NTV Telugu Site icon

Top Headlines @5 PM: టాప్ న్యూస్

Ntv Top Hl 5pm

Ntv Top Hl 5pm

1 మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకూ మెట్రో విస్తరణ

హైదరాబాద్ నగర వాసులకు మరో ఎక్స్ ప్రెస్ మెట్రో వేకు మార్గం సుగమం అయింది. హైదరాబాద్ నగర వాసులకు సేవలందిస్తున్న మెట్రో మరింతగా విస్తరించనుంది. డిసెంబర్ 9న సెకండ్ ఫేజ్ మెట్రోకి శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్.. 31 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి రూ 6250 కోట్ల ఖర్చు పెట్టనున్నారు. హైటెక్ సిటీ మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకూ మెట్రో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ప్రకటన పట్ల శంషాబాద్ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది… సీఎం కేసీఆర్ డిసెంబర్ 9వ తేదీన ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేస్తారని ప్రకటించడం సంతోషంగా ఉంది…మైండ్‌స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్ 31 కి.మీ పొడవు ఉంటుంది. సుమారు 6,250 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ మెట్రో వల్ల నగరం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లే వారికి మరింత సౌకర్యం కలగనుంది. మరోవైపు నగరంలో లకడీకాపూల్ నుంచి లింగంపల్లి వరకూ మెట్రో ప్రాజెక్టుకి ప్రభుత్వం సుముఖంగా వుంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ కష్టాలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు.

2 గాంధీ, అంబేద్కర్ కంటే వైఎస్సార్ గొప్ప వ్యక్తి కాదు

మంగళగిరిలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. అయితే.. ఈనేపథ్యంలో ఇప్పటం గ్రామస్తులకు చెక్కుల పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతతో నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున అభిమానులున్న నన్నే ఇంత ఇబ్బంది పెడుతోంటే.. ఇప్పటంలో ఓ ఆడపడుచును ఎంతగా ఇబ్బంది పెడతారో నాకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. నా కులపొళ్లతో నన్ను ఎందుకు తిట్టిస్తున్నారు..? అని ఆయన మండిపడ్డారు. 2024 ఎన్నికలు కీలక ఎన్నికలు అని, నేను ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పనని, 2014 నుంచి వివిధ సందర్భాల్లో ప్రధాని మోడీని కలిశానని ఆయన వెల్లడించారు. ప్రధానితో నేనేం మాట్లాడానో సజ్జలకు ఎందుకు..? అని ఆయన ప్రశ్నించారు.

3 మోడీ మనక్ కీ బాత్ లో తెలంగాణ ప్రస్తావన

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన యెల్ది హరి ప్రసాద్ అనే చేనేత కార్మికుడు జీ20 పేరుతో వస్త్రాన్ని తయారు చేసి మన్‌కీ బాత్‌కు పంపడంతో ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్ రూపొందించిన వస్త్రాన్ని చూపించడం, హరి ప్రసాద్ పేరు ప్రస్తావించడంతో స్థానికంగా అభినందనలు మిన్నంటాయి. పలువురు బీజేపీ నాయకులు హరి ప్రసాద్‌ను సన్మానించారు. అయితే నేడు ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ మిత్రులారా! నేటి కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన బహుమతి గురించిన చర్చతో ప్రారంభించాలనుకుంటున్నాను. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నేత సోదరుడు ఉన్నారు. ఆయన పేరు యెల్ది హరిప్రసాద్ గారు. ఆయన తన స్వహస్తాలతో నేసిన ఈ జి-20 లోగోను నాకు పంపారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. హరిప్రసాద్ గారు తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో నైపుణ్యం ఉంది. చేతితో నేసిన G-20 లోగోతో పాటు హరిప్రసాద్ గారు నాకు ఒక లేఖ కూడా పంపారు. వచ్చే ఏడాది జి-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని ఇందులో రాశారు.

4 కృష్ణ దశదినకర్మలో మహేష్ ఎమోషనల్ స్పీచ్

సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్‌ కన్వెన్షన్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబసభ్యులతో పాటు వేలాది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌ బాబు బాగా ఎమోషనల్ అయ్యారు. నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో గొప్పది.. మీ అభిమానం. దానికి ఆయనకు నేను రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ గుండెల్లో ఉంటారు. ఆయన ఎప్పుడూ మనమధ్యే ఉంటారు.మీ అభిమానం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మహేశ్‌ ఎమోషనల్‌ అయ్యారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ దశ దిన కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు.

5 అందుబాటులోకి టీటీడీ 2023 డైరీలు,క్యాలెండర్లు
నూతన సంవత్సరం వచ్చేస్తోంది. ప్రజలందరూ 2022కు వీడ్కోలు పలికి 2023కు స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. కావాల్సిన భక్తులకు ఆన్‌లైన్‌లో వీటిని అందజేసేలా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఆన్‌లైన్‌‌లో బుక్ చేసుకున్న వాళ్లకు పోస్టు ద్వారా పంపుతామని టీటీడీ వెల్లడించింది. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ‘పబ్లికేషన్స్‌’ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డుల ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించారు. ఆఫ్‌లైన్‌లో క్యాలెండర్లు, డైరీలు కొనుగోలు చేయాలని భావించిన వారు తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతో పాటు తిరుపతిలోని గోవింద రాజ స్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద గల పుస్తక విక్రయశాలల్లో సంప్రదించాలని టీటీడీ అధికారులు సూచించారు.

6 వైసీపీ కంచుకోటను అంగుళం కూడా కదల్చలేరు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసివచ్చినా వైసీపీ కంచుకోటను ఇంచుకూడ కదలించలేరని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. జనసేనను సైకో సేనగా మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. పవన్ లాంటి సైకోగాళ్లు నెలకోసారి వచ్చి ప్రజలను రెచ్చగొట్టి వెళ్తుంటారని మండిపడ్డారు. ఈ సైకోలు రాత్రిపూట సంచరించే రౌడీలు, గుండాలు, పొరంబోకులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల ఇళ్లు కూలుస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇదేమన్నా సినిమా సెట్టింగ్ అనుకుంటున్నావా లేదా విఠలాచార్య అట్ట మోపింగ్ అనుకుంటున్నావా అని పవన్‌ను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌కు ధైర్యం ఉంటే 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడతానని చెప్పాలని సవాల్ విసిరారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ప్రకటించే ధైర్యం పవన్ కళ్యాణ్‌కు ఉందా అని సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు సత్తా ఉంటే ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పాలన్నారు. కోడి కత్తి రాజకీయాలు అనే విమర్శలకు ప్రజలే 151 స్థానాలు వైసీపీకి ఇచ్చి సమాధానం చెప్పారని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.

7 జిన్ పింగ్ దిగిపోవాలి…పెద్ద ఎత్తున యువత నిరసన గళం
కోవిడ్ లాక్ డౌన్ వ్యతిరేకంగా చైనా దేశంలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు, యువత పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ దిగిపోవాలని, చైనా కమ్యూనిస్ట్ పార్టీ దిగిపోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. చైనాలో నిరసన కార్యక్రమాలు జరగడం చాలా చాలా అరుదు. అటువంటిది అక్కడ ‘జీరో కోవిడ్’ విధానం పాటిస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వానికి, అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. జిన్జియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరుమ్ కీ నగరంలో ఓ ఎత్తైన భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంతో 10 మంది మరనించడంతో పాటు పలువురు గాయపడ్డారు. భవనం పాక్షికంగా లాక్ డౌన్ చేయడం వల్లే నివాసితులు తప్పించుకోలేక మృతి చెందారని ప్రజలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ అగ్నిప్రమాదం ఘటన చైనాలో అగ్గిరాజేసింది. చైనా వాణిజ్య రాజధాని షాంఘైతో పాటు ఇతర నగరాల్లో కూడా ఆదివారం ప్రజలు కోవిడ్-19 నియంత్రణకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. షాంఘై నగరంలో శనివారం ఉరుమ్ కీ బాధితులకు కొవ్వత్తులతో సంతాపాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు చూస్తుండగానే.. సెన్సార్ షిప్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.