NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఇవాళ ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో హైటెన్షన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఈడీ అధికారుల ముందు హాజరవుతారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారితో కలిపి కవితను ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురిని ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా ఇప్పటికే 11 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై.. ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు రెడీ అయ్యారు. పిళ్లై విచారణలో భాగంగా ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. కవితతో పాటుగా పిళ్లైను కలిపి విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, పిళ్లై తాను ఇచ్చిన స్టేట్ మెంట్ వెనక్కు తీసుకుంటున్నట్లు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. కవిత విచారణకు హాజరు అవ్వటానికి ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం కీలకంగా మారుతోంది.

అవకాశమిస్తే కామారెడ్డి నుంచి పోటీచేస్తా.. అజహరుద్దీన్ మనసులో మాట

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ అవకాశం ఇస్తే కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఆయన కామారెడ్డి పర్యటనలో భాగంగా ఈవాఖ్యలు చేశారు. లింగంపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అవకాశం ఇస్తే కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాట సందర్భంగా అజారుద్దీన్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అజహరుద్దీన్ తప్పు తన వల్ల కాదన్నారు. జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాటకు పాల్పడితే అరెస్టు చేసి ఉండేవారని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ అన్నారు. జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటలో తమ తప్పేమీ లేదన్నారు. తానేమీ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అజారుద్దీన్ ఏం తప్పు చేశానో చెప్పాలని ప్రశ్నించారు. తొక్కిసలాట దురదృష్టకరమని అన్నారు.

మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 23.77 లక్షలు స్వాహా

గుడిని, గుడిలో లింగాన్ని కూడా కాజేసే కేటుగాళ్లు తయారయ్యారు. తాజాగా గుంటూరు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిధుల గోల్ మాల్ కలకలం రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల రూపాయల స్వామివారి సొమ్మును నొక్కేశారు. 2019 నుండి 2022 వరకు 23.77 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు అధికారులు. ఆలయంలో గుమస్తాగా పనిచేసిన శ్రీనివాస్ తో పాటు మరికొందరు ఈ గోల్ మాల్ వ్యవహారంలో పాత్రదారులుగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. గత కొద్ది రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు గుమస్తా శ్రీనివాస్. దీంతో అతనే ఈ స్కాంకి సూత్రదారిగా అనుమానిస్తున్నారు. ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై దేవాదాయ శాఖ కమిషనర్ కు నివేదిక పంపించారు అధికారులు. ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు భక్తులు.. స్వామివారి ఆదాయానికి గండి కొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

తేజస్వి యాదవ్ ఇంటిపై ఈడీ దాడులు

ఆర్జేడీ నేత, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. భూ కుంభకోణం కేసుకు సంబంధించి దేశ రాజధానిలోని తేజస్వీ యాదవ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దాడులు నిర్వహించింది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి ఆర్జేడీ అధినేత లాలూ కుటుంబం భూములు తీసుకుందన్న అభియోగాల కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేసింది. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ముగ్గురు కుమార్తెలు,ఆర్జేడీ నేతల నివాసాలతో సహా బీహార్‌లోని పలు నగరాలు, ఇతర ప్రాంతాల్లో శుక్రవారం కూడా ఈడీ సోదాలు నిర్వహించింది.ఢిల్లీలోని లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతితో పాటు బీహార్‌లోని ఆర్జేడీ నేత, మాజీ ఎమ్మెల్యే అబు దోజానా నివాసాల్లో సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, ఎన్‌సిఆర్,బీహార్‌లోని 15 కి పైగా ప్రదేశాలలో సోదాలు జరిగాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం ఇడి ఈ సోదాలు నిర్వహించింది. ఉద్యోగాల కోసం భూమి కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్‌ను సీబీఐ బృందం ప్రశ్నించిన కొద్ది రోజుల తర్వాత ఫెడరల్ ఏజెన్సీ ఈ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్‌ను సీబీఐ మంగళవారం రెండు సెషన్లలో దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించింది. లాలూ ప్రసాద్ భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని కూడా సీబీఐ సోమవారం ఆమె పాట్నా (బీహార్) నివాసంలో ఐదు గంటలకు పైగా ప్రశ్నించింది.

రక్తం ఖరీదు 50 వేలు..కోడలి రక్తం అమ్మేసిన అత్తమామ

ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన. మహారాష్ట్రలో ఈ దారుణం వెలుగు చూసింది. అఘోరీ విద్య కోసం అత్త సొంత కోడలు రుతుక్రమ రక్తాన్ని అమ్మేసినట్లు తెలిసింది. ఈ కేసులో బాధితురాలు పూణెలోని విశ్రాంత్‌వాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయబడింది. విశ్రాంతవాడి పోలీసులు చేతబడి చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం బీడ్ పోలీసులకు కేసును బదిలీ చేశారు.మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటన 2022 ఆగస్టులో జరిగింది. బీడులో అత్తమామల దగ్గరకు వెళ్ళినప్పుడు పలు కారణాలతో చిత్ర హింసలకు గురిచేసేవారని ఆమె పేర్కొ్ంది. అదనపు కట్నం తీసుకురావాలని బాగా కొట్టేవారని తెలిపింది. మహిళతో ఆ పని చేయించినట్లు ఫిర్యాదుదారు పోలీసులను ఆశ్రయించింది. బహిష్టు రక్తాన్ని దూదితో తీసి సీసాలో సేకరించారు. ఆ తర్వాత ఈ రక్తాన్ని పూజకోసం రూ.50 వేలకు అఘోరాకు విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు.. పూణెలోని విశ్రాంతంవాడి ప్రాంతానికి చెందిన బాధితురాలు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత ఆ మహిళ తన భర్తతో కలిసి బీడ్ జిల్లాలోని అత్తమామలతో కలిసి నివసించేందుకు వెళ్లింది. ఒకనొక నెలలో రుతుస్రావం తరువాత, ఆమె అత్తమామలు ఆ మహిళ చేతులు, కాళ్ళు కట్టివేసి బహిష్టు రక్తాన్ని దూదితో సేకరించి సీసాలో నింపారు. తర్వాత, ఈ రక్తాన్ని మంత్రగాడికి రూ.50 వేలకు విక్రయించారు.

విపత్తులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి డా. తానేటి వనిత న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఫ్లాట్ ఫారమ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల హోంశాఖ మంత్రులు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. తీరప్రాంత ప్రమాదాల నుండి ఎదురయ్యే సమస్యలు మరియు సవాళ్లకు సంబంధించిన అంశం పైన హోంమంత్రి డా.తానేటి వనిత గారు ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత గారు మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితుల కారణంగా ప్రతి ఏటా విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోందనే విషయాన్ని గుర్తుచేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విపత్తు నిర్వహణ శాఖలో మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తులను ఎదుర్కోవడంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పూర్తిగా విజయం సాధించిందని స్పష్టంచేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి కరువు అనే ప్రసక్తే లేకుండా చేసిన ఘనత సీఎం జగన్ గారికే దక్కుతుందని హోంమంత్రి వనిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 నవంబర్ చివరి వారంలో ఏర్పడిన తుఫానులు తూర్పు మరియు పశ్చిమ తీరాలపై పెను ప్రభావాన్ని చూపించాయని హోంమంత్రి తానేటి వనిత గారు గుర్తుచేశారు. ఈ తుఫానుల కారణంగా గ్రామాల్లోని ప్రజల ఇళ్లకు, పంట పొలాలకు, వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

ప్లేటు తిప్పేసిన ఆ డైరెక్టర్.. తారక్ ఫ్యాన్స్ ఆశలు గల్లంతు

కొన్ని రోజుల క్రితం జూ. ఎన్టీఆర్‌పై ఓ రూమర్ తెగ చక్కర్లు కొట్టింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో తారక్ జత కట్టబోతున్నాడన్నదే ఆ రూమర్ సారాంశం. ఇదొక మల్టీస్టారర్ సినిమా అని, ఇందులో ధనుష్ కూడా మరో కథానాయకుడి పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం జరిగింది. ఓ వారం రోజుల పాటు ఈ ప్రచారం జరగడం, దీన్ని ఎవ్వరూ ఖండించకపోవడంతో.. తారక్ ఫ్యాన్స్ నిజమేనని అనుకున్నారు. ఇదో క్రేజీ కాంబినేషన్ అని, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ సరికొత్త సంచలనాలకు తెరతీస్తుందని భావించారు. ఆల్రెడీ విలక్షన నటుడిగా తానేంటో నిరూపించుకున్న తారక్‌కి వెట్రిమారన్ లాంటి దర్శకుడు తోడైతే, ఇక విశ్వరూపం చూపించడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. కానీ.. ఇంతలోనే వెట్రిమారన్ ఓ బాంబ్ పేల్చాడు. ఈ ప్రాజెక్టే లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు. తన లేటెస్ట్ సినిమా ‘విదుతలై’ ఆడియో ఈవెంట్‌లో వెట్రిమారన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన దృష్టంతా ఈ విదుతలైని పూర్తి చేయడంలోనే ఉందన్నాడు. ఇది రెండు భాగాల్లో రూపొందుతున్న సినిమా. ఇప్పుడు పార్ట్ 1 విడుదల చేస్తున్నారు. దీని తర్వాత పార్ట్ 2 చిత్రీకరణను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత తాను సూర్యతో కలిసి వాడివాసల్ సినిమా చేయబోతున్నానని స్పష్టం చేశాడు.

ఆ డైరెక్టర్‌తో రూమ్‌లోకి వెళ్లా.. డోర్ లాక్ చేయకుండానే.

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. ‘మీటూ ఉద్యమం’ తర్వాతి నుంచే ఆ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ ఉద్యమం సమయంలో ఎందరో భామలు చిత్రసీమలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే స్టార్ నటీమణులు కూడా ఓపెన్ అయ్యారు. కెరీర్ ప్రారంభంలో తాము ఎదుర్కొన్న ఈ కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని పంచుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా విద్యాబాలన్ కూడా.. కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఒక దర్శకుడు తనని కాఫీకి పిలిచి, రూమ్‌కి రమ్మన్నాడని కుండబద్దలు కొట్టింది. అతని పిలుపుతో తాను రూమ్‌కి వెళ్లానని, అయితే చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ డైరెక్టర్ మౌనంగా వెళ్లిపోయాడని తెలిపింది. విద్యాబాలన్ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాది సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. ఆ సమయంలో ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లా. అక్కడ కాఫీ షాప్‌లో మాట్లాడుకుందామని నేను చెప్పాను. అయితే.. ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి వెళ్లి, మాట్లాడుకుందామని చెప్పాడు. అప్పుడే అతని ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. దీంతో.. గదిలోకి వెళ్లిన తర్వాత నేను డోర్ లాక్ చేయకుండా, కొంచెం తెరిచి ఉంచాను. అది గమనించిన ఆ దర్శకుడు.. ఏమీ మాట్లాడకుండా ఐదు నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

చరిత్ర సృష్టించిన అశ్విన్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ఐదు వికెట్లు తీశాడు

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్‌ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించడంతో.. అశ్విన్ ఈ రికార్డ్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. భారత గడ్డపై ఆయన టెస్టుల్లో 25 సార్లు ఐదు వికెట్ల హాల్స్ నమోదు చేశారు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో 26వ సారి 5 వికెట్ల హాల్ సాధించి, కుంబ్లే రికార్డ్‌ని అశ్విన్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా అశ్విన్‌కి ఇది 32వ ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం. ఇదే సమయంలో అశ్విన్ మరో సంచలన రికార్డ్‌ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు 111 వికెట్లతో అనిల్ కుంబ్లే పేరిట ఆ రికార్డ్ ఉండగా.. 113 వికెట్లతో అశ్విన్ ఆ రికార్డ్‌ని పటాపంచలు చేశాడు. భారత బౌలర్లలో ఈ ఇద్దరు మినహా మరెవ్వరు ఆస్ట్రేలియాపై 100 వికెట్లకు మించి తీయలేదు.

Show comments