*కోటి దీపోత్సవంలో పాల్గొనడం నా అదృష్టం: ప్రధాని మోడీ
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో ఎన్టీవీ- భక్టి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వైభవంగా జరుగుతోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విశిష్ఠ అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీకి న రచన టెలివిజన్ గ్రూప్ డైరెక్టర్ రచన చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీకి వేదపండితులు ఆశీర్వచనం అందించారు. భక్తులతో పాటు గోవింద నామస్మరణ ప్రధాని మోడీ చేశారు. గోవింద నామస్మరణతో కోటి దీపోత్సవ ప్రాంగణం మార్మోగింది. భక్తులతో పాటు ప్రధాని మోడీ కూడా భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కోటి దీపోత్సవ ఉత్సవాల గురించి ప్రధాని మోడీ ప్రసంగించారు. అనంతరం ప్రధాని తొలి కార్తీక దీపాన్ని వెలిగించారు. ఇల కైలాసాన ఆదిదేవుడికి ప్రధాని మోడీ హారతి ఇచ్చారు. ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆ దేవుడి దీవెనలతో తాను ఈ రోజు ఇక్కడ ఉన్నానని పేర్కొన్నారు. .ఈ రోజు కాశీలో దీపోత్సవం జరుగుతోందని.. తాను ఇక్కడ దీపోత్సవంలో పాల్గొంటున్నానని చెప్పారు. ఈ రోజు తిరుమల శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగిందని, శ్రీనివాసుడి దర్శనభాగ్యం మాటల్లో చెప్పలేనిదన్నారు. గుర్‌ద్వార్‌ను కూడా దర్శించే భాగ్యం కలిగిందన్నారు. తాను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నానన్న ప్రధాని మోడీ.. కానీ ఇది చాలా ప్రత్యేకమైనదనన్నారు. కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులకు శుభాభినందనలు తెలిపారు. శ్రీశైలం నుంచి వేములవాడ వరకు, భద్రాద్రి నుంచి అలంపూర్ వరకు ఆధ్యాత్మికత వెళ్లివిరుస్తుందన్నారు ప్రధాని మోడీ. పోతన, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అతి శ్లోకానుసారం దీపమే దైవమని ప్రధాని తెలిపారు. దీపజ్యోతి మనకు వెలుగు రేఖలను అందిస్తుంది, చీకట్లను తొలగిస్తుందన్నారు. ఆ రోజు అయోధ్యకు రాముడు తిరిగివచ్చినందుకు, శివుడు భూమిపైకి వచ్చిన గుర్తుగా మనం దీపం వెలిగిస్తామని చెప్పారు. ఈ రోజు దీపాలకు మరో ప్రత్యేకత ఉందన్న ఆయన.. ఈ దీపాలు ఆత్మనిర్భర్ భారత్‌ను సూచిస్తాయని.. వికసిత భారత్‌ను ప్రతిబింబిస్తాయన్నారు. కాశీ, ఉజ్జయిని ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దామని.. త్వరలోనే అయోధ్యలో ఆలయాన్ని ప్రారంభించుకోనున్నామన్నారు. ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని.. కోటి దీపోత్సవంలో ప్రతి ఒక్కరు సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ దీపాలు వెలిగిద్దామని భక్తులకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. బతుకమ్మ, బోనాల పండుగను జాతీయ పండుగగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని చెప్పారు.
*బీజేపీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టే..
ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 15 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్‌ఎస్ అని సీఎం తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఉన్న తెలంగాణను ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపారని.. 58 ఏళ్ళు ఎన్నో గోసలు పడ్డామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలన్నారు. ఆలోచించి ఓటు వేయాలి..ఓటే మనకు వజ్రాయుధమన్నారు సీఎం కేసీఆర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు డబ్బులు దుబారా చేస్తున్నాడని అంటున్నారని.. రైతు బంధు ఉండాలంటే బీఆర్‌ఎస్ గెలవాలని సీఎం ప్రజలకు సూచించారు. పీసీసీ చీఫ్ రేవంత్ 24 గంటల కరెంట్ వేస్ట్ అని మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతాయన్నారు. మూడేళ్లు కష్టపడి ధరణి తెచ్చానన్న ఆయన.. రాహుల్ గాంధీ, రేవంత్, భట్టి విక్రమార్క ధరణి తీసేస్తాం అంటున్నారని.. ధరణి తీసేస్తే రైతు బంధు రాదు.. దళారుల రాజ్యం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని ఈ సందర్భంగా చెప్పారు. గవర్నర్ వల్ల కాస్త లేట్ అయ్యిందని.. అధికారంలోకి వచ్చాక అది కూడా చేస్తామన్నారు. సంగారెడ్డి నేను పుట్టిన గడ్డ..నా జిల్లా అని సీఎం తెలిపారు. గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్‌ను ఓడగొట్టినా నేను ఏమి అనలేదని.. 24 గంటల త్రాగునీరు వచ్చే విధంగా ఆలోచిస్తున్నామన్నారు. ఒక పార్టీ మత పిచ్చి పార్టీ..ఎంత సేపు మసీదులు తవ్వుదామా ప్రజల మధ్య లొల్లి పెట్టడమే వాళ్ళకి పని అంటూ సీఎం మండిపడ్డారు. సంగారెడ్డి హైదరాబాద్‌లో అంతర్భాగం అవుతుందని.. సంగారెడ్డికి మెట్రో వస్తే మీ దశ మారిపోతుందన్నారు. మొదటి దశలో ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తే…రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో వేయవచ్చన్నారు. కారుని గుద్దిన, నా ఓట్లు నేనే గుద్దుకున్న అన్న ఎమ్మెల్యే కావాలా అంటూ ప్రశ్నించారు. ఈ ఉద్యమ ద్రోహి మొదట బీఆర్‌ఎస్‌లోనే ఉండే అంటూ జగ్గారెడ్డిపై సీఎం అయ్యారు. ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఎమ్మెల్యేగా లేకున్నా చింతా ప్రభాకర్ కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశాడన్నారు. 157 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేదన్నారు. వంద ఉత్తరాలు రాసినా ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మార్చి తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
*కొడంగల్ గడ్డ.. నా అడ్డా.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్
తన సొంత ఇలాకాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కొడంగల్ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది అని అన్నారు. 20 ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడానని తెలిపారు. ఈ కొడంగల్ గడ్డ… నా అడ్డా.. మీ బిడ్డ.. మీరు నాటిన మొక్క… రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిందని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మీరు పెంచిన ఈ చెట్టును నరికెందుకు కేసీఆర్, ప్రధాని మోదీ భుజాన గొడ్డలి వేసేందుకు బయలుదేరిండ్రు.. వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు.. పది వేల ఎకరాలు దోచుకుండు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కొడంగల్ సాక్షిగా చెబుతున్నా… కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయమని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో దొరల, గడీల పాలన పోవాలి… ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలిపారు. డిసెంబర్ 3న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి మరోసారి హామీ ఇచ్చారు.
*ములుగు ప్రజలు గత ఎన్నికల్లో చేసిన తప్పు చేయవద్దు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏటూరునాగారం రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగులో వంద శాతం గెలుస్తామన్నారు. గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అభివృద్ది ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని కేటీఆర్ అన్నారు. ములుగులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేక పోయినా.. జిల్లాను చేసిన ఘనత కేసిఆర్ ది అని తెలిపారు. ఇన్స్టాగ్రామ్ ఎమ్మెల్యేను కాదు.. ఇక్కడే ఉండి మీకు సేవ చేసే ఎమ్మెల్యేను గెలిపించండని అక్కడి ప్రజలను మంత్రి కేటీఆర్ కోరారు. కరెంట్ గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలకు సిగ్గులేదని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి ఎన్నికల కమీషన్ కు ఉత్తరం రాయడం వల్లే రైతు బందు ఆగిందని మంత్రి తెలిపారు. రైతుల నోటికాడి బుక్క దూరం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఇలాంటి.. కాంగ్రెస్ దరిద్రాన్ని మళ్ళీ నెత్తిన పెట్టుకుందామా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మార్పు కావాలి కాబట్టే.. మీ దిక్కు మాలిన కాంగ్రెస్ కు విముక్తి చెప్పి తెలంగాణా తెచ్చుకున్నామని అన్నారు. కాంగ్రెస్ కొత్త పార్టీ కాదు.. చెత్త పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం ఎన్ని కథలైనా చెపుతారు నమ్మొద్దు.. ములుగు ప్రజలు గత ఎన్నికల్లో చేసిన తప్పు చేయవద్దని కేటీఆర్ తెలిపారు. నాగ జ్యోతిని గెలిపిస్తేనే ములుగును అభివృద్ధి చేస్తాం.. లేకపోతే తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏమీ చేయమని కేటిఆర్ కరాఖండిగా చెప్పారు. మరోవైపు.. ములుగు ప్రాంత అభివృద్ధి సీఎంతోనే సాధ్యం అయ్యిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కళ్ళముందే బూతద్దంలా ములుగు అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. 100 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఇదిలా ఉంటే.. ఏటూరునాగారంలో బస్ డిపో, మోడల్ కాలనీలు, బిల్ట్ కర్మాగారాన్ని తెరిపిస్తామన్నారు. అంతేకాకుండా.. శివవసత్తులకు గౌరవవేతనం ఇస్తామని తెలిపారు. పేదలకు ఇల్లు, కొండాయి బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు సౌభాగ్య లక్ష్మీ కింద నెలకు 3 వేలు ఇస్తామని చెప్పారు. కార్డులు, పింఛన్లు ఇస్తాము.. అన్నపూర్ణ ద్వారా సన్న బియ్యం ఇస్తాం.. రూ.400 లకే గ్యాస్ ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
*ఆంజనేయస్వామి గుడిలో భట్టి విక్రమార్క ప్రమాణం
ఎన్నికల ప్రచారం సీఎల్పీ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి భట్టి విక్రమార్క్ మరో ముందడుగు వేశారు. సోమవారం ఖమ్మంలో ప్రచారం చేపట్టిన భట్టి ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. ఈ ప్రచారంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చొప్పికట్లపాలెంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రమాణం చేశారు. అవినీతి రహితంగా వ్యవహరిస్తానని ఆంజనేయస్వామి ఎదుట ప్రమాణం చేశారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. ‘రైతుబంధు ఆపింది కాంగ్రెసేనంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘రైతులను కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలే మోసం చేశారు. రైతు బంధు పథకం నిధులను నోటిఫికేషన్ రాక ముందే ఇచ్చేలా చూడాలని మేం ఈసీని కోరాం. నోటిఫికేషన్ వస్తే రైతు బంధు అమలు చేయలేమని తెలిసి కూడా బీఆర్ఎస్ జాప్యం చేసింది. కాంగ్రెస్ పార్టీకి రైతులకు మధ్యనే పేగుబంధం ఉంది. రైతులకందించే సబ్సిడీ పథకాలను పూర్తిగా రద్దు చేసిన బీఆర్ఎస్ పార్టీకి రైతులతో బంధమా..? రైతులకు సబ్సిడీ పధకాలు అందించి కాంగ్రెస్.. వ్యవసాయం కోసం ఇరిగేషన్, పవర్ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీనే. బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులు బీఆర్ఎస్ మాటలు నమ్మరు. రైతులు కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. మాకు ఓటేస్తేనే తెలంగాణకున్న రిస్క్ పోతుంది.. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే రిస్క్ ఉంటుంది. మతాలను రెచ్చగొట్టేలా అమిత్ షా మాట్లాడుతున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు వారి ఆర్థిక వెనుకబాటు తనాన్ని చూసి ఇచ్చిందే తప్ప.. మత ప్రాతిపదికన కాదు’ అని ఆయన పేర్కొన్నారు.
*చంద్రయాన్ 3 సక్సెస్.. బిలియనీర్ల జాబితాలో చేరిన 60 ఏళ్ల ఇంజనీర్
చంద్రయాన్ 3 సక్సెస్‌తో చరిత్రలో భారత్ కొత్త అధ్యాయనం లిఖించింది. చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. దీంతో భారత్‌కు ప్రపంచమే సెల్యూట్ కొట్టింది. అయితే ఈ చంద్రయాన్ 3 సక్సెస్ భారత్ కీర్తిని పెంచడమే కాదు.. ఇస్రో సైంటిస్టులకు పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇస్రో సైంటిస్టుల ప్రతిభను కొనియాడుతోంది. అయితే చంద్రయాన్ 3 సక్సెస్ ఓ వ్యక్తిగా భారీగా కలిసోచ్చింది. ఏకంగా అతడు బిలియర్‌గా మారిపోయాడు. చంద్రయాన్ 3 సక్సెస్‌తో ఇండియన్ ఇంజనీర్ బిలియనీర్ల జాబితాలో చేరిపోయాడు. ఇంతకి ఆయన ఎవరంటే.. కేన్స్ టెక్నాలజీ ఇండియా ఫౌండర్, మైసూర్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ రమేష్ కున్హికన్నన్. చంద్రయాన్ 3 రోవర్, ట్యాండర్ రెండింటికి అవసరమైన ఎలక్ట్రానిక్ సిస్టిమ్‌లను అందించి చంద్రయాన్ 3 మిషన్ విజయంలో భాగమయ్యారు. చంద్రయాన్ 3 తర్వాత కేన్స్ టెక్నాలజీ ఇండియా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అరంగేట్రం చేసింది. దీంతో కేన్స్ షేర్లు భారీగా పెరిగాయి. కేన్స్‌లో 64 శాతం వాటా ఉన్న రమేష్ కున్హికన్నన్ ఆస్తులు భారీగా పెరిగిపోయింది. అలా ఆయన నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 100 కోట్ల కంటే ఎక్కువ. ఈ మేరకు ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. కేన్స్ టెక్నాలజీ ఇండియా తన 137 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంలో సగానికి పైగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీలను తయారు చేయడం ద్వారా పొందుతున్నట్టు పేర్కొంది. ఈ సంస్థ ఆటోమోటివ్, ఏరోస్పేస్, మెడికల్ అండ్ డిఫెన్స్ పరిశ్రమలకు ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు సరఫరా చేస్తుంది. కాగా మైసూర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యూయేట్ చేసిన రమేష్ కున్హికన్నన్ 1988లో కేన్స్‌ను స్థాపించి కాంట్రాక్ట్ పద్దితిలో ఎలక్ట్రానిక్ పరికరాలను అందించారు. ఆయన భార్య సవిత రమేష్ 1996లో కంపెనీలో చేరి ప్రస్తుతం కేన్స్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా వారికి బాగా ఉపయోగపడింది. . స్థానిక తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన ఈ ప్రొగ్రాంతో భారతీయ పరిశ్రమలలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ వినియోగం కారణంగా, కంపెనీ వార్షిక ఆదాయం 2020 ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు పెరిగింది. దీంతో 2024 మార్చి నాటికి కంపెనీ ఆదాయం సుమారు 208 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నివేదికలు తెలుపుతున్నాయి.