దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు బీఆర్ఎస్ కండువాతో ఎమ్మెల్యే వెళ్లారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ వోజ్జల రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అధికార బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పుకుని పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం కనిపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
జనసేన విస్తృత స్థాయి సమావేశం:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతికి రానున్నారు. నేటి మధ్యాహ్నాం జనసేన పార్టీ విస్తృత స్థాయీ సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. ఎన్నికలకు లీడర్లు, కేడరును సమాయత్తం చేస్తూ జనసేన ఈ సమావేశం నిర్వహిస్తుంది. క్షేత్ర స్థాయిలో టీడీపీతో సమన్వయం చేసుకునే అంశంపై జనసేన ప్రధానంగా చర్చ జరుపనుంది. ఈ నెల రెండో వారం నుంచి టీడీపీతో కలిసి వివిధ కార్యక్రమాల రూపకల్పనపై జనసేన ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది.
గో ఫస్ట్ సీఈఓ కౌశిక్ ఖోనా రాజీనామా:
గత ఏడు నెలలుగా మూతపడిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్ సీఈవో కౌశిక్ ఖోనా ఎట్టకేలకు రాజీనామా చేశారు. విమానయాన సంస్థ ఇప్పటికే దివాలా తీసినట్లు ప్రకటించే ప్రక్రియను ప్రారంభించింది. తన రాజీనామా విషయాన్ని తెలియజేస్తూ కంపెనీ ఉద్యోగులకు మెయిల్ రాశారు. మే 3 నుండి గో ఫస్ట్ విమానాలు మూసివేయబడ్డాయి. అమెరికన్ కంపెనీ ప్రాట్ & విట్నీ ఇంజిన్ వైఫల్యం కారణంగా గో ఫస్ట్ దాని విమానంలో సగానికి పైగా నేలపైకి వచ్చింది.
తల్లి శవంతోనే జీవిస్తున్న అక్కాచెల్లెళ్లు:
ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏడాది క్రితం మరణించిన తల్లి శవంను ఇంట్లోనే పెట్టుకొని నివసిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇరుగుపొరుగు వారికి అక్కాచెల్లెళ్లు కొన్ని రోజులుగా కనిపించకపోవడం, తలుపులు మూసి ఉండడం కారణంగా అనుమానం రావడంతో అసలు విషయం బయటికి వచ్చింది. అక్కాచెల్లెళ్ల మానసిక పరిస్థితి సరిగా లేదని దర్యాప్తులో తేలింది. వివరాల ప్రకారం… మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా దేవి త్రిపాఠి (52) తన ఇద్దరు కూతుళ్లు పల్లవి (27), వైశ్విక్ (17)లతో కలిసి ఓ ఇంట్లో ఉండేది. పల్లవి పీజీ పూర్తిచేయగా.. వైశ్విక్ పదో తరగతి చదువుతోంది. ఉషా భర్త రెండేళ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దాంతో ఉషా ఓ దుకాణం నడుపుతూ జీవనం సాగించేది. అనారోగ్యంతో 2022 డిసెంబరు 8న ఉషా మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమెకు అక్కాచెళ్లెలిద్దరూ అంత్యక్రియలు నిర్వహించలేదు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. మృతదేహం వాసన బయటకు రాకుండా.. అగర్బత్తీలు కాల్చేవారు.
Also Read: Mother Dead Body: ఏడాది కాలంగా.. తల్లి శవంతోనే జీవిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు!
బంపర్ ఆఫర్ ప్రకటించిన సలార్ టీం:
ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సలార్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 7.19 గంటలకు రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ కు ఒక రోజు ముందు సలార్ టీమ్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో ఓ ఫొటోను షేర్ చేసింది. ‘బెస్ట్ 5 క్యాప్షన్లకు మీ దగ్గర్లోని థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లతో పాటు సలార్ మెర్చండైజ్ కూడా గిఫ్ట్ గా ఇస్తాం. సలార్ సీజ్‌ఫైర్ ట్రైలర్ డిసెంబర్ 1 సాయంత్రం 7.19 గంటలకు రానుంది’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను షేర్ చేశారు.
ఆస్ట్రేలియాతో నాలుగో టీ20:
5 టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సిరీస్ ఫలితం రాయ్‌పూర్‌లోనే తేలుతుందా? లేదా చివరి మ్యాచ్‌లో నిర్ణయమవుతుందా? అన్నది చూడాలి. నేటి రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.