NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

‘మీ డిగ్రీని చూపించు’.. కొత్త ప్రచారానికి ఆప్ శ్రీకారం

ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీకి సంబంధించిన అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూకుడు పెంచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ‘మీ డిగ్రీని చూపించు’ ప్రచారాన్ని ప్రారంభించింది. బిజెపి రాజకీయ నాయకులను కూడా అదే చేయాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీలకు సంబంధించిన సమాచారం ఇప్పటికే అందుబాటులోకి వచ్చినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు రూ. 25,000 జరిమానా విధించిన వారం తర్వాత ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ప్రచారాన్ని ప్రారంభించారు.“మేము ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాము. ప్రతిరోజూ, మీ నాయకులు తమ స్థాయిని మీకు ప్రదర్శిస్తారు. నేను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి BA మరియు ఆక్స్‌ఫర్డ్ నుండి రెండు మాస్టర్స్ డిగ్రీలను కలిగి ఉన్నాను. అవన్నీ అసలైనవే’’ అని అతిషి ఆదివారం ఢిల్లీలో విలేకరులతో అన్నారు. తాను అందరు నాయకులను, ముఖ్యంగా బిజెపి నాయకులను వారి డిగ్రీలు చూపించమని అడగాలనుకుంటున్నాను అని ఆమె తెలిపారు. ప్రచారంలో భాగంగా ఆప్ నేతలు ప్రతిరోజూ తమ డిగ్రీని బహిరంగపరుస్తారని చెప్పారు. సీనియర్ బిజెపి నాయకులు కూడా తమ డిగ్రీని చూపించాలి అని ఆమె కోరారు.

ఆ ఇద్దరు సీఎంలు కలిసిన వేళ

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదివారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. షిండేతో పాటు ఆయన ప్రభుత్వ మంత్రుల బృందం కూడా ఉంది. అయోధ్యలోని శ్రీ రాంలాలాను దర్శించుకున్న తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆహ్వానం మేరకు షిండే నేతృత్వంలోని మంత్రుల బృందం రాజధాని లక్నోకు చేరుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి బృందానికి స్వాగతం పలుకుతూ మర్యాద పురుషోత్తం ప్రభు శ్రీరాములు మన పూర్వీకుడని, అలాగే ఈ దేశానికి ఆత్మ అని అన్నారు.శ్రీరాముడి ఆశయాలను ప్రధాని నరేంద్రమోదీ తన జీవితంలో ఇముడ్చుకుని దేశంలో రామరాజ్య దృక్పథాన్ని సాకారం చేస్తున్నారని సీఎం యోగి అన్నారు. మోడీ నాయకత్వంలో అయోధ్య ప్రపంచంలోనే అత్యంత మహిమాన్వితమైన నగరంగా, ప్రపంచ తీర్థయాత్రల కేంద్రంగా మారుతోంది అని చెప్పారు. అయోధ్య అభివృద్ధికి వేల కోట్లతో కొత్త పథకాలు ప్రారంభించామని సీఎం యోగి అన్నారు. రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారని సీఎం యోగి వివరించారు.

ఏపీలో నేడు, రేపు వడగాల్పులు ..వాతావరణ శాఖ వార్నింగ్

వేసవి కాలం తీవ్రరూపం దాలుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం 27, మంగళవారం 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7, మన్యంలో 6, కాకినాడలో 6, అనకాపల్లి 5, తూర్పుగోదావరి 2, ఏలూరు జిల్లాలో ఒక మండలంలో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఎండ, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ అంబేద్కర్‌ సూచించారు. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతవరణ శాఖ తెలిపింది.

ఏపీ, కర్నాటకల్లో ఇక యాక్టివ్ రోల్ .. ఆట ఎలా ఉంటుందో?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనుందనే వార్తలు వచ్చాయి. ఏపీలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటకల్లో ఆఫ్ స్క్రీన్.. ఏపీలో ఆన్ స్క్రీన్ పాత్ర పోషించనున్నారు కిరణ్ కుమార్ రెడ్డి.తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డిని వినియోగించుకోనుంది బీజేపీ హైకమాండ్. కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలతో టచ్ లోకి వెళ్లాలని కిరణ్ కు బాధ్యతలు అప్పజెప్పింది హైకమాండ్.ఇప్పటికే యడ్యూరప్పతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీలో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలో పార్టీలో చేయబోయే మార్పులు చేర్పుల్లో జాతీయ కార్యదర్శి పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. ఏ మాత్రం వీలున్నా ఈలోగానే జాతీయ కార్సదర్శి పదవి కట్టబెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది బీజేపీ హైకమాండ్. కిరణ్ తో కలిసి పని చేయాలని చెప్పేందుకే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుని ఢిల్లీకి రమ్మని పిలిచింది బీజేపీ అధిష్టానం. మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోనూ కిరణ్ కుమార్ రెడ్డిని ఉపయోగించుకుంటారని భావించారు.

పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ

తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిని చేర్చారు. గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. మొత్తం 10 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌ లో ఉన్నాయని పేర్కొంది. దీనిపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ ఇంతకుముందే చర్చించారు. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. గవర్నర్ తీరు మంత్రి మండలి సలహాకు వ్యతిరేకంగా ఉందని రాష్ట్ర సర్కారు చెబుతోంది. ఇటువంటి విచక్షణాధికారాలు గవర్నర్‌కు ఉండవని ప్రభుత్వం అంటోంది. రాష్ట్రానికి సంబంధించిన ఆయా బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడానికి న్యాయమైన కారణాలు ఏవీ లేవని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు నెలలు గడుస్తున్నా బిల్లులకు ఆమోదం లభించలేదని, దీంతో వేరే మార్గం లేకే ప్రత్యేక పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సర్కారు అంటోంది.

మే 20న… ‘వస్తున్నాడు’

ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, ఇంకో ఏడాది వరకూ ఎన్టీఆర్ సినిమా థియేటర్ లో కనిపించదు. 2024 ఏప్రిల్ కి కొరటాల శివ, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా రిలీజ్ కి షెడ్యూల్ అయి ఉంది. ఈ గ్యాప్ లో 2023 మే 20కి ఎన్టీఆర్ ‘వస్తున్నాడు’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ మాస్ హీరోగా మార్చిన సినిమా ‘సింహాద్రి’. 19 ఏళ్లకే బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఎన్టీఆర్, ఇండియన్ సినిమా గర్వించేలా చేస్తున్న రాజమౌళిల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘సింహాద్రి’. నందమూరి అభిమానులందరికీ మోస్ట్ ఫేవరేట్ సినిమా అయిన ఈ ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్, మే 20న రీరిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. ఈమధ్య రీరిలీజ్ అనేది మాములు విషయం అయిపొయింది కానీ సింహాద్రిని మాత్రం అలా కాకుండా వరల్డ్ వైడ్ రీరిలీజ్ చేసి కొత్త సినిమా రేంజులో హంగామా చెయ్యడానికి ఫాన్స్ రెడీ అయ్యారు.

రామయ్య అభిషేకం చూసేందుకు వచ్చిన వానరులు

భద్రాచలం రామయ్యను చూసేందుకు భక్తులు తరలివస్తుంటారు. ప్రతిరోజూ జరిగే కార్యక్రమాల మాట అటుంచితే సీతారామ కల్యాణం, రాముడి పట్టాభిషేకం సమయంలో భక్తుల తాకిడి మామూలుగా ఉండదు. శ్రీరాముడు ఎక్కడుంటే అక్కడ ఆయన పరమభక్తుడు హనుమంతుడు ఉంటాడు. భక్తులకు కనువిందు చేస్తుంటాడు. అందుకే శ్రీరామనవమి, రాముడి పట్టాభిషేకం అనంతరం హనుమంతుడి జన్మోత్సవం జరుగుతుంటుంది. శోభాయాత్రలతో ఆలయాలు కళకళలాడుతుంటాయి. వీధుల్లో జై శ్రీరామ్, జై భజరంగభళి, జై హనుమాన్ నినాదాలు మారుమోగుతూ ఉంటాయి. భద్రాద్రి ఆలయంలో వానరాల సందడి అంతా ఇంతా కాదు. రాముడికి అభిషేకం చేస్తూ హడావిడిగా ఉన్నారు ఆలయ పూజారులు. ఇదే సమయంలో విశేష అతిథులు ఆలయం గోపురంపై సందడి చేశారు. రామయ్య అభిషేకం చూసేందుకు వచ్చారు వానరులు.. సాక్షాత్తూ హనుమ, సుగ్రీవుడు కలిసి వచ్చినట్టుంది. ఈ వానరులు కలిసి వచ్చిన దృశ్యం భక్తిటీవీలో ప్రసారం అయింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భక్తులు ఈ వీడియోలు చూసి భక్తిపారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఆ సంగతేంటో మీరూ ఓ లుక్కెయ్యండి.

‘కర్ణన్’ కాంబినేషన్ రిపీట్… ధనుష్ నుంచి సర్పైజ్ అనౌన్స్ మెంట్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇతర ఇండస్ట్రీల్లో కూడా సినిమాలు చేస్తూ మార్కెట్ ని పెంచుకుంటూ ఉన్నాడు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామాపై భారి అంచనాలు ఉన్నాయి. కెప్టైన్ మిల్లర్ అయిపోగానే ధనుష్ కి హిందీలో ఆనంద్ రాయ్ తో ఒక మూవీ కమిట్మెంట్ ఉంది. తెలుగులో శేఖర్ సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు, యుగానికి ఒకడు మూవీ సీక్వెల్ కి కూడా ధనుష్ ఓకే చెప్పాడు. ఈ భారి ప్రాజెక్ట్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ ల కన్నా ఎక్కువగా, కెప్టెన్ మిల్లర్ తర్వాత ఆ రేంజులో బజ్ జనరేట్ చేస్తూ ధనుష్, ఎవరూ ఊహించిన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఆ అనౌన్స్మెంట్. ధనుష్ నటించిన కర్ణన్ సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయిన సంధర్భంగా సోషల్ మీడియా అంతా ‘కర్ణన్’ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న సమయంలో… కర్ణన్ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ‘మారీ సెల్వరాజ్’తో ధనుష్ సినిమా అనౌన్స్ చేశాడు. తన సొంత నిర్మాత సంస్థ ‘ఉండర్ బార్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ధనుష్ ఈ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, జీ స్టూడియోస్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది.