*రెండో రోజు సీఐడీ కస్టడీలో చంద్రబాబు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని ఇవాళ (ఆదివారం) ఏపీ సీఐడీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. ఇవాళ చంద్రబాబును సూటిగా మరిన్ని ప్రశ్నలు సీఐడీ అధికారులు అడగనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రశ్నలకు వచ్చే ఆన్సర్స్ ను బట్టి.. ఆయన్ని మరిన్ని రోజులు కస్టడీలోకి తీసుకోవాలా లేదా, ఇక్కడితో విచారణ ముగించాలానేది నేటి సాయంత్రం నిర్ణయం తీసుకోనున్నారు. మరిన్ని రోజులు ప్రశ్నించాలి అనుకుంటే, మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఐడీ అధికారులు కోరే అవకాశం ఉంది. దీంతో నేటి సాయంత్రానికి చంద్రబాబు నాయుడి రిమాండ్ అదనపు గడువు ముగుస్తుంది.
*విజయవాడ నుంచీ చెన్నైకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
విజయవాడ-చెన్నై నగరాల మధ్య వందేభారత్ రైలును ఇవాళ ( ఆదివారం ) ఉదయం 10.30 గంటలకు జెండా ఊపి ప్రధాన మంత్రి నరంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 8 బోగీల ఈ రైలు వారంలో ఆరు రోజులు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. ఒక్క మంగళవారం రోజు మాత్రం ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవు.. నేడు లాంఛనంగా వందేభారత్ రైలును ప్రారంభించినప్పటికీ.. రేపటి (సెప్టెంబర్ 25) నుంచి ఈ ట్రైన్ సేవలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. వందేభారత్ ఎక్స్ ప్రెస్ విజయవాడ నుంచి చెన్నైకి 6 గంటల 40 నిమిషాల్లోనే చేరుకుంటుంది. విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు స్టార్ట్ అయ్యి.. రాత్రి 10 గంటలకు చెన్నైకి చేరుకుంటుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటల్లో దీనికి స్టాప్‌లు ఉన్నాయి. 3.49 గంటలకు తెనాలి చేరుకునే ఈ రైలు.. సాయంత్రం 5.03 గంటలకు ఒంగోలు.. సాయంత్రం 6.19కి నెల్లూరు, రాత్రి 8.05 గంటలకు రేణిగుంట చేరుకోనుంది.
*తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. బ్రేక్, ప్రత్యేక దర్శనాలు రద్దు.. వైవభంగా 7వ రోజు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఏడవ రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా.. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులుకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఇక, అలాగే ఇవాళ రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై తిరుమల శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏడో రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా.. తిరుమలలో బ్రేక్, ప్రత్యేక దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఇక ఎల్లుండి ( మంగళవారం )తో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
*తెలంగాణలో వర్షాలు..ఎల్లో అలెర్ట్..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా పశ్చిమం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నేడు నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సోమవారం (25) కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు తెలిపారు.
మొదటి రోజే బ్రేక్ ఈవెన్
కన్నడ యంగ్ స్టార్ హీరో రక్షిత్ శెట్టి అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ కథలకి మాత్రమే ఓకే చెప్పే రక్షిత్ శెట్టి… లేటెస్ట్ గా నటిస్తూ ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’ కర్ణాటకలో సూపర్ హిట్ అయ్యింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి క్లాసిక్ లవ్ స్టోరీ అనే పేరు తెచ్చుకుంది. ఈ మూవీలో మను అండ్ ప్రియాల ప్రేమకథని దర్శకుడు హేమంత్ రావు బ్యూటిఫుల్ గా నరేట్ చేసాడు. చరణ్ రాజ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో రిలీజ్ చేసింది. ‘సప్త సాగర దాచే ఎల్లో’ రైట్స్ ని తీసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈరోజు ఈ మూవీని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’గా రిలీజ్ చేసారు. సెప్టెంబర్ 22న రిలీజ్ ఈ సినిమా… మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్ కి ముందు మంచి బజ్ జనరేట్ చేసిన సప్త సాగరాలు దాటి పోస్ట్ రిలీజ్ కలెక్షన్స్ లో ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది. అన్ని సెంటర్స్ లో ఈ సినిమాకి హౌజ్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఒక మంచి సినిమా వస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు అనే విషయాన్నీ సప్త సాగరాలు దాటి సినిమా మరోసారి ప్రూవ్ చేస్తుంది. అన్ని సెంటర్స్ లో థియేటర్స్ ఫుల్ అవుతూ ఉండడంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ థియేటర్స్ ను పెంచే పనిలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 25కి పైగా థియేటర్స్ పెరిగాయి కాబట్టి కలెక్షన్స్ కూడా పెరగనున్నాయి.
*బాలుడి సమయస్ఫూర్తి.. తప్పిన రైలు ప్రమాదం
ఓ బాలుడి సమయస్ఫూర్తి చాలా మంది ప్రాణాలు కాపాడింది. పదేళ్ల వయసులోనే పెను ప్రమాదాన్ని తప్పించి వందల మంది ప్రాణాల్ని కాపాడాడు. రైలు ప్రమాదాన్ని గుర్తించిన బాలుడు వెంటనే తన షర్ట్ తీసి ఊపి రైలు ఆగేలా చేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు బాలుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పశ్చిమబెంగాల్ లోని మాల్దా జిల్లాకు చెందిన ముర్సెలీమ్ అనే పదేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో, కుటుంబంతో కలిసి కరియాలి అనే గ్రామంలో నివసిస్తున్నాడు. అతడికి చేపలు పట్టే అలవాటు ఉంది. అలాగే మొన్న కూడా అతడు చేపలు పట్టడానికి అక్కడే ఉన్న ఓ కుంట దగ్గరకు వెళుతున్నాడు. అక్కడికి వెళ్లాలంటే రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్లాలి. అటుగా కుంట వద్దకు వెళుతున్న బాలుడు రైలు పట్టాల కింద గొయ్యి గమనించాడు.
*నేడే భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30కి మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే మొదటి వన్డే గెలిచిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. వన్డే ప్రపంచకప్ 2023కు ముందు జరుగుతున్న చివరి సిరీస్‌ను సొంతం చేసుకొని.. మెగా ఈవెంట్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగాలని భారత్ చూస్తోంది. మరోవైపు మొదటి వన్డేలో ఓడిన ఆసీస్ ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లలో స్టార్స్ ఉన్నారు కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.