NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

లకారంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తారక్ తో మంత్రి అజయ్ భేటీ

జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్. తెలుగు వెలుగు, సినీ వీక్షకుల ఆరాధ్యదైవం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. ‘అన్న’ ఎన్టీఆర్‌ నిలువెత్తురూపం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. శతజయంతి రోజున ఈనెల 28న ఖమ్మం లోని లకారం ట్యాంకుబండ్‌ మధ్యలో సాక్షాత్కరించబోతోంది. దీంతో పర్యాటకంగా నగరానికి సరికొత్త అలంకరణ దక్కబోతోందని ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం లకారంలో 45 అడుగుల శ్రీకృష్ణావతారంలోని ఎన్టీఆర్‌ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. ఈ విగ్రహం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఎన్టీఆర్‌ శతజయంతి రోజైన ఈనెల 28న విగ్రహాన్ని ఆయన మనుమడు, ప్రముఖ సినీ కథానాయకుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతులమీదుగా ఆవిష్కరింపజేయనున్నారు. తెలుగురాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లోని ఎన్టీఆర్‌ అభిమానుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకకు జూనియర్‌ ఎన్టీఆర్‌తోపాటు సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌తోపాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ఎన్టీఆర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతేడాది శతజయంత్యుత్సవాల ప్రారంభ సమయం లో రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, పలువురు ఎనఆర్‌ఐలు, ఎన్టీఆర్‌ అభిమానులు నిర్ణయించారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌తోపాటు, ఖమ్మానికి చెందిన ఎన్టీఆర్‌ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్‌తోపాటు పలువురు పారిశ్రామిక వేత్తలు, తానా సభ్యులు, ఎనఆర్‌ఐలు ఆర్థికంగా ముందుకు వచ్చారు. సుమారు రూ.4కోట్ల వ్యయంతో ఏర్పాటు కాబోతున్న ఎన్టీఆర్‌ విగ్రహంతో ఖమ్మం నగరానికి మరింత శోభను తెస్తుందని భావిస్తున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయి విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు.

కర్నాటకలో తృటిలో తప్పిన విమాన ప్రమాదం

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ ను పైలెట్ చాకచక్యంగా సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదం నుంచి డీకే శివకుమార్ తప్పించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో పాటు కర్ణాటకకు చెందిన ఓ న్యూస్ రిపోర్టర్ కూడా హెలికాప్టర్ లో ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం శివకుమార్ కోలార్ జిల్లా ముల్బాగల్ బహిరంగ సభలో హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిడింది. హెలికాప్టర్ ముందరి భాగాన్ని పక్షి ఢీకొనడంతో విండ్ షీల్డ్ పగిలిపోయింది. దీంతో హెలికాప్టర్ ను హెచ్ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. శివకుమార్ తో పాటు హెలికాప్టర్ లోని సిబ్బంది, ఇతరులు అంతా క్షేమంగా ఉన్నారు. హెలికాప్టర్ జక్కూర్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది. కోలార్ వెళ్లే మార్గంలో ఉంది. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలోని హెస్కోట్ సమీపంలో గాలిలో ఉండగా డేగ హెలికాప్టర్ విండ్ షీల్డ్ ను బలంగా తాకింది. మంగళవారం ఉదయం బెంగళూర్ లో కాంగ్రెస్ మానిఫెస్టో విడుదల చేసినత తర్వాత ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరారు.

ఆ అరెస్టుల్లో రాజకీయ దురుద్దేశం లేదు

ఏపీలో చట్ట ప్రకారమే టీడీపీ నేతల అరెస్టులు జరుగుతున్నాయన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్. చిట్ ఫండ్ సెక్షన్ యాక్ట్ 5 ఆధారంగానే టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ ల అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులు చిట్ ఫండ్ కంపెనీ అవకతవకలే కారణమని ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. దీనిలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలను అడ్డుపెట్టుకుని టిడిపి నేతలు దోచుకుంటున్నారని, కానీ ప్రజా సంక్షేమం కోసమే సీఐడీ దాడులు చేస్తుందని అన్నారు. కాల్ మనీ, ప్రజల దగ్గర నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. మహానాడు కోసం టిడిపి నేతలను అరెస్టు చేశారనడంపై ఆయన మండిపడ్డారు. మాకేంటి అవసరం ? అని ప్రశ్నించారు. ఆర్థిక నేరగాళ్లు ఉంటే గాని మహానాడు నిర్వహించలేరా? అడిగారు. సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థలను రద్దుచేస్తాం, సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారా..? అంటూ ఎంపీ భరత్ రామ్ ప్రశ్నించారు. చిట్ ఫండ్ అవకతవకాల్లో అరెస్టు అయి రాజకీయం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఆరోపించారు. నేరస్తులు ఎవరైనా ఒక్కరేనని అన్నారు. పొలిటికల్ గా వాడుకోవాలని చూస్తున్నారని, ప్రజలు ఇలాంటివి అన్నీ గమనిస్తున్నారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ అన్నారు.

మోర్గాన్ స్టాన్లీలో మరో రౌండ్ లేఆఫ్స్.. ఉద్యోగుల ఉద్వాసనకు ప్లాన్

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలతో పాటు అన్ని మల్టీనేషనల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ చేరేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ కూడా తన ఉద్యోగులను తొలగించే ప్లాన్ లో ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా లేకపోవడం, ఒప్పందాల కొరత మధ్య ఆరు నెలల్లో రెండో రౌండ్ ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. మోర్గాన్ స్టాన్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ రెండో త్రైమాసికంలో దాదాపుగా 3,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. కఠినమైన ఆర్థిక పరిస్థితులే ఉద్యోగుల తొలగింపుకు కారణం అవుతున్నాయని కంపెనీ చెబుతోంది. గడిచిన త్రైమాసికంలో మోర్గాన్ స్టాన్లీ మొత్తం రాబడిలో దాదాపుగా 2 శాతం అంటే 14.5 బిలియన్ డాలర్లు తగ్గాయి.

బీఆర్ఎస్ అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మోడీపై ఆయన మండిపడ్డారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి కెటిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం కేసీఅర్ తీసుకున్న ప్రతి నిర్ణయం పేద ప్రజల కోసం ఉంటుంది. అకాల వర్షాల వలన, రైతులు నష్టపోయారు, సీఎం స్వయంగా పంట పొలాలను పరిశీలించారు. రాళ్ల వానల వలన ధాన్యం తడిసి పోయింది..నష్టపోయిన పంట పొలాలను నేను స్వయంగా పరిశీలించాను..రాష్ట్రం లో నీళ్ళు ఎక్కువగా ఉండడం వలన వరి పొలాలు సాగు చేశారు..బి అర్ ఎస్ అంటే రైతు ప్రభుత్వం.. ఇబ్బడి ముబ్బడిగా వరి సాగు చేశారు. రైతు బీమా, రైతు బంద్ కేసీఆర్ ఇచ్చారు.. సిరిసిల్ల జిల్లా లో 13 మండలాలలో 19 వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది ఇది ప్రాథమిక అంచనా. 17 వేల మంది రైతులు.. హెక్టార్ 25 వేలు, ఎకరానికి 10 వేలు ఇస్తున్నాం.. రాష్ట్రం లో నీ ప్రతి రైతు నమ్మకంగా ఉండాలి. సివిల్ సప్లై ద్వారా 7 1/2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం అని చెప్పారు కేటీఆర్. గత కంటే ఈసారి ఇప్పటికే ఎక్కువ కొనుగోలు చేశాము. రాష్ట్రం లో రైతులు ఆందోళన చెందవద్దు..కర్ణాటక లో ఎన్నికలు జరుగుతున్నాయి.. నరేంద్రమోడి గారు కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో మూడు సిలిండర్ లు ఫ్రీ అంటున్నారు..నరేంద్రమోడి దేశానికి ప్రధాన లేక కర్ణాటక రాష్ట్రానికి ప్రధానమంత్రా? అదాని కొన్న ఎయిర్ పోర్ట్ కి జీఎస్టీ ఉండదు కానీ పాలు పెరుగుల పై జి ఎస్టీ వేసిన ఘనుడు నరేంద్రమోడీ అని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.

ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఈసారి ఎండాకాలం కాస్తా వానాకాలంగా మారింది. గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి / గాలుల కోత ఇప్పుడు నైరుతి మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. ఉపరితల ఆవర్తనము దక్షిణ ఛత్తీస్గఢ్ & పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు ఉంది. ఉపరితల ఆవర్తనము దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు అనుబంధ తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య ఉంది. పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనము నుండి ఒక ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక అనుబంధ తమిళనాడు నుండి నైరుతి బంగాళాఖాతం వరకు ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య కొనసాగుతున్నది.ఆంధ్రప్రదేశ్ మరియు యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో ఆగ్నేయ / దక్షిణ దిశలో గాలులు వీస్తున్నాయని వాతావవరణ శాఖ తెలిపింది. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలలో ఈరోజు మరియు రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

రాహుల్ గాంధీ కేసులో గుజరాత్ హైకోర్ట్ కీలక ఆదేశాలు

పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ హైకోర్టు 2 ఏళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధ్య చట్టం-1951 ప్రకారం రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే ఆటోమెటిక్ గా పదవి కోల్పోతారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా తన ఎంపీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ కేసులో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారించిన గుజరాత్ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన రికార్డులు, న్యాయవిచారణ క్రమాన్ని తమకు సమర్పించాలని సూరత్ కోర్టను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ ఆదేశించారు. మే 4 నుంచి తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని, అందుబాటులో ఉండనని ఈ లోపే వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ రోజు లేదా ఎల్లుండి కల్లా వాదనలు విని విచారణను ముగిస్తానని జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ వెల్లడించారు. 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంలో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ క్రిమినల్ పరువునష్టం కేసును పెట్టారు. దీన్ని విచారించిన సూరత్ న్యాయస్థానం రాహుల్ గాంధీని దోషిగా నిర్థారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం పూర్ణేష్ మోడీ తరుపున నిరుపమ్ నానావతి గుజరాత్ హైకోర్టులో వాదనలు వినిపించారు.

అందగత్తె ఆడియెన్స్ ముందుకొచ్చేది ఎప్పుడంటే…

వినూత్నమైన కథతో తెరకెక్కిన సినిమా ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’. గతంలో ఛార్మీ తో జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ‘మంత్ర’ మంచి విజయాన్ని సాధించింది. అదే సంస్థ ఆ మధ్య అనుపమా పరమేశ్వరన్ తో ‘బట్టర్ ఫ్లై’ మూవీని నిర్మించింది. ఇప్పుడు తాజాగా ‘మంత్ర’ సినిమా రచయిత రవి ప్రకాశ్ బోడపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, థ్రిల్లర్ జానర్ లో ‘ ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ సంస్థ ద్వారా విడుదలకు సిద్దమైంది. ఇప్పటికే విడుదలచేసిన ఈ మూవీ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్, యాక్షన్ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ మర్డర్ కేసును సాల్వ్ చేసే ప్రాసెస్ లో అన్ని కోణాల్లో జర్నలిస్టులు, పోలీసులు ఇన్వెస్ట్ గేషన్ చేసే నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. రవి ప్రకాష్ బోడపాటి రచన-దర్శకత్వంలో, ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రంలో నిహాల్ కోదాటి హీరోగా, దృషికా చందర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మధునందన్, భార్గవ పోలుదాసు, భావన దుర్గం, సమర్థ యుగ్, అలాగే ప్రముఖ జర్నలిస్ట్ దేవి నాగవల్లీ, మెహెర్ శ్రీరామ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ కు ప్రాణం పోసేది మ్యూజికే! ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను గిడియన్ కట్టా అందించారు. దీనికి అమర్ దీప్ గుత్తుల డీఓపీగా వ్యవహరించారు. ప్రవీణ్ పూడి తన ఎడిటింగ్ తో మెస్మరైజ్ చేశారు. ‘చాలా వైవిధ్యమైన కథతో నేటి తరానికి నచ్చేలా ‘ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ సినిమాను తెరకెక్కించామని, యువతకు కావల్సిన అన్ని అంశాలతో పాటు ఓ మంచి సందేశం ఈ సినిమాలో ఉంటుంద’ని మేకర్స్ తెలిపారు.

దేవికను యన్టీఆర్ ఏం చేశారు!?

సినిమా రంగంలో పుకార్లు షికారు చేయడమన్నది ఇప్పుడే కాదు, అప్పట్లోనూ ఉండేది. యన్టీఆర్ హిట్ పెయిర్స్ తో ఆయనకు ‘రిలేషన్ షిప్’ఉన్నట్టు ‘కాగడా’ వంటి పత్రికలు ప్రచారం చేసేవి. యన్టీఆర్ హిట్ పెయిర్స్ లో ఒకరిగా నిలచిన దేవికను సైతం అదే తీరున చాటింపు వేశారు. ఆ చాటింపు ఎలా ఉన్నా తెలుగునాట యన్టీఆర్ – దేవిక జంట భలేగా అలరించింది. యన్టీఆర్ చిత్రాలతోనే దేవిక గుర్తింపు సంపాదించడం విశేషం! దేవిక అసలు పేరు ప్రమీలాదేవి. ఆ పేరుతో ఓ సినిమాలో తళుక్కుమన్నా, తరువాత యన్టీఆర్,అంజలీదేవి జంటగా నటించిన ‘రేచుక్క’లో ప్రమీల పేరుతో రాకుమారి లలితాదేవిగా కనిపించారు. ఆ సినిమా తరువాత యన్టీఆర్ ‘శభాష్ రాముడు’లో ఆయనకు నాయికగా నటించి, అలరించారు. ఆ సినిమాతోనే దేవికకు నటిగా మంచిపేరు లభించింది. యన్టీఆర్ సరసన దేవిక నటించిన “శభాష్ రాముడు, రక్తసంబంధం, మహామంత్రి తిమ్మరుసు,శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణసత్య, శ్రీకృష్ణవిజయం, పెండ్లిపిలుపు, కంచుకోట, టాక్సీ రాముడు, గాలిమేడలు, దక్షయజ్ఞం, దేశద్రోహులు, ఆడబ్రతుకు, మంగళసూత్రం, భామావిజయం, నిండుమనసులు, గండికోట రహస్యం, నిలువుదోపిడి, రాజకోట రహస్యం, చిన్ననాటి స్నేహితులు” వంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. వీటిలో “శభాష్ రాముడు, రక్తసంబంధం, ఆడబ్రతుకు, శ్రీకృష్ణావతారం” చిత్రాలు రజతోత్సవాలు చూశాయి.