NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఇండియాలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన సిద్ధం

భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ ఆధారితంగా నిర్మించిన రైలు వంతెన సిద్ధం అయింది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంజి ఖాడ్ వంతెనగా పిలువబడే ఈ బ్రిడ్జ్ కు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఈ బ్రిడ్జ్ వినియోగానికి సిద్ధం అయిందని, దీంట్లో మొత్తం 96 కేబుల్స్ ఉన్నాయని, కేబుల్స్ లో ఉండే మొత్తం వైర్ల పొడవు 653 కిలోమీటర్లు అని, 11 నెలల్లో ఈ వంతెనను నిర్మించినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ వంతెనను జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా (USBRL) రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. జమ్మూ కాశ్మీర్ ను భారత్ లోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా కనెక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. జమ్మూ నుంచి ఈ వంతెన దాదాపుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంజి ఖాడ్ వంతెన జమ్మూ కాశ్మీర్లోని కట్రా, రియాసిలను కలుపుతుంది; హిమాలయాల్లో భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రదేశంలో వంతెన నిర్మించాలంటే ఇంజనీరింగ్ అద్భుతమే అని చెప్పవచ్చు. రూర్కీ, ఢిల్లీ ఐఐటీల పరిశోధకలు వంతెన నిర్మించే స్థలం వద్ద పలు రకాల పరిశోధనలు చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభం అయింది. మొత్తం వంతెన పొడవు 725.5 మీటర్లు. మొత్తం వంతెనను 4 భాగాలుగా విభజించారు. రియాసి వైపున 120 మీటర్లు పొడవు కలిగిన వయాడక్ట్, కట్రా చివరలో 38 మీటర్ల పొడవున్న వయాడక్ట్, ప్రధాన వంతెన 475.25 మీటర్ల కేబుల్ స్టెడ్, దీనికి అప్రోచ్ గా 94.5 మీటర్ల వయాడక్ట్ ఏర్పాటు చేసి వంతెనను నిర్మించారు. ఇందులో ప్రధాన వంతెన మొత్తం పొడవు 475.25 మీటర్లు. అంజి ఖాడ్ వంతెన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ యొక్క కత్రా-బనిహాల్ సెక్షన్‌లో T2 మరియు T3 సొరంగాలను కలుపుతుంది.

రేపు హైదరాబాద్ లో పార్కుల మూసివేత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ( ఆదివారం ) మధ్యాహ్నం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం పరిసరాల్లో నెలకొనే రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కూడదనే ఉద్దేశంతో ఆదివారం నాడు లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షో లను మూసి వేస్తున్నట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది. అలాగే నగరంలో సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినట్లు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. పలు మార్గాల ద్వారా వెళ్లేలా రూట్ మ్యాప్ లను హైదరాదాద్ పోలీసులు విడుదల చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు.

ఏపీలో మోస్తరు వర్షాలు పడే అవకాశం

ఏపీ, తెలంగాణల్లో వాతావరణం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ / నైరుతి గాలులు వీస్తున్నాయి. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు అందించింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలలో ఇవాళ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశంఉంది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది . ఉరుములతో కూడిన మెరుపులు మరియు వడగండ్లు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు వడగండ్లు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఇవాళ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఎన్టీఆర్ పై చంద్రబాబు చూపిస్తోంది కపట ప్రేమ

తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీరామారావు శతజయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ పై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఎన్టీఆర్ పై చంద్రబాబు చూపిస్తుంది కపట ప్రేమ అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. ఎందరినో ప్రధానమంత్రులను, మరెందరికో భారత రత్న ఇతరత్రా ప్రతిష్టాత్మక పదవులు ఇప్పించానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు ఇప్పించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి రజనీకాంత్ రావడం ఆయన ఆలోచించుకోవాలని అన్నారు. గౌరవం,ఒక ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ దయచేసి చంద్రబాబును నమ్మొద్దని ఆయన అన్నారు. చంద్రబాబుకి కొడుకు మీద నమ్మకం లేక పేమెంట్లు ఇచ్చి అద్దె కొడుకుని తెచ్చుకున్నాడని ఆరోపించారు. మాట్లాడ్డం చేతకాని నారా లోకేష్ పప్పు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ల పేరుతో కొత్త కొత్త డ్రామాలకు తెర తీసిందని ఆరోపించారు.

అకాలవర్షాలతో అరిగోస పడుతున్న రైతులు

తెలంగాణలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి పంటలకు నష్టం వాటిల్లింది. పలు ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిపిపోయింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసి చేతికందిన వరిపంట నేలపాలైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ‌రక్షణ కోసం పడ్డ కష్టమంతా గాలివాన, వడగండ్ల మూలంగా నేలపాలైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పడి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చిన వరి ధాన్యం, మొక్కజొన్న నీటి పాలైంది. రాష్ట్రంలోని వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట పట్టణాల్లోని మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. ప్రస్తుతం వాతావరణం మార్పులతో కర్షకులు బోరున విలపిస్తున్నారు. మళ్లీ వర్షం పడే అవకాశం ఉండడంతో రైతన్న భయపడిపోతున్నాడు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్లే తాము నష్టపోయామంటూ రైతులు వాపోతున్నారు. మామిడి రైతుల తోటల్లోని మామిడి కాయలు నేలరాలడంతో తీవ్రంగా నష్టపోయారు. రైతులు తమ ధాన్యాన్ని చూస్తూ రోదిస్తున్నారు. కొన్ని గ్రామాలల్లో వరికోయకుండానే పంటచేలోని వరిధాన్యం వడగండ్ల వానకు పూర్తిగా నేలపమట్టమైంది. దీంతో చేతికి వచ్చిన పంట పనికి రాని పరిస్థితిలోకి వచ్చిందని రైతులు కంటతడిపెడుతున్నారు. అకాల వర్షాలతో పాటు, వడగండ్ల వాన దెబ్బకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

బాబు జగ్జీవన్ రామ్ అందరికీ స్ఫూర్తి కావాలి

బాబూ జగ్జీవన్ రామ్ అందరికీ స్ఫూర్తికావాలన్నారు లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్. గుంటూరులో ఆమె పర్యటించారు. బాబు జగ్జీవన్ రామ్ కర్మ యోగి పుస్తక ఆవిష్కరణ చేసిన లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అనంతరం మాట్లాడారు. వేంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు మీరాకుమార్ …దేవాలయం లోకి వెళ్ళి పూజలు చేయించడం సంతోషం గా ఉందన్నారు. ప్రజలు అసమానతలు లేని సమాజాన్ని కోరుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎప్పుడు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే తప్పకుండా వస్తానన్నారు మీరా కుమార్. మా తండ్రిని అందరూ బాబూజీ అని పిలుస్తున్నారు … అందుకే మీరంతా నాకు సోదరులు …నేను మీకు సోదరి అవుతాను… బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తి ని అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు మీరా కుమార్.

భర్త పేరు నిలబెట్టింది…ఆర్మీ ఆఫీసర్‌గా “గాల్వాన్ హీరో” భార్య..

లడఖ్ గాల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. ప్రతిగా భారత్ బలగాలు జరిపిన దాడిలో దీనికి రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులు హతమయ్యారు. అయితే తమ వారు మాత్రం నలుగురే చనిపోయారంటూ చైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసింది. గాల్వాన్ ఘర్షణల్లో భారత సైనికుల వీరత్వాన్ని చూసిన చైనా బలగాలు మరోసారి భారత్ పై దాడి చేసేందుకు వణికిపోతున్నాయి. ఇదిలా ఉంటే గాల్వాన్ ఘర్షణల్లో మరణించిన నాయక్ దీపక్ సింగ్ భార్య రేఖాసింగ్ భర్త పేరును నిలబెట్టింది. భారత సైన్యంలో లెఫ్టినెంట్ గా నియమితులైందని శనివారం అధికారులు వెల్లడించారు. తూర్పు లడఖ్ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి ఫ్రంట్ లైన్ బేస్ లో విధులు నిర్వహించనుంది. లెఫ్టినెంట్ రేఖా సింగ్ చెన్నైలో ఏడాది పాటు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో శిక్షణ తీసుకున్నారు. గాల్వాన్ ఘర్షణల్లో అమరుడైన నాయక్ దీపక్ సింగ్ బీహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్ కు చెందినవాడు. మరణానంతరం 2021లో ఆయన త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం అత్యున్నత వీరచక్ర అవార్డుతో గౌరవించింది. దివంగత నాయక్ దీపక్ సింగ్( నర్సింగ్ అసిస్టెంట్) భార్య లెఫ్టినెంట్ రేఖా సింగ్, చెన్నైలో శిక్షణ పూర్తి చేసుకుని ఇండియన్ ఆర్మీలో చేరారని ఆర్మీ ట్వీట్ చేసింది. గల్వాన్ ఘర్షణల సమయంలో దీపక్ సింగ్ అత్యున్నత త్యాగం చేశారని పేర్కొంది

సూర్య భార్య ఇంత ఘోరంగా అవి చేయడానికి కారణం ఏంటో..?

రా.. రా.. సరసకు రారా అంటూ చారడేసి కళ్ళతో భయపెట్టినా.. ఓ.. వాలుకళ్ల వయ్యారి.. తేనెకళ్ల సింగారి అంటూ వయ్యారాలు పోయినా.. జ్యోతికక చెల్లుతుంది. కోలీవుడ్ లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జ్యో.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఇక పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన జ్యోతిక పిల్లలు పెద్దవారు అయ్యాకా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ మంచి విజయాలనే అందుకుంది. ఇంకోపక్క భర్త సూర్యతో కలిసి నిర్మాతగా మారి.. మంచి సినిమాలను నిర్మిస్తోంది. ఇక ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది జ్యోతిక. మంచి పాత్రలు రావడానికి.. ఆమె తనవంతు కష్టం పడుతుంది. బాడీ ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటూ చెమటోడుస్తుంది. ఇప్పటికే జ్యోతిక జిమ్ లో భారీ భారీ వర్క్ అవుట్స్ చేస్తున్న వీడియోలు బయటికి వచ్చి అభిమానులు షాక్ అయ్యేలా చేశాయి. ఇక తాజాగా జ్యోతిక కఠోర వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అది చూస్తే అబ్బాయిలకు సైతం కొన్ని నిముషాలు ఒళ్ళు జలదిరించడం ఖాయమని తెలుస్తోంది. గోడపై రెండు కాళ్ళు పెట్టి.. చేతులను కింద బాల మీద ఆనించి, శరీరాన్ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతూ బాల్ తో కసరత్తులు చేస్తోంది. ఒక్క గోడ మీదనే కాకుండా.. బాక్సింగ్ బ్యాగ్, మెట్ల మీద, ఇంటి వద్ద గోడ మీద.. కాళ్ళు పెట్టి శరీరాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటుంది. నిజానికి ఇదంత ఈజీయేమి కాదు. కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది.

ఏప్రిల్ మాసం ‘విరూపాక్ష’దే!

మార్చి నెలలో ఏకంగా 34 సినిమాలు విడుదలైతే, ఈ నెలలో ఎగ్జామ్స్ ఫీవర్ కారణంగా ఆ ఊపు తగ్గింది. అనువాద చిత్రాలతో కలిపి 19 సినిమాలే ఏప్రిల్ లో రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ ఫస్ట్ వీకెండ్ 7వ తేదీ వచ్చిన మాస్ మహరాజా రవితేజ ‘రావణాసుర’, కిరణ్ అబ్బవరం ‘మీటర్’ చిత్రాలు ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ‘ధమాకా, ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ‘రావణాసుర’తో రవితేజ హాట్రిక్ అందుకుంటాడని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న నటుడు సుశాంత్ కూ చేదు అనుభవమే దక్కింది. ఫిబ్రవరిలో వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో కిరణ్ అబ్బవరం ఫర్వాలేదని పించుకున్నాడు. కానీ ఆ ఆనందాన్ని ‘మీటర్’ పరాజయం మింగేసింది. ఈ సినిమా మరీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. అదే రోజున వచ్చిన ఆంగ్ల అనువాద చిత్రం ‘ది పోప్స్: ఎక్సార్సిస్ట్’ కూడా ఏ విధంగానూ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ నెల సెకండ్ వీకెండ్ లో రెండు డబ్బింగ్ సినిమాలతో కలిపి ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో ‘ఓ కల’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక భారీ అంచనాలతో 14వ తేదీ విడుదలైన పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ బాక్సాఫీస్ బరిలో డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను త్రీడీలో కూడా రూపొందించడంతో అభిమానులు టెక్నికల్ గా ఈ సినిమా కొత్త అనుభూతులను అందిస్తుందని ఆశపడ్డారు. కానీ టూ డీతో పోల్చితే త్రీ డీ వర్షన్ పరమ దారుణంగా ఉందనే విమర్శలు వచ్చాయి. అలానే లారెన్స్ అనువాద చిత్రం ‘రుద్రుడు’ సైతం పాత వాసనలు కొట్టి, ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అదే రోజున వచ్చిన హెబ్బా పటేల్ ‘బ్లాక్ అండ్ వైట్’ చిత్రం, 15వ తేదీ వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా ‘విడుదల -1’ ఎలాంటి ప్రభావం చూపించలేక పోయాయి.