NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

రష్యా చేతిలో బందీ కావడం తీవ్ర అవమానకరం..

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఈ ఏడాది ఫిబ్రవరికి సంవత్సరం గడిచింది. అయితే ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్దం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే క్రిమియాను కోల్పోయిన ఉక్రెయిన్, ఖేర్సర్, లూహాన్స్క్, డోనెట్స్క్, జపొరిజ్జియా ప్రాంతాలను కూడా కోల్పోయింది. మరియోపోల్, సుమీ, ఖార్కీవ్ వంటి నగరాలు నామరూపాలు లేకుండా ధ్వంసం అవుతున్నాయి. ప్రతీ రోజు రష్యా జరిపే రాకెట్ దాడులతో అక్కడి నేలంతా నల్లగా మారిపోయింది. యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై రష్యన్లు దాడి చేసి బందీగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తే చివరివరకు పోరాడుతానని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అధ్యక్ష కార్యాలయంలోకి శత్రువులు ప్రవేశిస్తే, నేడు మేం ఇక్కడ ఉండేవాళ్లం కాదు అని, ఉక్రెయిన్ అధ్యక్షుడిని రష్యన్లు బందీగా తీసుకెళ్తున్నారు అంటే మీరు ఊహించగలరా..? ఇది అవమానకరం అని నమ్ముతా అని జెలన్ స్కీ అన్నారు.

ఏపీ రాజ్ భవన్ లో మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శన

ఇవాళ రాజ్ భవన్ దర్బార్ హాల్లో ప్రధాని 100వ మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆల్ ఇండియా రేడియో నేతృత్వంలో మన్ కీ బాత్ ప్రదర్శన నిర్వహించారు. మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్….ఈ సందర్భంగా ప్రముఖులు ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకం.మన్ కీ బాత్ ద్వారా ప్రధాని ప్రజల్లో చైతన్యం రగిలించారు.దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను ఎలా అధిగమించాలో ప్రధాని వివరిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రధాని నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమం చాలా మందికి వ్యాక్సినేషన్ విషయంలో అవగాహన కలిగించిందన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రసారం అయింది. దేశంతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కూడా లైవ్ టెలికాస్ట్ జరిగింది. మన్ కీ బాత్ వల్ల ప్రజల్లోని భావోద్వేగాలు తెలుసుకునే అవకాశం కలిగిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. తన ఆలోచనలను మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో పంచుకోగలిగానని వెల్లడించారు. 100వ ఎపిసోడ్ కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని దేశంలోని కోట్ల మంది వినేలా బీజేపీ భారీ ఏర్పాట్లను చేసింది. సామాన్యులకు సంబంధించి ప్రతీనెల కొన్ని వేల సందేశాలను ‘మన్ కీ బాత్’లో చదివానని ప్రధాని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమం తనను ప్రజలకు మరింతగా చేరువ చేసిందని అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో ప్రజలు వినేలా బీజేపీ చర్యలు తీసుకుంది.

మే 3వ తేదీన జగన్ విజయనగరం, విశాఖ జిల్లాల పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్ధాపన, చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్‌ ప్రాజెక్ట్‌ మిగులు పనులకు శ్రీకారం చుడతారు. అలాగే, విశాఖపట్నం–మధురవాడలో వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌కు శంకుస్ధాపన చేస్తారు.
విజయనగరం జిల్లా షెడ్యూల్‌ ఇదే
మే నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 10.25 గంటలకు జీఎంఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌కు చేరుకుంటారు, ఆ సెంటర్‌ను సందర్శిస్తారు, భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి శంకుస్ధాపన చేస్తారు. 10.30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం, చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్‌ ప్రాజెక్ట్‌ మిగులు పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 10.55 గంటలకు సవరవిల్లి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. సభ అనంతరం 1.20 గంటలకు అక్కడి నుంచి విశాఖ పర్యటనకు బయలుదేరుతారు.

హార్ట్ హెల్త్ ని మెరుగుపరిచే ఫుడ్

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నిర్థిష్ట కాలంలో మాత్రమే వస్తుంటాయి. అయితే వాటికి సీజన్ తో సంబంధం లేకుండా తలెత్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి వ్యాధుల్లో ముఖ్యమైనవి గుండెపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలే ప్రపంచ మానవాళిని వణికిస్తున్న ఆరోగ్య సమస్యల్లో తొలి స్థానంలో ఉన్నాయి. ఇక ఈ సమస్యలు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగానే పరిణమిస్తాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.ఈ క్రమంలో కొన్ని రకాల ఆహారాలను మన డైట్ లో చేర్చుకోవడం ద్వారా హృదయ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ హృదయ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటే గుండెపోటు సమస్య తలెత్తే ఛాన్స్ కూడా తగ్గుముఖం పడుతుంది.. నిమ్మ, ఆరెంజ్ : నిమ్మ, ఆరెంజ్ లను తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉండడమే దీనికి ప్రధాన కారణం. తద్వారా హృదయ సంబంధిత వ్యాధులను నియంత్రించగలవు.

స్విగ్గీ బాదుడు షురూ.. మొదట ఆ నగరాల్లో అమలు

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ బాదుడు షుచూ చేసింది. వినియోగదారుల నుంచి ఫుడ్ ఆర్డర్ పై రుసుము వసూలు చేస్తోంది. ఫుడ్ ఐటమ్స్ తో సంబంధం లేకుండా ‘‘ప్లాట్‌ఫారమ్’’ ఛార్జీల పేరుతో వినియోగదారుల నుంచి రూ. 2 చొప్పున వసూలు చేయడం ప్రారంభించింది. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి ఛార్జీలు పెరగడం అనేది ఉండదు. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ వ్యాపారం మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. స్విగ్గితో పాటు జొమాటో కూడా ప్రభావితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకోవడం, ఖర్చును తగ్గించుకోవడం, పనితీరును మెరుగుపరుచుకోవడానికి స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ ఛార్జీలను వసూలు చేస్తోంది. ముందుగా బెంగళూర్, హైదరాబాద్ నగరాల్లో అదనపు ఛార్జీలను ప్రవేశపెట్టారు. అయితే ముంబై, ఢిల్లీ నగరాల్లో ఈ ఛార్జీలను తీసుకురాలేదు. స్విగ్గీ సీఈఓ, సహవ్యవస్థాపకుడు శ్రీహర్ష మెజేటీ మాట్లాడుతూ.. డెలివరీ వ్యాపారంలో మందగమనానికి ప్లాట్‌ఫారమ్ ఛార్జీలు విధించేందుకు కారణమయ్యాయని అన్నారు

ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లను విడుదల చేయాలి

ఏపీలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ కేడీలకు సీఐడీ అధికారులకు తేడా లేకుండా పోయిందని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీవివాస్ ల అక్రమ అరెస్ట్ దుర్మార్గం అన్నారు. వైసీపీ కేడీలు టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. సీఐడీ అధికారులు సోదాల పేరుతో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీవివాస్ ల అక్రమ అరెస్ట్ దుర్మార్గం అన్నారు అచ్చెన్నాయుడు. ఆదిరెడ్డి కుటుబం నీతి నిజాయితీ ఏంటో రాజమండ్రి ప్రజల్ని అడగండి చెబుతారు. జగన్ రెడ్డి ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినా భయపడేది లేదు. జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని గోదావరి నదిలో కలిపేంతవరకు విశ్రమించేది లేదు.అరెస్టు చేసిన ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లను వెంటనే విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

తల్లి పులి అడుగుజాడల్లో నడుస్తున్న పులి పిల్లలు

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటాయి. అడవిలోని జంతువులకు సంబంధించిన వీడియాలకు మనకు చాలా మంది అభిమానులు ఉంటారు. అవి చేసే పనులు కొన్ని సార్లు భయం పుట్టిస్తే.. మరి కొన్నిసార్లు నవ్వులు పూయిస్తాయి. ఈ మధ్య జంతువుల వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో పులికి సంబంధించినది. ఈ వీడియోలో పులి దాని పిల్లలతో చూడొచ్చు.. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. పుటేజీలో.. పిల్లలు తల్లి పులితో కలిసి నడుస్తున్నట్లు మనం చూడవచ్చు. పులి ఎక్కడికి వెళితే దాని పిల్లలు తల్లి పులిని అనుకరిస్తు వెళ్తుండటం మనం ఈ వీడియోలో చూడొచ్చు.

న్యూసెన్స్ చేయడంలో నేనే పెద్ద కంత్రీ..

డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోల్లో నవదీప్ ఒకడు. ప్రస్తుతం స్టార్ హీరో అని అనిపించుకోపోయినా మంచి నటుడిగా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోగా నటిస్తున్నాడు. ఇంకోపక్క వెబ్ సిరీస్ లతో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో నవదీప్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తన ఫోటోలకు తెలుగులో మంచి మంచి క్యాప్షన్స్ పెడుతూ అలరిస్తూ ఉంటాడు. వాటికే ఫ్యాన్స్ ఎట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం నవదీప్.. న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. సరే ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇక ఇందులో నవదీప్ సరసన బింధుమాధవి నటిస్తోంది. పక్కా పొలిటికల్ డ్రామాగా ఈ సిరీస్ ను తెరక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సిరీస్ ఆహా ఓటిటీలో మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్స్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ పెంచేశాడు నవదీప్. నిత్యం ఏదో ఫోటోను షేర్ చేస్తూ న్యూసెన్స్ చేయడం మొదలుపెట్టాడు.

“ది కేరళ స్టోరీ” సినిమా ఆర్ఎస్ఎస్ కుట్ర

‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ మతమార్పిడులు, లవ్ జీహాద్, ఉగ్రవాదం కోణంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ సీపీఎం పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి సినిమాను నిర్మించారని దుయ్యబడుతున్నారు. ది కేరళ స్టోరీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రోడక్ట్ అంటూ.. ఆర్ఎస్ఎస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ మత ఉద్రిక్తతలను పెంచేందుకే ఇలాంటి ప్రచారాలను వ్యాప్తి చేస్తోందని మూవీని ఉద్దేశించి అన్నారు. ఫేక్ కథనాలు, సినిమాల ద్వారా విభజన రాజకీయాలను వ్యాప్తి చేసేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందని, ఎలాంటి వాస్తవాలు లేకుండా, సంఘ్ పరివార్ అపోహలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేరళలో 32,000 మంది మహిళలు ఇస్లాం మతంలోకి చేరి, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలో చేరారనేది పెద్ద అబద్ధం అని కొట్టి పారేశారు.

Show comments