పదవ తరగతి లీక్ కేసు.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తీవ్రంగా స్పందించారు. ఈ పేపర్ లీక్ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేశారని వెల్లడించారు. చీఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ కె.గోపాల్, ఇన్విజిలేటర్లు ఎస్.బందెప్ప, సమ్మప్పపై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. బందెప్ప, సమ్మప్పలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామన్నారు. పదో తరగతి తెలుగు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. కాసేపటికే 9.37 గంటలకు బందెప్ప మరో ఉద్యోగి సమ్మప్పకు వాట్సాప్ పంపించారని వెల్లడించారు. బందెప్ప చేసింది మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుందన్నారు. ఇదిలా ఉండగా.. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగలేదని.. రేపటి పరీక్ష యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.
తెలంగాణలో లీకేజీల జాతర.. విద్యామంత్రి రాజీనామా చేయాలి
రాష్ట్రంలో పదో తరగతి తెలుగు పేపర్ లీక్ కావడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోందన్నారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటని బండి సంజయ్ మండిపడ్డారు.ప్రభుత్వ చేతగానితనం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారిందన్న ఆయన.. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ లీకేజీతో ప్రభుత్వ, చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. టెక్నాలజీని పేపర్ లీకేజీ కోసం ఉపయోగించుకుంటున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పేపర్ లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం
రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రూ.4.30 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణం చేపట్టామన్నారు. స్థలాభావం ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా సబ్ స్టేషన్లతో మేలుకలుగుతుందన్నారు మంత్రి. త్వరలో అన్నవరం దేవస్థానం వద్ద రెండో కంటైనర్ సబ్ స్టేషన్ నిర్మాణం నిర్మిస్తామన్నారు. సబ్ స్టేషన్లతో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కు ప్రాధాన్యం ఉంటుందని, స్మార్ట్ మీటర్ల పై టీడీపీ, కమ్యూనిస్ట్ లు రాజకీయం చేస్తున్నారని మంత్రి పెద్ది రెడ్డి మండిపడ్డారు. రైతులపై ఎటువంటి భారం లేకుండా ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. డిబిటి విధానంలో రైతుల ఖాతాలకే బిల్లులు జమ అవుతాయన్నారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది. అర్థం చేసుకుంటున్న రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చి ఖాతాలు తెరుస్తున్నారు అని మంత్రి పెద్ది రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 33కేవి విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..3నెలల అతి తక్కువ సమయంలోనే కంటైనర్ సబ్ స్టేషన్ నిర్మించాం అన్నారు.
ఓటు వేసేటప్పుడు మనసు చెప్పింది వినండి
ఈమధ్యకాలంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల మగవాళ్ళంతా పోరంబోకులు అనీ, అందుకే మహిళల పేరు మీద అన్ని పథకాలు జగన్ అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. తాజాగా మరోమారు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, మహిళా రుణాల విషయమై చంద్రబాబు మాట తప్పాడన్నారు. మేం అధికారంలొకి వచ్చాక పాతరుణాలను కూడా తీర్చాం. పథకాల వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రజలు గమనించి గుర్తించాలి. ఇంటి ఇల్లాలికి ఆర్థిక ఆసరా దక్కే విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం ఇస్తారో, మాట తప్పి, హామీలు నీరుగార్చే దొంగ అయిన చంద్రబాబుకి ఇస్తారో మీ ఇష్టం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆశలు అన్నీ మహిళలపైనే. మళ్లీ ఆయనకు అధికారం దక్కించే అధికారం మీ చేతిలోనే ఉంది. మీరు ఈ సారి మేలు చేసే వారికి చేయూత ఇచ్చే వారికి కన్న కొడుకులా చూసుకునే వారికి అధికారం ఇస్తారో ఇవ్వరో ఆలోచించుకోవాలి. జగన్ కు ఓటు వేసి అదికారం ఇవ్వకపోతే మహిళలే నష్టపోతారు. ఓటు వేసేటప్పుడు మనసు చెప్పిన మాట ప్రకారం వేయాలి. మీకు ఎంతో మేలు చేసిన ప్రభుత్వానికి మరో సారి అధికారం ఇవ్వాలని గుర్తు పెట్టుకొని ఓటు వేయండి అని పేర్కొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
యూఏఈ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం
అబుదాబికి బయలుదేరిన యూఏఈకి చెందిన విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. బెంగళూరు విమానాశ్రయంలో విమానం సాధారణ ల్యాండింగ్ అయిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఫ్లైట్ ఇన్‌స్పెక్షన్ పూర్తి చేసి, అనంతరం గమ్యస్థానానికి బయలుదేరింది. ఏప్రిల్ 2న బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అబుదాబికి ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం EY237, సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానం బెంగళూరులో సాధారణ ల్యాండింగ్‌ను నిర్వహించింది. అవసరమైన సాంకేతిక తనిఖీలు పూర్తయ్యాయి. విమానం అబుదాబికి బయలుదేరి వెళ్లిందని ఎతిహాద్ ఎయిర్‌వేస్ తెలిపింది.
పవన్ కళ్యాణ్ పొత్తు ప్రయత్నాలపై బీజేపీ అలర్ట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీలో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీతో పొత్తు వద్దనే అభిప్రాయంతో బిజేపి కేంద్ర నాయకత్వం. పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి రమ్మనమని ఎవరూ పిలవలేదని అంటున్నారు బీజేపి వర్గాలు. పవన్ కల్యాణ్ స్వయంగా చొరవ తీసుకుని పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్న బిజేపి వర్గాలు. అయితే, టిడిపి తో పొత్తుకు మాత్రం బిజేపి విముఖంగా ఉన్నట్లు సమాచారం. టిడిపి “స్నేహం” పట్ల అపనమ్మకంతో ఉన్న బిజేపి. ఇటీవల ఏపీలో జరిగిన ఉపాధ్యాయుల ఎమ్.ఎల్.సి ఎన్నికల్లో “పిడిఎఫ్” ( ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్) తో టిడిపి పొత్తు పెట్టుకోవడం సుతారం ఇష్టం లేని బిజేపి. జనసేన తో కలిసి పనిచేసేందుకు మాత్రమే సుముఖంగా ఉన్న బిజేపి. సాయంత్రం తర్వాత ఏపి బిజేపి వ్యవహారాల ఇంచార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ తో “జనసేన” నేత పవన్ కళ్యణ్, నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బిజేపి అగ్రనేతలతో పవన్ కల్యాణ్ భేటీలపై ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. బిజేపి అగ్రనేతలకు ఏపి బిజేపి వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ ఇచ్చే చర్చలు వివరాలను బట్టి తదుపరి భేటీలు ఉంటాయని భావిస్తున్నారు.
అంబానీ హ్యాండ్ బ్యాగ్ ధరెంతో తెలుసా?
ప్రపంచ కుబేరుల్లో ఒకరు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఆయన ఇంటి కోడలంటే ఇంకా ఏ రేంజ్‌లో ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్వరలో అంబానీ కుటుంబానికి కోడలిగా అడుగు పెట్టబోంది రాధికా మర్చంట్. కేవలం అందమైన ముఖం మాత్రమే కాదు ఆమె స్వతహాగా ఫ్యాషన్ ఐకాన్. యంగ్ , ఫ్యాషనబుల్ లేడీ ఎల్లప్పుడూ ఆకట్టుకునేలా దుస్తులు ధరించి ఉంటుంది. రాధికా మర్చంట్ యాక్సెసరీలు ఆమె దుస్తుల ఎంపికల వలె బలంగా ఉంటుంది. అయితే NMACC ఓపెనింగ్ వేడుకలో ప్రతి ఒక్కరినీ మాట్లాడకుండా చేసింది ఆమె హెర్మేస్ కెల్లీమార్ఫోస్ బ్యాగ్. ఈ చేతి మిఠాయి సైజులో ఆమె బ్యాగ్ మీద సర్వత్ర చర్చ జరుగుతోంది. ఈ చిన్న బ్యాగ్ ధర అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సున్నితమైన పర్స్ ధర భారతీయ రూపాయలలో రూ. 52 లక్షలు. ఈ హై-ఎండ్ యాక్సెసరీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారడంలో ఆశ్చర్యం లేదు.
సాహిబ్‌గంజ్‌లో హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజధాని రాంచీకి 425 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాహిబ్‌గంజ్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెట్టుకింద ఉన్న ఆలయంలో ఒకటిన్నర అడుగుల ఎత్తున్న విగ్రహం ఉంది. సాహిబ్‌గంజ్‌లోని పటేల్ చౌక్ సమీపంలోని ఆలయంలో ఉంచిన హనుమాన్ విగ్రహాన్ని సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఒక వ్యక్తి ధ్వంసం చేశాడు. ఇది సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఒక్క వ్యక్తి మాత్రమే ఈ చర్యలో పాల్గొన్నట్లు కనిపించాడు. నిందితుడిని గుర్తించారు. ఉదయం విగ్రహం ధ్వంసం సంఘటన వార్త తెలియడంతో స్థానిక ప్రజలు ఆలయం సమీపంలో గుమిగూడి, దుండగుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించారు. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ప్రయోగించారు.
భర్తే శత్రువయ్యాడు.. ఆరు నెలలకే అలా జరిగింది
తెరముందు నవ్వుతూ, హుషారుగా కనిపించే సెలెబ్రిటీల జీవితాలు.. తెరవెనుక కూడా అలాగే ఉంటాయని చెప్పలేం. కొందరి జీవితాలు విలాసవంతంగా, సంతోషంగా ఉండొచ్చేమో గానీ.. మరికొందరు మాత్రం వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. సాధారణ మనుషుల తరహాలోనే.. వారి జీవితాల్లోనూ కష్టాలు ఉంటాయి. కలలన్నీ కలలుగానే మిగిలిపోయి ఉంటాయి. అలాంటి వారిలో మనీషా కొయిరాలా కూడా ఒకరు. ఒకప్పుడు ఈమె సినీ జీవితం ఎంత అద్భుతంగా గడిచిందో, వ్యక్తిగత జీవితం అంతే దారుణంగా సాగింది. ఆరోగ్యపరమైన సమస్యల దగ్గర నుంచి విడాకుల దాకా.. ఈమె ఎదుర్కొన్న కష్టాలు ఎన్నెన్నో! మంచి విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ఆశాజనకంగానే సాగుతోంది. వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ.. బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన చేదు అనుభవాల గురించి మనీషా కొయిరాలా చెప్పుకొచ్చింది.