బీఆర్ఎస్ నుంచి జూపల్లి, పొంగులేటి ఔట్… ధిక్కారంపై కేసీఆర్ ఫైర్
బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది.ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ క్రమంలో ఇరు నేతలు సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్.. మరోసారి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని.. అది పగటి కలేనంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఇక ఎందరో అమరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తెలంగాణలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని, బీఆర్‌ఎస్ పేరుతో చెత్త పాలనను దేశానికి ఇవ్వాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ విమర్శల వ్యాఖ్యల నేపథ్యంలోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని పలువురు నేతల అభిప్రాయ పడుతున్నారు.
నకిలీ నోట్ల ముఠాల ఆగడాలు. ఒకరి హత్య
నకిలీ నోట్ల ముఠాల ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రలో ఓ యువకుడు డబ్లింగ్ కరెన్సీ ముఠా చేతిలో హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది.పశ్చిమ గోదావరి జిల్లాలోఈ నెల 5న అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పెంటపాడు కాలువలో శవమై తేలిన పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామానికి చెందిన కేతా నరసింహ స్వామిగా గుర్తించారు. డబ్లింగ్ కరెన్సీ ఆశ చూపి నరసింహస్వామి నుంచి 3 లక్షలు కాజేశారు ఏడుగురు ముఠా సభ్యులు..తీసుకున్న డబ్బు గురించి నరసింహస్వామి ప్రశ్నించడంతో అతడిరి హత్య చేసిన గ్యాంగ్..కాలువలో పడేశారు. మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.అసలైన డబ్బులకి రెండింతలు నకిలీ కరెన్సీ అందజేస్తామని పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామానికి చెందిన కేతా నరసింహ స్వామి నుంచి 3 లక్షలు దోచేశారు. డబ్బులు గురించి పదేపదే ప్రశ్నిస్తుండడంతో నరసింహ స్వామిని ఈనెల 5వ తేదీన ముఠా సభ్యులు నిడదవోలు తీసుకువెళ్లారు. ఇంట్లో పని ఉందని చెప్పి వెళ్లిన నరసింహ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
టీడీపీ నేత ముల్పూరి కళ్యాణి అరెస్ట్
కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగు మహిళ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని అదుపులోకి తీసుకున్నారు హనుమాన్ జంక్షన్ పోలీసులు..గన్నవరంలో ఫిబ్రవరి 20న తెదేపా, వైకాపా మధ్య జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన రెండు కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు కల్యాణి. ముందస్తు బెయిల్ రాకపోవడంతో అప్పట్నుంచి అజ్ఞాతంలో ఉన్నారు కల్యాణి… హనుమాన్ జంక్షన్ లోని తన నివాసంలో ఉన్నట్లు సమాచారం రావడంతో కల్యాణిని అదుపులోకి తీసుకున్నారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమెని అదుపులోకి తీసుకునేందుకు ఇంట్లోకి వచ్చారు మహిళా పోలీసులు. కనీసం నైట్ డ్రెస్ లో ఉన్నానని, బట్టలు మార్చుకుని వస్తానని చెప్పినా మహిళా కానిస్టేబుళ్ళు ఆమె బెడ్ రూంలో ఉండడంతో వాగ్వాదం జరిగింది. ఇదిలా ఉంటే తెలుగు మహిళా నేత కల్యాణి అరెస్టును ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కళ్యాణిపై తప్పుడు కేసు పెట్టారు. అంతే కాకుండా కళ్యాణి బెడ్ రూంలోకి చొరబడ్డారు. కళ్యాణిని ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణం అన్నారు చంద్రబాబు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్య కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు అన్నారు.
వివాహ వేడుకలో గన్ పేల్చిన పెళ్లి కూతురు.. పాపం పెళ్లి కొడుకు..
ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో సరదగా వరుడు, వధువు చేసే పనులు శ్రుతి మించుతున్నాయి. సరదగా కోసమో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ వివాహ వేడుకల్లో కొత్త జంట చేసే పనులు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి మండపంలో నవవధువు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివాహ వేడుక జరుగుతున్న సమయంలో పెళ్లి కూతురు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగింది. వివాహ వేదికపై వధువు రివాల్వర్ తో ఐదు సెకన్లలో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. శుక్రవారం రాత్రి హత్రాస్ జంక్షన్ ప్రాంతంలోని సేలంపూర్ గ్రామంలోని అతిథి గృహంలో వివాహ కార్యక్రమం నిర్వహించారు. వరుడితో పాటు వేదికపై కూర్చుంది. ఒక వ్యక్తి లోడ్ చేసిన రివాల్వర్‌ను వధువుకు అందజేశాడు. ఆమె పైకి చూసి, తుపాకీని నాలుగుసార్లు కాల్చింది. వరుడు నిస్సత్తువగా ముందుకు చూస్తున్నాడు. రివాల్వర్‌ను తిరిగి ఆ వ్యక్తికి అందజేసింది. జంట ఒకరికొకరు పూలమాల వేసి, బంధువుల నుండి ఆశీర్వాదం మరియు ఫోటోగ్రాఫ్‌లకు పోజులిచ్చిన జైమాల్ (దండలు) వేడుక ముగిసిన వెంటనే కాల్పుల సంఘటన జరిగింది.
రామయ్య అభిషేకం చూసేందుకు వచ్చిన వానరులు
భద్రాచలం రామయ్యను చూసేందుకు భక్తులు తరలివస్తుంటారు. ప్రతిరోజూ జరిగే కార్యక్రమాల మాట అటుంచితే సీతారామ కల్యాణం, రాముడి పట్టాభిషేకం సమయంలో భక్తుల తాకిడి మామూలుగా ఉండదు. శ్రీరాముడు ఎక్కడుంటే అక్కడ ఆయన పరమభక్తుడు హనుమంతుడు ఉంటాడు. భక్తులకు కనువిందు చేస్తుంటాడు. అందుకే శ్రీరామనవమి, రాముడి పట్టాభిషేకం అనంతరం హనుమంతుడి జన్మోత్సవం జరుగుతుంటుంది. శోభాయాత్రలతో ఆలయాలు కళకళలాడుతుంటాయి. వీధుల్లో జై శ్రీరామ్, జై భజరంగభళి, జై హనుమాన్ నినాదాలు మారుమోగుతూ ఉంటాయి. భద్రాద్రి ఆలయంలో వానరాల సందడి అంతా ఇంతా కాదు. రాముడికి అభిషేకం చేస్తూ హడావిడిగా ఉన్నారు ఆలయ పూజారులు. ఇదే సమయంలో విశేష అతిథులు ఆలయం గోపురంపై సందడి చేశారు. రామయ్య అభిషేకం చూసేందుకు వచ్చారు వానరులు.. సాక్షాత్తూ హనుమ, సుగ్రీవుడు కలిసి వచ్చినట్టుంది. ఈ వానరులు కలిసి వచ్చిన దృశ్యం భక్తిటీవీలో ప్రసారం అయింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భక్తులు ఈ వీడియోలు చూసి భక్తిపారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఆ సంగతేంటో మీరూ ఓ లుక్కెయ్యండి.
పిరియడ్ డ్రామాలో తిరువీర్!
‘జార్జిరెడ్డి’, ‘పలాస’ చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ ‘మసూద’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వైవిధ్యమైన పాత్రలను పోషించడానికి ఆసక్తి చూపించే తిరువీర్ ఇప్పుడో పిరియడ్ డ్రామాలో ఛాన్స్ సంపాదించుకున్నాడు. సినీరంగ ప్రముఖులతోనూ, రాజకీయ నాయకులతోనూ చక్కని అనుబంధం ఉన్న ప్రముఖ వ్యాపార వేత్త రవికుమార్ పనస… తన తొలి చిత్రాన్ని తిరువీర్ తో నిర్మించబోతున్నాడు. ఈ పిరియడ్ డ్రామాకు ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరించబోతోంది. పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన గోపీ విహారి (జి.జి.) ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత రవికుమార్ పనస మాట్లాడుతూ, ”చిత్రసీమతో ఎంతోకాలంగా ఉన్న అనుబంధం దృష్ట్యా ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాలని అనుకున్నాను. అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. మేం నిర్మించబోయే పిరియడ్ డ్రామాకు తిరువీర్ బెటర్ ఛాయిస్ అనిపించింది. దర్శకుడు జి. జి. తన ఫ్రెష్ థాట్స్ తో ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తాడనే నమ్మకం ఉంది. తెలుగు సినీ ప్రేమికులకు ఈ చిత్రం ఓ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అతి త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తాం” అని అన్నారు.
మే 20న… ‘వస్తున్నాడు’
ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, ఇంకో ఏడాది వరకూ ఎన్టీఆర్ సినిమా థియేటర్ లో కనిపించదు. 2024 ఏప్రిల్ కి కొరటాల శివ, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా రిలీజ్ కి షెడ్యూల్ అయి ఉంది. ఈ గ్యాప్ లో 2023 మే 20కి ఎన్టీఆర్ ‘వస్తున్నాడు’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ మాస్ హీరోగా మార్చిన సినిమా ‘సింహాద్రి’. 19 ఏళ్లకే బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఎన్టీఆర్, ఇండియన్ సినిమా గర్వించేలా చేస్తున్న రాజమౌళిల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘సింహాద్రి’. నందమూరి అభిమానులందరికీ మోస్ట్ ఫేవరేట్ సినిమా అయిన ఈ ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్, మే 20న రీరిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. ఈమధ్య రీరిలీజ్ అనేది మాములు విషయం అయిపొయింది కానీ సింహాద్రిని మాత్రం అలా కాకుండా వరల్డ్ వైడ్ రీరిలీజ్ చేసి కొత్త సినిమా రేంజులో హంగామా చెయ్యడానికి ఫాన్స్ రెడీ అయ్యారు.
నరాలు తెగే ఉత్కంఠ.. కన్నీళ్లు పెట్టుకున్న జుహీ చావ్లా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సంచలన విజయం సాధించింది. కేకేఆర్ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్ లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావల్సిన నేపథ్యంలో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ.. తమ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆఖరి బంతికి సిక్స్ బాదగానే.. కేకేఆర్ డగౌట్ మొత్తం సంబరాల్లో మునిగి తెలిపోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు మైదనంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి తమ జట్టు హీరోను భుజాలపై ఎత్తుకుని మరి అభినందించారు. ఈ క్రమంలో స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ వీక్షించిన కేకేఆర్ కో-ఓనర్, బాలీవుడ్ సీనియర్ నటి జుహీ చావ్లా.. తమ జట్టు గెలవడంతో భావోద్వేగానికి లోనింది. ఆమె తన భర్త జే మెహతా.. కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ విన్నింగ్ సెలబ్రెషన్స్ జరుపుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో 21 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్ ఒక్క ఫోర్ ఆరు సిక్సులతో 48 పరుగులు సాధించాడు.. దీంతో కేకేఆర్ ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది..కాగా కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్ లో ఏప్రిల్ 14న సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. రింకూ సింగ్ లాస్ట్ ఓవర్లో కొట్టిన ఐదు సిక్స్ లు సోషల్ మాడియాలో వైరల్ గా మారింది.