NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ప్రజల్లో కాంగ్రెస్ ఉండకూదని బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు

జల్లో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ ఎజెండాలో భాగంగానే.. అయిపోయిన మునుగోడు ఎన్నికలపై ఈటల మాట్లాడారని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీలో ఈటల కూడా అతిపెద్ద వాటాదారుడేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆస్తుల ధ్వంసంలో, దోపిడీలో ఈటల కూడా భాద్యుడే, భాగస్వాముడేనని ధ్వజమెత్తారు. ఈటల లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై, అధ్యక్షుడిపై బురదజల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమది వ్యాపారస్తుల పార్టీ కాదని.. నిన్నటిదాకా ఈటల ఉన్న భూస్వాముల పార్టీ తమది కాదని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, ప్రజల ఇచ్చే విరాళాలతోనే తాము ఎన్నికలు జరుపుకుంటూ వచ్చామని పేర్కొన్నారు. తామెప్పుడూ తప్పుడు పనులు చేయలేదన్న ఆయన.. నీతి, నిజాయితీగా ఉంటూ వస్తున్నామన్నారు. మీకున్న అలవాట్లే.. కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయనే భావనతో మాట్లాడటం సరైంది కాదని రివర్స్ ఎటాక్ చేశారు.

బెజవాడలో తొలిసారి మహిళకు నగర బహిష్కరణ శిక్ష

విజయవాడ పోలీసులు నేరస్థుల పాలిట సింహ స్వప్నంలా మారుతున్నారు. తొలిసారి ఓ మహిళను నగర బహిష్కరణ శిక్ష వేశారు బెజవాడ పోలీసులు.బెజవాడలో తొలిసారిగా ఓ లేడీ కిలాడీకి నగర బహిష్కరణ శిక్ష విధించడం హాట్ టాపిక్ అవుతోంది. ఫోటోలో ఉన్న మహిళ పేరు సారమ్మ అలియాస్‌ శారద. పేరు సాఫ్ట్‌గానే ఉన్నా ఈవిడ మాత్రం ఖతర్నాక్. పోలీసుల కళ్లుగప్పి దందాలు చేయడంలో దిట్ట. ఇప్పటికే సారమ్మపై అజిత్‌సింగ్‌ నగర్‌ పీఎస్‌లో 13 కేసులున్నాయి. గంజాయి అమ్మడం మొదలు చాలా వివాదాల్లో ఈమె ప్రమేయం ఉంది. ఈమెపై పోలీసులు నిఘా పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా ఆమెలో మార్పు రాలేదు. ఎన్నిసార్లు హెచ్చరించినా, కేసులు పెట్టినా తీరు మారకపోవడంతో పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. కఠిన శిక్షకు సిద్ధం అయ్యారు. సారమ్మ అలియాస్‌ శారదకు చివరికి నగర బహిష్కరణే మార్గమని భావించిన పోలీసులు అదే నిర్ణయాన్ని అమలు చేశారు. ఈమెతోపాటు 19 మందిని సిటీ నుంచి బహిష్కరించారు. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న గంజాయి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

లోకేష్ పాదయాత్రతో ఉపయోగం లేదు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. లోకేష్ పాదయాత్ర దేనికి ఉపయోగంలేదు, లోకేష్ తో సెల్ఫీలు ఎవరైనా దిగుతున్నారా అంటూ విమర్శించారు రాజమండ్రి ఎం‌.పి మార్గాని భరత్ . రాజమండ్రిలో ఎం‌.పి మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఆదిములపు సురేష్ ఇంటిపై చంద్రబాబు రాళ్లదాడి చేయించడం దారుణమని ఖండించారు. టైమ్స్ నౌ సర్వే ప్రకారం వైసిపికి 25కి 25 ఎంపీ సీట్లు వస్తాయని తేలిందని, అదే స్ఫూర్తితో 175కు 175 సాధించేందుకు ముందుకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రాజమండ్రి సిటీ ఇంఛార్జి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు. అర్బన్ నుండి ఎవరిని నిలబెట్టిన గెలిపించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని భరత్ రామ్ అన్నారు. జగన్ సీఎం అయిన నుంచి నా ఎస్సీ నా బిసి నా మైనార్టీ అని పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. నాలుగేళ్ళకు పైగా అనేక సంక్షేమ పథకాలతో జగన్ అందరి అభిమానం చూరగొంటున్నారని అన్నారు. విపక్షాలు పనిగట్టుకుని విమర్శలు చేయడం మానుకోవాలన్నారు భరత్.

జగన్ స్వార్థం కోసం దళితులు బలిపశువులు

సీఎం జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం దళితులను బలిపశువుల్ని చేస్తున్నారని విమర్శించారు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మంత్రి ఆదిమూలపు సురేష్ అర్దనగ్న సురేష్ గా మారిపోయారు.జగన్ రెడ్డి తన స్వార్దం కోసం దళితుల్ని బలి పశువుల్ని చేస్తున్నారు.కోడికత్తి డ్రామాకు శీను అనే దళిత యుకుడిని వాడుకుని జగన్ రెడ్డి సీఎం పీఠం ఎక్కారు.ఇప్పడు అదే శీను జైల్లో మగ్గుతున్నా కనీసం పట్టించుకోవటం లేదు ?యర్రగొండపాలెం కంటే ముందు మార్కాపురంలో చంద్రబాబు పర్యటన జరిగింది.
అక్కడ ఎమ్మెల్యే చేత జగన్ రెడ్డి చొక్కా ఎందుకు విప్పించలేదు? అతను తన సామాజికవర్గం వాడనా..?ఉన్నత విద్యావంతుడు, దళిత మంత్రిని చొక్కా విప్పి నడిరోడ్డుపై నిలిబెట్టిన ఘనత జగన్ రెడ్డిదే.లోకేష్ అనని మాటలు అన్నట్టు చిత్రకరించి నిరసన పేరుతో దాడులు చేస్తారా? దళితులపై దాడులు జరిగినపుడు సురేష్ ఎందుకు చొక్కా విప్పి నిరసన తెలపలేదు?దళిత యువకుడు సుబ్రమణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే సురేష్ రక్తం ఎందుకు మరగలేదు?పోలీసులు జగన్ రెడ్డికి ఊడిగం చేయడం సిగ్గుచేటు.

హెలికాప్టర్ తో సెల్ఫీ.. రెక్క తగిలి అధికారి దుర్మరణం

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్‌లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేదార్‌నాథ్‌ ధామ్‌లోని హెలిప్యాడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రభుత్వ అధికారి జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ వెలుపల సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ హెలికాప్టర్ టెయిల్ రోటర్‌ బ్లేడ్‌ పరిధిలోకి వచ్చాడు. ప్రమాదవశాత్తు హెలికాప్టర్ టెయిల్ రోటర్‌ తగిలి అక్కడికక్కడే మరణించాడు. జితేంద్ర కుమార్ సైనీ అనే అధికారి ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఫైనాన్షియల్ కంట్రోలర్‌గా ఉన్నారు.యాత్రికుల కోసం ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి మరియు యమునోత్రి పోర్టల్‌లను ప్రారంభించి అక్షయ తృతీయ సందర్భంగా చార్ ధామ్ యాత్ర ప్రారంభించిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. తీర్థయాత్ర కోసం ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు నమోదు చేసుకున్నారు. వారి సంఖ్య పెరుగుతోంది. కాగా, కేదార్‌నాథ్‌ను ఏప్రిల్ 25న, బద్రీనాథ్‌ను ఏప్రిల్ 27న తెరవనున్నారు.

ఆస్పత్రిలో చేరిన హెచ్ డీ కుమారస్వామి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి జ్వరం కారణంగా ఆస్పత్రిలో చేరారు. అలసట, సాధారణ బలహీనత లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. జేడీఎస్ నాయకుడు కుమారస్వామి వైద్యపరంగా స్థిరంగా ఉన్నారని.. ఆయన కోలుకుంటున్నారని చికిత్స అందిస్తున్న ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. అలసిపోకుండా పర్యటిస్తున్న 63 ఏళ్ల నేత కుమారస్వామి జ్వరంతో బాధపడుతున్నారని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. “Mr H D కుమారస్వామి ఏప్రిల్ 22న సాయంత్రం ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్ బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చేరారు. ఆయన అలసట సాధారణ బలహీనత లక్షణాలతో అడ్మిట్ అయ్యారు” అని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని సంబంధిత వైద్య పరీక్షలు, చికిత్స నిర్వహించబడుతోంది. ఆయన వైద్యపరంగా స్థిరంగా ఉన్నారని, కోలుకుంటున్నారని పేర్కొంది. కుమారస్వామి కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా జేడీఎస్ అభ్యర్థుల కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. జేడీఎస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందవద్దని, విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కుమారస్వామి అభ్యర్థించినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కుమారస్వామి గతంలో గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారు.
మంత్రి సురేష్ ని బర్తరఫ్ చేయాలి

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపై అటు టీడీపీ, జనసేన, బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా విరుచుకుపడుతున్నారు. మంత్రి యర్రగొండపాలెంలో వ్యవహరించిన తీరుని మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి తప్పుబట్టారు.
రోడ్డు మార్గాన కాకుండా వీర జవాన్లను వాయు మార్గాన తరలించేందుకు విమానాలు సమకూర్చి ఉంటే 2019లో పుల్వామా దుర్ఘటనలో 40 మంది జవాన్లు చనిపోయి ఉండేవారు కాదని చెప్పినందుకు నాటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ పై మోడీ ప్రభుత్వం కక్ష సాధించడం శోచనీయం అన్నారు డాక్టర్ ఎన్. తులసి రెడ్డి. ఎన్నికల్లో లబ్ధి కోసం జవాన్ల ప్రాణాలను బలి పెట్టడం దుర్మార్గం. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ నేతలు దాడులు చేయడం గర్హనీయం. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ రోడ్డుమీద చొక్కా విప్పి వీధి రౌడీలా ప్రవర్తించడం సిగ్గుచేటు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే శాంతి భద్రతల సమస్యలను సృష్టించడం దురదృష్టకరం అన్నారు తులసిరెడ్డి. మంత్రి వర్గం నుండి మంత్రి ఆది మూలపు సురేష్ ను ముఖ్యమంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

పెళ్లి తరువాత కియారా న్యూడ్ ఫోటో.. బయటపడింది ఇలా

బాలీవుడ్ నటి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఈ మధ్యనే ప్రేమించిన సిద్దార్థ్ మల్హోత్రాను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తెలుగువారికి కూడా కియారా సుపరిచితమే. భరత్ అనే నేను సినిమాతో పరిచయమై మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ వసుమతి.. రెండో సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయవిధేయ రామలో మెరిసింది. ఇక ఈ సినిమా ఆశించిన ఫలితం అనిందించనప్పటికీ.. మరోసారి ఈ హీరోయిన్ నే ఏరికోరి ఎంచుకొని గేమ్ ఛేంజర్ లో అవకాశమిచ్చారు చరణ్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాలు, వ్యక్తిగత జీవితాలు పక్కన పెడితే.. కియారా సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కించే ఫోజులతో అదరగొడుతుంది. అయితే కియారా ఒక న్యూడ్ ఫోటో షూట్ చేసిన విషయం తెల్సిందే. ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ డాబు రత్నానీ తీసిన ఆ ఫోటో నెట్టింట ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చలాకీ చంటికి గుండెపోటు… పరిస్థితి విషమం

జబర్దస్త్ లో యాటిట్యూడ్ కా బాప్ అనిపించుకున్న నటుడు చలాకీ చంటి. తనకు నచ్చని విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తాడు. ఎదురు ఉన్నది ఎవరు..? ఎంతవారు అనేది అస్సులు పట్టించుకోడు. అయినా అతడంటే అందరికి ఇష్టమే. జబర్దస్త్ లో ఎన్నోసార్లు బయటికి వెళ్లి వచ్చిన నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చలాకీ చంటి మాత్రమే. ఇక గతేడాది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన చంటికి అవకాశాలు తండోపతండాలుగా వస్తాయి అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ తరువాత చంటి అసలు కనిపించిందే లేదు. అడపాదడపా షోస్ లలో మెరిసిన చంటి.. బుల్లితెరపై కూడా కనిపించడం మానేశాడు. దీనికి కారణం చంటి ఆరోగ్య పరిస్థితి అని టాక్ నడుస్తోంది. గత కొన్నిరోజులుగా చంటి ఆరోగ్యం అస్సలు బాగోలేదని, గుండె సంబంధిత సమస్యతో పోరాడుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేటి ఉదయం చంటికి గుండెపోటు వచ్చిందట. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చంటి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం అందుతుంది. కాగా, ప్రస్తుతం చంటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే చంటి అనారోగ్యం గురించి తెలుసుకున్న జబర్దస్త్ నటులు.. హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించినట్లు సమాచారం. 2016 లో చంటికి వివాహమైంది. వారికి ఒక పాప కూడా ఉంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.