*తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడే..
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. రేపు(సోమవారం) ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు స్వామివారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. రేపు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవ నిర్వహించనున్నారు. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు 16 వాహనాలపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సర్వదర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించనుంది. సిఫార్సు లేఖలపై వసతి గదులు కేటాయింపు విధానాన్ని రద్దు చేశారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన గదులు కేటాయింపు జరగనుంది. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మాడవీధులలో గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. ఆన్‌లైన్‌లో లక్షా 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రతి నిత్యం సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. అన్నప్రసాద సముదాయంలో నిత్యం లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. 3500 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
*లిఫ్ట్ లో యువతిని బంధించి అత్యాచారం
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరినీ వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. ఆడదానికి ఒక తల్లిగా, తోబుట్టువుగా చూసే రోజుల పోయాయి. ఆడదిని ఆట వస్తువుగా చూస్తున్నారు. ఆమె ఎప్పుడు ఒంటరిగా దొరికితే చాలు అనుభవించేందుకు సిద్దంగా ఉన్నారు. నెలల పశిపాప నుంచి వృద్ధుల వరకు అత్యాచారానికి బలవుతున్నారు. పగలు రాత్రి అనే తేడాలేకుండా ఆడదానిపై కర్కసంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ సనత్ నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో జరిగింది. ఆసుపత్రి లిఫ్ట్‌లోని భవనం పై అంతస్తుకు బాలికను తీసుకెళ్లాడు. అనంతరం లిఫ్ట్ ఆపరేటర్ యువతి నోటికి గుడ్డ పెట్టి అత్యాచారం చేశాడు. డైట్ సెక్షన్‌లోని ఫ్లోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం వైద్యం కోసం ESI ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. వారం రోజుల నుండి యువతి అన్నయ్య ESI ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. యువతీ ఆసుపత్రిలోనే ఉండి అన్నయ్య బాగోగులు చూసుకుంటుంది. అయితే ఆ యువతి పై లిఫ్ట్ ఆపరేటర్ కన్ను పడింది. ఆ యువతి లిప్ట్ ఎక్కినప్పుడల్లా మాటలను కలిపాడు. వారిద్దరే ఉన్నట్లు ఆ యువతి చెప్పడంతో వీరిద్దరు తప్పా ఎవరు లేరని భావించాడు. సమయం కోసం వైట్ చేశాడు. చివరకు ఆ సమయం రానే వచ్చింది. ఆ యువతి లిప్ట్ ఎక్కి అన్నదర్గకు వెళుతుండగా లిఫ్ట్ ఆపరేటర్ ఆ యువతితో మాటలు కలిపాడు. మాటలు కాస్త కామంతో రావడంతో ఆయువతి లిప్ట్ ను స్టాప్ చేయాలని కోరింది. లేదంటే గట్టిగా అరుస్తానంటూ చెప్పడంతో లిఫ్ట్ ఆపరేటర్ ప్లాన్ ప్రకారం తన వద్ద వున్న బట్టను ఆమె నోట్లో కుక్కాడు. అరవకూడదని లేదంటే చంపేస్తానని బెదిరించాడు. లిప్ట్ ను పై ఫ్లోర్ కి తీసుకుని వెళ్లాడు. ఆ యువతిని డైట్ సెక్షన్‌లోని ఫ్లోర్‌లో తీసుకునివెళ్లి ఆమె పై అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు ఈఎస్‌ఐ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.
*CWC గెస్టుల కోసం నోరూరించే వంటకాలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీడబ్ల్యూబీసీ సమావేశానికి అగ్రనేతలంతా హాజరయ్యారు. దేశంలో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా.. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అయితే.. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న అంచనాలను పార్టీ క్యాడర్ లో నింపాలనే ఉద్దేశంతో దాదాపు 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో ఈ ప్రతిష్ఠాత్మక సభ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సమావేశాలకు మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. కాగా, ఈ సమావేశానికి వచ్చిన అతిథులకు ఘనంగా విందు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. ఈ విందులో తెలంగాణ ప్రత్యేక వంటకాలతో పాటు హైదరాబాద్‌కు ప్రసిద్ధి చెందిన దమ్ బిర్యానీ కూడా వడ్డించనున్నారు. బిర్యానీ, మటన్, తలకాయ కూర, మొత్తం 78 రకాల వెరైటీ వంటకాలు మెనూలో ఉన్నాయి. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు అన్ని రకాల నోరూరించే వంటకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక వంటకాల కోసం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వంటవాళ్లను రప్పించినట్లు తెలుస్తోంది.
*రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..
రేపటి ( సోమవారం ) నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనుండగా ఒక రోజు ముందుగా నేడు (ఆదివారం) అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్ర ప్రభుత్వం భేటీ కానుంది. ఈ సెషన్స్ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఐదు రోజుల సమావేశాల్లో మొదటిరోజు రాజ్యాంగ సభ మొదలుకొని 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్తానంపై ప్రత్యేక చర్చ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ది అడ్వొకేట్స్(సవరణ)బిల్లు–2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు–2023, ది పోస్టాఫీస్ బిల్లు–2023లను ఈ సెషన్‌లో లోక్‌సభలో కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మార్పులతో గత సెషన్స్ లో రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లును ఈసారి చర్చకు తీసుకురానుంది. అయితే, అనూహ్యంగా మరికొన్ని అంశాలను సైతం సభ ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయన్న చర్చ సర్వత్రా జోరుగా కొనసాగుతుంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళల కోటా కల్పించే బిల్లును ఈ ప్రత్యేక సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ స్పెషల్ సెషన్ సమయంలోనే పార్లమెంట్‌ను నూతన భవనంలోకి మార్చనుట్లు తెలుస్తుంది. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోడీ మే 28వ తేదీ ప్రారంభించారు. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లోకి మారిన తర్వాత సిబ్బంది కొత్త యూనిఫాంపై బీజేపీ సింబల్ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్ సిబ్బంది యూనిఫాంపై కూడా ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడ్డే అవకాశం ఉంది. ప్రధాని మోడీ సారథ్యంలో దేశ రాజధానిలో ఇటీవల విజయవంతంగా ముగిసిన జీ20 శిఖరాగ్రం అంశాన్ని పాలకపక్షం చర్చకు తీసుకు వస్తుందని అందరు భావిస్తున్నారు. ఏడాదిలో మూడుసార్లు బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ పై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ నేడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
*మెక్సికోలోని ఓ బార్ లో కాల్పులు.. ఆరుగురి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టిచింది. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రమైన జాలిస్కోలోని ఒక బార్‌లో తుపాకుల మోత మోగడంతో.. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది ముఠా హింసతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతమని జాలిస్కో పోలీస్ అధికారులు తెలిపారు. మెక్సికన్ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం అర్థరాత్రి టియోకల్టిచే నగరంలో ఈ సంఘటన జరిగిందని జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బార్‌లో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారనీ, ఈ సమయంలో కొంతమంది దుండగులు తుపాకులు పట్టుకుని వచ్చి.. విచక్షణరహితంగా కాల్పులు జరిపారని జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. మారావిల్లాస్ పరిసరాల్లోని బార్‌లో పలువురు వ్యక్తులు కాల్పులు జరిపారనీ.. ఈ సంఘటనలో ఆరుగురు మరణించారని పేర్కొంది. వాస్తవానికి నాలుగు మరణాలను అధికారులు నివేదించారు.. అయితే, ప్రాసిక్యూటర్లు నిన్న (శనివారం) ఆరుగురు మరణించినట్లు ధృవీకరించారు. మెక్సికోలోని అతిపెద్ద క్రిమినల్ గ్రూపుల్లో ఒకటైన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్‌తో ముడిపడి ఉన్న హింసతో జాలిస్కో అల్లాడిపోయింది. జాలిస్కో రాజధాని గ్వాడలజారాకు ఉత్తరాన ఉన్న టియోకల్టిచేలో ఈ నెల ప్రారంభంలో మరో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. 2006 చివరిలో సమాఖ్య ప్రభుత్వం సైనిక మద్దతుతో మాదక ద్రవ్యాల వ్యతిరేక దాడిని ప్రారంభించినప్పటి నుంచి 3 లక్షల 40 వేల మంది కంటే ఎక్కువ హత్యలు జరిగాయి.. దాదాపు లక్ష మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎక్కువ భాగం నేర సంస్థలతో ముడిపడి ఉన్నాయని జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.
*ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి!
బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర అమెజాన్ రాష్ట్రంలోని బార్సిలోస్ ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని అమెజాన్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా ఎక్స్‌లో తెలిపారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక మరణించిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారని కొన్ని బ్రెజిల్ మీడియా సంస్థలు నివేదించాయి. మరణించిన కుటుంబ సభ్యులకు లిమా సానుభూతి తెలిపారు. అమెజాన్ రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కిమీ (248 మైళ్లు) దూరంలో ఉన్న బార్సిలోస్ ప్రావిన్స్‌లో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంకు గురైన విమానం ‘మనౌస్ ఏరోటాక్సీ’ ఎయిర్‌లైన్స్‌కు చెందింది. ప్రమాదం జరిగిందని మనౌస్ ఏరోటాక్సీ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసినా.. మరణాల గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. దర్యాప్తుకు అన్ని విధాలుగా తాము సహకరిస్తామని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.
*ప్రధాని మోడీ పుట్టినరోజు.. నేడు ఆయన చేయబోయే కార్యక్రమాలు ఇవే..
ప్రధాని నరేంద్ర మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రధాని మోడీ కూడా తన బర్త్ డే రోజున న్యూఢిల్లీలోని ద్వారకలో యశోభూమిగా పిలిచే ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తొలి దశను నేడు ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీజేపీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వరకు దేశవ్యాప్తంగా సేవా పఖ్వాడా పేరుతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సేవా పఖ్వాడా కింద నేటి నుంచి ఈ నెల 24 వరకు ‘ఆయుష్మాన్ భవ వారోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయుష్మాన్ యోజన కింద పేదలకు ఈ-కార్డులు పంపిణీ చేయనున్నారు. అదే టైంలో సఅక్టోబరు 2 వరకు బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక స్వచ్ఛతా ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని మోడీ ప్రారంభించనున్నారు. రాంచీలోని మొరాబాదిలోని ఆర్యభట్ట ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోడీ విశ్వకర్మ యోజనను ప్రారంభిస్తారు. ప్రధాని మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు ప్రసిద్ధ ఇండియా గేట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. అలాగే ఢిల్లీలోని దర్గా హజ్రత్ నిజాముద్దీన్‌లో ఆయన దీర్ఘాయువు, మెరుగైన ఆరోగ్యం కోసం సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. ఇక, ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో దేశంలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఔట్ పేషెంట్ విభాగం ప్రారంభించనున్నారు. లింగమార్పిడి సంఘంతో సమన్వయం చేయడానికి ఢిల్లీకి చెందిన సేవా భారతి కోఆర్డినేటర్లు కార్యక్రమంలో పాల్గొంటారు.
*పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (సెప్టెంబర్ 17) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,890గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,040గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,320 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,890గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా నేడు పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 74,700లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 700 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,700గా ఉండగా.. చెన్నైలో రూ. 78,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,500 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,200లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,200ల వద్ద కొనసాగుతోంది.
*నేడే ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంకతో భారత్ అమీతుమీ!
ఆసియా కప్ 2023 తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలవుతుంది. బంగ్లాదేశ్‌తో చివరి ‘సూపర్-4’ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన భారత్.. ఫైనల్‌ను మాత్రం తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఆసియా కప్ ఫైనల్ గెలిచి వచ్చే నెలలో ఆరంభం అయ్యే వన్డే ప్రపంచకప్ 2023కి ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనుకుంటోంది. సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని టీమిండియాను ఓడించాలని లంక చూస్తోంది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో మినహా భారత ప్రధాన బ్యాటర్లు నిలకడగా రాణించలేదు. ఫామ్ అందుకున్న ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జట్టుకు మరోసారి ఆరంభాన్నివ్వాల్సిన అవసరముంది. కోహ్లీ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మిడిలార్డర్లో రాహుల్, హార్దిక్, జడేజా కీలకం. బంగ్లాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న బుమ్రా, సిరాజ్, కుల్‌దీప్ తుది జట్టులోకి తిరిగి రానున్నారు. మరోవైపు లంక బ్యాటర్లు బాగా ఆడుతున్నారు. స్పిన్నర్ వెల్లలాగె, పేసర్ పతిరనతోనూ ముప్పు పొంచి ఉంది. స్పిన్నర్ తీక్షణ గాయపడి ఫైనల్‌కు దూరం అయినా డిసిల్వా, అసలంకలతో ప్రమాదమే. కొలంబోలో మ్యాచ్ అంటే స్పిన్నర్లదే హవా. ఈ టోర్నీలో కొలంబోలో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో స్పిన్నర్లే ఆధిపత్యం చెలాయించారు. ఆదివారం కూడా పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. ఇరు జట్లలో మంచి స్పిన్నర్లు ఉండడంతో బ్యాటర్లు కష్టపడాల్సిందే. ఈ పిచ్‌పై పరుగులు చేయడానికి చెమటోడ్చాల్సిందే. అయితే కొలంబోలో పేసర్లకు కూడా కాస్త సహకారం ఉంటుంది. ఆసియా కప్ 2023 ఆరంభం నుంచి వెంటాడుతున్న వరుణుడు ఫైనల్‌ను కూడా వదిలిపెట్టేలా లేడు. ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ సమయంలో వర్షం పడేందుకు 50 నుంచి 60 శాతం వరకు అవకాశాలున్నట్లు కొలొంబో వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మ్యాచ్ రద్దుకాదని సమాచారం. భారత్-శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కల్పించారు. ఆదివారం ఫైనల్ జరగకపోతే.. సోమవారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు.