NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

హోం మంత్రి నివాసంలో రంజాన్ వేడుకలు.. పాల్గొన్న సీఎం కేసీఆర్

రాష్ట్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆహ్వానం మేరకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు.హోంమంత్రి నివాసంలో సీఎం కేసీఆర్ రంజాన్‌ వేడుకల్లో పాల్గొని మంత్రి కుటుంబసభ్యులకు సీఎం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఆయనతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎంపీ కేశవరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రంజాన్‌ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు రంజాన్ వేడుక‌ల్లో పాల్గొని ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సనత్ నగర్‌లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్​, బన్సీలాల్‌పేట బోయగూడలోని క్యూబా మసీదు వద్ద ప్రార్థనలలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని.. మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా ఆశీస్సులతో ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

వీధికుక్కల దాడి.. రెండేళ్ల చిన్నారికి గాయాలు

వీధికుక్కలు రెచ్చిపోతున్నాయి. కనిపించిన వారిని కనిపించినట్టు పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరిపై దాడులు చేస్తున్నాయి. దీంతో జనం రోడ్డుమీద నడవాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం తిప్పరాజుపాలెం గ్రామంలో హేమంత్ అనే రెండేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఇంటి దగ్గర ఆడుకుంటుండగా దాడి చేశాయి వీధి కుక్కలు. దీంతో ముఖం పై తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే హేమంత్ ని కాకినాడ జీ జీ హెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.హేమంత్ కి ముఖం పై కుట్లు వేసి, మైనర్ సర్జరీ చేశారు వైద్యులు. పూర్తిగా రికవరీ అయ్యే వరకు అబ్జర్వేషన్ లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా వెళ్తుంటే తరచు కుక్కలు దాడులు చేస్తున్నాయని చెబుతున్నారు గ్రామస్తులు. నిత్యం కుక్కల దాడులతో జనం హడలి పోతున్నారు. హైదరాబాద్ లో చిన్నారిని కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపింది. కుక్కల్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

దేశంలో ఇలాంటి దుస్థితి ఎక్కడా లేదు

యర్రగొండపాలెం ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ చూడని దౌర్భాగ్యకరమైన పరిస్థితులను ఈ అరాచక వైసీపీ ప్రభుత్వంలో చూడాల్సి వస్తోంది.ప్రతిపక్ష నాయకుడి కాన్వాయ్ పై రాళ్లు విసరడం, భద్రతా సిబ్బంది తలలు పగలగొట్టడం ఎప్పుడైనా చూశామా..?ప్రభుత్వంలో భాగస్వామి అయిన కేబినెట్ మంత్రి చొక్కా విప్పేసి రోడ్లపైకి వచ్చి ఏం సందేశమిస్తున్నారు..?మంత్రి చొక్కా ఇప్పడం అంటే జగన్ ప్రభుత్వం కూడా బట్టలిప్పేసినట్టే.గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, షర్మిల పాదయాత్రలు చేశారు.ఏనాడైనా ఇలాంటి దురదృష్టకర ఘటనలు చూశామా..?కుప్పంలో దాడి చేస్తారు.. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసానికి పాల్పడతారు.ఏకంగా జెడ్ ఫ్లస్ భద్రతలో ఉన్న మాజీ సీఎం ఇంటిపైకే దాడికి యత్నిస్తారు.అసలు ఈ రాష్ట్రం ఏమైపోతోంది.. బీహార్, ఉత్తర ప్రదేశ్ ల కంటే ఏపీలో పరిస్థితులు దిగజారిపోతుండటం బాధాకరం అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇప్పటికే చేసిన హత్యలు, దౌర్జన్యాలు, అరాచకాలు మీ సైకో మనస్తత్వ ఆకలి తీర్చలేదా..?రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వమే ప్రజల బట్టలిప్పేలా కనిపిస్తోంది. యర్రగొండపాలెం ఘటనపై సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

వందేభారత్ రైలుపై రాళ్ళు రువ్విన వ్యక్తి.. కారణం ఏంటో తెలుసా?

అతి తక్కువ కాలంలోనే దేశంలో పాపులర్ అయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఎక్కువైంది. రాళ్లదాడికి పాల్పడిన ఓ వ్యక్తిని రైల్వే భద్రతాదళం అరెస్టు చేసింది. భారతీయ రైల్వేల విస్తరణతో సెమీ హైస్పీడ్‌గా పరిగణించబడే వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం 14 రూట్లలో నడుస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్ర నుంచి ముంబై-పూణె-సోలాపూర్ మార్గంలో నడుస్తోంది. అలాగే ముంబై గాంధీనగర్, ముంబై షిర్డీ రైళ్లు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా బెంగళూరు రైల్వే సెక్షన్‌లోని మలూరు-టికల్‌ మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై ఎప్పుడూ రాళ్ల దాడి జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తిని రైల్వే భద్రతా దళం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. రాళ్లు రువ్వడానికి అతడు చెప్పిన కారణాన్ని విని భద్రతా బలగాలు ఖంగుతిన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వినందుకు 36 ఏళ్ల వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అరెస్టు చేసింది. అతని పేరు అభిజిత్ అగర్వాల్. పోలీసులు అతడిని విచారించారు. ఈ విచారణలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వాలని దేవుడి నుంచి తనకు ఆజ్ఞ వచ్చినంది చెప్పాడు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్వడం వల్ల నాకు ఆహారం అందుతోందని పేర్కొన్నాడు. నిందితుడిపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153, 147 కింద కేసు నమోదు చేశారు. విచారణలో అతడు మానసిక రోగి అని తేలింది. అభిజిత్ అగర్వాల్ రైల్వే ట్రాక్ లేదా స్టేషన్‌లో నివసిస్తున్నారు. అతను అక్కడే తిని పడుకుంటాడు. కార్లపై రాళ్లు వేయమని దేవుడు ఆదేశించాడని అందుకే తాను రాళ్లు విసురుతున్నానని చెప్పాడు.

ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో సత్యపాల్ మాలిక్.. అరెస్ట్ చేయలేదన్న మాజీ గవర్నర్

అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నుంచి సమన్లు అందిన మరుసటి రోజు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శనివారం ఢిల్లీలోని ఆర్కే పురంలోని పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. బస్సులో ఉన్న నాయకులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సత్యపాల్ ను అరెస్ట్ చేశారంటూ ప్రచారం మొదలైంది.అయితే, సత్యపాల్ ని అరెస్టు చేశారన్న వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. మాజీ గవర్నర్ సత్యపాల్ తన ఇష్టపూర్వకంగానే పోలీసు స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. తాము మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆయన తన ఇష్టానుసారం తన మద్దతుదారులతో కలిసి ఆర్కే పురం పోలీస్ స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. మాలిక్ తన ఇంటికి సమీపంలోని పార్క్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి పోలీసులు అభ్యంతరం చెప్పడంతో పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. నివాస ప్రాంతంలో అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, హర్యానా నుండి సమావేశానికి వచ్చిన మాలిక్, రైతు సంఘాలు, గ్రామ సంఘాల నాయకులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.

సురేష్ జగన్ కు మాత్రమే విశ్వాసపాత్రుడు

మంత్రి ఆదిమూలపు సురేష్ వైఖరిపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. మంత్రి సురేష్ తండ్రి దళితుల ఆత్మగౌరవం కోసం గుర్రాలపై తిరిగితే, నేడు కొడుకు దళితుల ఆత్మగౌరవాన్ని జగన్ కు తాకట్టుపెట్టడానికి బట్టలిప్పి తిరిగాడు. సురేష్ తనచర్యతో దళిత జాతిని జగన్ కాళ్లవద్ద తాకట్టు పెట్టాడనే చెప్పాలి. తన తప్పు ఒప్పుకొని సురేష్ తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంత్రి సురేష్ ఏ1గా ఉంటే, అతని భార్య ఏ2గా ఉంది. ఆ కేసుని చూపి భయపెట్టే, జగన్ నిన్న సురేష్ తో అర్థనగ్న ప్రదర్శనలు చేయించాడు.బట్టలు లేకుండా నడి వీధుల్లో తిరిగిన సురేష్, తన చర్యతో దళితుల ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేశాడు.సురేష్ చొక్కాలు విప్పడానికి కారణం జగన్ భయమా.. లేక తన ఆస్తులపైకి సీబీఐ వస్తుందన్న భయమా?సురేష్ జగన్ కు విశ్వాసపాత్రుడు తప్ప, మాదిగలకు కాదు.జగన్ ప్రభుత్వంలో విచ్చల విడిగా సాగుతున్న ఇసుక మాఫియాపై ప్రశ్నించిన వరప్రసాద్ కు శిరోముండనం జరిగినప్పుడు సురేష్ చొక్కా విప్పితే దళితజాతి హర్షించేది.డాక్టర్ సుధాకర్ మొదలు డాక్టర్ అచ్చెన్న వరకు ఎందరో దళితుల్ని జగన్ బలి తీసుకున్నప్పుడు సురేష్ నోరు ఎత్తిఉంటే దళితులు గర్వంగా ఫీలయ్యేవారు.దళిత మహిళల మానాలు, ప్రాణాలు జగన్ ప్రభుత్వంలో బలైపోతున్నప్పుడు, మంత్రి హోదాలో సురేష్ ముఖ్యమంత్రిని ప్రశ్నించి ఉంటే, దళిత జాతి రొమ్ము విరిచేది అన్నారు మాజీ మంత్రి కేఎస్ జవహర్.

సముద్ర వీరుడు Vs భైరవుడు… RFCలో వార్, ఈ డైలాగ్ పడితే కేక మచ్చా

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివతో జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయ్యింది. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ‘ఎన్టీఆర్ 30’ సినిమాలో ‘భైరవుడు’ అనే పాత్రలో నటిస్తున్న సైఫ్ అలా వచ్చాడో లేదో కొరటాల శివ, హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఒక కొండ పైన జాతర సెటప్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్-సైఫ్ అలీ ఖాన్ మధ్య యాక్షన్ సీన్స్ ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. సైఫ్ అండ్ ఎన్టీఆర్ మంచి పెర్ఫర్మార్స్ కావడంతో ఈ ఇద్దరి మధ్య పోటాపోటీగా సీన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సైఫ్, ఎన్టీఆర్ తో పాటు శ్రీకాంత్ కూడా ఈ యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొన్నాడట.శంషాబాద్ లో కొరటాల శివ యాక్షన్ బ్లాక్ ని షూట్ చేశాడు, ఇప్పుడు RFCలో కూడా యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే సముద్ర వీరుడు vs భారవుడు మధ్య బిగ్గెస్ట్ వార్ జరిగేలా ఉంది.

5 పరుగులకే తొలివికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ జట్టు

ఐపీఎల్‌ 2023లో భాగంగా నేడు ఎకానా స్పోర్ట్జ్ సిటీ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న గుజరాత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. కృనాల్‌ పాండ్యా వేసిన రెండో ఓవర్‌లోనే శుభ్‌మన్‌ గిల్‌ (0) ఔటయ్యాడు.3 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 13/1. సాహా (9), హార్ధిక్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌ జట్టు బ్యాటింగ్‌లో తడబడుతున్నది. తొలి ఐదు ఓవర్లు ముగిసేసరికి కేవలం మూడు బౌండరీలు మాత్రమే రాబట్టింది. ఆ మూడు బౌండరీలను వృద్ధిమాన్‌ సాహా కొట్టాడు. ప్రస్తుతం సాహా 25, హార్దిక్‌ పాండ్యా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, లక్నో సూపర్‌ జెయింట్స్ జట్టు ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించింది. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు నమోదు చేసుకుంది. పాయింట్ల పట్టికలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్‌ టైటాన్స్‌ నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.