NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మోచా తుఫాన్.. మనం సేఫ్.. ఆ దేశాలకు డేంజర్

మోచా తుఫాన్ ప్రభావం మనదేశంపై అంతగా ఉండదని.. అయితే, బంగ్లాదేశ్,మయన్మార్ దేశాలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈనెల 14న మయన్మార్‌ వద్ద తీరం దాటే చాన్స్‌ వుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి మంగళవారానికి వాయుగుండంగా మారనుంది. తర్వాత ఉత్తర వాయవ్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి ఈనెల పదో తేదీకల్లా తుఫాన్‌గా మారనుంది. ఆపై మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి ఈనెల 11వ తేదీ వరకు తొలుత ఉత్తర వాయవ్యంగా, ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈశాన్యంగా పయనించే క్రమంలో అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి ఈనెల 14న దక్షిణ బంగ్లాదేశ్‌, మయన్మార్‌ మధ్య తీరం దాటనుందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఈ తుఫాన్‌కు ‘మోచా’ (ఎంఓసీహెచ్‌ఏ) అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. పలకడంలో మాత్రం దీనిని మోకా అంటున్నారు. ఈ తుఫాన్ మయన్మార్- బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటుతుందని అంచనా వేసినప్పటికీ.. దీని ప్రభావం ఒడిసా, పశ్చిమబెంగాల్‌ తీరాలపైనా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈ తుఫాన్ పట్ల ఆందోళనగా ఉన్నాయి.

జేపీఎస్‌ కు సాయంత్రం వరకు డెడ్‌ లైన్‌.. లేదంటే టర్మినేట్‌

రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్‌‌)లపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇవాల సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని జేపీఎస్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ ఇవాళ సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే, చేరని వాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరిస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కాగా.. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నోటీసులను జారీ చేశారు. అంతేకాకుండా.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. జేపీఎస్ యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని తెలిపారు.

ntvtelugu.com లో ఇంటర్ ఫలితాలు లైవ్

ఇవాళ ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నాయి తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు.. ntvtelugu.com వెబ్‌ సెట్‌లో, ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా వేగంగా ఫలితాలు పొందే అవకాశం వుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకూ జరిగిన ఇంటర్ పరీక్షలు….ఫస్టియర్ పరీక్షలకు 4,82,501 మంది విద్యార్ధులు…సెకండియర్ పరీక్షలకు 4,23, 901 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఫలితాల వెల్లడిపై బోర్డు అధికారులు నిన్న టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సంప్రదించిన అనంతరం ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు.

అన్నం వండలేదని భార్యనే చంపేశాడు.. జైళ్ళో చిప్పకూడు తింటున్నాడు

ఈ మధ్య కాలంలో అకారణంగా భార్యభర్తలు చంపుకుంటున్నారు. చిన్న చిన్న వాటికే ఈగోలు పెంచుకుని చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. అన్నం వండలేదని భర్త కోపంలో భార్యను కొట్టి చంపాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం సంబల్ పూర్ జిల్లాలోని జమాన్కిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నువాది గ్రామంలో సనాతన్ ధారువాగా(40), పుష్ప ధారువాగా (35) ఇద్దరు దంపతులు, వారికి ఓ కుమార్తె, కొడుకు ఉన్నారు. కుమార్తె కుచిందలో ఇంటి పనిమనిషిగా పనిచేస్తుండగా, కుమారుడు ఆదివారం రాత్రి స్లీప్ ఓవర్ కోసం స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో సనాతన్ ఇంటికి తిరిగి వచ్చేసరికి పుష్ప కూర మాత్రమే వండింది. అన్నం వండలేదని సనాతన్ గుర్తించాడు. వెంటనే భార్యను నిలదీశాడు. చిన్న గొడవ కాస్త ముదిరి భార్యను చంపేవరకు వచ్చింది. ఈలోగా వారి కుమారుడు ఇంటికి వచ్చి చూడగా తల్లి శవమై కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

హీరో అజిత్ రీల్ కూతురు మరణం.. సోషల్ మీడియాలో వైరల్

విశ్వాసం సినిమాలో హీరో అజిత్ కుమార్తెగా నటించిన నటి అనికా సురేందర్ కన్నీటి నివాళి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్ చూసిన అభిమానులు షాక్ అయ్యారు. తమిళ సినిమా ప్రముఖ నటులలో ఒకరైన అజిత్ కూతురుగా నటించిన నటి అనికా సురేందర్ రెండు సినిమాల్లో నటించింది. దీంతో ఆమెను అజిత్ రీల్ కూతురు అని పిలుస్తారు. అజిత్ సినిమాలో నటించిన తర్వాత అనికా సురేందర్ తమిళ సినిమాలో ఓ క్యూట్ బేబీ పాత్ర పోషించింది. ఇప్పుడు అనిక పెరిగి పెద్ద అమ్మాయిగా ప్రముఖ నటీమణులతో పోటీ పడుతోంది. అనికా సురేందర్ మలయాళంలో బుట్టబొమ్మ సినిమాలో నటించింది. అనికా చేసిన తెలుగు సినిమా కాపెలా భారతీయ రీమేక్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.బుట్టబొమ్మ సినిమా విజయం తర్వాత అనికా సురేందర్ మలయాళంలో తెరకెక్కిన ‘ఓ మై డార్లింగ్’ చిత్రంలో కథానాయికగా నటించింది. చిత్రంలో అనికా ముద్దు సన్నివేశం వివాదాస్పదమైంది.

ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డు అందుకున్న ప్రియదర్శి

కమెడీయన్ వేణు దర్శకుడిగా మారి తీసిన సినిమా బలగం. తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలో బలం ఉండటంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే బలగం సినిమా మాసిపోతున్న బంధాలను తట్టిలేపింది. అందుకే ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. అంతే కాకుండా సినిమాకు అవార్డుల పంటపండుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శికి ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డు వచ్చింది. ప్రియదర్శి స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు.ప్రియదర్శితో పాటు సినిమాలో ఆయనకు తాతగా నటించిన కేతిరి సుధాకర్ రెడ్డి కూడా అవార్డు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఆయనకు అవార్డు వచ్చి్ంది. 2021, 22 ఇయర్స్ మలయాళ చిత్రాలు ఉత్తమ చిత్రీకరణకు స్వీడిష్ అంతర్జాతీయ అవార్డును అందుకుంది. వాటి తర్వాత బలగం సినిమా ఆ జాబితాలో చేరి తొలి తెలుగు సినిమాగా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా 40కి పైగా అంతర్జాతీయ అవార్డులను బలగం సినిమా గెలుచుకుంది.

ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం

ఐపీఎల్‌ 2023లో భాగంగా కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్‌ బ్యాటర్లలో శిఖర్‌ ధావన్‌(57) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో షారుక్ ఖాన్( 8 బంతుల్లో 21 పరుగులు), హర్‌ప్రీత్‌ బ్రార్‌ ( 9 బంతుల్లో 17) పరుగులతో రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 3 వికెట్లు తీయగా.. హర్షిత్‌ రాణా రెండు, సుయాష్‌ శర్మ, నితీష్‌ రాణా తలా ఒక్క వికెట్‌ సాధించారు. అయితే.. 180 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌ విజయం సాధించింది. ఉత్కంఠపోరులో 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టి రింకూ సింగ్‌ కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. 180 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ నితీష్‌ రాణా 51 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్‌ (42), రింకూ సింగ్‌(21) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.