*ఏపీలో ప్రభుత్వ విద్యార్థులకు అందుబాటులోకి ఐబీ సిలబస్
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ విద్యార్థులకు అందుబాటులోకి ఐబీ సిలబస్ ను తీసుకొచ్చింది. అంతర్జాతీయంగా ప్రభుత్వ బడి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. ఐబీ సిలబస్ ప్రవేశంపై ఇప్పటికే మార్గదర్శక ప్రణాళిక తయారీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టే నిర్ణయానికి ఇవాళే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఐబీ సంస్థతో ఎంఓయూ కార్యక్రమం జరిగింది. సచివాలయంలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఐబీ సంస్ధతో రాష్ట్ర ప్రభుత్వం ఏంఓయూ చేసుకుంది. ఎంఓయూపై ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మాట్ కాస్టెల్లో, ఏపీ విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సంతకాలు చేశారు. సింగపూర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా, యూకేల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యలో నాణ్యతను పెంచడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. మా పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యార్థులగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం.. అందుకోసమే మీ సహకారాన్ని కోరుతున్నాం.. ఇక్కడ విద్యార్థులు సంపాదించే సర్టిఫికెట్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నది నా ఉద్దేశం అని సీఎం అన్నారు. మరే ఇతర ఐబీ ఇంటర్నేషనల్ స్టూడెంట్‌తో అయినా సరిసమానంగా ఉండాలి.. అట్టడున ఉన్న విద్యార్ధులకు దీన్ని అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అతిపెద్ద విజయం.. ఐబీ సిలబస్ అన్నది సవాల్‌తో కూడుకున్నది.. అందులోనూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం అన్నది అటు మీకు కూడా సవాల్‌తో కూడుకున్నది.. కానీ సంకల్పం ఉంటే సాధ్యంకానిది ఏది లేదు అని జగన్ అన్నారు. పాఠశాల విద్యను బలోపేతంచేయడానికి మేం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ తెలిపారు. పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దాం.. స్కూళ్లను బాగుచేయడం దగ్గరనుంచి… తరగతిగదుల డిజిటిలైజేషన్ వరకూ అనేక చర్యలు తీసుకున్నామన్నారు. 6వ తరగతి నుంచి అన్ని తరగతి గదులనూ డిజిటలైజేషన్ చేస్తున్నాం.. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశాం.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబులు పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు. పిల్లలందరికీ బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ తీసుకు వచ్చాం.. పిల్లాడిని స్కూలుకు పంపే తల్లికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పారు. టోఫెల్ పరీక్షల్లో శిక్షణ.. టోఫెల్ ప్రైమరీ, ఆ తర్వాత టోఫెల్ జూనియర్, టోఫెల్ సీనియర్ విభాగాలుగా వీటిని విద్యావ్యవస్ధలో భాగం చేశాం.. ప్రతిరోజూ ఒక పీరియడ్ టోఫెల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
*ఫించన్ల ఖాళీలపై సీఎస్ కీలక ఆదేశాలు
రాష్ట్రంలో ఏర్పడే సామాజిక పింఛనుల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. పంట రుణాల మాఫీ, ఎరువుల పంపిణీ, జీఓ 58, 59 అమలు, గృహలక్ష్మీ, ఆసరా పింఛన్లు, సాంఘీక సంక్షేమ ఇళ్ల స్థలాల పంపిణీ, తెలంగాణకు హరితహారం, గ్రామ పంచాయతీ భవనాలు, ఆయిల్ పామ్ తోటల తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక పింఛనుల మంజూరిపై నిత్యం సమీక్షిస్తున్నందున, పింఛనుల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలన్న సీఎస్ సూచించారు. రైతు రుణ మాఫీకై ప్రభుత్వం 19,446 కేటాయించిందని, అతితక్కువ సమయంలో ఈ రుణ మాఫీ ముమ్మరంగా కొనసాగుతోందని సీఎస్ అన్నారు. రుణ మాఫీ పొందిన రైతులను వెంటనే కొత్తగా పంట రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించిన సీఎస్ శాంతి కుమారి.. ఈ అంశంలో ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగిందని, అయినప్పటికీ ఈ ఎరువుల పంపిణి సక్రమంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారని, నిరుపేదలకు లబ్ది చేకూరే జీ.ఓ 58 క్రింద స్వీకరించిన దారఖాస్తులను వారం రోజులలోగా దర్యాప్తు పూర్తి చేసి పట్టాలను అందచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5707 కొత్త గ్రామ పంచాయితీ భవనాలను మంజూరీ చేయడం జరిగిందని, వీటన్నింటి నిర్మాణాలను ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ పామ్ క్రింద నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎస్ స్పష్టం చేశారు.
*గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సుల పరుగులు
హైద్రాబాద్ లో పర్యావరణ హితమైన బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. 25 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను గచ్చిబౌలి స్టేడియం వద్ద మంత్రి ప్రారంభించారు. మొత్తం 500 బస్సులను ప్రారంభించనున్నారు… అందులో ఇప్పుడు 25 బస్సులు రోడ్ ఎక్కనున్నాయి.. మిగితావి నవంబర్ లో ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఐటీ కారిడార్ లో బస్సులు నడుస్తాయి. 35 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ బస్సులను నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి. బస్ లో సీసీ కెమెరాలు కూడా అమర్చి, లొకేషన్ ట్రాకింగ్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. హైద్రాబాద్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్దమవుతోందన్నారు. 550 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను తీసుకురాబోతుందని, హైద్రాబాద్ లాంటి మహా నగరంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అనేక చర్యలకు సిద్ధమవుతున్నామన్నారు. అంతేకాకుండా.. ‘అన్ని బస్సులను ac బస్సులుగా కన్వర్ట్ చేస్తే మంచిది… ఆర్టీసీ ఆలోచించాలి.. అన్ని బస్సులను మెట్రో లకు అనుసంధానం చెయ్యాలి… తక్కువ సమయంలో గమ్యాన్ని రీచ్ అవుతాము… 35 సీటింగ్ అయినప్పటికీ AC బస్ కాబట్టి నిలబడి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది.. ఎండీ సజ్జనార్ వచ్చాక కొత్త ఒరవడి తీసుకొచ్చారు… బస్ ఫెసిలిటీ నీ పెంచుకున్నాం… ఎలక్ట్రికల్ బస్ లు రానున్న రోజుల్లో పంచుకుంటాం.. కేంద్ర విధానాల వల్ల ఎలక్ట్రిక్ బస్ లను పెంచుకొలేక పోతున్నాము… ఎలక్ట్రికల్ వెహికిల్ కి సబ్సిడీ కూడా ఇచ్చాము… ప్రజలు ఎలక్ట్రికల్ వెహికిల్ కి షిఫ్ట్ అవుతున్నారు.. తెలంగాణ రాష్ట్రం రాకముందు.. 71 లక్షల వాహనాలు ఉండేవి… ఇప్పుడు 1.52 కోట్ల వాహనాలకు పెరిగాయి.. మన అందరికీ శుభవార్త… ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం అవ్వడం… గెజిట్ కూడా రావడంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులుగా మారిపోయారు… నేను మంత్రిగా ఇంత గొప్ప బిల్లు నీ ప్రవేశపెట్టడం ఆనందంగా ఉంది..
నేను వచ్చాక చాలా సంస్కరణలు చేశాను… ఫాన్సీ నంబర్ల ఇష్యూ చేసేది రిఫరెన్స్ లతో అయ్యేవి… కానీ ఈ ఫాన్సీ బిడ్డింగ్ ఏర్పాటు చేసాము… సజ్జనర్ గారు వచ్చాక ఆర్టీసీ నీ సమర్థవంతంగా నడిపించారు…’ అని ఆయన వ్యాఖ్యానించారు.
*మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
కేంద్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ “నారీ శక్తి వందన్ అధినియం 2023” పేరిట మంగళవారం రోజు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఇవాళ లోక్‌సభలో 7గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టగా ఓటింగ్ నిర్వహించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన్ బిల్లు’ లోక్‌సభలో ఆమోదం పొందినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అత్యాధునిక సదుపాయాలతో గల కొత్త పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లును న్యాయ, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో నారీ శక్తి వందన్ బిల్లుపై స్లిప్ ద్వారా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు పోలయ్యాయి. మూడింట రెండొంతుల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాయ్‌బరేలీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా 60 మంది సభ్యులు లోక్‌సభలో ‘నారీ శక్తి వందన్ బిల్లు’పై చర్చలో పాల్గొన్నారు. బిల్లుపై చర్చపై కేంద్ర మంత్రి మేఘ్వాల్ స్పందిస్తూ.. రాణి దుర్గావతి, రాణి చెన్నమ్మ, రాణి అహల్యాబాయి, రాణి లక్ష్మి వంటి అసంఖ్యాక కథానాయికలను ప్రస్తావించారు. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం స్లిప్పుల ద్వారా సభలో ఓటింగ్ నిర్వహించారు. అంతకు ముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేయగా.. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ను ప్రారంభించారు. డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉండడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ను నిర్వహించారు. ఆకుపచ్చ, ఎరుపు స్లిప్పులపై ఎస్, నో అని ఉంటాయని వాటిపై సంతకం చేసి వారీ పేరు, ఐడీ నంబర్ సహా నియోజకవర్గం, రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పేరు రాయాలని లోక్‌సభ సెక్రటరీ సూచించారు. స్లిప్పులు పంపిణీ అనంతరం మళ్లీ వాటిని తీసుకునే వరకు ఎవరూ సీట్ల నుంచి వెళ్లవద్దని సూచించారు. ఈ విధంగా ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఓటింగ్‌లో ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు లభించింది.
*మహిళా రిజర్వేషన్ బిల్లు.. వ్యతిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎంపీలు ఎవరంటే?
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లు(మహిళా రిజర్వేషన్ బిల్లు) లోక్‌సభలో బంపర్ మెజార్టీతో ఆమోదం పొందింది. అత్యాధునిక సదుపాయాలతో కొత్త పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు పోలయ్యాయి. లోక్‌సభలోని 545 మంది ఎంపీలకు గానూ 456 మంది సభకు హాజరై ఓటు వేశారు. అంతకు ముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేయగా.. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ను ప్రారంభించారు. ఓటేసిన 456 మంది లోక్‌సభ సభ్యులలో 454 మంది మద్దతుగా ఓటు వేయగా.. ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆ ఇద్దరు ఎంపీలు ఎంఐఎం పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఔరంగాబాద్/ఛత్రపతి శంభాజీనగర్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళల రిజర్వేషన్లలో మహిళలకు కోటా లేకపోవడంతో వీరు ఈ బిల్లును వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
*ప్రధాని మోడీ వాట్సాప్ ఛానెల్ రికార్డ్.. ఒక్క రోజులోనే మిలియన్ ఫాలోవర్లు
ప్రధాని నరేంద్రమోడీ క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియా ఫ్లాట్‌పాం ఎక్స్(ట్విట్టర్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయిలో మోడీకి ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ బుధవారం తన వాట్సాప్ ఛానెల్ క్రియేట్ చేశారు. ఒక్క రోజులోని రికార్డు స్థాయిలో మిలియన్ సబ్‌స్క్రైబర్లను దాటింది. ఇప్పటికే ఎక్స్(ట్విట్టర్)లో 91 మిలియన్ల మంది ఫాలోవర్లలో ప్రధాని మోడీ దేశంలోనే నెంబర్ 1గా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో పీఎం మోడీకి 48 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 78 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వాట్సాప్ ఛానెల్ ఫీచర్నిని ప్రవేపెట్టిన తర్వాత ప్రధాని మోదీ మంగళవారం వాట్సాప్ ఛానెల్ లో చేరారు. వాట్సాప్ కమ్యూనిటీలో చేరినందుకు థ్రిల్ గా ఉందని, కొత్త పార్లమెంట్ భవనం నునంచి ఒక ఫోటోను పోస్ట్ చేశారు. మెటా సెప్టెంబర్ 13 భారత్ తో పాటు 150కి పైగా దేశాల్లో వాట్సాప్ ఛానెల్ ప్రారంభించింది.
*కెనడాతో లింకులున్న టెర్రర్-గ్యాంగ్‌స్టర్ల జాబితా రిలీజ్ చేసిన ఎన్ఐఏ
ఇండియా, కెనడాల మధ్య ఖలిస్తాన్ వేర్పాటువాదం చిచ్చుపెట్టింది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది. జూన్ నెలలో కెనడా సర్రే ప్రాంతంలో నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీంతో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి. ఇదిలా ఉంటే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కెనడాతో సంబంధం ఉన్న ఉగ్రవాద-గ్యాంగ్‌స్టర్ నెట్వర్క్ కి చెందిన 43 మంది వ్యక్తుల వివరాలను బుధవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభత్వం స్వాధీనం చేసుకోగల వారి ఆస్తుల వివరాలను పంచుకోవాలని ఎన్ఐఏ కోరింది. ఎన్ఐఏ లిస్టులో లారెన్స్ బిష్ణోయ్, జస్దీప్ సింగ్, కాలా జాతేరి అలియాస్ సందీప్, వీరేంద్ర ప్రతాప్ అలియాస్ కాల రాణా మరియు జోగిందర్ సింగ్‌ల ఫోటోలు ఉన్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్లలో చాలా మంది కెనడాలో ఉన్నారని ఎన్ఐఏ పోస్టు హైలెట్ చేసింది. ఈ గ్యాంగ్ స్టర్ల పేరు మీద లేదా వారి సహచరులు, స్నేహితులు, బంధువుల పేరుపై ఉన్న ఆస్తులు, వ్యాపారాల వివరాలను పంచుకోవాలని కోరింది. ఉగ్రవాద-గ్యాంగ్‌స్టర్ల వివరాలను గురించిన పోస్టును ఎన్ఐఏ తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో పంచుకుంది. జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఇతను సిక్కు వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు ‘ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్’పేరుతో ఓ ఉగ్రసంస్థను నడుపుతున్నారు. ఇదే కాకుండా గురుపత్వంత్ సింగ్ పన్నూకు సంబంధించిన ‘సిక్ ఫర్ జస్టిస్’ సంస్థతో సంబంధాలు ఉన్నాయి. వీరందరికి పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా నిధులు అందుతున్నాయనేది బహిరంగ రహస్యం. భారత్ నుంచి పంజాబ్ ని వేరుచేసి ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని ఈ ఉగ్రసంస్థలు భారత్ కి వ్యతిరేకంగా ద్వేషాన్ని నూరిపోస్తున్నాయి.
*డొనాల్డ్ ట్రంప్ చనిపోయాడు.. కలకలం రేపిన ట్రంప్ కుమారుడి పోస్ట్!
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరణించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ కలకలం సృష్టించింది. డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విటర్ ఖాతా నుంచి ఈ పోస్ట్ వెలువడడం దీనికి కారణమైంది. అనంతరం ట్రంప్ కుమారుడు దీనికి వివరణ ఇచ్చారు. తన ట్విటర్ ఖాతా హ్యాక్ చేయపడినట్లు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ తెలిపారు. దాని నుండి వరుస ట్వీట్లు పోస్ట్ చేయబడ్డాయి. అభ్యంతరకర ట్వీట్ల పరంపరలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణాన్ని తప్పుగా ప్రకటించే ట్వీట్ ఒకటి ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను టార్గెట్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. సెప్టెంబరు 20న డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విటర్ పోస్టులు వరుసగా వెలువడ్డాయి. 140k వీక్షణలను సంపాదించిన పోస్ట్‌లలో ఒకటి ఇలా ఉంది. “నా తండ్రి డోనాల్డ్ ట్రంప్ మరణించారని ప్రకటించడానికి నేను విచారంగా ఉన్నాను. నేను 2024లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తాను.” అని ఆ పోస్ట్‌లో ఉంది. అదే ఖాతాను నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ను దూషిస్తూ పోస్టులు వెలువడ్డాయి. అయితే ట్రంప్ జూనియర్ తన ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించారు. వెంటనే ఆ పోస్టులను తొలగించారు. అయినప్పటికీ దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు మాత్రం సోషల్‌మీడియా జోరుగా షేర్ చేయబడ్డాయి. ఇప్పటివరకు ఇది ఎవరు చేశారో తెలియదు. మరోవైపు తాను మరణించానంటూ వచ్చిన సోషల్ మీడియా పోస్ట్‌పై డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన కుమారుడి ఖాతాలో పోస్ట్ వచ్చిన అరగంట తర్వాత తాను బతికే ఉన్నానంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ట్రంప్ వెల్లడించారు.
*ఐసీసీ కీలక ప్రకటన.. అమెరికాలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ) మెన్స్ వరల్డ్‌కప్-2024 కీలక ప్రకటన చేసింది. అమెరికాలోని మూడు ప్రధాన నగరాలు ఈ మెగా టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. న్యూయార్క్, ఫ్లోరిడా, డల్లాస్‌లను టీ20 ప్రపంచకప్ వేదికలుగా ఎంపిక చేసినట్లు నేడు (బుధవారం ) ఐసీసీ ధ్రువీకరించింది. కాగా వెస్టిండీస్‌తో కలిసి యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈసారి టీ20 ప్రపంచకప్ నిర్వహణకు రెడీ అయింది. మొట్ట మొదటిసారి ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను అమెరికా దక్కించుకోవడంతో.. వేదికల ఎంపికలో తుది నిర్ణయం తీసుకుంది. అయితే, న్యూయార్క్‌లోని నసౌవ్ కౌంటీ, డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రొవార్డ్ కౌంటీ అసోసియేషన్‌లకు ఈ మేరకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఐసీసీ ఆదేశించింది. సీటింగ్ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గాఫ్ అలార్డిస్ మాట్లాడుతూ.. అతిపెద్ద ఐసీసీ టోర్నమెంట్ కు అగ్రరాజ్యం అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతుండటం హ్యాపీగా ఉందన్నారు. అమెరికాలో క్రికెట్ పట్ల ఆదరణ రోజురోజుకీ పెరుగుతుంది.. ఫ్యాన్‌బేస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు. ఇక, ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. సొంత నగరాల్లోనే మేటి క్రికెట్ మ్యాచ్‌లు నేరుగా చూసేందుకు యూఎస్‌ఏలోని క్రికెట్ ఫ్యాన్స్‌కు ఛాన్స్ కల్పించడం పట్ల గాఫ్ అలార్డిస్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరోసారి క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం అందనుంది. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో నిర్వహించిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ జట్టు విజేతగా నిలిచింది.
సైలెంటుగా సాయి పల్లవి పెళ్లి.. అసలు సంగతి చెప్పేసిన డైరెక్టర్
తెలుగు ఆడియన్స్ సాయి పల్లవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఫిదా’ ద్వారా తెలుగు స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎక్కువ కాలం గుర్తుండిపోయే క్యారెక్టర్లలో నటించి నటిగా తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. కొన్ని రోజులుగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. డాక్టర్ కోర్సు కూడా చేసిన ఆమె సమాజ సేవ చేసేందుకు హాస్పిటల్ పెట్టబోతోందని పుకార్లు వచ్చినా అది నిజం కాదని తెలుస్తోంది. ఇక అనూహ్యంగా ఆమె పెళ్లి చేసుకుందన్న వార్తలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో మెడలో దండలు వేసుకొని మరో వ్యక్తితో కలిసి ఉన్న ఆమె ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామిని ఆమె పెళ్లి చేసుకుందన్న కథనాలు వినిపించగా అందులో ఎటువంటి వాస్తవం లేదు. శివకార్తికేయన్‌తో కలిసి ఆమె నటిస్తున్న ‘#SK 21’ ముహూర్తం పూజ ఇటీవల నిర్వహించారు. ఆ పూజా కార్యక్రమంలో భాగంగా చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి, సాయి పల్లవి మెడలో వేరువేరుగా పూల దండలు వేసుకొని ఉండగా మీడియాకు ఫొటో కోసం ఫోజులు ఇచ్చారు. ఇది అసలు పెళ్లి ఫొటో కాదని, సినిమా వేడుకలో తీసిందిని తాజాగా సాయి పల్లవితో విరాటపర్వం చేసిన దర్శకుడు వేణు కూడా ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక మరో పక్క సాయి పల్లవి ఈరోజే నాగచైతన్య 23 సినిమాలో కూడా భాగం అవుతుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.