NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏనుగుల బీభత్సం.. అక్కడ మహిళపై దాడి.. ఇక్కడ?

తెలుగు రాష్ట్రాలను ఏనుగుల గుంపు భయపెడుతోంది. ఒడిస్సా నుంచి ఈ మధ్యనే తరలివచ్చిన ఆరు ఏనుగుల గుంపు స్థానికులను భయపెడుతోంది. అధికారులను ఎంత బ్రతిమాలిడినా వారేం చేయలేదు. చివరకు వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ వైర్లు అమర్చారు. దీంతో విద్యుత్ షాక్ తో నాలుగు గజరాజులు మృతిచెందాయి. తృటిలో ప్రాణాలతో బయటపడ్డాయి మరో రెండు ఏనుగులు. పార్వతీపురం మన్యం జిల్లాలో బామిని మండలం కాట్రగడ పంచాయతీ సమీపంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందడం కలకలం రేపుతోంది. గత కొద్ది కాలంగా బామిని ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తుంది. పొలంలో పడివున్న ఏనుగులను గుర్తించారు స్థానికులు. ఏనుగుల మృతికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు..ఇటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల తాడిలో మహిళ మృతి చెందడం విషాదం నింపింది.

కావలిలో సీఎం జగన్ పర్యటన.. చుక్కల భూములకు పట్టాల పంపిణీ

ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుక్రవారం విజ‌య‌వాడ‌, నెల్లూరు జిల్లా కావలిలో ప‌ర్యటించ‌నున్నారు. విజయవాడలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. అనంతరం నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విజయవాడలో ఉదయం 8.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం చేరుకుంటారు. అక్కడ రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొంటారు, అనంతరం 9.35 గంటలకు తాడేపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుని కావలి బయలుదేరుతారు. ఉదయం 9.35 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు కావలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంకు చేరుకుంటారు. ఆ తర్వాత కావలి మినిస్టేడియంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించ‌నున్నారు. కార్య‌క్ర‌మం అనంతరం కావ‌లి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ. 20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని నేడు నెల్లూరు జిల్లా కావలిలో ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మేమే నేరస్తులమయ్యాం.. మా ఫోన్లు ట్రాక్ చేస్తున్నారు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణ నేపథ్యంలో రెజ్లర్ల నిరసన 18వ రోజుకు చేరుకుంది. ధర్నాలో కూర్చున్న వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, సత్యవ్రత్ కడియన్‌లు తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. బ్లాక్ డే గా పేర్కొంటూ..నల్ల బ్యాండ్‌లు ధరించారు. కొంతమంది మద్దతుదారులు బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా వారి చేతులపై వాటిని ధరించారు. మైనర్‌తో సహా పలువురు మహిళా గ్రాప్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అన్ని ఆరోపణలను తిరస్కరించిన బిజెపి ఎంపిపై ఢిల్లీ పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ 10 కింద ఒకటి సహా రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. తాజాగా బజరంగ్ పునియా మీడియాతో మాట్లాడారు. తమ ఫోన్ నంబర్‌లు ట్రాక్ చేస్తున్నారంటూ ఆరోపించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు నిరసనగా తాము నేడు బ్లాక్ డేగా పాటిస్తున్నామన్నారు. తమ పోరాటానికి మద్దతుగా ఈ దేశమే నిలుస్తుందనీ, తమ పోరాటంపై తమకు నమ్మకం ఉందని బజరంగ్ పునియా అన్నారు. రోజురోజుకు తమ నిరసన ఉధృతమవుతోందనీ, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తమ ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తున్నారని మమ్మలను నేరం చేసినట్లు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా తమ కాంటాక్ట్‌లో ఉన్న వారిని ట్రాక్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

నిలిపి ఉంచిన లారీలు దగ్ధం.. కారణాలేంటి?

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అకస్మాత్తుగా రెండు లారీలు దగ్ధం కావడం కలకలం రేపుతోంది. పి.గన్నవరం నియోజవర్గంలోని అంబాజీపేటలో శ్రీ పట్టాభిరామ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం వద్ద నిలిపి ఉన్న రెండు లారీలు దగ్ధం అయ్యాయి. డోర్ డెలివరీ చేయాల్సిన సామాన్లతో నిండి ఉన్న ఒక లారీ పూర్తిగా దగ్ధం కాగా మరో లారీ పాక్షికంగా దెబ్బతింది. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనా. మంటలను అదుపు చేశారు అమలాపురం, కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. లారీల దగ్ధం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఏ కారణాల వల్ల జరిగింది? ఆస్తి నష్టం ఎంత అనేది తేలాల్చి ఉంది. విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి త్రినాధపురంలో వాసం శాంతి (28) అనే మహిళ మృతి చెందింది. ప్రమాదవశాత్తు మెడపై నుండి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది మహిళ. భర్తతో మనస్పర్ధలు కారణంగా ఇద్దరు పిల్లలతో సహా రెండేళ్లుగా అమ్మ వద్దనే ఉంటుంది శాంతి. రాత్రి మెడపై నిద్రించేందుకు వెళ్లిన శాంతి ఉదయం శవమై కనిపించిందంటూ రోదిస్తుంది తల్లి కుమారి. పోలీసులకు ఫిర్యాదు చేసింది మృతురాలి తల్లి. భర్తపై అనుమానం వుందంటోంది మృతురాలి తల్లి. తల్లి మరణంతో పిల్లలు అనాథలుగా మారారు.

మధ్యప్రదేశ్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

మధ్యప్రదేశ్‌లోని కట్నీ స్టేషన్ సమీపంలో గురువారం సిమెంట్‌తో కూడిన గూడ్స్ రైలుకు చెందిన నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. మార్గంలో అదనపు లైన్ ఉన్నందున ఇది ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపలేదు. రైలు పట్టాలు తప్పిన వెంటనే ట్రాక్‌ను క్లియర్ చేసే పనిని ప్రారంభించారు. ఈ ఘటన జరిగినప్పుడు రైలు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుండి సిమెంట్‌ను తీసుకెళ్తుందని, లైన్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.అంతకుముందు, పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లోని శక్తిగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి బర్ద్ధమాన్-బండెల్ లోకల్ రైలు పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. రాత్రి 9.20 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అగ్నివీరులకు గుడ్ న్యూస్..రైల్వే ఉద్యోగాల్లో 15శాతం రిజర్వేషన్లు

రైల్వే తన వివిధ విభాగాల కింద డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీర్‌లకు నాన్-గెజిటెడ్ పోస్టులలో 15 శాతం సంచిత రిజర్వేషన్‌ను అందిస్తోంది. వారికి వయస్సు సడలింపు, ఫిట్‌నెస్ పరీక్షల నుండి మినహాయింపును కూడా అందజేస్తుందని రైల్వే వర్గాలు గురువారం తెలిపాయి. అగ్నివీరులకు వయస్సు, ఫిట్‌నెస్ పరీక్షలో సడలింపు ఉంటుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)లో అగ్నివీర్లకు రిజర్వేషన్ విధానం కూడా ఉందని వారు తెలిపారు. రైల్వేలు అగ్నివీరులకు లెవల్‌ వన్‌లో 10 శాతం, లెవల్‌ టూలో ఐదు శాతం రిజర్వేషన్లు, నాన్-గెజిటెడ్ పోస్టుల్లో క్షితిజ సమాంతర రిజర్వేషన్‌గా ఇస్తాయి. ఈ రిజర్వేషన్‌లు బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్, ఎక్స్-సర్వీస్‌మెన్, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటీస్ ఉన్న వ్యక్తులకు అందుబాటులో ఉన్న వాటితో సమానంగా రిజర్వేషన్ కల్పిస్తారు. అగ్నివీరులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, వయో సడలింపులో కూడా సడలింపు ఉంటుంది. అగ్నివీర్ మొదటి బ్యాచ్‌కు ఐదేళ్లు, తదుపరి బ్యాచ్‌లకు మూడేళ్లు సడలింపు ఇస్తారు. ఈ సడలింపు వివిధ కమ్యూనిటీలకు లెవల్-1, లెవెల్-2 అంతకంటే ఎక్కువ పోస్టుల కోసం నిర్దేశించిన ప్రస్తుత వయోపరిమితి కంటే ఎక్కువగా ఉంటుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్/రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్) తరపున పే లెవల్-1, పే లెవల్-2 అంతకంటే ఎక్కువ నాన్-గెజిటెడ్ పోస్టులను తెరవాలని కోరుతూ రైల్వే బోర్డు జనరల్ మేనేజర్‌లందరికీ లేఖ జారీ చేసిందని వర్గాలు తెలిపాయి.

ఈ పెళ్లి గౌన్ కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు.. ఎందుకో తెలుసా?

ప్రతి ఒక్కరికి జీవితంలో పెళ్లి అనేది స్పెషల్. ఆ రోజు అందరి కంటే డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు. కారణం పెళ్లికి వచ్చిన వాళ్లంతా వారి ధరించిన దుస్తుల పైనే చూపుంటుంది. అందుకే వెడ్డింగ్ డ్రెస్ ను స్పెషల్ గా డిజైన్ చేసుకుంటారు. ఓ అమ్మాయి వెడ్డింగ్ గౌన్ అయితే ఏకంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది. ఏంటి ఆ గౌను ప్రత్యేకత అని ఆలోచిస్తున్నారు. దుస్తులు, నగలు ఇష్టపడని మహిళలు ఎవరు ఉండరు. అలంకరణ అమ్మాయిలకు మరింత అందాన్ని తీసుకువస్తుంది. అంత ఇష్టంగా ధరించే దుస్తులను ఆభరణాలతో డిజైన్ చేస్తే ఇంక ఎంత అద్భుతంగా ఉంటుంది. ఓ యువతి క్రిస్టల్స్‌తో తన పెళ్లి గౌను డిజైన్ చేయించుకుంది. ఆ గౌన్ ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ వెడ్డింగ్ గౌనులో 50,890 క్రిస్టల్స్‌ని ఉపయోగించి డ్రెస్‌ను తయారు చేశారు. చేతి స్లీవ్స్ కూడా స్ఫటికాలతో అలంకరించారు. ఈ గౌనును ఇటాలియన్ బ్రైడల్ ఫ్యాషన్ బ్రాండ్ డిజైన్ చేశారు. మైఖేలా ఫెర్రెరో ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. ఈ డ్రెస్ తయారు చేయడానికి దాదాపు 4నెలల టైం పట్టింది. పెళ్లి రోజున మోడల్ మార్చే గెలానీ కావ్-అల్కాంటే ఈ దుస్తులను ధరించింది. ప్రస్తుతం ఈ ఆకర్షణీయమైన గౌను గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ వస్త్రం ప్రత్యేకతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ట్విటర్ పేజీలో పంచుకున్నారు. గతంలో రికార్డు ఓజ్డెన్ గెలిన్లిక్ మోడా తసరిమ్ లిమిటెడ్ (టర్కీ) పేరుతో ఉంది. 45,024 క్రిస్టల్‌తో టర్కీలోని ఇస్తాంబుల్‌లోని ఫోరమ్ ఇస్తాంబుల్ షాపింగ్ మాల్‌లో 29 జనవరి 2011న ప్రదర్శించారు.

రెబల్ స్టార్ కోసం రంగంలోకి దిగిన కాంతార స్టార్

ప్రభాస్ భారి బడ్జట్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా జోష్ లో ఉన్న ప్రభాస్, మారుతీ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ ని సైలెంట్‌గా కంప్లీట్ చేస్తున్నాడు. అసలు అనౌన్స్మెంట్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది, బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని జరుపుకుంటూ ఉంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మారుతితో సినిమా చేయడం ఏంటి? అనే డిస్కషన్స్ ని పట్టించుకోకుండా ప్రభాస్ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి పాన్ ఇండియా సినిమాల మధ్య… జస్ట్ చేంజ్ ఓవర్ కోసం సరదాగా ఈ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇక డార్లింగ్ ఎలాగు ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఫ్యాన్స్ కూడా మారుతిని యాక్సెప్ట్ చేసేశారు. ఈ సినిమా నుంచి లీక్ అయిన ఫోటోల్లో ప్రభాస్ లుక్ ని చూసి మారుతి పై నమ్మకం పెంచేసుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే మాళవిక మోహనన్‌, రిద్దికుమార్ ఫైనల్ అయిపోయారు. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనే ఇప్పుడో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడని గతంలోనే వార్తలొచ్చాయి. దాంతో తమన్ దాదాపుగా లాక్ అయిపోయాడని అనుకున్నారు కానీ ఇప్పుడు తమన్ ప్లేస్‌లో కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్‌ను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కాంతార సినిమాను నిలబెట్టడంలో అజనీష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచింది. ఇదే కాదు రీసెంట్‌గా వచ్చిన విరూపాక్ష సినిమాకు కూడా అదిరిపోయే బీజిఎం ఇచ్చాడు అజనీష్.