*వారికి జగన్ సర్కార్ గుడ్‌న్యూస్
ఏపీ ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకున్నవారికి ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది. పేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద శుక్రవారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగదు జమ చేయనున్నారు. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా లబ్దిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ నగదును జమ చేయనున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగినట్లవుతుంది. వీరి ఖాతాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్ధిక సాయం అందిస్తుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గడిచిన ఆరు నెలల్లోనే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద 16,668 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 125.50 కోట్లు జమ చేసింది జగన్ ప్రభుత్వం. ‘పిల్లల చదువు ఇంటికి వెలుగు– ఇల్లాలి చదువు వంశానికే వెలుగు’ అనే మాటను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓవైపు పేద కుటుంబాల్లోని చెల్లెమ్మల పెళ్లిళ్లకు అండగా నిలుస్తోంది. మరోవైపు ప్రతి చెల్లెమ్మను, ప్రతి తమ్ముడిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం, బాల్యవివాహాలను నివారించడం, పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవడం వంటి సమున్నత లక్ష్యాలతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది.
*హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన
మంత్రి కేటీఆర్ శుక్రవారం హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు 12819 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 17అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో.. పట్టణప్రగతి, సిఎంఏ, మునిసిపల్ సాధారణ నిధులు, స్మార్ట్ సిటీ, స్టేట్ గవర్నమెంట్ ఫండ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఫ్లడ్ రిలీఫ్ పథకాల క్రింద రూ.12819 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న 17అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వరంగల్ మహానగరపాలక సంస్థ, కుడా, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ 178.95 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. జిడబ్ల్యూ ఎంసీ ఆధ్వర్యంలో సిఎంఏ, స్మార్ట్ సిటీ పథకాల క్రింద రూ. 520 లక్షల తో చేపట్టిన 2 అభివృద్ధి పనులైన మోడల్ వైకుంఠ ధామం, సైన్స్ పార్క్ లను, తెలంగాణ స్టేట్ సైన్స్ టెక్నాలజీ కౌన్సిల్ నిధులతో రూ 850 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్సి , ఎస్టీ సెంటర్ లకు ప్రారంభోత్సవాలు చేస్తారు. అదేవిధంగా భద్రకాళి మాడ వీధులు, రూ 120 లక్షలతో అంతర్గత సిసి రోడ్ లకు శంకుస్థాపన, బిసి సంక్షేమ శాఖ నిధులతో 31 వ డివిజన్ లో రూ 586 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిసి కమ్యూనిటీ హాల్ లకు మంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.
*‘తాగొచ్చి మా అమ్మను కొడుతున్నాడు.. మా నాన్నను జైల్లో వేయండి’
బాపట్ల జిల్లా కర్లపాలెంలోని పోలీస్ స్టేషన్లో విచిత్రమైన ఫిర్యాదు వచ్చింది. ఓ తొమ్మిదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైకు తండ్రిపై ఫిర్యాదు చేశాడు. తల్లి బాధ చూడలేక తన సమస్యను ధైర్యంగా ఎస్సైకు వివరించాడు. తన తల్లిని తండ్రి ఇబ్బందులు పెడుతున్నాడని అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ చిన్నోడి ధైర్యానికి పోలీసులు షాక్ తిన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా కర్లపాలెం పాత ఇస్లాంపేటకు చెందిన సుభానీ, సుభాంబీ భార్యాభర్తలు.. వారిద్దరికి ఓ కుమారుడు ఉన్నాడు. సుభాని రైస్ మిల్లులో పనిచేస్తాడు.. అలాగే కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. సుభాంబీ ఇంట్లోనే ఉంటుంది. సుభానీ రోజు మద్యం తాగుతాడు. అనంతరం రోజూ రాత్రిళ్లు ఇంటికి వచ్చి భార్యను దారుణంగా వేధించేవాడు. తండ్రి సుభాని తల్లిని రోజూ కొట్టడం చూసి తొమ్మిదేళ్ల కుమారుడు రహీమ్ తట్టుకోలేకపోయాడు. తల్లి బాధను చూడలేకపోయాడు. తండ్రి ఇలా చేయకుండా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే నేరుగా స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. తన తల్లితో తండ్రి ప్రవర్తిస్తున్న తీరును ఎస్సైకు వివరించాడు. వెంటనే తండ్రి చేస్తున్న పని ఆపించాలని వేడుకున్నాడు. అతడిని పిలిచి మందలించాలని ఎస్సైను కోరాడు. బాలుడి ఫిర్యాదుతో ఎస్సై వెంటనే ఆ దంపతులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించి అక్కడిన నుంచి పంపించేశారు. మొత్తానికి బాలుడు తన తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక పోలీస్ స్టేషన్‌కు వచ్చి తండ్రిపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
*కర్ణాటకలో అధికారం ఎవరిది..? ఒపీనియన్ పోల్స్ చెబుతున్నది ఇదే..
కర్ణాటక ఎన్నికలకు మరో 5 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే మెజారిటీ ఒపీనియన్ పోల్స్ బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని తమ సర్వేలను వెల్లడించాయి. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, లేకపోతే సింగిల్ లార్జెట్ పార్టీగా అవతరిస్తుందని చెబుతున్నాయి. మూడు ఒపీనియన్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే.. మూడు రోజుల క్రితం వెలుబడిన జీన్యూస్-మాట్రిక్స్ ఒపీనియన్ పోల్ మాత్రం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రకారం కర్ణాటకలోని 224 సీట్లలో కాంగ్రెస్ 107-119 స్థానాలు, బీజేపీ 74-86, జేడీఎస్ 23-35 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఓట్లపరంగా బీజేపీకి 35 శాతం, కాంగ్రెస్ కు 40 శాతం, జేడీఎస్ కు 17 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. ఇండియా టుడే-సీ ఓటర్ కూడా ఇలాంటి ఫలితాలనే వెల్లడించింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యకు 42 శాతం మద్దతు తెలుపగా.. బీజేపీ బసవరాజ్ బొమ్మైకి 31 శాతం మాత్రమే జైకొట్టారు.
*”జైభజరంగబలి”పై ఓవైసీ కామెంట్స్
మతం ఆధారంగా కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీలు ఓట్లు అడుగుతున్నాయని మండిపడ్డారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసద్దుదీన్ ఓవైసీ. హుబ్లీలో కూల్చివేసిన దర్గా పునర్మిర్మానికి కాంగ్రెస్ హామీ ఇస్తుందా..? అని ప్రశ్నించారు. బీజేపీతో సైద్ధాంతిక పోరాటానికి లొంగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలత్లో హనుమాన్ ఆలయాల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటు వేసేటప్పుడు ‘జై బజరంగబలి’ అని చెప్పాలని కర్ణాటక ప్రజలను ప్రధాని మోదీ కోరారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో మరిన్ని హనుమాన్ ఆలయాలు నిర్మిస్తామని డీకే శివకుమార్ చెబుతున్నారని, ఇది ఎలాంటి సెక్యులరిజం? అని ఓవైసీ ప్రశ్నించారు. మే 10న ప్రజలు ఓటు వేసేటప్పుడు ‘అల్లాహు అఖ్బర్’ అని చెప్పమని నేను ఇక్కడ నిలబడి అడిగితే, మీడియా నన్ను దూషిస్తుందని ఆయన అన్నారు. కోలార్ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ‘భజరంగ్ దళ్’ నిషేధిస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో కర్ణాటక ఎన్నికల్లో ప్రకంపనలు రేపింది. ప్రస్తుతం దీని ఆధారంగానే ప్రచారం కొనసాగిస్తున్నాయి పార్టీలు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోని విమర్శిస్తూ.. ప్రజలు ఓటేసే ముందు ‘జై భజరంగబలి’ అని ఓటేయాని ప్రధాని మోదీ సూచించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ గురువారం వ్యాఖ్యానించారు. మే 10న కర్ణాటక రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి.
*అదుపులో మణిపూర్ పరిస్థితి.. మరిన్ని బలగాలు మోహరింపు..
మణిపూర్ లో గిరిజన, గిరిజనేతరుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సైన్యం మోహరించింది. మోరే, కాంగ్‌పోక్పి ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని భారత సైన్యం వెల్లడించింది. ఇంఫాల్, చురచంద్‌పూర్ ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరగుతున్నాయని తెలిపింది. సైన్యంతో పాటు పారామిలిటీరీ ట్రూప్స్ రాష్ట్రంలో మోహరించారు. అస్సాం నుంచి మరిన్ని బలగాలను భారతవాయుసేన కల్లోలిత మణిపూర్ రాష్ట్రానికి చేర్చుతోంది. మే 3న ప్రారంభమైన ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. మైతై కమ్యూనిటీని ఎస్టీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ATSU) మణిపూర్ నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’లో హింస చెలరేగింది. వాహనాలు, ఇళ్లకు నిప్పుపెట్టారు. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం బిరేన్ సింగ్ తో చర్చించారు. చుట్టు పక్కల రాష్ట్రాల సీఎంలతో కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు నకిలీ వీడియోల పట్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆర్మీ కోరింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మణిపూర్ గవర్నర్ ‘షూట్ అట్ సైట్’ ఆర్డర్స్ ఇష్యూ జారీ చేశారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. భారీ జనసమూహాలపై నిషేధంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధించారు.
*పాకిస్తాన్‌లో ఘోరం.. ఉపాధ్యాయులపై ముష్కరుల కాల్పులు
పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. పరీక్షల సందర్భంగా విధులు నిర్వహిస్తున్న టీచర్లపై టెర్రరిస్టులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పర్ కుర్రం గిరిజన జిల్లాలోని తేరీ మెంగల్ హైస్కూల్ పై టెర్రరిస్టులు దాడి చేసి పరీక్ష విధుల్లో ఉన్న ఏడుగురు ఉపాధ్యాయులను హతమార్చారు. దాడి జరిగిన వెంటనే ఆ ప్రాంతం నుంచి ముష్కరులు పారిపోయారు. దీనికి తామే బాధ్యులమని ఏ గ్రూపు ఇప్పటి వరకు ప్రకటించుకోలేదని అధికారులు. ఇదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఇంకో వ్యక్తి చనిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పాకిస్థాన్ లోని వాయువ్య గిరిజన జిల్లాలో గురువారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు మృతి చెందారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని అప్పర్ కుర్రం గిరిజన జిల్లా పరచినార్ ప్రధాన కార్యాలయంలోని షాలోజాన్ రోడ్డులో తేరీ మెంగల్ తెగకు చెందిన మహ్మద్ షరీఫ్ అనే పాఠశాల ఉపాధ్యాయుడి కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేయడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, అదే జిల్లాలోని ప్రభుత్వ తేరీ మెంగల్ హైస్కూల్ స్టాఫ్ రూమ్ లోకి చొరబడి టోరీ తెగకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులను ముష్కరులు హతమార్చారు. ఉపాధ్యాయులందరూ తమ పరీక్ష విధులు నిర్వర్తించడానికి పాఠశాలలో ఉన్నారు. దాడి అనంతరం దుండగులు పరారయ్యారు. ఈ దాడులకు ఏ గ్రూపు లేదా వ్యక్తి బాధ్యత వహించలేదు, కానీ ఈ ప్రాంతం సున్నీలు- షియాల మధ్య మతపరమైన ఘర్షణలకు కేంద్రంగా ఉంది. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. హత్యల అనంతరం 9, 10 తరగతుల కోహత్ బోర్డు పరీక్షను కూడా వాయిదా వేశారు. ఏడుగురు ఉపాధ్యాయుల హత్య కేసులో నిందితులను అరెస్టు చేసే వరకు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఆల్ ఖుర్రం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ జాహిద్ హుస్సేన్ తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
*ఉగ్రం ట్విట్టర్ రివ్యూ
అల్లరి నరేష్ అంటేకామెడీకి కేరాఫ్ అడ్రాస్ గా నిలిచాడు. కామెడీ మూవీలతో హీరోగా ఎదిగి నవ్వులు పూయించిన ఆయనకి ఇప్పుడు ఆ కామెడీనే వర్కౌట్ కావడం లేదు. అందుకే ఆయన తనని తాను మార్చుకోవాల్సి వచ్చింది. సీరియస్ లుక్‌లోకి టర్న్ తీసుకుని చేసిన `నాంది` భారీ విజయాన్ని సాధించింది. ఇక నాంది సినిమా హిట్ తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో రూపొందిన మరో చిత్రం ‘ఉగ్రం’. మీర్నా మీనన్ హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటించింది. తాజాగా ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అసలు ఉగ్రం కథేంటి? ఎలా ఉంది? అల్లరి నరేశ్ యాక్షన్‌పై తమ అభిప్రాయాలను ట్విటర్‌లో పంచుకుంటున్నారు. నాంది తర్వాత యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఉగ్రం. ఉగ్రం సినిమాలో అల్లరి నరేశ్ యాక్షన్ అదిరిపోయిందని ట్విట్టర్ లో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సెకండాఫ్‌లో క్లైమాక్స్, ఫైట్ సీన్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ విశ్వరూపం చూపించాడని ట్విటర్ వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం అల్లరి నరేష్ ముఖ్యంగా క్లైమాక్స్ ఫర్ఫార్మెన్స్ అదిరిపోయింది అంటూ ట్విట్టర్ వేదికలో తెలుపుతున్నారు. బీజీఎం కొన్ని సీన్స్‌లో డీసెంట్‌గా ఉందని చెబుతున్నారు. కొందరు ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందనగా.. సెకండాఫ్‌లో గూస్‌బంప్స్ ఖాయమంటున్నారు. ఉగ్రం సినిమాలో అల్లరి నరేశ్ యాక్షన్ వేరే లెవెల్‌లో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.