Story Board: దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో.. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్. మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్- నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 102 లోక్ సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ ఉంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ లో 60 అసెంబ్లీ స్థానాల్లో 50స్థానాలకు పోలింగ్ ఉంది. పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అదేవిధంగా సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఉంది. తొలిదశ పోలింగ్‌లో మొత్తం ఎనిమిది మంది మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీ పడుతున్నారు.
తొలిదశ పోలింగ్ లో మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16కోట్ల 63 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్ కోసం లక్షా 87వేల పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసిన ఈసీ, ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరించింది. సుమారు 18 లక్షల మంది సిబ్బంది ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ టైమ్. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగుస్తుంది. తొలివిడత పోలింగ్ జరిగే 102 స్థానాల్లో 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1625 మంది అభ్యర్థుల్లో.. 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు ఉన్నారు. 16.63 కోట్ల మంది ఓటర్లలో 8.4 కోట్లు పురుషులు, 8.23 కోట్లు మహిళలు కాగా, 11 వేల 371 మంది థర్డ్ జెండర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. 35.67లక్షలమంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షల మంది దివ్యాంగులు వారికి సౌకర్యం ఉన్న చోట ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న ఈసీ, 102 నియోజకవర్గాల పరిధిలో 5 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలే విధులు నిర్వహిస్తున్నట్లు వివరించింది. వెయ్యి పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తొలివిడత పోలింగ్ నిర్వహణ కోసం 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు వినియోగిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికలను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు ఈసీ పలు కీలక చర్యలు చేపట్టింది. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించింది. 50శాతం కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలో వెబ్‌కాస్టింగ్ చేయడం సహా అన్ని పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్‌లను నియమించింది. తొలిదశ పోలింగ్ కోసం మొత్తం 361 పరిశీలకులను నియమించిన ఈసీ, వారిలో 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీసు పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకులు ఉన్నట్లు వివరించింది. 4వేల 627 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 5వేల 208 స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్‌లు, 2వేల 28 వీడియో సర్వైలెన్స్ టీమ్‌లు, 1255 వీడియో వ్యూయింగ్ టీమ్‌లను ఏర్పాటు చేసింది.
తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ పూర్తి కానుంది. అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్‌లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో రెండేసి, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్ష్యదీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి తొలిదశలో పోలింగ్ జరగనుంది. మణిపుర్‌లో రెండు స్థానాలకు కూడా తొలివిడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఔటర్ మణిపుర్ నియోజకవర్గంలో మాత్రం మొదటి రెండు దశల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 80 స్థానాలు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, 40 సీట్లు ఉన్న బిహార్, 42 సీట్లు ఉన్న బెంగాల్లో మొత్తం ఏడు విడతల్లోనూ పోలింగ్ ఉండగా తొలివిడత యూపీలో 8, బిహార్‌లో 4, బంగాల్లో 3 నియోజకవర్గాల్లో ఓటింగ్‌కు ఏర్పాట్లు జరిగాయి. అసోంలో 5, ఛత్తీస్‌గఢ్‌లో ఒకటి, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 5, రాజస్థాన్ 12, జమ్ముకశ్మీర్‌లో ఒక నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.102 లోకసభ నియోజకవర్గాలతోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తమిళనాడులో 39 స్థానాలకు 950 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 6.23కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 68వేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. రాజస్థాన్‌లో 12స్థానాలకు పోలింగ్ జరగనుండగా 114 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారు 2.54కోట్ల ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. యూపీలో 8 స్థానాలకు 80 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, కోటీ 43 లక్షల మంది ఓటు వినియోగించుకోనున్నారు. ఉత్తరాఖండ్‌లో ఐదు స్థానాలకు 55 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 83లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనుండగా, పోలింగ్ కోసం ఈసీ 11వేల 728 కేంద్రాలను ఏర్పాటు చేసింది.
కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్నారు. 2014లో, ఆయన ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన విలాస్ ముత్తెంవార్‌ను 2.84 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. 2019లో ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేను 2.16 లక్షల ఓట్లతో ఓడించి సీటును నిలబెట్టుకున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 2004 నుంచి మూడుసార్లు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రిజిజు ప్రధాన ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు నబమ్ టుకీ. దీంతో అక్కడ పోటీ తీవ్రంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బనాద సోనోవాల్ అసోంలోని దిబ్రూగఢ్ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలికి టిక్కెట్ ఇవ్వకపోవటంతో రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్‌ను దిబ్రూగఢ్ నుంచి బిజెపి పోటీకి దింపింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన హరీంద్ర మాలిక్, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి దారా సింగ్ ప్రజాపతి, బిజెపి నుంచి కేంద్ర మంత్రి సంజీవ్ బలియన్ బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక మోడీ క్యాబినెట్‌లో జూనియర్ మంత్రిగా పనిచేసిన జితేంద్ర సింగ్ ఉదంపూర్‌లో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు భూపేంద్ర యాదవ్.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా మత్స్య ప్రాంతానికి చెందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ యాదవ్‌తో పోటీలో ఉన్నారు. ఇక్కడ యాదవ్ సామాజికవర్గం కీలక పాత్రను పోషించనున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.. కాంగ్రెస్ మాజీ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్‌తో పోటీ పడనున్నారు.
తమిళనాడులోని నీలగిరి లోక్‌సభ నియోజకవర్గం ప్రస్తుత డిఎంకె ఎంపి, మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజాపై బిజెపి నుంచి కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఇదే తొలిసారి. శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం తన తండ్రి ఏడుసార్లు గెలుపొందిన స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బిజెపి నుంచి టి. దేవనాథన్ యాదవ్, ఏఐఏడీఎంకే నుంచి జేవియర్ దాస్‌లు బరిలో ఉన్నారు. తమిళనాడు బిజెపి అధ్యక్షులు కె. అన్నామలై కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, అక్కడి నుంచి డీఎంకే నాయకుడు గణపతి పి. రాజ్‌కుమార్, ఎఐఎడిఎంకెకు చెందిన సింగై రామచంద్రన్‌తో అన్నామలై పోటీ పడుతున్నారు. ఇక క్రియాశీల రాజకీయాల్లోకి రావటానికి ఇటీవల తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్.. బిజెపి నుంచి చెన్నై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం బరిలో ఉన్నారు. కనిమొళి.. తూత్తుకుడి స్థానం నుంచి తిరిగి విజయం సాధించాలని చూస్తున్నారు. ఇక ఆమెపై ఎన్డీయే మిత్రపక్షమైన తమిళ మానిల కాంగ్రెస్ ఎస్.డి.ఆర్ విజయశీలన్‌ను, ఏఐఏడీఎంకే ఆర్. శివసామి వేలుమణిని పోటీకి దింపాయి.
కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్.. ఛింద్వారా నుంచి మళ్లీ ఎన్నిక కావటానికి ప్రణాళికలు రచిస్తున్నారు. 1980 నుంచి తొమ్మిది సార్లు ఈ సీటును గెలుచుకున్న కమల్ నాథ్.. ఈ సారి కూడా తన కుమారుడిని గెలిపించేదుకు కృషి చేస్తున్నారు. 2019 ఎన్నికలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 స్థానాలకు గాను 28 స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. అయితే చింద్వారా నుంచి నకుల్ మాత్రం 37,536 తేడాతో బిజెపి అభ్యర్థిని ఓడించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చెందిన ఏకైక ఎంపీగా ఉన్నారు. త్రిపురలోని ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాలలో.. పశ్చిమ త్రిపుర స్థానానికి మాజీ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ బిజెపి నుంచి బరిలో ఉన్నారు. ఆయనపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఆశిష్ కుమార్ సాహా పోటీ చేయనున్నారు. ఇక్కడ పోటీ చాలా గట్టిగా ఉండనున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసోంలోని కలియాబోర్ ఎంపీగా 2014 నుంచి రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన, లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్.. ఈ సారి పొరుగున ఉన్న జోర్హాట్‌లో పోటీ చేస్తున్నారు. మణిపూర్ న్యాయ, విద్యా శాఖ మంత్రి బసంత కుమార్ సింగ్ ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనపై జేఎన్‌యూ ప్రొఫెసర్, కాంగ్రెస్ అభ్యర్థి బిమల్ అకోయిజామ్ పోటీ చేస్తున్నారు. మెయితీ కమ్యూనిటీకి చెందిన బసంత్ కుమార్ సింగ్.. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన తౌనోజం చావోబా సింగ్ కుమారుడు. ఉత్తర రాజస్థాన్‌లోని బిజెపికి పట్టు ఉన్న స్థానం చురు నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా దేవేంద్ర ఝఝరియా, కాంగ్రెస్ నుంచి రాహుల్ కస్వాన్‌లు బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య బలమైన పోటీ ఉండనున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాగా, పార్టీ టికెట్ నిరాకరించటంతో రాహుల్ కస్వాన్ మార్చిలో రెండుసార్లు బిజెపిని వీడారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తున్నారు. బిహార్‌లోని జమూయ్ నియోజకవర్గం నుంచి LJP వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్‌విలాస్ పాసవాన్ కుమారుడు చిరాగ్ పాసవాన్ పోటీలో నిలిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫీలీబీత్‌లో వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాదకు అవకాశం కల్పించింది.