*గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడటం దురదృష్టకరం
గ్రూప్-1 పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగా.. వరుసగా రెండోసారి రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడటం దురదృష్టకరం అని అన్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది యువతలో నైరాశ్యం నింపేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నాడు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో.. నీళ్లు, నిధుల విషయంలో ఎలాగూ దగాపడుతున్నాం.. ఇప్పుడు నియామకాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం యువతకు శాపంగా మారింది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే జరిగిన పేపర్ లీక్ ఘటన ఈ సందర్భంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కాస్తయినా జాగ్రత్తగా వ్యవహరిస్తోందనుకుంటే.. మళ్లీ అదే అసమర్థత, అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది అని కిషన్ రెడ్డి అన్నారు. గ్రూప్-1 పరీక్షలో.. అక్రమాలను అరికట్టేందుకు దరఖాస్తుదారుల బయోమెట్రిక్ తీసుకోవడం తప్పనిసరి అంటూ నియామక నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత బయోమోట్రిక్ తప్పనిసరి కాదంటూ వ్యవహరించడం.. యువతకు న్యాయబద్ధంగా ఉద్యోగాలు కల్పించే విషయంలో బీఆర్ఎస్ సర్కారు ఆలోచన సరళిని స్పష్టం చేస్తోంది అని ఆయన విమర్శించారు. దరఖాస్తులు మొదలుకుని ప్రతి అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. హాల్‌టికెట్లపై ఫొటోలు లేకపోవడం, బయోమెట్రిక్ స్క్రీనింగ్ ను తొలగించడం ద్వారా పరీక్షల్లో అక్రమాలకు ఆస్కారం కల్పించినట్లయింది అని ఆయన తెలిపారు. ఇలా గ్రూప్-1 పరీక్షల నిర్వహణ విషయంలో సర్కారు నిర్లక్ష్యాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో.. పరీక్షలను రద్దు చేయడం మినహా న్యాయస్థానం ముందు వేరే అవకాశమే లేకుండా పోయింది.. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వానికి అధికారంలో ఉండే నైతిక అర్హత లేదు అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
*మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న నవదీప్ విచారణ
మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ పోలీసుల ఎదుట హాజరై విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు గత ఆరు గంటలుగా విచారిస్తున్నారు. దేవరకొండ సురేష్, రామచంద్రలతో పరిచయాలపై నార్కోటిక్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. సురేష్, రామచంద్ర అకౌంట్లోకి నవదీప్ డబ్బులు బదిలీ చేసిన దానిపై విచారణ చేస్తున్నారు. డబ్బుల బదిలీపైనా నవదీప్ ని నుంచి నార్కోటిక్ బ్యూటీ వివరాలు తెలుసుకుంటుంది. సురేష్ రామచంద్రలకు సంబంధించి ఆర్థిక లావాదేవులపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. సినీ ఫైనాన్సర్ వెంకటరత్నారెడ్డితో ఉన్న పరిచయాలపై నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆరా తీస్తున్నారు. మాదాపూర్ లో జరిగిన డ్రగ్ పార్టీలకు హాజరయ్యారాన్ని దానిపై విచారణ.. నవదీప్ పై గతంలో వచ్చిన ఆరోపణలపై కూడా నార్కోటిక్ బ్యూరో అధికారులు విచారణ చే జరుపుతున్నారు. పబ్ లో డ్రగ్స్ సరఫరాపై వివరాలు సేకరిస్తున్నారు. ఎవరి దగ్గర డ్రగ్స్ కొంటున్నారనే కోణంలో నార్కోటిక్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే, ఈ కేసులో నవదీప్‌ను వినియోగదారుడిగా నార్కోటికి బ్యూరో చేర్చింది. ఆయన ద్వారానే సినీ పరీశ్రమకు డ్రగ్స్ సరఫరా అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాక్టర్ నవదీప్‌ను పోలీసులు 37వ నిందితుడిగా పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నార్కోటిక్స్ పోలీసులు రైడ్స్ చేశారు. కాగా, నవదీప్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పోలీసుల విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసుల ముందుకు హాజరయ్యారు.
*’సీపీఎస్’పై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
సీపీఎస్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. సీపీఎస్ రద్దు అనే అంశం ముగిసిన అధ్యాయంగా పేర్కొన్న ఆయన.. జీపీఎస్ అనేది మా ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు.. సీపీఎస్ రద్దు విషయంలో మేం ఇంతకు మించి చేయలేమని.. సీపీఎస్ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని మా రిక్వెస్ట్ అని విజ్ఞప్తి చేశారు. జీపీఎస్ విధానం ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా ఉందని మేం చెప్పడం లేదు.. కానీ, జీపీఎస్ విధానంలో ఏమైనా చెప్పదల్చుకుంటే మేం చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే, సీపీఎస్ విధానం రద్దును కేంద్రం ఎందుకు ఆమోదించడం లేదని బీజేపీ వాళ్లని అడగాలని సూచించారు.. కాగా, ఏపీలో సీపీఎస్ విధానాన్ని రద్దుచేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. సీపీఎస్ స్థానంలో ‘ఏపీ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) బిల్లు 2023’ ద్వారా కొత్త విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. ఇక, బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొత్తగా వచ్చారు. తాను వచ్చాననే విషయం అందరికీ తెలియాలి కాబట్టే పురంధేశ్వరి మద్యం అంశాన్ని లేవనెత్తారు అంటూ సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యానారాయణ. మరోవైపు.. స్కిల్ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.. మాకేం ప్రేమ్ చంద్రారెడ్డి మీద ప్రత్యేక ప్రేమ లేదన్నారు.. కానీ, అధికారులు అభ్యంతరం చెప్పాక.. ఫైల్ సీఎం దగ్గరకు వెళ్తుంది.. దానికి సీఎందే బాధ్యత అవుతుందన్నారు.. రిమాండ్ కొనసాగింపు సందర్భంగా తానేం తప్పు చేయలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
*5 సెకన్లలో రెండు భారీ భవనాల కూల్చివేత
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను కేవలం 5 సెకన్లలో కూల్చివేశారు. అధునాతన సాంకేతిక విధానాలతో రెండు భవనాల కూల్చివేత జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సమస్యలు రావడంతో భవనాలు కూల్చివేసినట్లు తెలిపారు. బిల్డింగ్స్ కూల్చివేసిన ప్రాంతాల్లో భారీ భవనాలను అధికారులు నిర్మించనున్నారు. భవనాల కూల్చివేతకు భారీగా పేలుడుపదార్థాలను వినియోగించారు. క్షణాల్లో నేలమట్టమైన రెండు భవనాలు.. భవనాల కూల్చివేత సమయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త భవనాలు నిర్మిస్తామంటున్న అధికారులు వెల్లడించారు. భవనాల కూల్చివేతను ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ పర్యవేక్షించింది.
*రాజస్థాన్లో రాహుల్ పర్యటన.. కార్యకర్తలనుద్దేశించి కీలక ప్రసంగం
రాజస్థాన్ లో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటించారు. శనివారం అక్కడ జరిగిన కార్యకర్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం జైపూర్‌లో కొత్త కాంగ్రెస్ కార్యాలయానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. విపక్షాల కూటమి (INDIA) పేరుపై వివాదాన్ని చర్చించడానికి ప్రధాని మోడీ ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌ను ప్రకటించాడన్నారు. కాని ప్రజలు ఈ అంశంపై అంగీకరించడం లేదని తెలిపారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతిచ్చామని అన్నారు. అంతేకాకుండా దాని అమలుకు కొత్త జనాభా లెక్కలు, డీలిమిటేషన్ అవసరమని బీజేపీ చెబుతోందని.. ఈరోజు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రాహుల్ గాంధీ తెలిపారు. రిజర్వేషన్లను 10 సంవత్సరాలు ఆలస్యం చేసేందుకు బీజేపీ చూస్తోందని అన్నారు. అది అమలైతేనే OBC మహిళలు ప్రయోజనాలు పొందుతారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారని తెలిపారు. ఈ జనసంద్రాన్ని చూస్తుంటే వేల సింహాలు ఇక్కడ కూర్చున్నట్టు కనిపిస్తున్నాయని అన్నారు. అనంతరం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. నేడు కాంగ్రెస్ కుటుంబం మొత్తం జైపూర్‌లో తిష్ట వేసిందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. నేడు రాజస్థాన్ ఆర్థిక వృద్ధి రేటులో ఉత్తర భారతదేశంలో మొదటి స్థానంలో ఉందని.. ఇది చాలా గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో సుపరిపాలన ఉందని.. ఈసారి కూడా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది తమ సంకల్పం అన్నారు.
*లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. ఐదుగురికి డిప్యూటీ సీఎం అవకాశాలు..!
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అక్కడి ప్రభుత్వంలో మరో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఐదుగురిని ఉపముఖ్యమంత్రులను చేసే విషయమై చర్చిస్తున్నామని రాయరెడ్డి తెలిపారు. దీనికి పలువురు నేతలు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో మరో ఐదుగురు డిప్యూటీ సీఎంలను చేయాలనే ప్రతిపాదనకు హోంమంత్రి జి. పరమేశ్వర, ఎంబీ పాటిల్ సహా పలువురు నేతలు మద్దతు పలికారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ.. కనీసం ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. మెరుగైన పరిపాలన సాగించేందుకు ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలను నియమిస్తామన్న కేఎన్ రాజన్న ప్రకటనకు తన మద్దతు ఉందని బసవరాజ రాయరెడ్డి అన్నారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కర్ణాటక ప్రభుత్వంలో డీకే శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉండగా.. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఐదుగురు ఉపముఖ్యమంత్రులను చేస్తే మొత్తం ఆరుగురు డిప్యూటీ సీఎంలు అవుతారు. తాజాగా మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న కూడా డిమాండ్ చేశారు. కర్నాటకలోని తుమకూరులో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి పదవి షెడ్యూల్డ్ కుల- తెగకు ఒక పదవి, మైనారిటీ వర్గానికి ఒక పదవి, వీరశైవ సామాజికవర్గానికి చెందిన నాయకునికి ఒక పదవి ఇవ్వాలని ఆయన కోరాడు.
*కొత్తగా 9 వందే భారత్ రైళ్లకు రేపు ప్రధాని మోడీ శ్రీకారం
భారత రైల్వేలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ హైస్పీడు రైళ్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రేపు ప్రధాని నరేంద్రమోడీ 11 రాష్ట్రాలకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 9 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ రాష్ట్రాల్లోని మతపరమైన, పర్యాటక ప్రాంతాలను ఈ రైళ్లు కలపనున్నాయి. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో ప్రయాణికులు మరింత వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు కొత్తగా ప్రారంభించే వందేభారత్ రైళ్లు సహాయపడనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైళ్లును జెండా ఊపి ప్రారంభించనున్నారు.
కొత్త వందేభారత్ రైళ్ల రూట్లు ఇవే:
ఉదయపూర్ – జైపూర్
తిరునెల్వేలి-మధురై – చెన్నై
హైదరాబాద్ – బెంగళూరు
విజయవాడ – చెన్నై (రేణిగుంట మీదుగా)
పాట్నా – హౌరా
కాసరగోడ్ – తిరువనంతపురం
రూర్కెలా – భువనేశ్వర్ – పూరి
రాంచీ – హౌరా
జామ్‌నగర్-అహ్మదాబాద్
రైల్వేలో ఆధునాతన ఫీచర్లను జోడించడంతో పాటు ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు భారత్ రైల్వే వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. ప్రస్తుతం రూర్కెలా-భువనేశ్వర్, కాసర్ గోడ్-తిరువనంతపురం మార్గాల్లో ఇప్పుడున్న వేగవంతమైన రైళ్లతో పోలిస్తే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ముందుగానే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి.
*కాశీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. అక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ కార్యదర్శి జై షా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. చంద్రుడు శివశక్తి పాయింట్‌కి భారతదేశం చేరుకోవడానికి ఒక నెల పూర్తైన ఈ రోజున కాశీకి వచ్చానని అన్నారు. గత నెల 23న చంద్రయాన్ ల్యాండ్ అయిన చంద్రుని బిందువు శివశక్తి అని అన్నారు. చంద్రునిపై ఒక శివశక్తి ఉంటే.. మరొకటి కాశీలో ఉందని చెప్పారు. ఈ రోజు శివశక్తి స్థానం నుండి భారతదేశం విజయం సాధించినందుకు మరోసారి అభినందిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వారణాసి, పూర్వాంచల్ యువతకు కాశీలో నిర్మించబోయే స్టేడియం వరంగా మారనుందన్నారు. ఈ స్టేడియం సిద్ధమైతే 30 వేల మందికి పైగా ఇక్కడ మ్యాచ్‌ను చూడవచ్చని తెలిపారు. ఈ స్టేడియంలో ఎన్నో గొప్ప క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయని ప్రధాని మోడీ అన్నారు. అంతేకాకుండా.. స్థానిక క్రీడాకారులు ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీని వల్ల కాశీ ఎంతో ప్రయోజనం పొందుతుందని చెప్పారు. నేడు ప్రపంచం క్రికెట్‌తో ముడిపడి ఉందని.. రాబోయే రోజుల్లో సహజంగానే క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరుగుతుందని అన్నారు. ఈ స్టేడియం స్థలం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.121 కోట్లు వెచ్చించింది. స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ మొత్తం రూ.330 కోట్లు వెచ్చించనుంది. ఈ స్టేడియం ద్వారా తొలిసారిగా వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. వారణాసిలోని రాజతలాబ్‌లోని గంజరిలో ఈ స్టేడియంను నిర్మించనున్నారు. దీని తయారీకి మొత్తం రూ.450 కోట్లు వెచ్చించనున్నారు. ఈ స్టేడియం 30 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. వారణాసిలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ప్రత్యేకత దాని నిర్మాణంలో దాగి ఉంది. దీని వాస్తుశిల్పం శివునిచే ప్రేరణ పొందింది. ఇది చంద్రవంక ఆకారపు పైకప్పు కవర్, త్రిశూలం ఆకారంలో ఫ్లడ్-లైట్లను కలిగి ఉంటుంది. సీటింగ్ ఏర్పాటు ఘాట్‌లా ఉంటుంది. ఇక స్టేడియం కెపాసిటీ గురించి మాట్లాడితే.. 30 వేల మంది ఇక్కడ కూర్చుని మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2025 నాటికి ఈ స్టేడియం సిద్ధం కానుంది. కాన్పూర్, లక్నో తర్వాత యూపీలో ఇది మూడో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా అవతరించనుంది.
*మిస్టరీ థ్రిల్లర్ మెగా ‘157’ టార్గెట్ ఫిక్స్…
మెగాస్టార్ నుంచి సాలిడ్ ప్రాజెక్ట్ బయటికొస్తే బాక్సాఫీస్ బద్దలవుతుంది. నెక్స్ట్ అదే జరగబోతోంది. భోళా శంకర్ తర్వాత మెగా 156 చేయాల్సిన చిరు.. దాన్ని హోల్డ్‌లో పెట్టి బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగా 157 అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో.. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో చిరు తన వయసు, ఇమేజ్‌కు తగ్గ పాత్ర చేస్తున్నట్టుగా డైరెక్టర్ చెబుతున్నాడు. మూడు లోకాల చుట్టూ తిరిగే కథ కావడంతో.. ముగ్గురు హీరోయిన్లను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అనుష్క ఓ హీరోయిన్‌గా లాక్ అయిపోయిందని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ఉంటారు కానీ… రొమాన్స్ లాంటివి ఉండవట. జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్‌లో, ఈ జనరేషన్ పిల్లలు కూడా మెగాస్టార్‌ను చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని వశిష్ఠ చెబుతున్నాడు. పక్కా ప్లానింగ్‌తో విజువల్ వండర్‌గా మెగా 157 ఉంటుందని అంటున్నారు. అంతేకాదు.. రిలీజ్ విషయంలోను టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టి.. 2025 సంక్రాంతి లేదా సమ్మర్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అందుకు తగ్గట్టు షెడ్యూల్ కూడా రెడీ చేసుకున్నారట కానీ దీనికంటే ముందే మెగా 156 ఆడియెన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. 157 ఫాంటసీ సినిమా కాబట్టి… విఎఫ్‌ఎక్స్ కోసం చాలా టైం పట్టనుంది కానీ కళ్యాణ్ కృష్ణ చేయబోయే మెగా 156 కమర్షియల్ మూవీ కాబట్టి… 2024లోనే రిలీజ్ ఉంటుందని చెప్పొచ్చు. అయితే మెగా 157 ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.