*రేపు కోటి దీపోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ
రేపు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్ షోలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు సాగనున్న మోడీ రోడ్ షో కొనసాగనుంది. రేపు ఉదయం మహబూబాబాద్ బహిరంగ సభ, మధ్యాహ్నం కరీంనగర్ బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు రాత్రి ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి వయా నారాయణగూడ, వైఎంసీఏ, కాచిగూడ చౌరస్తా వీరసావర్కర్ విగ్రహం వరకు రోడ్ షోలో ప్రధాని మోడీ పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, తదితర నేతలు పాల్గొననున్నారు.
*గిరిజనులను కాంగ్రెస్ మోసం చేసింది..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ములుగులో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడనందుకు క్షమించండి అని తెలిపారు. సమ్మక్క సారలమ్మ తల్లులు, రామప్ప రుద్రేశ్వరుడు ఆశీర్వాదంతో ఇక్కడ అడుగు పెట్టానన్నారు. ఇదిలా ఉంటే.. ములుగు జిల్లాలో గిరిజన విశ్వద్యాలయంను ప్రధాని మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా.. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు. ట్రైబల్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తామని తెలిపారు. మరోవైపు.. పోడు పట్టాల కోసం గిరిజన, గిరిజనేతరుల మధ్య బీఆర్ఎస్ విభేదాలు సృష్టించిందని ఆరోపించారు. గిరిజనులను కాంగ్రెస్ మోసం చేసిందని తెలిపారు. ఓ గిరిజన నేత ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన సర్కార్ మోదీ సర్కార్ అని అన్నారు దేశంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అధికంగా బీజేపీలోనే ఉన్నారని అమిత్ షా తెలిపారు. 2013-14 వరకు దేశం మొత్తంలో గిరిజనులకు బడ్జెట్ తక్కువగా ఉండేది కానీ.. బీజేపీ వచ్చాక పెంచారని అన్నారు. ఏకలవ్య పాఠశాలలు బీజేపి ప్రభుత్వము ఏర్పాటు చేసింది.. 50 లక్షల మంది గిరిజన కుటుంబాలకు ఇళ్లనూ మంజూరు చేశామన్నారు. 1 కోటి మంది గిరిజన రైతులకు ప్రతీ సంవత్సరం 6 వేలు ఇస్తుంది, దాన్ని 12 వేలకు పెంచుతామని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరిని పునరుద్ధరిస్తామని అమిత్ షా చెప్పారు. అంతేకాకుండా.. హైదరాబాద్ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ ను తొలగించాలి అనుకుంటే కేవలం బీజేపీకి మాత్రమే ఓటు వేయండని తెలిపారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఔటర్ రింగ్ రోడ్డు పనులలో, మియాపూర్ భూముల్లో కేసీఆర్ అవినీతి ఉందని అమిత్ షా ఆరోపించారు. అయోధ్యలో రామ మందిరం జనవరిలో ప్రారంభం కానుందని.. అయోధ్యలో రామ మందిర దర్శనంకు ఖర్చు మొత్తం బీజేపీ ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు.
*ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలు
కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారు.. కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగిందని తెలిపారు. అంతేకాకుండా.. ధరణి పేరుతో వేల ఎకరాలు కేసీఆరే ఆక్రమించుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో 8లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల ఉసురు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నారు.. కేసీఆర్ గారూ.. మీరు వెళుతున్న రోడ్డు కాంగ్రెస్ వేసిందని రాహుల్ గాంధీ తెలిపారు. మీరు చదువుకున్న స్కూల్ నిర్మించింది కాంగ్రెస్ అన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్… హైదరాబాద్ చుట్టూ భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయంటే అందుకు కారణం కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందేలా చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి అమలు చేస్తామని తెలిపారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తాం.. రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తాం.. రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం.. రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు అందిస్తాం.. అధికారంలోకి రాగానే రైతులకు 24గంటల ఉచిత కరెంటు అందిస్తాం.. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు ఆర్ధిక సాయం అందిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. నిన్న సాయంత్రం నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నానని రాహుల్ గాంధీ అన్నారు. చదువుకునే యువతకు విద్యా భరోసా ద్వారా రూ.5లక్షలు సాయం అందిస్తామని చెప్పారు. ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అందుబాటులోకి తెస్తామని పేర్కొ్న్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండని రాహుల్ గాంధీ అక్కడి ప్రజలను కోరారు.
*దుబ్బాకలో ఎప్పుడైనా కత్తిపోట్లు చూశామా..? మనకు కత్తులు దొరకవా..?
ముఖ్యమంత్రిగా ఈ స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పెట్టిన భిక్ష అని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధన కోసం పుట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం దుబ్బాకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దుబ్బాకలోనే తాను చదువుకున్నట్లు చెప్పారు. ఉన్న తెలంగాణను ఊగగొట్టంది కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. 2001లో గులాబీ జెండా ఎగిరితే, 2004లో కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తు పెట్టుకుందని చెప్పారు. 2004లో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. దుబ్బాక ఉపఎన్నికల్లో దెబ్బతిన్నాం, మళ్లీ అలా జరగకూడదని ఓటర్లను కోరారు. రైతు బంధును పుట్టించింది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నాడని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 24 గంటలు కరెంట్ వద్దు, మూడే గంటలు చాలు అని అంటున్నాడని, రాహుల్ గాంధీకి ఎద్దు, వ్యవసాయం గురించి తెలుసో లేదో అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి తీసేసి కాంగ్రెస్ భూమాత పెడతామంటుందని, అది భూమానా..? భూమేతనా? అని ప్రశ్నించారు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని అడిగారు. ధరణి తీసేస్తే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లు అవుతుందని అన్నారు. ప్రభాకర్ రెడ్డి దోమకు కూడా అన్యాయం చేయడని, దుబ్బాకలో ఎప్పుడైనా కత్తిపోట్లు చూశామా..? మనకు కత్తులు దొరకవా..? అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో నేను రాలేదని, అప్పుడు వస్తే కథ ఒడిసిపోయేదని, నోటికివచ్చినట్లు ఇక్కడ ఎమ్మెల్యే వాగ్ధానాలు చేశాడని విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, నేను కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాశానని, 157 మెడికల్ కాలేజీల్లో కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నవోదయ కూడా ఒక్కటి ఇవ్వలేరని చెప్పారు. ఏమీ ఇవ్వని బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వెయ్యాలి..? బీజేపీవి జూటా మాటలని, దుర్మార్గుల చేతికి తెలంగాణ ఇచ్చి ఆగం కావడన్ని ప్రజల్ని కోరారు. నేను దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయాని కోరానని, ఆయన గెలిస్తే నెల రోజుల్లో దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చారు.
*పటాన్‌చెరులో పదేళ్లుగా బీఆర్ఎస్ రౌడీయిజం నడుస్తోంది..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోజున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర ఆక్రమించిన భూములు ఉండొచ్చు, అక్రమ సంపాదన ఉండొచ్చు కానీ ప్రజా మద్దతు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌కి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లలో పటాన్‌చెరులో బీఆర్ఎస్ నేతల రౌడీయిజం, వాళ్ల ఆగడాలు మీకు తెలుసని, మీరు ఓటేసి గెలిపిస్తే మీ భూముల్ని గుంజుకున్నరు, వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఓటుకు పదివేలు ఇవ్వాలని చూస్తున్నారని అన్నారు. ఆనాడు ఇందిరమ్మ హయాంలో ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చేశామని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబం నమ్మకద్రోహం చేసిన కుటుంబమని, తెలంగాణను దోచుకున్న కుటుంబం, తెలంగాణకు ద్రోహం చేసిన కుటుంబమని ఆరోపించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఈ పటాన్ చెరులో వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ఎమ్మెల్యే మహిపాలుడు కాదు, శిశుపాలుడని, వంద తప్పులు చేసిన శిశుపాలుడి తల నరికినట్లే, వంద తప్పులు చేసిన మహిపాలుడిని పటాన్ చెరులో బొంద పెటాలని అన్నారు. పటాన్ చెరు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండా అని ధీమా వ్యక్తం చేశారు.
*అభివృద్ధి పనులు చేసిన మన ముఖ్యమంత్రిని మళ్ళీ గెలిపించుకుందాం..
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మంత్రి కేటీఆర్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2009లో గెలిస్తే తెలంగాణ తెస్తా అని మీకు హామీ ఇచ్చినా.. కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది, అందులో అందరి కష్టం ఉందని అన్నారు. సిరిసిల్లను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినా.. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని తెలిపారు. వీర్నపల్లి స్కూల్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూసి వెళ్ళండి.. అంతర్జాతీయ స్కూల్ లాగా తీర్చిదిద్దాం.. చూడని వాళ్లు చూసి వెళ్ళాలని కేటీఆర్ పేర్కొన్నారు. మండలంలో ఇలాంటి స్కూల్ అన్ని గ్రామాల్లో కట్టిస్తానని తెలిపారు. తండాలు గ్రామ పంచాయతీ చేయాలని కోరితే మన రాష్ట్రం వచ్చాక 3146 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అన్ని అభివృద్ధి పనులు చేసిన మన ముఖ్యమంత్రిని మళ్ళీ ఒక్కసారి గెలిపించుకుందామన్నారు. బీడీల పెన్షన్ దేశంలో ఎక్కడ ఇవ్వడం లేదు.. మన రాష్ట్రంలో నాలుగున్నర లక్షల బీడీల పెన్షన్ ఇస్తున్నాం.. పెన్షన్ రాని వాళ్లకు నెల రోజుల్లో ఇస్తామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ వాళ్లకు మనం చేసే అభివృద్ధి కనబడడం లేదని మండిపడ్డారు. డిసెంబర్ 3 తర్వాత కోడల్లకు సౌభాగ్య లక్ష్మి అని పేరుతో నెలకు 3000 పెన్షన్ ఇస్తామని తెలిపారు. 2014 లో నరేంద్రమోడీ జన్ ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తా అన్నాడు చేశాడా అని ప్రశ్నించారు…?. డిసెంబరు 3 తర్వాత సిలిండర్ రూ. 400 వందలకే ఇస్తాం.. ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఈ సందర్భంగా హమీ ఇచ్చారు. మరోవైపు.. దేశంలో 24 గంటల కరెంటుతో దేశానికే అన్నం పెట్టేలా నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు కేసీఆర్ ధీమా 5 లక్ష భీమా అమలు చేస్తాం..గల్ఫ్ లో ఉన్న వాళ్లకు 5 లక్షల భీమా, గల్ఫ్ వెళ్లే వాళ్లకు 5 లక్షలతో కొత్త పథకం తీసుకొస్తాం.. చెరువులో భూములు కోల్పోయిన వాళ్లకు నష్ట పరిహారం చెల్లిస్తామని అన్నారు. అలాగే.. కొత్త మండలాలకు కొత్త భవనాలు, తహసిల్దార్ కార్యాలయాలు కట్టిస్తాం.. వీర్నపల్లిలో కొత్త హాస్పిటల్ కట్టిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పోడు భూములకు పట్టా ఇప్పించే బాధ్యత తనదేనన్నారు.. రానీ వాళ్లకు కూడా ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లకు ఎందుకు ఓటు వేయాలి.. ఏం పీకిండు అని ఓట్లు వేయాలని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే పట్వారి వ్యవస్థ తీసుకొస్తారని.. అసైన్డ్ భూములకు పట్టాలు, హక్కులు కల్పిస్తారని విమర్శించారు.
*బీఆర్ఎస్, బీజేపీ బొమ్మ బొరుసు లాంటివి..
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అక్కడ నిర్వహించిన రోడ్డు షోలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ బొమ్మ బొరుసు లాంటివని విమర్శించారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ గెలుపు కొరకు పనిచేస్తుందని చెప్పారు. కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని లూటీ చేశాడని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరి పై 94 వేల రూపాయల అప్పు చేశారని తెలిపారు. అంతేకాకుండా.. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశానికి నాలుగింతలు అప్పు పెరిగిందని ఆరోపించారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. రాష్ట్రంలో చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. దేశంలో, రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటాయని సిద్ధరామయ్య తెలిపారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 1200 రూపాయలు సిలిండర్ ధరలు పెరిగాయని అన్నారు. తెలంగాణలో డీజిల్ ధరలు రూ.87 ఉంటే, కర్ణాటకలో రూ.97 రూపాయలు ఉందని చెప్పారు. మరోవైపు.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. చంద్రశేఖర రావు ఆయన కుమారుడు కర్ణాటకలోని గ్యారెంటీలను సక్రమంగా జరగడంలేదని.. అమలు పరచడం లేదని అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గ్యారెంటీలను అమలుపరుస్తున్నామని సిద్ధరామయ్య తెలిపారు. అన్న భాగ్యం కింద 7 కిలోలు బియ్యం ఇస్తున్నాం.. గృహలక్ష్మి పథకం ఒక కోటి 14 లక్షల స్త్రీలకు అమలు పరుస్తున్నాం.. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం.. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరవాత ఆరు గ్యారెంటీలు ఇస్తామని సిద్ధరామయ్య చెప్పారు.
*తమిళటైగర్ ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడు.. తమిళ నేత సంచలన వ్యాఖ్యలు..
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం(MDMK) ప్రధాన కార్యదర్శి వైకో ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక ప్రభుత్వం ప్రభాకరన్ మరణించడాని ప్రకటించిన 14 ఏళ్ల తరువాత ఆయన ఈ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ప్రభాకరన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ప్రభాకరన్ జయంతి సందర్భంగా వైకో మాట్లాడుతూ.. ఎల్‌టీటీఈ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని మేము నమ్ముతున్నాము, అతని పుట్టిన రోజును కేక్ కట్ చేసి జరుపుకున్నాము, ప్రభాకరన్‌తో కలిసి ఉన్న పజా నెడుమారన్, కాశీ ఆనందన్ వంటి వారు ఎప్పుడూ అబద్దం చెప్పరని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తమిళ జాతీయవాది, ప్రముఖ రాజకీయ నేత పజా నెడుమారన్ ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే ఆయన బహిరంగంగా కనిపిస్తారని చెప్పారు. ‘‘ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని, బాగానే ఉన్నారని తమిళులకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నారు. అతని గురించి అన్ని పుకార్లు, ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం ఇవ్వవచ్చు. తమిళ ఈలం విముక్తికి అతని తదుపరి ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తారు.’’ అని నెడుమారన్ వ్యాఖ్యానించారు. మరో తమిళ నేత కాశీ ఆనందన్ కూడా ప్రభాకరన్ బతికే ఉన్నాడని, అతన్ని నిజంగా శ్రీలంక చంపితే, అతని మరణానికి సంబంధించిన పత్రాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభాకరన్ ఎల్టీటీఈ మిలిటెంట్ సంస్థ నాయకుడు. శ్రీలంకలోని ఉత్తర ప్రాంతాన్ని ప్రత్యేక తమిళ ప్రాంతంగా ప్రకటించాలని చెబుతూ.. ఆ దేశానికి వ్యతిరేకంగా పోరాడారు. 26 ఏళ్ల పాటు శ్రీలంకలో అంతర్యుద్ధం నడిచింది. తమిళ ప్రజల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ సంస్థను భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరోపియన్ యూనియన్ ఇతర అనేక దేశాలు ఉగ్రసంస్థగా ప్రకటించాయి. శ్రీలంక ఆర్మీ మే 18, 2009న ప్రభాకర్‌ని హతమర్చింది. డీఎన్ఏ పరీక్ష ద్వారా అతని మృతదేహాన్ని గుర్తించింది.