Story Board: వారాహి యాత్ర చేసిన పవన్.. రకరకాల ప్రకటనలు చేసిన జనసేన క్యాడర్ ను గందరగోళంలో పడేశారు. ఒకరోజు పొత్తు ఉంటుందంటారు. మరోసారి ఒంటరిగా పోటీ అంటారు. సీఎం అని నినాదాలిస్తే సీఎం కాలేమంటారు. మళ్లీ సీఎం అవడానికి రెడీగా ఉన్నానంటారు. ఓవైపు జనసేనకు బలం పెరుగుతోందని చెబుతూనే.. మరోవైపు తనకు ఓట్లు పడటం లేదని వాపోతున్నారు. తన పార్టీలో జనాన్ని ప్రభావితం చేసే లీడర్ లేడని ఒప్పుకుంటారు. ఏంటో పవన్ మాటలు వింటుంటే ప్రత్యర్థులే కాదు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా హడలిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇక వలంటీర్లపై పవన్ చేసిన విమెన్ ట్రాఫికింగ్ వ్యాఖ్యలు జనసేనకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ వ్యాఖ్యల్ని ఎలా సమర్థించుకోవాలో కూడా అంతుబట్టని దుస్థితి. ఇక రాబోయో రోజుల్లో పవన్ ఇంకా ఏం మాట్లాడతారో అని వాళ్లు తలలు పట్టుకుంటున్నారు. రాజకీయ ఆరోపణలు చేయడం వేరు. సీరియస్ ఇష్యూస్ పై స్పందించడం వేరు. కానీ పవన్ తీరు చూస్తే.. ఈ రెండింటికీ పెద్దగా తేడా తెలిసినట్టు కనిపించడం లేదు. వారాహి యాత్రకు అనుకున్నంత ప్రచారం రాలేదనుకున్నారేమో.. ఏదోటి మాట్లాడి సంచలనం సృష్టించాలనుకుంటున్నట్టుగా ఉంది. కానీ విమెన్ ట్రాఫికింగ్ లాంటి ఆరోపణలతో రాజకీయంగా సంచలనం సృష్టించాలనుకోవడం సరైన పద్ధతి కాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
వలంటీర్ల గురించి మాట్లాడాలనుకుంటే వాళ్ల జీతాల గురించి, పనితీరు గురించో మాట్లాడొచ్చు. లేకపోతే వలంటీర్ల వ్యవస్థలో లోపాలేంటో చెప్పి.. తానైతే ఎలా సరిచేస్తానో చెప్పుకోవచ్చు. అంతేకానీ వలంటీర్లంతా మాఫియా కోసం పనిచేస్తున్నారని, ఒంటరి మహిళల వివరిలిస్తున్నారనటం.. మరీ విడ్డూరంగా ఉంది. రాజకీయ లబ్ధి కోసం ఏది పడితే అది మాట్లాడతారా అనే ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పడం అంత తేలిక కాదు. లక్షల మంది వలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజల గడపల్లోకి తీసుకెళ్లుతుంటే.. వారి సమస్యలపై మాట్లాడకపోగా.. వారిపై ఇలాంటి ఆరోపణలు చేయడమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ ఏదో ఆశించి.. మరేదో మాట్లాడితే.. ఆ వ్యాఖ్యలు రాజకీయంగా నష్టం చేస్తాయనే ఆందోళన కూడా జనసేనలో ఉంది. ఎందుకంటే వలంటీర్లు లక్షల మంది ఉన్నారు. వాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఏపీలో ఓటర్లు. వలంటీర్లకు మాఫియాతో లింక్ పెడితే.. ఇన్ని లక్షల ఓట్లు పోతాయేమో అనే కనీస స్పృహ లేకుండా పవన్ మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
అసలు వేల సంఖ్యలో మహిళలు మిస్సింగ్ అంటూ పవన్ చెప్పిన లెక్కలు ఎక్కడివి అనే ప్రశ్నలు వస్తున్నాయి. టీడీపీ-జనసేన సర్కారు హయాంలో మొత్తం 16 వేల 765 మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, అందులో ఆచూకీ లేని మహిళల సంఖ్య 2 వేలకు పైగా ఉందని, దీనికి పవన్ ఏం సమాధానం చెబుతారని వైసీపీ ప్రశ్నిస్తోంది. వైసీపీ హయాంలో ట్రేస్ కాని మహిళల సంఖ్య కూడా చెప్పిన నేతలు.. అసలు పవన్ చెప్పిన లెక్కలు ఎక్కడివో, ఎవరిచ్చారో చెప్పాలని నిలదీశారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ లో లేని లెక్కలు పవన్ ఎక్కడ్నుంచి వచ్చాయనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి.
పవన్ చేసిన వ్యాఖ్యలు చిన్నవి కాదు. . ఏదో యథాలాపంగా మాట్లాడాల్సిన మాటలూ కాదు. పవన్ తెలిసో, తెలియకో ఐబీని కూడా ఇందులోకి లాగారు. ఐబీనే ఈ విషయం ప్రజలకు చెప్పమని తనతో చెప్పిందనడం కామెడీకి పరాకాష్టగా మారింది. అసలు ఐబీ సమాచారం చాలా సీక్రెట్ గా ఉంటుంది. కేవలం కేంద్ర హోం మంత్రికి మాత్రమే రిపోర్ట్ చేస్తుంది. అలాంటిది పవన్ కి ఏ హోదా ఉందని ఐసీ ఇన్ఫర్మేషన్ ఇస్తుందనేది తేలాల్సిన అంశం. నిజంగా ఐబీ చెప్పినా.. ఐబీ చెప్పకుండా పవన్ క్లెయిమ్ చేసినా.. రెండూ రాజకీయంగానే కాదు.. వ్యవస్థల పరంగానూ రచ్చ లేపే అంశాలే. అప్పుడు కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ పవన్ అసలు ఇవేవీ ఆలోచించినట్టు లేదు. కనీస బాధ్యత లేకుండా మాట్లాడేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
ఏపీలో వేల మంది మహిళలు మిస్సయ్యారనే లెక్కలు పవన్ కు ఎలా వచ్చాయనేది తేలాలి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దగ్గర ఉండే గణాంకాలు పవన్ కు ఎలా వచ్చాయో తేలాలి. పైగా వలంటీర్లకు మాఫియాతో లింకులున్నాయని, వాళ్లే మాఫియాకు సమాచారం ఇస్తున్నారనే మాటలకు కనీస ఆధారాలైనా ఉన్నాయా అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. ఏ ఆధారాలు లేకపోతే.. ఇంత పెద్ద ఆరోపణలు ఎలా చేస్తారనేది సామాన్యులకు అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే పవన్ మాట్లాడింది రాజకీయం కాదు. ప్రభుత్వాలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. అది ఏపీ శాంతిభద్రతలు, మహిళల భద్రతకు సంబంధించిన విషయం. అంటే ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం. ఇంత సున్నితమైన అంశంపై.. అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం.. పవన్ ను ప్రజల్లో మరింత పలుచన చేస్తుంది. అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా పవన్ తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలి. ఏదో ఆవేశంలో మాట్లాడానని చెప్పి.. క్షమాపణ చెబితే.. కాస్త పరువు నిలబడుతుంది. దీని వల్ల ఏదో నష్టం జరుగుతుందని కామ్ గా ఉంటే.. అది మరింత పెద్ద తప్పవుతుంది. నోరు జారినప్పుడు వ్యాఖ్యలు వెనక్కితీసుకుని క్షమాపణ చెబితే.. వ్యక్తిత్వం, మనిషి విలువ పెరుగుతాయే కానీ.. తగ్గవనే సంగతి పవన్ గుర్తుంచుకోవాలి. నేనేంటి.. సారీ చెప్పడమేంటని భేషజాలకు పోతే.. పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని గ్రహించాలి. అదేదో పవన్ సినిమాలో చెప్పినట్టే.. ఎక్కడ నెగ్గాలో కాదో.. ఎక్కడ తగ్గాలో తెలిసుండాలి. మరి ఈ సినిమా డైలాగ్ ను పవన్ రాజకీయాల్లో అప్లై చేస్తారా.. లేదా అనేది చూడాల్సి ఉంది.
నిజానికి ప్రజలు పవన్ లేవనెత్తే అంశాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో రోడ్ల స్థితిగతులపై పవన్ పిలుపునిస్తే ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది. ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతులకు ఆర్థిక సాయం చేస్తుంటే.. ప్రభుత్వ అధికారులు ముందుగా వెళ్లి పరిహారం చెల్లించారు. అలాగే పశ్చిమ గోదావరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ స్పందిస్తారని ఆశించారు. అంతుచిక్కని జబ్బుతో ఏలూరు ప్రజలు అనారోగ్యానికి గురైన ఘటనను మాత్రమే ప్రస్తావించారు. దీనికి కారణమైన ఆక్వా కాలుష్యం గురించి మాట్లాడలేదు. గోదావరి, కృష్ణా డెల్టాను అక్రమ ఆక్వా సాగు మింగేసే పరిస్థితులున్నాయి. పోలవరం నిర్వాసితుల సమస్య గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఇక్కడ పండించే వివిధ ఉద్యాన పంటలకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ల అవరముంది. అవి లేనందున రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడం ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. రైతుల ఆదాయం పెరుగుతుంది. ఇంకా ప్రభుత్వం తీసుకొచ్చిన కౌల్దారీ చట్టంలో అనేక లోపాలున్నాయి. వాటి వల్ల కౌలు రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయానికి నోచుకోవడం లేదు. అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏం చేయాలనేది పవన్ నిర్దేశించ లేకపోయారు. కనీసం తాము అధికారానికి వస్తే ఏం చేస్తామనేది సేనాని ప్రసంగంలో చోటు చేసుకోలేదు. ఇలా ఎన్నో ప్రజా సమస్యలుంటే అవన్నీ గాలికొదిలేసి.. సంబంధం లేని విమెన్ ట్రాఫికింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి.. దానికి వలంటీర్లు సేకరించే సమాచారమే కారణమనటం పెను దుమారం రేపుతోంది.