న్యాయ వ్యవస్థలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళలకు ప్రాతినిథ్యమే లేకపోగా, రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళా సభ్యుల సంఖ్య నామమాత్రంగా ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారాయన. మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు సీజేఐ. ఆకాశంలో సగం… అవకాశాల్లోనూ మహిళలకు సగం వాటా ఇవ్వాల్సిందే అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. మన న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్ మీ హక్కు… దాన్ని డిమాండ్ చేయడానికి మీరు అర్హులంటూ న్యాయ వృతిలో ఉన్న మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీజేఐ.
దిగువ కోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు 30 శాతం కంటే తక్కువే ఉన్నారన్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. హైకోర్టుల్లో అది 11.5 శాతమే అన్నారు. సుప్రీం కోర్టులో 11 నుంచి 12 శాతం మాత్రం మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. దీనిని వేల సంవత్సరాల అణచివేతకు సంబంధించిన సమస్యగా అభివర్ణించారు సీజేఐ. దేశంలోని 17 లక్షల మంది న్యాయవాదులు ఉంటే… అందులో మహిళలు 15 శాతమే అన్నారాయన. రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో ఎన్నికయ్యే మహిళా ప్రజాప్రతినిధులు 2 శాతమే అన్నారు.