అమ్మ దా’నిమ్మ’ ధర ఇంత పెరిగావేంటమ్మా
వేసవి కాలం ఉదయం 6 గంటల నుంచే మండే ఎండలు.. 9 గంటలకే భగ భగ మండే సూరీడు. ఇక వేసవి తాపాన్ని తగ్గించేందుకు జనం రక రకాల పానీలయాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అందులో నిమ్మరసం ఒకటి. ఎక్కడైనా బండి కనిపిస్తే చాలు అక్కడ ఆగి నిరమ్మరసం తాగి దాహార్తి తీర్చుకుంటా ఉంటాము. అంతే కాకుండా నిమ్మకాయలను కొనుగోలు చేసి దానిని ఇంటికి తీసుకుని వెళ్లి ఇంట్లో వున్న చల్లటి నీటిలో షుగర్ కలిపి అందులో నిమ్మకాయ రసం కలుపుకుని నోట్లో వేసుకుని వేసవి తాపాన్ని తగ్గించుకుని సేదతీర్చుకుంటాము. అయితే ఇప్పుడు ఎండలు ఎక్కువయ్యాయి, దాహం తీర్చుకునేందుకు ప్రజలు నిమ్మకాయవైపు చూస్తు్న్నారు. ఈ సమయంలో నిమ్మకాయల డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. మండే ఎండలా నిమ్మ ధర భగభగ మండుతోంది. కొనుగోలు చేయాలంటేనే జనం వామ్మో నిమ్మకాయా ధర ఏంటి ఇంతనా అంటున్నారు. ఒక్క నిమ్మకాయ ధర రూ. 10 పెరగడం గమనార్హం. ఇకప్పుడు రూ. 20కి 6 వచ్చేవి అంటే 10 మూడు వస్తాయి. కానీ ఇప్పుడు ఒక్క నిమ్మకాయ ధర రూ.10 కావడంతో వామ్మో ఇదేంటి నిమ్మకాయ ధర 10 రూపాయలా అంటూ ఆశ్చర్యపోతున్నారు. వేసవి కాలంలో నిమ్మకాయలకు డిమాండ్ పెరగడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు లబోదిబోమంటున్నారు.
కర్నూలు రెసిడెన్షియల్ స్కూళ్ళో ప్రిన్సిపల్ వేధింపులు
చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, చిన్నారులు, విద్యార్ధినిలపై వేధింపులు ఆగడం లేదు. గురుదేవో భవ అంటారు.. కానీ కొంతమంది గురువులు విద్యార్ధినులను వేధిస్తూ మాయని మచ్చగా మారుతున్నారు. తాజాగా కర్నూలులో ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థిని పురుష ప్రిన్సిపల్ వేధింపులకు గురిచేస్తున్నాడు. అదేంటని అడిగితే బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నాడు. గదికి పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తండ్రికి ఫిర్యాదు చేసింది ఆ బాధిత విద్యార్థిని. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రిన్సిపల్ వేధింపులు భరించలేక తండ్రి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ స్కూళ్ళో టీసీ తీసుకొని మరో రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించాడు తండ్రి. అయితే ఆ అమ్మాయికి టీసీ ఇచ్చేందుకూ ఇబ్బంది పెట్టాడు ఆ కీచక ప్రిన్సిపల్. దీంతో ఏం చేయలేక టీసీ తీసుకున్నాడా తండ్రి. ఈ కీచక ప్రిన్సిపల్ పై ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ, మహిళా కమిషన్, కలెక్టర్ సహా మంత్రులకు ఫిర్యాదు చేశారు. నెలలు గడిచినా చర్యలు లేవని విద్యార్థిని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిశ చట్టం.. ఆ చట్టం ఈ చట్టం అంటూ ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో వేధింపులు మాత్రం ఆగడం లేదని, ఇలా అయితే ఆడపిల్లల్ని ఇంటికి దూరంగా రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఎలా చదివిస్తామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అయినా ఈ ఘటనపై స్పందిస్తారో లేదో చూడాలి.
బలూచిస్తాన్ లో బాంబుపేలుడు.. నలుగురు మృతి
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో సోమవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులతో కలిపి మొత్తం నలుగురు మృతి చెందగా.. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనేక ఇస్లామిస్ట్ సాయుధ గ్రూపులకు నిలయమైన బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా నగరంలోని షహ్రాహ్-ఏ-ఇక్బాల్‌లో.. ఖాందారీ బజార్ దగ్గర నిలిపి ఉన్న పోలీసు వాహనం సమీపంలో ఈ బాంబు దాడి జరిగింది. భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఈ పేలుడు సంభవించినట్లు ఎస్‌ఎస్‌పీ ఆపరేషన్స్ కెప్టెన్ జొహెయిబ్ మొహసిన్ తెలిపారు. దుండగులు ద్విచక్ర వాహనంలో పేలుడు పదార్థాలను ఉంచి, రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు అధికారి అజ్ఫర్ మెహసర్ వివరించారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు, ఇద్దరు పౌరులు మరణించారని పేర్కొన్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే.. మరణించిన ఆ ఇద్దరు పౌరుల్లో ఒక ఐదు సంవత్సరాల బాలిక ఉంది. ఈ బాంబు పేలుడు తీవ్రత కారణంగా.. సమీపంలో ఉన్న కొన్ని ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో.. 18 మంది తీవ్ర గాయాలపాలయ్యాయని, గాయపడిన వారిలో మహిళతో పాటు పిల్లలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
చెన్నై నుండి పుదుచ్చేరి.. బీర్ బస్ ప్రయాణం.
మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల బస్సుల్లో ప్రయాణం చేసి ఉంటారు. కానీ బీర్ బస్ లో ప్రయాణం చేశారా? బీర్ బస్ అంటే బస్సులో బీర్ లు ఉంటాయా? అనే అనుమానం వస్తుందా? బస్సులో బీర్ తాగుతూ ప్రయాణం చేయొచ్చా? బీర్ బస్సులో తాగి వెళ్లొచ్చా అని అడిగితే అందులో కండీషనర్ ఉందని చెబుతున్నారు. చెన్నై నుండి పుదుచ్చేరికి ఒక రోజు ట్రిప్, తిరుగు ప్రయాణం కోసం కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం కానుంది. చెన్నైలో నివసిస్తున్న చాలా మంది పౌరులు ఒక రోజు సరదాగా పాండిచ్చేరిని సందర్శించాలని కోరుకుంటారు. వారాంతాల్లో అలా సరదాగా గడిపే పౌరులు ఎందరో ఉన్నారు. వీరినే లక్ష్యంగా చేసుకుని పుదుచ్చేరికి చెందిన ఓ కంపెనీ కొత్త సర్వీసును అందించాలని నిర్ణయించింది. పుదుచ్చేరిలో కాటమరన్ బ్రూయింగ్ కో-పాండీ అనే కంపెనీ పనిచేస్తోంది. ఈ సంస్థ చెన్నై నుండి పుదుచ్చేరికి ‘బీర్ బస్’ అనే కొత్త టూరిజం ప్రాజెక్ట్‌ను ప్రవేశపెట్టింది. ఈ నెల 22న ఈ బీర్ బస్ సర్వీస్ ప్రారంభం కానుందని ప్రకటించారు. చెన్నై నుంచి పుదుచ్చేరికి ఒక రోజు పర్యటనకు ఒక్కొక్కరికి రూ.3,000 ఖర్చు అవుతుంది.
జనసేన ఎందుకు పెట్టారో పవన్ కే తెలీదు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విరివిగా పాల్గొంటున్నారు. పల్నాడు జిల్లాలో మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ జగనన్నే మా భవిష్యత్ స్టిక్కర్లు అంటిస్తున్నారు. తమ ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం చేకూరిన వారి నుంచి వివరాలు, ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. పనిలో పనిగా విపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు చేపడుతుంటే..ప్రతిపక్షాలు కువిమర్శలు చేస్తున్నాయని మండిపడుతున్నారు. అంబటి రాంబాబు జనసేన పార్టీ ఎందుకు పెట్టారో పవన్ కళ్యాణ్ కే తెలియదన్నారు మంత్రి అంబటి రాంబాబు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జనసేన పార్టీ పెట్టావా లేక చంద్రబాబు పల్లకి మో పార్టీ పెట్టాడా పవన్ సమాధానం చెప్పాలన్నారు. ఒంటరిగా పోటీ చేయలేని పార్టీలకు ఈ రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడాలన్నారు. మీకు మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి లేదంటే నన్ను ఆశీర్వదించవద్దు అని సూటిగా,దైర్యంగా చెప్పగలిగిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు అంబటి రాంబాబు. జగన్ పై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా , ఎవరు ఎంత మందితో కలిసి వచ్చిన ప్రజలు చితకొట్టి పంపిస్తారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ని మళ్ళీ మెజారిటీతో గెలిపిస్తారన్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ముసలం..
రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ లో పార్టీ నేతల మధ్య పోరు కొనసాగుతోంది. సీఎం స అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ గా మారింది. గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సచిన్ పైలట్ నిరాహారదీక్షకు దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన కార్యకర్తలతో కలిసి జైపూర్‌లోని షహీద్ స్మారక్ వద్ద మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రోజంతా నిరాహార దీక్ష చేస్తున్నారు. సచిన్ పైలట్ నిరాహార దీక్ష ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్‌లో రాజకీయ రగడ పెరిగింది. అంతర్గత రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. వసుంధర రాజే సీఎంగా ఉన్నప్పుడు జరిగిన స్కామ్‌లపై చర్యలు తీసుకోలేదన్న అంశాన్ని లేవనెత్తుతూ పైలట్ నిరాహారదీక్షను ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపవాస దీక్ష కొనసాగనుంది. పైలట్ నిరాహార దీక్షలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన మద్దతుదారులు జైపూర్ చేరుకుంటున్నారు. పైలట్ అనుకూల నాయకులు మరియు ఎమ్మెల్యేలు జైపూర్ చేరుకోవాలని ఎంపిక చేసిన మద్దతుదారులకు సందేశం ఇచ్చారు. జైపూర్‌లోని అమరవీరుల స్మారకం వద్ద మంగళవారం ప్రారంభమైన సచిన్ పైలట్ నిరాహార దీక్షకు సన్నాహాలు సోమవారం అర్థరాత్రి వరకు కొనసాగాయి.
2024లోనూ జగనన్న వన్స్ మోర్ అంటున్నారు
పల్నాడు జిల్లాలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఊపుమీద సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు,, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్లలో మేళతాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు.‘ఎమ్మెల్యే వద్దకు ప్రజలు వెళ్లడం సాధారణంగా జరిగేది. కానీ అందుకు విరుద్దంగా ప్రజల వద్దకే మంత్రులు, ఎమ్మెల్యేలు రావడం అంటే అది కేవలం ఒక్క జగనన్న వల్లే సాధ్యమైంది’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ నేతలే చెబుతున్నారు. జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా కామెంట్లు చేశారు. విపక్షాలపై ఆమె మండిపడ్డారు. 2024 లో జగనన్నను వన్స్ మోర్ అంటూ ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన 16 మంది ముఖ్యమంత్రు ల కన్నా మిన్నగా పాలిస్తున్నాడు జగనన్న…అలాంటి జగన్ పై నీతిమాలిన రాజకీయాలు చేయాలని చూస్తే టిడిపి ,జనసేన లను తరిమి తరిమి కొడతాం…వైసీపీ నాయకులతో మంచికి మంచి ఉంటుంది, చెడుకు చెడు ఉంటుందన్నారు.
హవ్వ.. యూనిఫాం ఎలుకలు కొరికేశాయట..
వినేవాడు వుండాలే గానీ చెప్పేవాడు వేదాంతం చెబుతాడు. బంగారాన్ని ఎలుకలు, పందికొక్కులు తినేస్తాయి. వైన్ షాపుల్లో మందు కూడా ఎలుకలే తాగేస్తుంటాయి.. వేల కోట్ల రూపాయల దాణాను చిటికెలో పశువులు తినేస్తాయి.. సినిమాల్లో చూపించినట్టు పోలీస్ గన్ ఎవరో ఎత్తుకుపోతారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తిరుపతిలో యూనిఫాం లేకుండా సమావేశానికి వచ్చిన ఓ వీఆర్వో ఇచ్చిన సమాధానం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. తిరుపతిలో యూనిఫాం ఎలుకలు కోరికేశాయ్ మేడం అంటూ బదులిచ్చాడు వీఆర్వో. ఈ నిర్లక్ష్యపు సమాధానంతో వీఆర్వోపై సస్పెన్షన్ వేటు పడింది. సచివాలయ ఉద్యోగులతో నగర సమస్యలపై జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు తిరుపతి కమీషనర్ హరిత. అయితే ఈ సమావేశానికి అంతా హాజరయ్యారు. కానీ యూనిఫారం లేకుండా హాజరయ్యాడు వీఆర్వో ప్రసాద్. అందరూ యూనిఫారంతో వచ్చారు నీవు ఎందుకు రాలేదని ప్రశ్నించారు కమీషనర్ హరిత. నా యూనిఫాం ఎలుకలు కోరికేశాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు వీఆర్వో. ఇటు పనిలోను వెనుకంజులో ఉండటం, నిర్లక్ష్యపు సమాధానంపై సీరియస్ అయ్యారు కమీషనర్. వీఆర్వోను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు నగర కమీషనర్ హరిత. ఈ ఘటన తిరుపతిలో హాట్ టాపిక్ అవుతోంది.
ముందుంది ముసళ్ల పండగా.. ఆ నిర్మాతకి కంగనా వార్నింగ్
ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌ని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటుంది. సందర్భం వస్తే చాలు.. అతనిపై ఉగ్రరూపం దాలుస్తుంది. అతని వల్లే సినీ పరిశ్రమ చెడిపోయిందని, బ్యాక్‌గ్రౌండ్ లేని వారి కెరీర్‌లను నాశనం చేశాడంటూ ఆరోపణలు చేస్తూ వస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్‌లో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని ప్రియాంకా చోప్రా చెప్పినప్పుడు కూడా.. కంగనా రనౌత్ రంగంలోకి దిగి, కరణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రియాంకా చెప్పింది నిజమేనని, హిందీ సినీ పరిశ్రమలో కరణ్ జోహార్ రాజకీయాలు నడిపిస్తున్నాడని, షారుఖ్‌తో ప్రియాంకా క్లోజ్‌గా ఉండటం నచ్చక ఆమెను పరిశ్రమ నుంచి వెళ్లిపోయేలా టార్చర్ పెట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. అనుష్క శర్మ కెరీర్‌ను కూడా దెబ్బతీశాడని ఆరోపించింది. ఇలా తనపై కంగనా చేసిన ఆరోపణలపై కరణ్ జోహార్ ఇటీవల స్పందించాడు. తనపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా తాను తలొగ్గనని, ఆ అబద్ధాలు తనకు ఎలాంటి నష్టం కలిగించవని అన్నాడు. తనను ఎవరు ఎంత దూషించినా, చెడుగా చూపించాలని ప్రయత్నించినా భయపడేది లేదని తేల్చి చెప్పాడు. మీరంతా అబద్ధాలకు బానిసలవుతున్నారని, అయినా తాను వాటికి స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.