NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కాగా.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం. తదితరులకు స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రధాని మోడీ నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.

చంద్రబాబు అందుకు రెడీనా?

ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి సవాల్ విసిరారు. చంద్రబాబు ట్విట్ కు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలోని ఒక కోటి 50 లక్షల ఇళ్ళకు రావటానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడో లేదో చెప్పాలి అన్నారు. జగనన్న కాలనీల నిర్మాణాలు ఎలా ఉన్నాయో చూడటానికి రావాలని ఛాలెంజ్ చేస్తున్నాను. నీ కొడుక్కి పనీ పాటా లేదు. రోడ్ల మీద తిరుగుతున్నాడు. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా నీ పాలన, నాలుగేళ్ల పాలనలో జగన్ పాలన పై ఆలోచించాలి అన్నారు జోగి రమేష్. ప్రజలకు అంత మంచి చేస్తే 2019 ఎన్నికల్లో 23 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యే వాడివి? అన్నారు మంత్రి జోగి రమేష్. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. పెడనలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు.మా భవిష్యత్తు జగనన్నే అనేది ప్రజల ఆకాంక్ష అంటున్నారు మంత్రి జోగిరమేష్. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి కార్యక్రమాలను ఏపీలో సీఎం జగన్ చేస్తున్నారు. బటన్ నొక్కగానే రైతులు , అక్కచెల్లెమ్మల అకౌంట్లలలోకి డబ్బులు జమ అయ్యేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రతీ గడపకూ వెళ్లి ప్రభుత్వం పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నారో అడిగి తెలుసుకుంటాం అన్నారు. విపక్షాల విమర్శలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

కడపలో అఖిలపక్ష నేతల అరెస్టులు

కడప జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నేతలు తలపెట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది.. పశుసంవర్ధక శాఖ డిడి డాక్టర్ అచ్చన్న మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు అఖిలపక్ష నేతలు ర్యాలీ తలపెట్టారు.. అయితే పోలీసులు ముందస్తుగానే అఖిలపక్ష నేతలను అరెస్టు చేశారు.. నగరంలోని మానస ఇన్ హోటల్ లో బస చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను ముందస్తుగా లాడ్జిలో అరెస్ట్ చేశారు.. అలాగే టిడిపి పోలీసు బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్ రెడ్డి. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ అమీర్ బాబులను కూడా హౌస్ చేశారు.. కొద్దిసేపటి తర్వాత సిపిఐ రామకృష్ణ, పోలిట్ సభ్యులు శ్రీనివాసుల రెడ్డిలు ర్యాలీ చేపట్టేందుకు కార్యకర్తలతో బయటకు రావడంతో పోలీసులు వారి ఇరువురిని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు.. ఈ సందర్భంలో పోలీసుల వాహనాలను ఆందొలనాకారులు అడ్డుకున్నారు.. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.. తర్వాత పోలీసులు ఆందోళనా కారులను చెదరగొట్టి ఇరువురు నేతలని స్టేషన్ కు తరలించారు… హత్యకు గురైన డిడి దాక్టర్ అచ్చన్న విషయంలో దర్యాప్తు సజావుగా సాగడం లేదని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి, దోషులను శిక్షించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు.

ఏప్రిల్ 13 నుంచి టెన్త్ పరీక్షా పేపర్ల మూల్యాంకనం

తెలంగాణలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ఏప్రిల్ 11తో ముగియనున్నాయి. అనంతరం ఏప్రిల్ 13 నుంచి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 21 వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. పరీక్ష పేపర్ల మూల్యాంకనానికి రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10వ తరగతి పరీక్షల మొదటి రెండు పేపర్లు లీక్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. పలువురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతోపాటు నిందితులను అరెస్టు చేయడంతో విద్యార్థులు, విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.తెలంగాణలోని ఉట్నూర్ జిల్లాలో పరీక్ష ప్రశ్న పత్రాల బండిల్ మాయమైన నేపథ్యంలో తపాలా శాఖ సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెన్షన్ వేటు పడింది. అనంతరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ సమాధాన పత్రాల బండిల్‌ను రికవరీ చేస్తున్నట్లు ప్రకటించారు. సమాధాన పత్రాలను పోస్టల్ శాఖకు అప్పగించగా మాయమైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐదు కేంద్రాల్లో 1,011 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

కలకలం సృష్టిస్తున్న ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్.. పిల్లల్లో కొత్త లక్షణాలు

మన భారతదేశంలో పరిస్థితులు యథావిథిగా మారడంతో.. కరోనా వైరస్ దాదాపు విడిచి వెళ్లిందని అంతా భావించారు. ఇక కరోనా భయం అవసరం లేదని భావించారు. కానీ.. అనూహ్యంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజుకు 6 వేలకు పైగా కరోనా కేసులు దాటుతుండటంతో.. ఆందోళనకరమైన వాతావరణం అలుముకుంది. దాని సబ్‌వేరియెంట్లు సైతం పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా.. కొవిడ్ ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ XBB.1.16 దేశంతో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని కారణంగానే పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని నిర్ధారించిన వైద్యులు.. అప్రమత్తగా ఉండాలని ప్రజల్ని సూచిస్తున్నారు. ఇదిలావుండగా.. ఈ సబ్‌వేరియెంట్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని తాజాగా షాకింగ్ రిపోర్ట్ వెల్లడైంది. ఈ వేరియంట్‌ సోకిన పిల్లల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నట్టు తేలింది. ఈ వేరియెంట్ బారిన పడిన పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. గతంలో ఈ కొత్త లక్షణాలు ఉండేవి కావని వైద్యులు తెలిపారు. ఈ కొత్త లక్షణాలతో పాటు గతంలో మాదిరిగానే కోవిడ్‌ బాధితులకు హైఫీవర్‌, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే.. కొత్త లక్షణాల విషయంలో కలకలం రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిపై ప్రభుత్వం అప్రమత్తమైంది. అటు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ కొత్త వేరియెంట్‌పై పరిశోధనలు చేస్తున్నట్టు వెల్లడించింది.

మలిదశ ఉద్యమానికి అమరావతి జేఏసీ శ్రీకారం

ఏపీలో తమ డిమాండ్ల సాధనకు అమరావతి జేఏసీ ఉద్యమ బాట పట్టింది. మలిదశ ఉద్యమానికి అమరావతి జేఏసీ శ్రీకారం చుట్టింది. కండువాలు ధరించి పోస్టర్లు రిలీజ్ చేసి విజయవాడలో జరిగిన నిరసనలో పాల్గొన్నారు జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర నేతలు.
ఉద్యోగుల డిమాండ్ లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి.పీఆర్సీ,డీఏ బకాయిలపై స్పష్టత ఇవ్వడం లేదు.గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యోగులకు ఇచ్చే జీతాలు,పెన్షన్లపై ప్రభుత్వం తప్పు లెక్కలు చెబుతుంది. సంఘాలతో సంబంధం లేకుండా ఉద్యోగులంతా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఈనెల 17, 20 తేదీల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించి మద్దతు కోరతామన్న ఆయన.. ఈ నెల 21వ తేదీన సెల్‌ డౌన్ యథావిథిగా ఉంటుందన్నారు. 27వ తేదీన కారుణ్య నియామకాలు కోసం వారి కుటుంబం సభ్యులను కలుస్తాం. వచ్చే నెల ఐదో తేదీన మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ నెల రోజుల అంశాలను మరో సారి చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు.. కాగా, 21వ తేదీన సెల్‌ డౌన్‌ పేరుతో ప్రభుత్వ యాప్‌లను పనిచేయకుండా నిలిపివేశాలా కార్యాచరణ రూపొందించింది జేఏసీ.8 ఏళ్లుగా ఉద్యోగుల హెల్త్ ను ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు.ప్రభుత్వ చెల్లింపులు సరిగా లేకపోవటం వల్ల వైద్యం నిరాకరణ చేస్తున్నారు. ప్రధాన సమస్యలు ఏవీ ఇప్పటి వరకు పరిష్కారం అవలేదు.

నువ్వా నేనా చూసుకుందాం.. ముంబైతో చెన్నై ఢీ

IPL చరిత్రలో అతిపెద్ద మ్యాచ్ గురించి చర్చించేటప్పుడు ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ రెండు జట్లు ఒకదానితో ఒకటి పోటీపడినప్పుడల్లా పోటీ ఉత్కంఠభరితంగా ఉంటుంది. రెండు జట్లకు ఐపీఎల్ ఛాంపియన్‌షిప్ టైటిల్స్ అత్యధికంగా అందుకున్నాయి. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకుంది, చెన్నై సూపర్ కింగ్స్ కంటే మొత్తం నాలుగు సార్లు గెలిచింది. ఈ సీజన్‌లో ఇవాళ(శనివారం) రాత్రి 7:30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా, చెన్నై సూపర్ కింగ్స్‌కు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తాడు. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క IPL 2023 ఓటమితో ప్రారంభమైంది. అయితే జట్టు వారి రెండవ మ్యాచ్‌లో బలమైన పునరాగమనం చేసింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై ఐదు వికెట్ల తేడాతో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. అదే రెండో మ్యాచ్‌లో, లక్నో ముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 217 పరుగులు చేసింది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ 2023 ప్రారంభం కావడం విశేషం ఏమీ కాదు. జట్టు తన మొదటి మ్యాచ్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడింది. ఇందులో RCB ఎనిమిది వికెట్ల తేడాతో MIని ఓడించింది.

ప్రియమైన బర్రెలు.. అటు వెళ్లకండి.. అది చాలా వీక్

రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, వందేభారత్ రైలు ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి నిరసన తెలిపారు. వందేభారత్ రైలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 68 ప్రమాదాలు జరిగాయి. గేదెలు, ఆవులను ఢీకొట్టడంతో వందే భారత్ రైలు దెబ్బతింది. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి ఓ గేదెకు విజ్ఞప్తి చేశాడు. “మోదీ గారూ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ స్టార్ట్ చేస్తున్నారు. వందే భారత్ రైళ్లు చాలా వీక్. దయచేసి ఆ వైపు వెళ్లకండి. పొరపాటున ముట్టుకున్నా రైలు పాడయ్యే ప్రమాదం ఉంది.” అని తెలిపారు. ‘‘అసలే ఆ రైళ్లు చాలా బలహీనంగా ఉన్నాయి. దేశంలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టిస్తానని చెప్పిన మోడీ.. వందే భారత్ పేరుతో గేదెలు తాకేతేనే ధ్వంసం అయ్యే రైళ్లను తీసుకొచ్చారు.. అలాంటి రైళ్లతో.. వాటికే కాదు మీరు కూడా రిస్క్‌లో ఉన్నారు. మోడీ వాటిని ప్రారంభించడం ఆపే అవకాశం లేదు. కాబట్టి మీరైనా అటువైపు వెళ్ళకుండా ఉండి మీ ప్రాణాలు కాపాడుకోండి. మీ బంధువులకు చెప్పి వందే భారత రైలు ప్రయాణించే ట్రాక్ వైపు వెళ్లకుండా చూసుకోండి” అని సతీష్ రెడ్డి గేదెలకు విజ్ఞప్తి చేశాడు. దీంతో వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. గేదె ఢీకొట్టడంతో వందే భారత్‌ రైళ్లు చిద్రమైపోతున్నాయని అంటూ పాంప్‌ లేట్‌ లతో నిరసన తెలిపిన తీరు చర్చకు దారితీస్తున్నాయి. వందేభారత్‌ రైల్లు చాలా వీక్‌ అని పాంప్‌ లెట్‌లలొ వినూత్నంగా నిరసనలు తెలిపారు.

బాలయ్య-అనిల్ మంచి జోష్ లో ఉన్నారే…

సంక్రాంతికి వీర సింహంగా బాక్సాఫీస్ బరిలో నిలిచి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నట సింహం నందమూరి బాలకృష్ణ. ఈ దసరాకి మరొకసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ బాలయ్య తన కొత్త సినిమాని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీలా మరో స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీపై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. అటు అనిల్ రావిపూడి ఫన్ టైమింగ్, ఇటు బాలయ్య మార్క్ మాస్… రెండు ఎలిమెంట్స్ ఉండేలా రూపొందుతున్న NBK 108 సినిమాని దసరాకి రిలీజ్ చేస్తున్నాం అని మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఈ విజయదశమికి ఆయుధ పూజ అంటూ షైన్ స్కీన్ ప్రొడ్యూసర్స్ బాలయ్య ఉన్న పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా NBK 108 మూవీకి సంబంధించిన ఒక పాట షూటింగ్ ని కంప్లీట్ చేసామని చిత్ర యూనిట్ తెలిపారు. గ్రాండ్ సెట్ లో, హై ఎనర్జీ సాంగ్ ని షూట్ చేశారు.

సూపర్ స్టార్ మెచ్చిన సినిమా… ఈ కాంబో సెట్ అయితే ఊచకోతే

తెలుగులో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మంచి మూవీ రాగానే ఇంటికి పిలిచి మరీ అభినందించే హీరో చిరంజీవి మాత్రమే. తమిళ్ లో ఇలా ఎవరు మంచి సినిమా చేసిన అభినందించే హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఏ దర్శకుడు, ఏ హీరో మంచి సినిమా చేసినా స్వయంగా వారిని కలిసి కాంప్లిమెంట్స్ ఇవ్వడం రజినీ రెగ్యులర్ గా చేసే పని. సూపర్ స్టార్ నుంచి ఇలాంటి అప్రిసియేషణ్ అందుకున్న లేటెస్ట్ సినిమా ‘విడుదలై పార్ట్ 1’. ఫ్లాప్ అనేదే తెలియని దర్శకుడు వెట్రిమారన్, యాక్టర్ సూరిని హీరోగా పెట్టి చేసిన ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ ప్లే చేసిన విడుదలై పార్ట్ 1 సినిమా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయినా కలెక్షన్స్ లో మాత్రం డ్రాప్ కనిపించట్లేదు. ఇప్పటివరకూ ముప్పై కోట్లు రాబట్టిన ఈ సినిమా వెట్రిమారన్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ గా పేరు తెచ్చుకావడంతో ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. జైలర్ షూటింగ్ గ్యాప్ లో రజినీకాంత్ కూడా విడుదలై పార్ట్ 1 సినిమాని స్పెషల్ ప్రిమియర్ వేసుకోని చూశాడు.వెట్రిమారన్, సూరి ఇతర చిత్ర యూనిట్ తో కలిసి సినిమా చూసిన రజినీకాంత్… వెట్రిమారన్ మేకింగ్ ని ప్రత్యేకంగా అభినంది, విడుదలై పార్ట్ 1 సినిమా తెలుగులో కూడా మంచి హిట్ కావాలని కోరుకున్నాడు. ఈ ప్రిమియర్ అయిపోగానే రజినీకాంత్, వెట్రిమారన్, సూరి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి. వీటిని చూడగనే రజినీ, వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక్క సినిమా బాగుంటుందని కోలీవుడ్ సినీ అభిమానులు కోరుకుంటున్నారు.