Off The Record: ఆధిపత్య రాజకీయాలకు పురిటిగడ్డ అనకాపల్లి. ఒకప్పుడు కొణతాల, దాడి కుటుంబాల మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు నడిచేది. బలమైన గవర సామాజిక వర్గం డామినేషన్ కనిపించేది. 2009లో తొలిసారి ఆ రాజకీయానికి బ్రేకులు పడ్డాయి. స్ధానికేతర నాయకుల ఎంట్రీతో కుటుంబ రాజకీయాలు చెల్లిపోయాయి. పునర్విభజన తర్వాత కీలకమైన మునగపాక మండలం యలమంచిలిలో విలీనం అయింది. సరిగ్గా ఇక్కడి నుంచే అనకాపల్లి రాజకీయ ప్రయోగాలకు వేదికగా మారింది. అనకాపల్లి మున్సిపాలిటీ, మండలం, కశింకోట మండలం ఈ స్ధానం పరిధిలో వుండగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కీలకంగా మారింది.
2014లో పెందుర్తి నుంచి వచ్చిన పీలా గోవింద్ సత్యనారాయణ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో గాజువాకకు చెందిన గుడివాడ అమర్నాథ్ గెలవగా జగన్ కేబినెట్‌లో బెర్త్ దక్కింది. గడిచిన 20 ఏళ్ళలో ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలిచిన పార్టీ కానీ నాయకుడు కానీ లేరు. ఈ పరిస్ధితులే ఇప్పుడు టీడీపీలో సెగ పుట్టిస్తున్నాయి. ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుంది అనకాపల్లి. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అంచనాతో పోటీలు పడుతున్నారు ఆ పార్టీ నేతలు. మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీష్ ఈసారి టిక్కెట్ కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నాగజగదీష్ అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాగా… పీలాను నియోజకవర్గ ఇన్చార్జ్ గా నియమించింది అధిష్టానం. ప్రస్తుతం ఇద్దరూ ఒకరి నీడను కూడా ఒకరు భరించే స్థితిలో లేరు. అధ్యక్షుడి హోదాలో జగదీష్ తీసుకునే నిర్ణయాలను పట్టించుకోకపోవడమే కాకుండా… కనీసం పార్టీ ఆఫీస్‌లో అడుగు పెట్టేందుకు కూడా పీలా వర్గం ఇష్టపడ్డం లేదట. మరోవైపు నియోజకవర్గ ఇన్చార్జ్ గా పీలా చేసే రాజకీయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు నాగజగదీష్ అనుచరులు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత గ్యాప్ తీసుకొని.. పీలా తన వ్యాపారాలపై దృష్టి సారిస్తే.. అనకాపల్లి సెగ్మెంట్‌లో పార్టీని సమన్వయం చేయడం, వైసీపీ దూకుడుని ఎదుర్కోవడంలో తానే ముందున్నానని నాగ జగదీశ్ చెప్పుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడ్డ తనకే.. ఈసారి అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పీలా గోవింద్ ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి మరీ కలిసొస్తున్నారు. మార్నింగ్ కాఫీ విత్ క్యాడర్ పేరుతో.. ఓ ప్రోగ్రాం కూడా మొదలుపెట్టారు. ఇలా.. ఇద్దరి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు బల ప్రదర్శనలకు వేదికగా మారింది. అది కూడా పార్టీ అధినేత ముందు కావడం తీవ్ర చర్చ నీయాంశం అయింది.
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం అనకాపల్లితోనే ముగిసింది. ఇందులో భాగంగా భారీ రోడ్ షో నిర్వహించారు చంద్రబాబు. బలం, బలగాన్ని చూపించుకునే ప్రయత్నంలో పీలా, బుద్ధా వర్గాలు భారీ స్ధాయిలో జనసమీకరణ చేశాయి. ఎమ్మెల్యే టిక్కెట్ పోటీలో ఎవరం తక్కువ కాదని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఏ రూపంలో జనసమీకరణ జరిగినా ప్రోగ్రామ్ విజయవంతం కావడంతో అధినేత ఖుషీ అయ్యారట. కానీ… ఇద్దరిలో ఎవరికీ టిక్కెట్ హామీ ఇవ్వకపోవడంతో ఊసూరుమన్నారట. అయినా నిరుత్సాహపడకుండా ఎవరి ప్రయత్నాల్లో వారు సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఈ ఆధిపత్యపోరు ఎన్నికల్లో పార్టీని దెబ్బకొట్టకుండా నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.