NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

కోవిడ్ కొత్త వేరియంట్ పై ప్రధాని మోడీ సమీక్ష

కోవిడ్-19 మహమ్మారిపై ప్రధాని నరేంద్రమోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చైనావ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్-7 విజృంభిస్తుండటంతో ఇండియా కూడా అప్రమత్తం అయింది. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ నిపుణులతో, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే గురువారం భారత ప్రధాని నరేంద్రమోదీ కోవిడ్ పరిణామాలపై అత్యున్నత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రద్దీ ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని.. పరీక్షలను పెంచాలని అధికారులకు నిర్దేశించారు. వయసు పైబడిన వారు ప్రికాషనరీ డోస్ తీసుకోవాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, వెంటిలేటర్లతో సహా పలు ఆస్పత్రుల్లో మౌళిక సదుపాయాలను పెంచాలని కోరారు. కోవిడ్ కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు పీఎం సూచించారు. అధికారులు దేశంలోని మందులు, వ్యాక్సిన్లు, ఆస్పత్రుల్లో బెడ్ లకు సంబంధించిన అన్ని వివరాలను అధించారు. అవసరమైన ఔషధాల లభ్యత, ధరలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆయన అధికారులకు సూచించారు.

ధర్మారెడ్డి, చెవిరెడ్డిలను పరామర్శించిన జగన్

నంద్యాల, తిరుపతి జిల్లాల్లో జగన్ ఇవాళ పర్యటించారు. తుమ్మలగుంట, తిరుపతి జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు సీఎం వైఎస్‌ జగన్‌. టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి అలియాస్‌ శివ (28) ఆక‌స్మిక మ‌రణం పొంద‌డంతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండ‌లం పారుమంచాల గ్రామానికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చంద్రమ‌ళిరెడ్డి చిత్రప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ధ‌ర్మారెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి, కుటుంబ స‌భ్యులు, బంధువుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పరామ‌ర్శించారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. చెన్నైలో బీటెక్‌ పూర్తిచేసి ముంబైలో ఫైనాన్స్‌ కన్సల్టెంటుగా ఉద్యోగం చేస్తున్న ధర్మారెడ్డి తనయుడు చంద్రమౌళి ఈనెల 18వ తేదీన చెన్నైలో తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరిన చంద్రమౌళికి ఎక్మో చికిత్స అందించిన ఫ‌లితం ద‌క్కలేదు. ధర్మారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. చంద్రమౌళి భౌతికకాయాన్ని ధర్మారెడ్డి స్వగ్రామం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నై నుంచి తరలించారు. ఇవాళ ఉద‌యం చంద్రమౌళి పార్ధివ దేహానికి అంత్యక్రియ‌లు నిర్వహించారు. తీవ్ర విషాదంలో వున్న ధర్మారెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు సీఎం జగన్. సీఎం వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు.

రుషికొండ నిర్మాణాలపై కేంద్రం దర్యాప్తు

విశాఖపట్నంలోని రుషికొండ ప్రాజెక్టులో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై,రుషికొండ వద్ద మంజూరు చేయబద్ద 19968 చదరపు మీటర్ల ప్రాంతం కంటే కోస్టల్ రీజియన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి అదనపు నిర్మాణం చేపట్టినట్లు మంత్రిత్వ శాఖకు తెలుసా అని జీవీఎల్ పార్లమెంటులో ప్రశ్నించగా ,ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్ర పర్యావరణ, మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఎంపీ జీవీఎల్ కు సమాధానం ఇస్తూ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 9.88 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే 2021 మే 19 న రాసిన లేఖ ద్వారా పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి కోసం సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి 2021 ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) నంబర్లు 257 , 241 మరియు 2022 యొక్క సిసి నంబర్ 1425 03/11/2022 ఉత్తర్వు ద్వారా పై ప్రాంతాన్ని సర్వే చేయడానికి ఒక బృందాన్ని నియమించమని మరియు నిర్మాణ కార్యకలాపాలు జరిగిన ఖచ్చితమైన ప్రాంతం మరియు స్లాపింగ్ కోసం ఉపయోగించిన ప్రాంతం గురించి ఒక నివేదికను సమర్పించమని మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఇటువంటి పర్యావరణ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి కేంద్ర చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాల గురించి జీవీఎల్ ప్రశ్నించగా మంత్రి సమాధానం ఇచ్చారు.

పవన్ కాన్వాయ్ లో మరో 6 వాహనాలు.. అవేంటంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం బాగా కష్టపడుతున్నారు. జనసేన తరపున ఆయన ప్రచారం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఒకానొక సమయంలో కొంచెం మెతకగా కనిపించిన పవన్ ఈసారి రాజకీయ రంగును గట్టిగానే పులుముకున్నాడని తెలుస్తోంది. మాటకు మాట.. కౌంటర్ కు రీ కౌంటర్ గట్టిగానే వేస్తున్నారు. ట్విట్టర్ లోను తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు. ఇక కొంతమంది ఈసారి పవన్ కు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటుండగా.. ఇంకొందరు అంతా ఎన్నికల వరకే.. ఓట్లు మాత్రం రావు అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఇటీవలే పవన్ ప్రచార వాహనం వారాహి గురించి పెద్ద వివాదమే నడిచింది. వాహనానికి అమ్మవారి పేరు పెట్టి ప్రచారం చేయడం తప్పా అని పవన్ అంటుంటే.. అమ్మవారి పేరు పెట్టుకొని తప్పులు చేయడం కన్నా వరాహం అని పెట్టుకొని ఇష్టమొచ్చినట్లు ఉరేగు అని వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ఇక వీటన్నింటి గురించి వదిలేస్తే తాజాగా పవన్ కాన్వాయ్ లో మరో 6 వాహనాలు వచ్చి చేరాయి. నేడు పవన్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తనకు సంబంధించిన ఆరు వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించారు.

వైద్యసేవల్లో తెలంగాణ థర్డ్.. యూపీ లాస్ట్ ప్లేస్

తెలంగాణ రాకపోతే మహబూబ్ నగర్ కు మెడికల్ కాలేజీలు వచ్చేవా..? అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. మహబూబ్ నగర్ లో గురువారం 1000 పడకల సూపర్ స్పెషాలిటి ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. రూ.300 కోట్లతో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని అన్నారు. క్యాన్సర్ తో పాటు అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి మెడికల్ మహబూబ్ నగర్ కి కేటాయించారని గుర్తు చేశారు. రూ.50 కోట్లతో నర్సింగ్ కాలేజ్ భవనం నిర్మిస్తాం అని అన్నారు. పాలమూరు జిల్లాపై గత నాయకులందరివీ మొసలి కన్నీళ్లే అని ఆరోపించారు. మహబూబ్ నగర్ ని దత్తత తీసుకుంటా అన్న వ్యక్తి ఎక్కడికి వెళ్లాడని చంద్రబాబును విమర్శించారు. జాతీయ స్థాయి నాయకులు ఉన్నా మహబూబ్ నగర్ కు మెడికల్ కాలేజీ తీసుకురాలేదని విమర్శించారు.

లేడీ సూపర్ స్టార్ Vs యంగ్ హీరోయిన్… మాటల యుద్ధం

లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న మూవీ ‘కనెక్ట్’. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రమోషన్స్ లో భాగంగా నయనతార ముందెన్నడూ లేనంతగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నయనతార ఒక యంగ్ హీరోయిన్ కి కౌంటర్ వేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడింది మాళవిక మోహనన్ గురించి. రజినీకాంత్ నటించిన ‘పేట’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్, సెకండ్ సినిమానే దళపతి విజయ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవిక మోహనన్, ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో “నేను ఒక సీన్ చూసాను, అందులో హీరోయిన్ హాస్పిటల్ బెడ్ పైన ఉంది. పేషంట్ లా ఉండాల్సిన హీరోయిన్, మేకప్ వేసుకోని ఉండడం ఏంటో అర్ధం కాలేదు. అది కమర్షియల్ సినిమా అని తెలుసు కానీ కొంచెం అయినా రియలిస్టిక్ గా ఉండాలి కదా” అంటూ ఇండైరెక్ట్ గా నయనతార గురించి కామెంట్స్ చేసింది.

చైనాలో రోజుకి 10 లక్షల కేసులు, 5వేల మరణాలు
ప్రపంచ ఇప్పటి వరకు చూడని ఉత్పాతాన్ని చైనా ఎదుర్కోబోతోంది. కోవిడ్ వల్ల ఆ దేశం ఉక్కిరిబిక్కిరి కాబోతోందని పలు అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ రాకెట్ వేగంతో కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేయడంతో అక్కడి ప్రజల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతీ రోజూ 10 లక్షల కేసులు, 5000 మరణాలు నమోదు అవుతున్నాయిన.. లండన్‌కు చెందిన అనలిటిక్స్ సంస్థ చేసిన కొత్త పరిశోధనను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ గురువారం నివేదించింది.చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి చెందుతోంది. అత్యధిక వ్యాప్తి, తక్కువ ఇంక్యుబేషన్ పిరియడ్ ఉన్న ఈ వేరియంట్ వల్ల చైనీయులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇన్నాళ్లు ‘‘జీరో కోవిడ్’’ విధానాన్ని అనుసరించిన చైనా, అక్కడి ప్రజల నిరసనలతో దీన్ని ఎత్తేసింది. దీంతో అక్కడ లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రానున్న మూడు నెలల్లో 60 శాతం మంది జనాభాకు కరోనా సోకుతుందని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. వచ్చే నెల నాటికి రోజూవారీ కేసుల సంఖ్య 3.7 మిలియన్లకు, మార్చి నాటికి 4.2 మిలియన్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

బట్టలు విప్పి దుబాయ్ లో బోల్డ్ బ్యూటీ ఫోటోషూట్.. అరెస్ట్..?

బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాషన్ కే ఐకాన్ అన్నట్లు అమ్మడి డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఎవ్వరికైనా మతులు పోవాల్సిందే. ఒకసారి ఒంటినిండా పిన్నీసులను కప్పుకొని కనిపిస్తే.. ఇంకోసారి టేప్ కప్పుకొని కనిపిస్తుంటుంది.. మరొకసారి ఫోన్ లు.. అసలు ఒంటిమీద అమ్మడికి బట్టలు నిలవవు అంటే అతిశయోక్తి కాదు. ఛీఛీ ఇలా చేస్తున్నందుకు సిగ్గుగా లేదా అంటే.. దానికి ఈ బ్యూటీ చెప్పిన సమాధానం వింటే అవాక్కవ్వకుండా ఉండలేరు. నేను ఇలా ఉంటేనే నాకు నేమ్, ఫేమ్ వచ్చాయి.. అందుకే నేను ఇలాగే ఉంటాను అని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. దుబాయ్ లో ఒక ప్రాంతంలో ఉర్ఫీ తనదైన స్టైల్లో ఫోటోషూట్ చేస్తూ కనిపించింది. ఒంటిపై బట్టలు లేకుండా అదేనండీ .. విచిత్రమైన వేషధారణతో ఫోటోషూట్ చేస్తూ కనిపించడంతో దుబాయ్ పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలో నిజం లేదని ఉర్ఫీ చెప్పుకొచ్చింది.