NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నూజివీడులో హిజ్రాల ఓవరాక్షన్

ఈమధ్య కాలంలో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. ఏలూరు జిల్లాలో హిజ్రాల ఓవరాక్షన్ తో పెళ్లి ఫంక్షన్ లో గందరగోళం నెలకొంది. నూజివీడులో ఏ ఇంట్లో శుభకార్యం జరిగిన డబ్బులు ఇవ్వాలని హిజ్రాల డిమాండ్ పెరిగిపోతోంది. డబ్బు ఇవ్వకపోతే అడిగినంత ఇవ్వకపోతే శుభకార్యానికి వచ్చిన వారిని దుర్భాషలాడుతున్నారు హిజ్రాలు. ముసునూరు మండలం కాట్రేనిపాడులో నిశ్చితార్థ కార్యక్రమంలో 11 వేల రూపాయల డబ్బులు డిమాండ్ చేశారు హిజ్రాలు..ఇవ్వని ఇంటి యజమాని శుభకార్యానికి వచ్చిన ప్రతి ఒక్కరిని దుర్భాషలాడారు హిజ్రాలు. హిజ్రాల తీరుతో యజమాని నూజివీడు రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. హిజ్రా నాయకులను, పలువురు హిజ్రాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. మరొకసారి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సిఐ అంకబాబు. గతంలోనూ హిజ్రాలపై అనేక ఆరోపణలు వున్నాయి. ఇటీవల ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో యువకుడిపై హిజ్రాలు దాడికి పాల్పడ్డారు. మార్చి నెలలో లంబాడీ డొంక ప్రాంతానికి చెందిన నాయబ్‌ రసూల్‌ అనే యువకుడు ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో ఓ వేడుకకు వెళ్లివచ్చే క్రమంలో కొంతమంది హిజ్రాలు అతనికి కనిపించారు. మాట్లాడుకుంటుండగా నాయబ్‌ రసూల్‌కు, వారికీ చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన హిజ్రాలు అతనిపై దాడి చేశారు. తాము తెచ్చుకున్న కర్రలు, ఇనుపరాడ్లు, బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. దీనిపై బాధితుడు ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. హిజ్రాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలంటున్నారు బాధితులు.

కంపకల్లి ఉత్సవం.. ఇదేంట్రా బాబూ!

మన సంప్రదాయంలో అనేక రకాల ఉత్పవాలు జరుగుతుంటాయి. అందులో కొన్ని విచిత్రంగా, నవ్వు తెప్పించేవిగా ఉంటే.. మరికొన్ని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. ప్రకాశంలో జరిగే కంపకల్లి ఉత్సవం గురించి చర్చించుకుంటున్నారు. జిల్లాలోని హనుమంతునిపాడు మండలం చిన్న గొల్లపల్లిలో కంపకల్లి ఉత్సవం ఒకటి జరుగుతూ ఉంటుంది. కంపకల్లి ఉత్సవంలో భాగంగా ముళ్ళ కంపలపై పొర్లి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు..అదేంటి ముళ్ళ కంపలంటే ముళ్ళు గుచ్చుకుంటాయి కదా.. చిన్న ముల్లు గుచ్చుకుంటేనే మంట పుడుతుంది. అలాంటిది ముళ్ళ కంపలపై పొర్లడం ఏంటని అనుకుంటున్నారా. అంతేమరి.. అక్కడ సంప్రదాయాన్ని తు.,చ తప్పకుండా పాటిస్తారు. చిన్నపిల్లల్ని కూడా పొర్లిస్తారు.అయితే ఈసారి 14 సంవత్సరాల లోపు చిన్నారులను ముళ్ళ కంపలపై దొర్లించకుండా భక్తులకు అవగాహన కల్పించారు ఐసిడిఎస్, పోలీస్ అధికారులు..చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కంపకల్లి ఉత్సవం జరుగుతుంటుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఈ ఉత్సవం చూడడానికి జనం వస్తుంటారు. కరోనా అనంతరం మూడేళ్ల తర్వాత ఉత్సవాలు నిర్వహించటంతో భారీగా తరలి వచ్చారు భక్తులు… కంపకల్లి ఉత్సవంలో ముళ్ల కంపలపై పొర్లాడితే తమ కోరికలు తీరతాయని, కష్టాల నుంచి గట్టెక్కుతామంటున్నారు అక్కడి జనం.

ఛత్తీస్ ఘడ్ లో భారీ మద్యం కుంభకోణం.. ఐఎఎస్ అధికారి సూత్రదారి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో భారీగా లిక్కర్ అక్రమాలు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటింది. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో భారీ అవినీతి బట్టబయలైనట్టు ఈడీ ఆరోపణలు చేసింది. ఏకంగా రూ.2వేల కోట్ల అవినీతిని గుర్తించినట్టు వెల్లడించింది. ఈ అవినీతి సొమ్మును ఎన్నికలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ నేత, రాయ్‌పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్‌ను ఈడీ మే 6న అరెస్టు చేసింది. ఈ సందర్భంగా మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో విక్రయించే ప్రతి మద్యం సీసాపై అక్రమ లాభార్జన ధ్యేయంగా భారీగా జరిగిన అవకతవకల్లో ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు ఉన్నట్లు ఈడీ తెలిపింది. 2019-2022 మధ్యకాలంలో రూ.2వేల కోట్ల మేర భారీ అవినీతి చోటుచేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. ఐఏఎస్ అధికారి అనిల్ టుటేజా ఇందులో కీలక పాత్ర పోషించారని, రాయ్‌పుర్‌ మేయర్‌ సోదరుడైన అన్వర్‌ ధేబర్‌ హస్తం కూడా ఇందులో ఉన్నట్లు పేర్కొంది.

విద్యకోసం విదేశాలకు వెళ్ళి.,. తిరిగిరాని లోకాలకు

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి చెందింది.. హైదరాబాద్ చెందిన తాటికొండ ఐశ్వర్య మృతి చెందినట్లుగా విచారణ సంస్థలు ధ్రువీకరించాయి. హైదరాబాద్ నుంచి కొన్నాళ్ల క్రితమే ఉన్నత చదువుల కోసం టెక్సాస్‌కు వెళ్లిన ఐశ్వర్య మృతి చెందిన సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న టెక్సాస్‌లోని అలెన్ మాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోయారు.ఈ కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తాడికొండ ఐశ్వర్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాటికొండ ఐశ్వర్య మరణించారు. తాటికొండ ఐశ్వర్య మరణించినట్లు తెలుగు సంఘాలు ధ్రువీకరించాయి. తాటికొండ ఐశ్వర్య కొత్తపేటలో నివాసం ఉంటారు. రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ తాటికొండ నర్సిరెడ్డి కుమార్తెనే తాటికొండ ఐశ్వర్య. ఐశ్వర్య మృదేహాన్ని హైదరాబాద్ కు రప్పించేందుకు కుటుంబ సభ్యులతో పాటు అమెరికా తెలుగు సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి.

ప్రముఖ సింగర్ రక్షిత సురేష్ కి ప్రమాదం 

ప్రముఖ సింగర్ రక్షిత సురేశ్ ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది. మలేషియాలో ఎయిర్‌పోర్టుకి వెళ్తున్న సమయంలో.. దురదృష్టవశాత్తు ఆమె కారు డివైడర్‌ను ఢీకొంది. అయితే.. కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ పుణ్యమా అని ఆమె ఈ ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడింది. ఈ సంఘటన గురించి ఆమె ట్విటర్ మాధ్యమంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో తన కళ్లముందు జీవితమంతా మెదిలిందని.. కేవలం ఎయిర్‌బ్యాగ్స్ కారణంగా తాను ఈ పెద్ద ప్రమాదం నుంచి బతికి బయటపడ్డానని చెప్పుకొచ్చింది. ‘‘నేను ఒక పెద్ద ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాను. ఆదివారం ఉదయం మలేషియా విమానాశ్రయానికి వెళ్తున్నప్పుడు.. నా కారు డివైడర్‌ను ఢీకొంది. దీంతో.. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో నా జీవితమంతా కళ్లముందు మెదిలింది. కార్‌లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ నా ప్రాణాలు కాపాడాయి. ఒకవేళ అవి లేకపోయి ఉంటే, పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ సంఘటనని తలచుకుంటే, ఇప్పటికీ నా శరీరం వణుకుతోంది. ఈ ప్రమాదంలో నేను, డ్రైవర్‌, మరో ప్యాసింజర్‌ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాం. చావు నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడినందుకు మేము అదృష్టవంతులం’’ అంటూ రాసుకొచ్చింది.

చరిత్ర సృష్టించిన జైస్వాల్.. సెకండ్ యంగెస్ట్ ప్లేయర్

ఈ ఐపీఎల్ సీజన్‌లో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనింగ్ చేస్తున్న ఈ ఆటగాడు.. ఆ జట్టుకే అత్యంత కీలక ఆటగాడిగా అవతరించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడుతూ.. మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఓ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో.. ఐపీఎల్‌ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో పిన్న వయస్కుడిగా జైశ్వాల్‌ రికార్డులకెక్కాడు. 21 ఏళ్ల 130 రోజుల్లో 34 ఇన్నింగ్స్‌ల్లో జైశ్వాల్‌ ఈ ఫీట్‌ సాధించాడు. జైశ్వాల్‌ కంటే ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్‌ పంత్‌ (20 ఏళ్ల 218 రోజులు) 35 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగుల మార్క్‌ అందుకొని అగ్రస్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత పృథ్వీ షా(21 ఏళ్ల 169 రోజులు) 44 ఇన్నింగ్స్‌ల్లో, సంజూ శాంసన్‌(21 ఏళ్ల 183 రోజులు) 44 ఇన్నింగ్స్‌ల్లో, శుభ్మన్ గిల్‌(21 ఏళ్ల 222 రోజులు) 41 ఇన్నింగ్స్‌ల్లో, దేవదత్‌ పడిక్కల్‌(21 ఏళ్ల 285 రోజులు) 35 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నారు.

అందుకు ఒప్పుకోలేదని.. సినిమా నుంచి తొలగించారు 

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ధనవంతుడు అవ్వడమే కాదు, అతనికి మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అతని తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఒక గొప్ప క్రికెటర్. మరి.. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పుడు సైఫ్‌కి ఇండస్ట్రీలో రావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని అంతా అనుకోవచ్చు. కానీ, అతనికి కూడా కొన్ని ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఓ డైరెక్టర్ పెట్టిన అనూహ్య కండీషన్ వల్ల.. అతడు ఒక సినిమా ఛాన్సే వదులుకోవాల్సి వచ్చింది. అవును.. ఇది నమ్మశక్యంగా లేకపోయినా, నిజంగానే జరిగింది. ఈ విషయాన్ని తానే స్వయంగా రివీల్ చేశాడు. ప్రియురాలు, సినిమా మధ్యలో ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని డైరెక్టర్ తనకు చెప్పాడని.. తాను కుదరదని చెప్పడంతో సినిమా నుంచి తీసేశారని పేర్కొన్నాడు.