*రేపటి ముఖ్యమంత్రి అనంతపురం పర్యటన వాయిదా
సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల పర్యటన వాయిదా పడింది. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సీఎం రానున్నట్లు ముందుగా తెలిసింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నార్పల మండల కేంద్రంలో రేపు జరగబోయే జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం. సీఎం పర్యటన రద్దు అయినట్లు శింగనమల ఎమ్మెల్యే కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 17 వ తేదీన సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో జరగనున్న జగనన్న వసతి దీవెన కార్యక్రమం అనివార్య కారణాల వలన వాయిదాపడిందని జిల్లా కలెక్టర్ఎ మ్.గౌతమి ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన తదుపరి తేదీని ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందిన తర్వాత తెలియజేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రేపు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. వన్ టౌన్ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
*ఆస్తి కోసం తమ్ముడిని హతమార్చిన అన్న
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి అనేందుకు వరంగల్ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. 94 గజాల స్థలం కోసం సొంత తమ్ముడికి ఇవ్వడం ఇష్టం లేని అన్నా తమ్ముడి పైన పెట్రోల్ పోసి అంటించి ఆ తరువాత తల పైనా బండ రాయి మోదీ చంపిన ఘటన వరంగల్ లో తీవ్ర సంచలనంగా మారింది. వరంగల్ పట్టణం ఉర్సు తాళ్లమండువ ప్రాంతానికి చెందిన గోవిందుల శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ ముగ్గురు అన్నదమ్ములు. అందరికీ వివాహమై విడివిడిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన స్థలాన్ని ముగ్గురూ సమానంగా పంచుకున్నారు. అయితే అందరిలో పెద్దవాడైన శ్రీనివాస్ చనిపోవడంతో మిగిలిన ఇద్దరు స్థలం కోసం గొడవ పడేవారు. చిన్న శ్రీకాంత్ తన వాటాగా వచ్చిన 94 గజాల స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నించగా.. శ్రీధర్ అభ్యంతరం తెలిపాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో శ్రీధర్ స్థలం దగ్గరకు వచ్చి సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ నిజామాబాద్‌కు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతూ స్వగ్రామం వరంగల్ చేరుకున్నాడు. తన భూమిని అమ్మేందుకు మరోసారి ప్రయత్నించగా శ్రీధర్ సోదరుడు మరోసారి బెదిరించాడు. దీంతో చేసేదేమీలేక శ్రీకాంత్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సోదరుడిపై శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ్ముడి స్థలం విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. తనకు అభ్యంతరం లేదని చెప్పడంతో శ్రీకాంత్ తన భూమిని విక్రయించే ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో శనివారం తన స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారిని వెంబడించాడు. స్థలం చూపిస్తుండగా శ్రీధర్ ఒక్కసారిగా సోదరుడిపై దాడి చేశాడు. శ్రీకాంత్‌ను తీవ్రంగా కొట్టి ఇంట్లోకి లాక్కెళ్లిన శ్రీధర్.. ముందుగా తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తమ్ముణ్ణి ఇంట్లోనే ఉంచి బయటి నుంచి తలుపులు వేసి రాయిని అడ్డుకున్నాడు. కానీ శ్రీకాంత్ శరీరం మొత్తం నిప్పంటుకోవడంతో తలుపు తోసి రోడ్డుపైకి వచ్చాడు. అయినా శ్రీధర్ వదల్లేదు. అందరూ చూస్తుండగానే రాయితో మోదిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య, పిల్లలను తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
*దేశంలో వరుసగా నాలుగో రోజు 10 వేలు దాటిన కొవిడ్ కేసులు
దేశంలో గత 24 గంటల్లో 10,093 కొవిడ్ కేసులు నమోదయ్యాయి, ఇది శనివారం నాడు నమోదైన 10,747 కేసుల సంఖ్య కంటే 6 శాతం తక్కువ. గత రెండు వారాల్లో ఇటీవలి ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలలో దేశంలో 10,000 కేసులు నమోదవడం ఇది వరుసగా నాలుగో రోజు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 57,542గా ఉంది. గడిచిన 24 గంటల్లో 19 మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తికిసూచిక అయిన డైలీ పాజిటివిటీ రేటు 5.61 శాతంగా నమోదైంది. కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మరో 10-12 రోజుల వరకు కేసులు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
*దేశం కోసం ప్రాణమైనా ఇస్తా..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెబుతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి.. దాచిపెట్టేందుకు ఏమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. తన అరెస్ట్‌కు బీజేపీ ఆదేశాలు ఇచ్చిందని, సీబీఐ వాటిని తప్పక పాటిస్తుందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాను అవినీతిపరుడినని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. ఒకవేళ డబ్బు సంపాదించాలనుకుంటే ఐటీ శాఖలో కమిషనర్‌గా పనిచేసినప్పుడు కోట్లు వెనకేసుకునేవాడినని కేజ్రీవాల్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపరుడు అయితే.. ప్రపంచంలో మరెవరూ నిజాయితీపరులు కాదన్నట్లేనని ఆయన అన్నారు. దేశాన్ని ప్రేమిస్తా, అవసరమైతే దేశం కోసం జీవితాన్నైనా అర్పిస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సీబీఐ 100 సార్లు పిలిచినా సమాధానమిస్తానని ఆయన చెప్పారు.
*సీఎం యోగి నివాసానికి భద్రత పెంపు.. యూపీలో 144 సెక్షన్
ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ ల హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసుల కస్టడీలో ఉండగానే మీడియాకు లైవ్ లో సమాధానాలు ఇస్తున్న సమయంలో ముగ్గురు నిందితులు వారిద్దరిపై కాల్పులు జరిపారు. ఆ ఇద్దరు స్పాట్ లోనే మరణించారు. ఈ ఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై దర్యప్తునకు కమిటీ వేయాలని అధికారులకు సూచించారు. అలాగే.. ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రయాగ్ రాజ్ లో అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ ల హత్య జరగ్గానే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలీసులంతా అలర్ట్ అయ్యారు. అన్ని జిల్లాల్లో పోలీసులు నిఘా పెంచారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ లో అల్లర్లను ఎదుర్కొనేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ప్రయాగ్ రాజ్ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రొవిన్షయల్ ఆర్మ్ డ్ కాన్ స్టబులరీ( పీఏసీ), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించింది. దీంతో అతీక్ అహ్మద్ సోదరుల హత్య తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నివాసానికి భద్రతను భారీగా పెంచారు. ఈ హత్య జరిగిన తర్వాత కనీసం 17 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.
*దుబాయ్‌లో అగ్ని ప్రమాదం.. నలుగురు భారతీయులతో పాటు 16 మంది మృతి
దుబాయ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయులు సహా మొత్తం 16 మంది మరణించారు. మరో 9 మంది గాయల పాలయ్యారు. అల్ రస్ ప్రాంతంలో శనివారం జరిగిన దుర్ఘటన. మృతుల్లో కేరళకు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరు భార్యభర్తలు. తమిళనాడుకు చెందిన మరో ఇద్దరు పురుషులు కూడా ఈ అగ్నిప్రమాదంలో తమ ప్రాణాలను కోల్పోయారు. వీరు భవనంలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ బిల్డింగ్ లో ఫోర్త్ ప్లోర్ లో స్థానికలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.36 గంటలకు మంటలు చెలరేగినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించారు. సహాయక సిబ్బంది ఎంతో శ్రమించి మధ్యాహ్నం 2.42 గంటలకు మంటల్ని ఆర్పగలిగారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచాన వేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
*గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనున్న రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ కీలక పోరు జరుగనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఢీ కొట్టనుంది. రాయల్స్ నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లతో 1.588 నెట్ రన్ రేట్‌తో పట్టికలో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక గుజరాత్ టైటాన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో పాయింట్లతో పట్టికలో మూడవ స్థానంలో ఉంది. అయినప్పటికీ రన్ రేట్ 0.341తో ఉంది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్‌లు గత సీజన్‌లో రన్నరప్‌తో తలపడుతున్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్- జోస్ బట్లర్ గట్టి ఓపెనింగ్ కాంబినేషన్‌గా ఉన్నారు. మిగిలిన బ్యాటింగ్ యూనిట్‌తో రాజస్థాన్ పటిష్టమై బ్యాటింగ్ లైనఫ్ ను కలిగి ఉంది. ఇక జైస్వాల్ ఈ సీజన్‌లో 160.71 స్ట్రైక్ రేట్‌తో రెండు అర్ధసెంచరీలు చేసి 135 పరుగులు చేయగా, ఇంగ్లండ్ వైట్-బాల్ కెప్టెన్ 170 రేట్ వద్ద స్ట్రైకింగ్ చేస్తూ ఇప్పటివరకు 204 పరుగులు చేశాడు. టైటాన్స్ యొక్క కొత్తబంతి బౌలర్లు మహమ్మద్ షమీ మరియు జోష్ లిటిల్ కూడా వారి శత్రు బౌలింగ్‌తో ఇప్పటివరకు మ్యాచ్‌లను మలుపు తిప్పారు. జైస్వాల్ మరియు బట్లర్‌లకు వ్యతిరేకంగా వారు ఎలా బౌలింగ్ చేస్తారనేది వేచి చూడాలి.
*అయ్యగారు అనుకున్నంత పనీ చేశారు… పాన్ ఇండియా రిలీజ్ లేదు
అక్కినేని అఖిల్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కలిసి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని రోజు రోజుకీ పెంచుతూ మేకర్స్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది, సాలిడ్ హిట్ అవుతుంది అని అక్కినేని ఫాన్స్ లెక్కలు వేసుకుంటూ ఉంటే అందరికీ షాక్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న తెలుగు, మలయాళ భాషల్లో మాత్రమే రిలీజ్ అవుతుంది మిగిలిన భాషల్లో కాస్త గ్యాప్ తీసుకోని రిలీజ్ చేస్తామని క్లియర్ కట్ గా చెప్పేశారు. మమ్ముట్టీ ఉన్నాడు కాబట్టి మలయాళ రిలీజ్ ని స్టిక్ అయ్యి ఉన్నారు కానీ ఇతర భాషల్లో ఏజెంట్ సినిమాని రిలీజ్ చెయ్యకపోవడానికి కారణాలు ఉన్నాయి. తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా కూడా ఏప్రిల్ 28నే విడుదల కానుంది, ఈ మూవీని దాటి తమిళనాడులో ఏజెంట్ కి థియేటర్స్ రావడం అనేది కష్టమైన పని. ఇలానే హిందీలో ఒక వారం ముందే సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా రిలీజ్ అవుతోంది. కాటమరాయుడు సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఏజెంట్ ని రిలీజ్ చెయ్యడం అనేది మంచి ఆలోచన కాదు. సల్మాన్ సినిమా మాములుగానే బాక్సాఫీస్ దగ్గర హ్యుజ్ ఓపెనింగ్స్ ని రాబడుతుంది, అలాంటిది ఇక రంజాన్ పండగ రోజున అంటే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు సినిమాల కారణంగానే ఏజెంట్ మూవీని ఏప్రిల్ 28న తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యట్లేదు. తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ చేసిన వారం తర్వాత మంచి డేట్ చూసుకోని హిందీ, తమిళ్ రిలీజ్ కి వెళ్లనున్నారు. అయితే తెలుగులో ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయితే ఇతర భాషల్లో రిలీజ్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది, ఈ విషయం కూడా మేకర్స్ కి అఖిల్ కి బాగా తెలుసు కానీ ఏజెంట్ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకంలో ఉన్నారు. మరి ఏప్రిల్ 28న ఏమవుతుందో చూడాలి.
