Bangladesh: బంగ్లాదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. దేశంలో ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి)కి చెందిన తారిఖ్ రెహమాన్ కూడా 17 ఏళ్ల తర్వాత దేశానికి తిరిగి వచ్చారు. తారిఖ్‌ను బంగ్లా భవిష్యత్ ప్రధానమంత్రిగా చెబుతున్నారు. జమాత్-ఎ-తోయిబా (జెఎమ్), బిఎన్‌పి గురించి దేశంలో విశేషంగా చర్చ జరుగుతుంది. అయితే మరొక పార్టీ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ పార్టీ రాబోయే ఎన్నికల్లో బంగ్లాలో కింగ్ మేకర్ అవుతుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏంటి, దానికి ఉన్న అనుకూలతలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Virat Kohli: కింగ్ ఎక్కడున్నా కింగే.. కొనసాగుతున్న కోహ్లీ వీరబాదుడు.. ఖాతాలోకి మరో రికార్డ్..!
బంగ్లా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా దేశాన్ని విడిచిన తర్వాత, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. 2026 ఫిబ్రవరి 12న దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జీఎం క్వాడర్ జాతీయ పార్టీ కూడా పాల్గొంటోంది. ఈ ఎన్నికలకు జాతీయ పార్టీ మొత్తం 300 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పోరులో విజయాన్ని సాధించడానికి ఈ పార్టీ 14 పార్టీలతో కూడిన బలమైన కూటమిని ఏర్పాటు చేసింది. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ జాతీయ పార్టీ బంగ్లాదేశ్‌లో 1990లలో కూడా అధికారంలో ఉంది. అలాగే ఈ పార్టీ నాయకులు గతంలో షేక్ హసీనాతో కలిసి పనిచేశారు కూడా.
జాతీయ పార్టీ వ్యూహం ఇదే..
ఇప్పుడు దేశంలో అవామీ లీగ్ పై నిషేధం ఉన్న కారణంగా జాతియా పార్టీ ఆ పార్టీ ఓట్లను తమ వైపుకు మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల దేశంలో ప్రథమ్ అలో మీడియా నిర్వహించిన సర్వేలో 30 శాతం బంగ్లాదేశీయులు ఇప్పటికీ షేక్ హసీనా పట్ల సానుభూతి చూపుతున్నారని తేలింది. ఈ సానుభూతి జాతియా పార్టీకి ఓట్లుగా మారితే, అది బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పార్టీ నాయకుడు గులాం మొహమ్మద్ క్వాడర్ (జి.ఎం. క్వాడర్) బంగ్లాదేశ్‌లో సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన బంగ్లాదేశ్ పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీ ఇతర పార్టీలకు కూడా గట్టి పోటీ ఇవ్వవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జి.ఎం. క్వాడర్ రాజకీయాల్లోకి రాకముందు, అనేక ముఖ్యమైన సంస్థలలో కీలక పదవులను నిర్వహించారు. బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్‌లో డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ ప్లానింగ్), జమునా ఆయిల్ కంపెనీ లిమిటెడ్, బంగ్లాదేశ్ టొబాకో కంపెనీ (ఇప్పుడు బ్రిటిష్ అమెరికన్ టొబాకో బంగ్లాదేశ్) జనరల్ మేనేజర్ (CEO)గా కూడా పనిచేశారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Teja Sajja: ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు సాగలేం: తేజ సజ్జా