Off The Record: గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు కొత్తగా ఏపీలో ఎలక్షన్ అబ్జర్వర్స్ మీద చర్చ ఎందుకు జరుగుతోంది? స్పెషల్ అబ్జర్వర్స్ నిఘా ప్రత్యేకించి ఎవరి మీద ఉండబోతోంది? ప్రత్యేక పరిశీలకుల ప్లానింగ్ ఎలా ఉంది? ఏపీ ఛీఫ్ సెక్రెటరీ, డీజీపీ కూడా నిఘా నేత్రం కింద ఉన్నారన్నది నిజమేనా?
ఈ నెల 18న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. అలాగే నామినేషన్ల ఘట్టానికి కూడా తెర లేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రం మీద కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించినట్టే కన్పిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఒకేసారి ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఎఎస్ అధికారుల మీద బదిలీ వేటు వేసింది. ఇలా వేటు పడ్డ వారిలో అత్యధిక శాతం అధికార పార్టీకి సహకరిస్తున్నారనే ఆరోపణలు.. ఫిర్యాదులు ఉన్న వారే. ఇక మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ నుంచి వివిధ శాఖలకు చెందిన అధికారులు.. ఉన్నతాధికారులపై విపరీతంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్తున్నాయట. ఆ సంఖ్యను చూసి కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలే ఆశ్చర్యపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో ప్రత్యేక అబ్జర్వర్ల నియామకం జరిగిందంటున్నారు. మొత్తం ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు ఏపీకి నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. వీరిలో జనరల్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్ మోహన్ మిశ్రాను, పోలీస్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నిగమ్ ఉన్నారు. దీంతో స్పెషల్ అబ్జర్వర్స్ విధులపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. జనరల్‌గా అబ్జర్వర్‌గా నియమితులైన రామ్ మోహన్ మిశ్రా.. ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వ్యవహారాల మీద ప్రధానంగా కన్నేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎస్ జవహర్ రెడ్డి మీద కూడా పెద్ద ఎత్తునే విమర్శలు వచ్చాయి. ఏకంగా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్వయంగా ఈసీకి జవహర్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఏపీలో పరిపాలన పరంగా జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల నిర్వహణ విషయంలో లోటు పాట్ల మీద ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారట జనరల్ అబ్జర్వర్. ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ విషయంలో జరుగుతున్న రాజకీయాలను, అధికారుల మీద వస్తున్న విమర్శలు.. ఆరోపణలపై ఇప్పటికే జనరల్ అబ్జర్వర్ కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.
ఇక డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి నిర్వహించే బాధ్యతలు.. పోలీస్ విభాగంలో జరుగుతున్న పరిణామాలు.. వాళ్లకి ఎలాంటి ఆదేశాలు వెళ్తున్నాయనే దానిపై ఫోకస్ చేసేందుకే పోలీస్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాను నియమించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో పోలీస్ అధికారుల పనితీరు మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. దీంట్లో భాగంగా ఎన్నడూ లేని విధంగా వివిధ జిల్లాల్లోని పోలీస్ ఉన్నతాధికారుల మీదే కాకుండా.. పోలీస్ బాస్ మీద కూడా పెద్ద ఎత్తున.. కంప్లైంట్లు వెళ్లాయి. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు మీద కూటమిలోని మూడు పార్టీలు కంప్లైంట్ చేశాయి. ఏపీలోని చాలా జిల్లాల్లో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అలాగే చాలా చోట్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయట. దీంతో డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు మీద కూడా పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఫోకస్ పెట్టే సూచనలు కన్పిస్తున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది.ఇక ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనేది ఓ అంచనా. ప్రస్తుతం ఏపీలో ఈ ఎన్నికలను అధికార-ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టగా తీసుకున్నాయి. అలాగే ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు చావో రేవో వంటి పరిస్థితి. దీంతో ప్రలోభాల పర్వం చాలా ఎక్కువగా ఉండే సూచనలు కన్పిస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు నియోజకవర్గ స్థాయిని బట్టి 25 నుంచి 75 కోట్ల దాకా ఉండవచ్చని అంచనాలున్నాయి. ఇప్పటికే మద్యం, మనీ ప్రభావం చాలా చోట్ల కన్పిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో వ్యయ పరిశీలకుడు నిగమ్ త్వరలోనే జిల్లాల పర్యటనలు చేపట్టే సూచనలు కన్పిస్తున్నాయి. బాగా డబ్బున్న అభ్యర్థులు.. ఎన్నారైలు.. ఎక్కువ ఖర్చు పెట్టే అభ్యర్థులు ఎవరున్నారో చూసుకుని.. ఆ ప్రాంతాల్లో.. నియోజకవర్గాల్లో నిగమ్ ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉందట. మొత్తమ్మీద గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్పెషల్ అబ్జర్వర్ల నియామకంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.