Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్.. తమ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించబోతోందన్న వార్తలతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. టిక్కెట్ డౌట్ ఉన్న సిట్టింగ్‌లు, ఆశావహులు ఎవరి రేంజ్‌లో వాళ్ళు ఆఖరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ సీటుపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ పెరుగుతోంది. బీఆర్‌ఎస్ లీడర్, సినిమా హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఈసారి ఇక్కడ టిక్కెట్ ఆశిస్తుండటమే అందుకు కారణం. నేను లోకల్… కాంగ్రెస్ సీనీయర్ లీడర్ జానారెడ్డిని ఓడించే సామాజిక, ఆర్ధిక బలం నాకు మాత్రమే ఉన్నాయని చెప్పుకుంటున్న కంచర్ల ఈసారి సీటు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్టు తెలిసింది. అటు ఆయన అల్లుడు అల్లు అర్జున్ కూడా మామను అసెంబ్లీ మెట్లు ఎక్కించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట.
బీఆర్‌ఎస్‌లో తనకున్న పరిచయాలతో ఓ ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి ఓడిన కంచర్ల.. ఈసారి తన సొంత నియోకజవర్గంలో పొటీ కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కొంత కాలంగా తన పేరిట కేసీఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి జనాన్ని ఆకట్టుకునేందుకు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పెద్దవూర మండలంలోని తన సొంతూరు కొత్తగూడెంలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించి అల్లుడు.. అల్లు అర్జున్ చేత రిబ్బన్ కట్ చేయించారు కంచర్ల. దీన్ని ప్రారంభోత్స కార్యక్రమంగా కంటే.. బల ప్రదర్శనకు వేదికగా వాడుకున్నారన్నది లోకల్ టాక్. దీంతో నాగార్జున సాగర్ టిక్కెట్ రేస్ పీక్స్‌కు చేరిందంటున్నారు పార్టీ కార్యకర్తలు.
ఇప్పటికే ఇక్కడ సిట్టింగ్ నోముల భగత్ ఉండగా ఈసారి ఎలాగైనా తానే దక్కించుకోవాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్నారట కంచర్ల. అందుకే అల్లుడిని కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి రప్పించి.. ఆ మైలేజిని తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నట్టు తెలిసింది. అల్లు అర్జున్ రాక సందర్భంగా నియోజకవర్గానికి చెందిన యువతను, జిల్లా బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆహ్వానించిన చంద్రశేఖర్‌రెడ్డి పరోక్షంగా తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. గతంలో ఒకసారి ఎన్నికల బరిలో దిగి ఓడిపోయినందున ఈసారి ఆరునూరైనా టిక్కెట్ సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టి తీరాలన్న పట్టుదలతో ఉన్న కంచర్ల ఏ ఛాన్స్‌నీ వదులుకోకూడదని అనుకుంటున్నారట. అందుకే అల్లుడి ఇమేజ్‌ని పూర్తిగా వాడుకోవాలని డిసైడైనట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటన సమయం ఇక రోజుల్లోకే వచ్చినందున సిట్టింగ్‌కి తానే ప్రత్యామ్నాయంగా ఉండాలనుకుంటున్నారట చంద్రశేఖర్‌రెడ్డి. ఆర్ధిక, అంగ బలం నాకే ఉంది.. సీటు ఇవ్వండని కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు, మామకు టిక్కెట్ ఇప్పించేందుకు అల్లు అర్జున్ చేస్తున్న ప్రయత్నాలు మరోవైపు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.