Off The Record: మేం అధికారంలోకి వస్తే… ధరణిని రద్దు చేయం.. తప్పుల్ని సరిదిద్దుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. కేసీఆర్ కుటుంబానికి ఉపయోగపడుతున్న దీన్ని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా చేస్తామని అన్న మాటల్ని ఉదహరిస్తూ… ఇదేంటి… బండి… ఇలా మాట్లాడుతున్నారేంటని అనుమానంగా చూస్తున్నారట చాలామంది. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఒకటి రెండు తప్ప మిగతా వన్నీ కేంద్ర ప్రభుత్వ స్కీములేనని, వాటిని కూడా కొనసాగిస్తామని అన్నారు బండి. అలా ఒకసారి కాదు…రెండుసార్లు చెప్పడంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. సొంత పార్టీలోనూ… వ్యతిరేక పార్టీల్లో సైతం ఆయన మాటలపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోందట. ఆ మాటల మర్మం ఏంటని ఆరా తీసేవాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారట.
Read Also: Off The Record: పీక్స్‌కు పవన్ కల్యాణ్, పేర్ని నాని వార్.. మాజీ మంత్రిని టార్గెట్ చేసిన కాపులు..!
తెలంగాణలో ఇప్పుడు ధరణి పోర్టల్‌పై తీవ్ర చర్చే జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే… దాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతామని ప్రకటించింది కాంగ్రెస్. కాషాయ నేతలు కూడా చాలామంది అదే అభిప్రాయంతో ఉన్నారు. ఒక్క బీఆర్‌ఎస్ తప్ప మిగతా రాజకీయపార్టీలన్నీ ధరణికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాయి. అయితే అందరిదీ ఒకదారి… నాది వేరేదారి అన్నట్టుగా ఉన్నాయట బండి సంజయ్ మాటలు. ఏదో యాదృచ్చికంగా అన్నారని తొలిసారి అనుకున్నా… రెండోసారి కూడా అవే మాటలు మాట్లాడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు. సంజయ్ ఆ మాటలు ఆషామాషీగా అనలేదని, దాని వెనక బలమైన కారణమే ఉందన్న ప్రచారం జరుగుతోంది. అసలు హై కమాండ్‌కు తెలిసే అలా అంటున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి.
Read Also: Off The Record: టీడీపీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్..
సంజయ్ కావాలని అన్నా, యాదృచ్చికంగా అన్నా…వాటి మీద తెలంగాణలో తీవ్ర చర్చే జరుగుతోంది. బీజేపీ స్ట్రాటజీ టీమ్‌లు రాష్ట్రంలో సర్వే చేస్తున్నాయి. ఆ టీమ్స్ ఇస్తున్న రిపోర్ట్ ఆధారంగా మాట్లాడి ఉంటారేమోనన్న అనుమానాలు సైతం వస్తున్నాయట. ఎట్నుంచి ఎటు చూసినా…. బీఆర్‌ఎస్ మీదికి ఒంటికాలి మీద లేచే బండి సంజయ్…ఇప్పుడు కేసీఆర్ పథకాల్ని పొగడటమే హాట్ డిబేట్ అయింది.