NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

హుగ్లీలో హింస… బీజేపీ శోభాయాత్రపై రాళ్ల దాడి

రామ నవమి నుంచి పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. రామ నవమి రోజున ప్రారంభం అయిన మతఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి హౌరాలోని శిబ్ పూర్, కాజీపరా ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది. రామ నవమి రోజున శోభాయాత్రపై ఓ వర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఆదివారం హుగ్లీలోని రిస్రా ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో రామ నవమి శోభాయాత్రపై మరోసారి రాళ్లదాడి జరిగింది. శోభాయాత్రఅలో బీజేపీ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఉన్న సమయంలోనే దుండగులు వీరంగం సృష్టించారు. బీజేపీతో కలిసి విశ్వహిందూ పరిషత్, ఇతర హిందూ సంస్థలు ఈ ర్యాలీని నిర్వహించాయి. తాజాగా జరిగిన దాడిలో ఎమ్మెల్యే బిమన్ ఘోష్ గాయపడినట్లు బీజేపీ పేర్కొంది. సమాచారం అందుకున్న వెంటనే చందన్ నగర్ పోలీస్ కమిషనర్ అమిత్ జబల్ గీర్ అదనపు పోలీస్ బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు.

కేటీఆర్ ని బర్తరఫ్ చేయాల్సిందే…

మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ని చేస్తేనే పేపర్ లీకేజీ కేసు విచారణ సాఫీగా సాగుతుందని, లేకపోతే లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఎస్‌పీఎస్‌సీ కమిటీని కూడా రద్దు చేయాలని, పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన విస్త్రృతస్థాయి సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. లింగారెడ్డి నిన్న సిట్ ముందుకు వెళ్లాడని, అతని బావమరిది ప్రగతి భవన్‌లో సీఎం ఓఎస్‌డీ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. కేసీఆర్‌కి రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితుడని.. కేంద్ర సర్వీసులో ఉన్న ఆయన ఏడు సంవత్సరాలు గడిచినా ఇంకా కొనసాగుతూ వస్తున్నారని తెలిపారు. తాము ఫిర్యాదు చేస్తేనే ఆయన రాజీనామా చేశారని.. ఈ లీకేజీ వ్యవహారంలో రాజశేఖర్ రెడ్డి పాత్ర ఏంటన్నది కూడా తేలాలని కోరారు.అంతేకాదు.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌పై ఏప్రిల్ 25న సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లో నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తామని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ తీగ లాగితే.. ప్రగతి భవన్ లింక్ బయటపడిందని అన్నారు. ఈ పేపర్ లీకేజీ కేసుని సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.

జగన్ ముందస్తుకి వెళ్ళే ఛాన్స్ లేదు

ఏపీలో మళ్ళీ ముందస్తు ముచ్చట నడుస్తోంది. ఒకవైపు జగన్ తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారంటూ ఊహాగానాలు వార్తలుగా వస్తున్నాయి. అయితే ఇదంతా మీడియా తన రేటింగ్స్ పెంచుకోవడానికే చేస్తున్న హంగామా అని మాజీ మంత్రి పేర్నినాని కొట్టిపారేశారు. తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తనదైన రీతిలో స్పందించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ లేదని అంటున్నారు రాజమండ్రి ఎం.పి. మార్గాని భరత్. ప్రజలు ఆశీర్వదించినట్టుగా ఐదేళ్లు పాలన కొనసాగుతుందని ఎంపీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు.రేపు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరగనున్న సమీక్ష సమావేశానికి రాజమండ్రి అసెంబ్లీ ఇన్ ఛార్జీగా వెళ్లతానని చెప్పారు. భరత్ రాజమండ్రిలో ఏన్టీవితో మాట్లాడుతూ మంత్రి వర్గం మార్పు ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఉంటుందని అన్నారు. మరో ఐదేళ్లు ప్రజలను ఆశీర్వదించాలని కోరుతూ జగన్ సూచనలు మేరకు పనితీరు మెరుగుపర్చుకోవడానికి మంచి వేదిక అవుతుందని పేర్కొన్నారు. నవరత్నాలు అందరికి అందించడానికి ప్రయత్నిస్తామన్నారు.సంక్షేమ పథకాలే మమ్మల్ని మళ్లీ గెలెపిస్తాయనే ఆశాభవంతో ముందుకు వెళతామని అంటున్నారు ఎంపీ మార్గాని భరత్.

యాక్సిడెంట్ తర్వాత నా మాట పడిపోయింది

జీవితం చాలా చిన్నది. ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో చెప్పడం చాలా కష్టం. ఆ ప్రమాదాల నుంచి బయటపడినవారికే జీవితం అంటే ఏంటో ఇంకా బాగా తెలుస్తుంది. అటువంటి ప్రమాదం నుంచి బయటపడిన హీరో సాయి ధరమ్ తేజ్. మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, మంచి కథలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్న నేపథ్యంలో ఆయన జీవితంలో పెద్ద కుదుపు. అదే రోడ్ యాక్సిడెంట్. రెండేళ్ల క్రితం తేజ్ కు కేబుల్ బ్రిడ్జ్ వద్ద బైక్ యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే. ప్రాణాలతో బయటపడడేమో అని అనుకున్నారు. కానీ, దేవుడి దయవలన, ప్రేక్షకుల ప్రార్థనల వలన తేజ్ బయటపడ్డాడు. దాదాపు ఆరునెలలు బెడ్ కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్న తేజ్.. ఒక ఇంటర్వ్యూలో అప్పటి సంఘటనలను గుర్తుచేసుకున్నాడు. ఆయన నటించిన విరూపాక్ష సినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని విప్పాడు.

బ్యాడ్ హ్యాబిట్ ..రాహుల్ విషయంలో వెస్ట్రన్ దేశాలకు క్లాస్..

పాశ్యాత్య దేశాలకు మరోసారి తలంటారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో, ఉక్రెయిన్ యుద్ధ విషయంలో వెస్ట్రన్ దేశాలు భారత వైఖరిని తప్పుబడుతున్న సమయంలో వారికి సరైన పాఠం నేర్పారు జైశంకర్. ఇదిలా ఉంటే మరోసారి పాశ్చాత్య దేశాల వైఖరిని తప్పుబట్టారు. రాహుల్ గాంధీ విషయంలో పలు విదేశాలు స్పందించడంపై ‘‘ బ్యాడ్ హ్యాబిట్’’ అంటూ ఘాటుగా స్పందించారు. ఇతర దేశాల అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడం పశ్చిమ దేశాలకు అలవాటని జైశంకర్ విమర్శించారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో వ్యాఖ్యానించే హక్కు తమకు దేవుడు ఇచ్చిన హక్కు అని వెస్ట్రన్ కంట్రీస్ భావిస్తున్నాయని ఆయన ఆదివారం అన్నారు. బెంగళూర్ లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా, జర్మనీ, యూకేలు రాహుల్ గాంధీ జైలు శిక్ష, అనర్హత విషయాల్లో స్పందిస్తూ.. మేము రాహుల్ గాంధీ విషయాన్ని గమనిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశాయి. దీనిపై ఓ ప్రశ్నకు బదులిస్తూ వెస్ట్రన్ దేశాల వైఖరిని తూర్పారపట్టారు.

చరణ్ ను పెళ్లాడిన కొత్తలో ఎన్నో అవమానాలు

మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక కూతురుగా, భార్యగా, కోడలిగా, ఒక బిజినెస్ విమెన్ గా.. తనవంతు పాత్రను ఎంతో అద్భుతంగా పోషిస్తుంది. ఇక త్వరలోనే తల్లి అనే బాధ్యతను అందుకోనుంది. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం తెల్సిందే. పదేళ్ల తరువాత ఉపాసన, చరణ్ పేరెంట్స్ కాబోతున్నారు. దీంతో మెగా కుటుంబమే కాదు మెగా ఫ్యాన్స్ కూడా మెగా వారసుడు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక తల్లి కాబోతున్న ఉపాసనను చరణ్ ఒక్క నిమిషం కూడా విడిచి ఉండడం లేదు. ఎక్కడకు వెళ్లినా తనతోపాటు భార్యను తీసుకెళ్తూ.. ఏది కావాలంటే అది చేస్తూ పర్ఫెక్ట్ హస్బెండ్ అనిపించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఇన్ని ప్రశంసలు అందుకుంటున్న ఉపాసన చరణ్ ను పెళ్లాడిన కొత్తలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. బాడీ షేమింగ్ కు గురైంది. అయినా ఉపాసన ఎక్కడా రాజీపడలేదు. వాటిని ఏవి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ఉంటూ అందరి మన్ననలు పొందింది. కానీ, ఆ అవమానాలను మాత్రం మర్చిపోలేదని చెప్తుంది ఉపాసన.

ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించిన జయదేవ్ ఉనాద్కట్

ఐపీఎల్ చరిత్రలో భారత పేసర్ జయదేవ్ ఉనాద్కట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక జట్ల తరపున ఆడిన ఆటగాడిగా జయదేవ్ నిలిచాడు. ఇప్పటివరకూ ఇతడు ఐపీఎల్‌లో మొత్తం 7 జట్ల తరఫున ఆడాడు. తొలుత 2010లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున ఇతడు ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. అనంతరం 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిథ్యం వహించాడు. ఆ జట్టు తరఫున ఆ ఒక్క సీజన్ మాత్రమే ఆడిన అతడు.. 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున రంగంలోకి దిగాడు. 2016 సీజన్ వరకూ ఆ జట్టుకి ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత 2017లో పుణే సూపర్‌ జెయింట్స్‌, 2018లో రాజస్థాన్‌ రాయల్స్‌కు పప్రాతినిథ్యం వహించాడు. రాజస్థాన్ జట్టుకి కీలక బౌలర్‌గా అవతరించడంతో.. నాలుగు సీజన్ల పాటు రాజస్థాన్ యాజమాన్యం అతడ్ని రిటెయిన్ చేసింది. అంటే.. నాలుగు సీజన్ల పాటు రాజస్థాన్ తరఫున అతగడు ఆడాడు. అయితే.. ఐపీఎల్‌-2022కు ముందు రాజస్థాన్ అతడ్ని రిలీజ్ చేసింది. అప్పుడు నిర్వహించిన మెగా వేలంలో.. ముంబై ఇండియన్స్ జట్టు అతడ్ని కొనుగోలు చేసింది. అయితే.. అతడు పెద్దగా ఇంపాక్ట్ చూపకపోవడంతో, ముంబై కూడా అతడిని ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు విడిచిపెట్టింది. ఐపీఎల్‌-2023 మినీ వేలంలో లక్నో జట్టు అతడ్ని సొంతం చేసుకుంది. ఇలా అతడు ఏడు జట్ల తరఫున ఆడిన భారత ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. అయితే.. ఈ జాబితాలో అగ్రస్థానంలో మాత్రం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. ఇప్పటివరకూ ఫించ్ ఐపీఎల్‌లో మొత్తం 8 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన సన్ రైజర్స్

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసింది. రాయల్స్ జట్టు కుదిర్చిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ చేధించలేకపోయింది. 131 పరుగులకే సన్‌రైజర్స్ చేతులు ఎత్తేయడంతో.. రాయల్స్ టీమ్ 73 పరుగులతో ఘనవిజయం సాధించింది. రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. ఆది నుంచే సన్‌రైజర్స్ బ్యాటర్లు డీలా పడిపోయారు. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. ఏ ఒక్కరు కూడా కనీస పోరాట పటిమ కనబర్చలేకపోయారు. అబ్దుల్ సమద్ ఒక్కడే 32 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడంటే.. ఇతర బ్యాటర్ల పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి. భారీ అంచనాలు పెట్టుకున్న 13 కోట్ల ప్లేయర్ హ్యారీ బ్రూక్ అయిన దారుణంగా విఫలమయ్యాడు. 21 బంతుల్లో కేవలం 13 పరుగులే చేయడంతో.. అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.