*నేడు రైతుల ఖాతాల్లోకి నిధులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించనున్నారు. వరుసగా ఐదవ సంవత్సరం మొదటి దశ వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. బటన్ నొక్కి రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మొదటి విడతగా 52,30,939 మంది రైతులకు వైఎస్‌ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద ఒక్కో రైతుకు రూ.5,500, పీఎం కిసాన్ యోజన కింద మరో రూ.2,000 కూడా నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖరీఫ్ నాట్లు వేసే సమయంలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది. రైతు భరోసా కింద ప్రస్తుతం పంపిణీ చేస్తున్న రూ.3,923 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో రైతులకు రూ.30,985 కోట్లు పంపిణీ చేసింది.
*నేటి నుంచి పింఛన్ల పంపిణీ
నేటి నుంచి ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంది. 63.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1739.75 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం పింఛన్ల రూపంలో పంపిణీ చేయనుంది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధులు, వితంతు, దివ్యాంగులు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గురువారం నుంచి పింఛన్ల పంపిణీ జరగనుంది. లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఈ డబ్బులను బుధవారమే ఆయా గ్రామ/వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయగా.. స్థానిక సిబ్బంది నిధులను డ్రా చేసి, వాలంటీర్ల వారీగా పంపిణీ కూడా చేశారు.గురువారం తెల్లవారుజాము నుంచి తమ పరిధిలోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్ సొమ్మును వాలంటీర్లు అందజేస్తారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. వాలంటీర్ల ఆధ్వర్యంలో 5వ తేదీ వరకు లబ్ధిదారుల ఇంటి వద్దనే ఈ పంపిణీ కొనసాగుతుందని.. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పంపిణీ ప్రక్రియ కొనసాగేందుకు 26 జిల్లాల్లో డీఆర్‌డీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లనూ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.
*తెలంగాణ విశ్వ విద్యాలయానికి సెలవులు
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ), పాలక మండలి (ఈసీ) మధ్య విభేదాల కారణంగా రిజిస్ట్రార్ నియామకంపై వివాదం రగులుతుంది. వర్సిటీకి వీసీ రాకతో స్టాఫ్ రిజిస్ట్రార్ ఛాంబర్ తెరిచినా ఆ స్థానంలో ఎవరూ కూర్చోలేదు. యూనివర్సిటీకి వచ్చిన వీసీ రవీందర్‌ను ఆయన ఛాంబర్‌లో పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, బీవీఎం విద్యార్థి సంఘాల నేతలు చుట్టుముట్టారు. వీసీ, ఈసీ నియామకాల నేపథ్యంలో.. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌తో పాటు సారంగాపూర్ ఎడ్యుకేషన్, భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లకు జూన్ 1 నుంచి 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు వీసీ ఆచార్య రవీందర్ బుధవారం సాయంత్రం తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌తో పాటు సారంగాపూర్ ఎడ్యుకేషన్, భిక్కనూరు సౌత్ ప్రాంగణాలకు జూన్ 1 నుంచి 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో గందరగోళ పరిస్థితి నెలకింది. విద్యార్థులు గురువారం మధ్యాహ్నం భోజనం తర్వాత వసతి గృహాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 9 వరకు తరగతులు ఆన్‌లైన్‌లో ఉంటాయని వెల్లడించారు. వర్సిటీకి ముందుగా మే 31 వరకు వేసవి సెలవులు ఉన్నప్పటికీ, కొత్త విద్యా సంవత్సరం 2023-24 తరగతులను ముందుగానే ప్రారంభిస్తామని మే 18న ప్రకటించారు. కొందరు ఉపాధ్యాయులు విధులకు వస్తున్నా విద్యార్థులు రావడం లేదన్నారు. ఈనేపథ్యంలో ముందుగా తీసుకున్నా నిర్ణయించిన ప్రకారం జూన్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా, సెలవులు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. ఏవో కుంటి సాకులు చెబుతూ హాస్టల్ ఖాళీ చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. వర్సిటీలో నెలకొన్న వివాదంపై విద్యార్థుల పోరాటాన్ని విరమించుకునేందుకే వీసీ సెలవులు ప్రకటించారని PDSU, ABVP నాయకులు మండిప్డడారు. హాస్టళ్లలో మరమ్మతులు చేపట్టాలని గతంలో విన్నవించినా అధికారులు స్పందించలేదని పీడీఎస్‌యూ నాయకులు ఒక ప్రకటనలో ఆరోపించారు. వీసీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
*పని చేయరు… చేసే వారిని విమర్శిస్తారు: హరీశ్ రావు
గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ఆపరేషన్ లు జరిగేవి, కేసిఆర్ పాలనలో సీన్ రివర్స్ అయిందని తెలిపారు. పని చేయరు… చేసే వారిని విమర్శిస్తారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని. కేంద్రం ఇచ్చింది ఒక్క మెడికల్ కాలేజీ అదికూడా అతిగతిలేకుండా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులకు దమాక్ పని చేయడం లేదని విమర్శించారు. వైద్యరంగంలో ప్రొఫెసర్ ల వయస్సు, విసిల బిల్లులు గవర్నర్ పెండింగ్ లో పెట్టడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. ఓరుగల్లులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి హరీష్ రావు సుడిగాలి పర్యటన చేశారు. పాధర్ కొలంబొ మెడికల్ కాలేజీతో పాటు హన్మకొండ ప్రసూతి ఆసుపత్రిలో రెడియాలజీ ల్యాబ్, కెఎంసిలో అకాడమిక్ బ్లాక్ ను ప్రారంభించారు. 1100 కోట్లతో 24 అంతస్థులతో 2100 పడకలతో నిర్మించే హెల్త్ సిటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి పనుల ప్రగతిని పర్యవేక్షించారు. 68 శాతం పనులు పూరైనా హెల్త్ సిటి పనులు వెయ్యి మంది కార్మికులతో ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం నవంబర్ వరకు పూర్తి చేసి జనవరిలో గా అందుబాటులోకి తీసుకొస్తామని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారని, దసరా వరకు 10 ఫ్లోర్ లను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని చూస్తున్నామని చెప్పారు. 36 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. వచ్చే సంవత్సరం ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంతో ఉన్న ములుగులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం దేశంలో ఎక్కడ లేదన్నారు. 70శాతం డెలివరీ లు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నాయని, కాంగ్రెస్ పాలన తీసుకువస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు. అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సూది మందులు ఉండవు గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ఆపరేషన్ లు జరిగేవి, కేసిఆర్ పాలనలో సీన్ రివర్స్ అయిందని తెలిపారు. పని చేయరు చేసే వారిని విమర్శిస్తారని ఆరోపించారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ఇవ్వడి కానీ విమర్శించడం సమంజసం కాదన్నారు.
*డీఆర్‌డీవో ఎంఎస్ఎస్ డీజీగా రాజబాబు
డీఆర్‌డీవో ఎంఎస్‌ఎస్ కొత్త డైరక్టర్ జనరల్‌గా ప్రముఖ శాస్ర్తవేత్త అయిన ఉమ్మలనేని రాజబాబు నియమితులయ్యారు. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లో మిసైల్స్ అండ్ స్ట్రటజిక్ సిస్టమ్స్(ఎంఎస్‌ఎస్) డైరక్టర్ జనరల్‌గా రాజబాబును నియమించారు. ఇప్పటి వరకు డీఆర్‌డీఓ ఎంఎస్ఎస్ డీజీగా ఉన్న బీహెచ్‌వీఎస్ నారాయణ మూర్తి బుధవారం పదవీ విరమణ చేశారు. దీంతో డీఆర్‌డీఓలో ఆర్‌సీఐ విభాగం డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాజబాబును ఆ స్థానంలో నియమించారు. డీఆర్‌డీవో ఎంఎస్ఎస్ డీజీగా రాజబాబు నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆయన 1988లో వైమానిక దళంలో తన కెరీర్ ప్రారంభించారు. అనంతరం 1995లో డీఆర్‌డీ వోలో చేరారు. 35 ఏళ్ల పాటు ప్రొఫెషనల్ ఏరోస్పెస్ కెరీర్‌లో విమానాలు, హెలికాప్టర్లతోపాటు అనేక క్షిపణి వ్యవస్థల అభివృద్ధిపై పనిచేశారు. ఆయన నాయకత్వంలో దేశంలోనే మొట్టమొదటి ఉపగ్రహ క్షిపణి పరీక్ష (ఎ-శాట్) మిషన్ శక్తిని విజయవంతం చేశారు. మిషన్ శక్తి ప్రదర్శనను విజయవంతంగా నడిపించినందుకు అత్యుత్తమ సాంకేతిక అభివృద్ధి అవార్డును ఆయనకు ప్రదానం చేశారు.
*అంబానీ ఇంట వారసురాలు జననం
భారతదేశ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటికి వారసురాలు వచ్చింది. ఆయన పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఆకాశ్ భార్య శ్లోకా బుధవారం ఓ ఆస్పత్రిలో పండంటి పాపకు జన్మినిచ్చారు. అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. ఆకాశ్, శ్లోకాలకు 2019లో వివాహం జరిగింది. వారికి 2020లో మొదటి సంతానంగా బాబు పుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి ఆకాశ్ దంపతులకు పాప జన్మించింది. ఆకాశ్ దంపతులకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని అంబానీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ పరిమల్ నథ్వానీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆకాశ్, శ్లోకా అంబానీల లిటిల్ ప్రిన్సెస్ రాకకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఈ అమూల్యమైన క్షణాలు మీ జీవితాలకు అపారమైన ఆనందాన్ని ప్రేమను తెస్తుందని పేర్కొంటూ ఎంపీ ట్వీట్ చేశారు. ఏప్రిల్‌లో ముంబయిలోని ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో బేబీ బంప్‌తో శ్లోకా కనిపించారు. ఆ సమయంలో ఆమె రెండో బిడ్డకు జన్మనిస్తున్నట్టు ప్రకటించారు. వారం కిందట కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆకాశ్ అంబానీ రిలయన్స్ జియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అంబానీ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తోన్న పాఠశాలలో చదువుకున్న ఆకాశ్, శ్లోకాలు ఒకరినొకరు ఇష్టపడటంతో ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. అనంతరం వారి పెళ్లి జరిగింది. శ్లోకా తండ్రి ప్రముఖ వజ్రాల వ్యాపారి రుస్సెల్ మెహతా. ముకేష్ అంబానీ కుమార్తె ఈషా గతేడాది కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమె ప్రసవం అమెరికాలో జరిగింది. అక్కడ నుంచి భారత్‌కు తన కవలలతో వచ్చిన కుమార్తెకు అంబానీ కుటుంబం ఘనస్వాగతం పలికిన విషయం తెలిసిందే.
*మళ్లీ ప్రపంచంలోనే ధనవంతుడిగా మస్క్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా అగ్రస్థానంలో నిలిచారు. ప్యారిస్ ట్రేడింగ్‌లో ఆర్నాల్ట్‌కు చెందిన ఎల్వీఎంహెచ్ షేర్లు 2.6% పడిపోయిన తర్వాత బుధవారం నాడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించారు. ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితా అయిన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మస్క్ ఈ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచారు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో టెక్ పరిశ్రమ కష్టాలు, లగ్జరీ స్థితిస్థాపకతను చూపించినందున ఆర్నాల్ట్ డిసెంబర్‌లో మస్క్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి ఎల్వీఎంహెచ్ మార్కెట్ విలువ దాదాపు 10 శాతం పడిపోయింది. ఒకానొక సమయంలో మార్కెట్ అస్థిరత కారణంగా ఒక్క రోజులో $11 బిలియన్లను తుడిచిపెట్టింది. లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ మాతృ సంస్థ ఎల్వీఎంహెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్నాల్ట్, డిసెంబర్ 2022లో మస్క్ యొక్క టెస్లా విలువ బాగా పడిపోయినప్పుడు మస్క్‌ను అధిగమించాడు. ఆ సమయంలో మస్క్ $44 బిలియన్లకు కొనుగోలు చేసిన ట్విట్టర్‌లో ఎక్కువ నిమగ్నమయ్యాడు. మస్క్ ఈ సంవత్సరం $55.3 బిలియన్ల కంటే ఎక్కువ లాభాలతో పుంజుకున్నాడు. టెస్లా సంవత్సరానికి 66 శాతం పుంజుకుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అతని సంపద విలువ ఇప్పుడు సుమారు $192.3 బిలియన్లుగా ఉంది. ఆర్నాల్ట్ సుమారు $186.6 బిలియన్ల విలువతో రెండవ స్థానంలో ఉన్నారు. టెస్లాతో పాటు, 51 ఏళ్ల మస్క్ రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్‌లకు కూడా నాయకత్వం వహిస్తున్నారు.
*82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
హాలీవుడ్ సీనియర్ నటుడు, గాడ్‌ఫాదర్ చిత్రాలతో అభిమానులను అలరించిన అల్ పాసినో 82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నారు. ఆల్ పాసినో నాలుగోసారి తండ్రి కాబోతున్నారు. 82 ఏళ్ల అల్ పాసినో.. 29 ఏళ్ల యువతి నూర్ అల్ఫల్లాతో కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ప్రస్తుతం నూర్ అల్ఫల్లా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్ పాసినో ప్రతినిధి ఓ మ్యాగజైన్‌కు వెల్లడించారు. నిర్మాతగా కొనసాగుతున్న నూర్‌తో పాసినోకు కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వారు రిలేషన్‌షిప్‌లో కొనసాగుతున్నారు. మాజీ ప్రియురాలు మీటల్ దోహన్‌తో బ్రేకప్ అయిన వెంటనే అల్ఫాల్లాతో పాసినో డేటింగ్ ప్రారంభించినట్టు నమ్ముతారు. గతేడాది ఏప్రిల్‌లో ఈ జంట కాలిఫోర్నియాలోని వెనిస్‌లోని ఫెలిక్స్ రెస్టారెంట్‌లో జంటగా కనిపించడంతో డేటింగ్ ఊహాగానాలు మొదలయ్యాయి. గత నెలలో పాసినో స్నేహితుడు బెన్నెట్ మిల్లర్ నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు ఇద్దరూ హాజరయ్యారు. పాసినోతో డేటింగ్‌కు ముందు రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో అల్ఫల్లా డేటింగ్‌లో ఉంది. ఏడాదికిపైగా సాగిన ఆ బంధానికి 2018లో ముగింపు పలికారు. తర్వాత 2019లో నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌ఉడ్‌తో కలిసి ఆమె చెట్టపట్టాలేసుకుని తిరిగినా.. తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పింది. అల్ఫల్లాకు మొదటి సంతానం కాగా.. పాసినో నాలుగో సారి తండ్రవుతున్నాడు. అల్ పాసినోకు ఇప్పటికే ముగ్గురు సంతానం. నటన శిక్షకురాలు జాన్ టరంట్‌తో కుమార్తె జూలీ మేరీ (33), మాజీ ప్రియురాలు బెవెర్లీ డీఆంగెలోతో 22 ఏళ్ల కవలలు ఉన్నారు. రెండేళ్ల వయసులోనే తనను, తన తల్లిని విడిచిపెట్టిన తన తండ్రిలా ఉండకూడదనుకుని తన పిల్లలతో సన్నిహితంగా మెలగాలని భావిస్తానని పాసినో పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.