బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం నాడు 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరయ్యారు. అయితే..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఆయన మనవడు, లోక్‌సభ మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకాష్ అంబేద్కర్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి లాంఛనంగా సమావేశం నిర్వహించి, అనంతరం ప్రకాష్ అంబేద్కర్‌కు మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎంపీలు జే సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ మహారాష్ట్ర నేత, ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ అన్నా ధోంగే, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేతల ఆగ్రహం
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని పై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు గుడివాడ పర్యటన విజయవంతం కావడంతో కొడాలినాని కళ్లు బైర్లు కమ్మాయన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. కొడాలి నానికి తన రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్ధమై.. పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడు.గుడివాడకు ఎన్నో మంచి పనులు చేసిన చంద్రబాబు చేసిన ఒక్కే ఒక్క చెడ్డ పని కొడాలినాని కి టిక్కెట్ ఇవ్వటమే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే రకం కొడాలి నాని. బందరు పోర్టు నవయుగకు ఇచ్చింది వైఎస్ హయాంలో అని కూడా తెలీకుండా కొడాలి నాని మాట్లాడుతున్నాడు.మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళల్ని తూలనాడే కొడాలి నాని లాంటి వారికి భూమి మీద ఉండే అర్హత లేదు. చంద్రబాబు కాళ్లపై పడి బీఫామ్ తీసుకున్న విషయం కొడాలినాని మరిచాడా..? గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు కొడాలి నానిపై నిప్పులు చెరిగారు. అసత్యాలతో గుడివాడ ప్రజల్ని 20ఏళ్లుగా కొడాలి నాని మోసగిస్తూ వస్తున్నాడు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుడివాడలో నిర్మించిన 800కు పైగా టిడ్కోఇళ్లు పేదలకు ఇంతవరకు ఎందుకివ్వలేదు..? గుడివాడ రోడ్ షో కమ్మ వారి షో అంటూ కొడాలి నీచ రాజకీయం చేస్తున్నారు. రోడ్డు షోలో అని వర్గాల నాయకులు పాల్గొన్న విషయం దుర్మార్గుడైన కొడాలి నానికి కనపడదా..? కొడాలి నానికి బి-ఫామ్ ఇచ్చింది చంద్రబాబు కాదా..? సీట్ కోసం చంద్రబాబు కాళ్ళ మీద పడిన సంగతి గుర్తు లేదా..?కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే రకం కొడాలినాని. నిమ్మకూరులో NTR బసవతారకం దంపతుల విగ్రహాలు పెట్టింది జూనియర్ ఎన్టీఆర్. బందరు పోర్టు నవయుగకు ఇచ్చింది వైఎస్ హయాంలో అని కూడా తెలీకుండా కొడాలి నాని మాట్లాడుతున్నాడన్నారు.
విశాఖలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఉద్రిక్తత
ఏపీలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వాతావరణం మారిపోయింది. ఈ రెండు పార్టీలకు విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం మరింత వేడిని రాజేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా బీజేపీ,బీఆరెస్ మధ్య చిచ్చు రాజుకుంది. భారతీయ రాష్ట్ర సమితి జెండాలను పీకి పారేసి బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రయివేటీకరణను నిలిపివేయించేందుకు కేంద్ర స్థాయిలో ఏడాదిగా ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు బీఆరెస్ హడావుడి చేస్తోందనేది ఆగ్రహం. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోటచంద్ర శేఖర్ విశాఖకు వచ్చిన సమయంలో బీఆర్ ఎస్ నగరంలోని ప్రధాన కూడళ్లలో జెండాలు, ఫ్లేక్సీలు కట్టింది. స్టీల్ ప్లాంట్ పరిసరాలను గులాబీ జెండాలతో నింపేసింది. సాధారణంగా రాజకీయ పార్టీల జెండాలను కార్యక్రమం ముగిసిన తర్వాత నిర్వాహకులు కానీ జీవీఎంసీ కానీ తొలగిస్తుంటాయి. అయితే, బీఆరెస్ జెండాలు విషయంలో ఆ విధంగా జరగలేదు. ఇవాళ ఎంపీ జీవీఎల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో సమావేశం అయ్యారు. పార్టీ నాయకులతో కలిసి ఆ వివరాలను మీడియాకు చెప్పారు. ప్రెస్మీట్ ముగించుకుని జీవీఎల్ వెళ్లిన తర్వాత బిజెపి నాయకులు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో కట్టిన జెండాలను పీకేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు మళ్లీ జెండాలను యధాస్థానంలో ఉంచారు. బాధ్యులైన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కానుగమాకులపల్లెలో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి
ఒక ప్రమాదం ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కానుగమాకులపల్లెలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లి జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ ఇంట్లో గృహప్రవేశానికి వేసిన షామియానా గాలికి ఎగిరి 11కేవి విద్యుత్ లైన్ పై పడడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బీ కొత్తకోట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మదనపల్లి జిల్లా ఆసుపత్రికి నలుగురిని తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందడంతో కానుగమాకులపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. శుభకార్యం జరగాల్సిన చోట విషాదం నెలకొంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరివేసుకుని మృతి చెందాడు సంతోష్ నాయక్. తల్లి దండ్రులు,బంధువులు ఆందోళనకు దిగారు. సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాల ఎదురుగల శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై ధర్నా చేస్తున్నారు సంతోష్ నాయక్ తల్లిదండ్రులు,బంధువులు. దీంతో భారీగా నిలిచి పోయాయి వాహనాలు. శ్రీశైలానికి చెందిన ఓ మహిళతో మృతుడు సంతోష్ ప్రేమ వ్యవహారంతోనే హత్య చేసి ఉరి వేశారని ఆరోపణ.. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని రహదారి దిగ్బంధం చేశారు. నిన్నటి నుంచి శవ పరీక్ష నిర్వహించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పృథ్వీ షాకు షాక్.. ఆ కేసులో హైకోర్టు నోటీసులు
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లేయెన్సర్ సప్నా గిల్ మధ్య కొంతకాలం క్రితం ‘సెల్ఫీ’ విషయమై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే! ఈ వ్యవహారం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా కూడా నిలిచింది. ఇప్పుడు ఇదే గొడవ పృథ్వీ షాను మరింత ఇరకాటంలో నెట్టేసింది. జూన్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా బాంబే హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. అతనితో పాటు పోలీసుల్ని సైతం విచారణకు రావాలని ఆదేశించింది. కాగా.. ఫిబ్రవరిలో ముంబైలోని ఒక స్టార్ హీటల్‌లో పృథ్వీ షా, సప్నా గిల్‌కు గొడవ జరిగింది. ఈ గొడవలో భాగంగా పృథ్వీ స్నేహితుడి కారుపై సప్నా గిల్ దాడి చేయడం, ఆమెను ఆపేందుకు పృథ్వీ ప్రయత్నించడం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే పోలీసులు సప్నా గిల్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. సప్నా గిల్ వాదన మాత్రం మరోలా ఉంది. తనతో ఉన్న వ్యక్తి సెల్ఫీ ఇవ్వమని అడిగినందుకు.. పృథ్వీ షా దురుసుగా మాట్లాడటంతో పాటు తనను అసభ్యంగా తాకాడని ఆరోపించింది. అతనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే.. పోలీసులు ఆమె ఫిర్యాదుని స్వీకరించకపోవడంతో.. ఏప్రిల్ మొదటి వారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పృథ్వీ షాతో పాటు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిసున్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏం జరిగిందో తెలుసా!?
యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు. టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. దీనితో సినిమా మీద ఒక్క సారిగా బజ్ పెరిగి పోయింది. ‘తెల్లవారు జామున మంచు పొగలాంటి ప్రేమ అనే వలయంలో చిక్కుకున్న ప్రేమికుల కోసం ఈచిత్రం’ అంటూ గ్లింప్స్ ఆకట్టుకునే విధంగా సాగింది. ఈ మధ్యనే ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకుంది. బ్లాక్ ఆంట్ పిక్చర్స్, శ్రీనాథ కథలు సంయుక్తంగా అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు కొవ్వూరి అరుణ సమర్పకురాలు కాగా భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాశారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. అన్ని వర్గాలను అలరించేలా ఈ సినిమా రూపొందించామని, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ దొరుకుతుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
సౌందర్య తలలేదు.. మొండెం మాత్రమే ఉంది
అందం, అభినయం, గౌరవం, వినయం, విధేయత .. ఇలా అన్ని లక్షణాలు ఉన్న హీరోయిన్ సౌందర్య. సావిత్రి తరువాత అంతటి గొప్ప గుర్తింపును అందుకున్న నటి సౌందర్య. హీరోయిన్ అంటే.. ఎక్స్ పోజింగ్ చేయాలి, అందాలు ఆరబోస్తేనే హిట్లు దక్కుతాయి అనుకొనే వారందరికీ ఎక్కడా ఎక్స్ పోజింగ్ చేయకుండా కేవలం ట్యాలెంట్ తోనే హిట్స్ అందుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఎన్నో మంచి సినిమాల్లో నటించి, మెప్పించిన ఆ సౌందర్య రూపం ఇప్పుడు లేదు. కానీ, ఆమె గురించి ఇప్పుటికీ మాట్లాడుకుంటున్నారు అంటే.. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2004 ఏప్రిల్ లో ఒక రాజకీయ పార్టీ ప్రచారం కోసం హెలీకాఫ్టర్ లో బయల్దేరిన సౌందర్య మళ్లీ భూమి మీదకు ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆ సమయంలో ఆమె గర్భవతి అని కూడా పుకార్లు వచ్చాయి. ఆమె మృతితో ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలిపోయింది. ఆమె పార్దీవ దేహాన్ని చూడడానికి అభిమానులు తరలివచ్చారు. అయితే ఆ ప్రమాదంలో సౌందర్య తల, మొండెం వేరు అయ్యాయని వార్తలు వచ్చాయి కానీ, నిజమో కాదో తెలియదు. అయితే అది నిజమేనని, తల లేని సౌందర్య బాడీని వాచ్ చూసి గుర్తుపట్టామని, ఆమె స్నేహితురాలు, నటి ప్రేమ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు పొరుగు జిల్లాల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఊరుములు, మెరుపులు, వడగళ్ల వానలు పడ్డాయి. హైదరాబాద్, శివార్లలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పౌరులు నిద్రలేచారు. కుండపోత వర్షం వల్ల కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం/ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండ వేడిమి నుంచి ప్రజలకు భారీ వర్షాలు ఉపశమనం కలిగించాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గురువారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రాత్రి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన.. వడగళ్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.