Story Board: కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ తో పాటు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శనివారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేస్తామని తెలిపింది. లోక్ సభతో పాటు ఐదు రాష్ట్రాలు.. ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి స్థాయి షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో.. అక్కడ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. పనిలోపనిగా కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ ఇవ్వచ్చని చెబుతున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ను మార్చి 10వ తేదీన ప్రకటించగా ఈసారి మాత్రం ఆరు రోజులు ఆలస్యంగా ప్రకటిస్తోంది ఈసీ. గత ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23న కంప్లీట్ కావడంతో ఆ నెలాఖరుకే కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. గత ఎన్నికలు ఏడు ఫేజ్‌లలో కంప్లీట్ అయ్యాయి. ఈసారి వేసవి తీవ్రత దృష్ట్యా ఎన్ని దశల్లో పోలింగ్ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ ప్రకటించినప్పట్నుంచే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతోంది. మార్చి మూడవ వారంలో నోటిఫికేషన్ రావొచ్చని గతంలోనే సంకేతాలు వెల్లడయ్యా యి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘంలోనూ కమిషనర్ల ఖాళీలు కూడా భర్తీ అయ్యాయి. ప్రస్తుతం సీఈసీ రాజీవ్ కుమార్ తో సహా ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఇటీవల ఖాళీ అయిన రెండు స్థానాలకు గురువారమే నియామకాలు పూర్తయ్యాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న ఏకైక ప్రతిబంధకం తొలగిన ట్లు అయింది. ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడానికి మార్గం ఏర్పడింది. జమ్ము-కాశ్మీర్తో సహా అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా లలో ఎన్నికల సంఘం ఇప్పటికే పర్యటనలు పూర్తిచేసింది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాతావరణాన్ని పరిశీలించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, కలెక్టర్లతోనూ సమీక్షల ప్రక్రియను ఈసీ ముగించింది. లోక్ సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వ హించడానికి అవసరమైన సూచనలు చేసింది. ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లకు ఆదేశాలిచ్చింది. ఎన్నికల నగారా మోగించడానికి సర్వం సిద్ధమైంది. అన్నీ చూసుకున్నాకే షెడ్యూల్ విడుదలకు ఈసీ డేట్ ఫిక్స్ చేసింది. ప్రధాన జాతీయ పార్టీలతోపాటు మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి. పొత్తుల ప్రక్రియను పూర్తిచేసుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియనూ చేపట్టాయి. ఇప్పుడు ఎన్నికల తేదీలు విడుదల చేస్తామని ఈసీ అధికారిక ప్రకటన కూడా చేసేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోంది. దేశమంతా ఓట్ల పండగ హడావుడిలో మునిగితేలుతుంది.
ఇటీవల కాలంలో దేశంలో ఏ ఎన్నికల షెడ్యూల్ విషయంలోనూ ఇంత హడావిడి జరగలేదు. ఈసారి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రెండు నెలల ముందు నుంచీ ప్రతిరోజూ వాట్సప్ లో షెడ్యూల్ ప్రకటిస్తూనే ఉన్నారు ఔత్సాహికులు. అదిగో వచ్చేసింది, ఇదిగో వచ్చేసింది అంటూ ఆఖరికి ఎలక్షన్ కమిషన్ లెటర్ హెడ్ పైనే ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. కానీ ఇక ఫేక్ న్యూస్ కు అవకాశం లేకుండా.. ఈసీ ఉత్కంఠకు తెర దించనుంది. మరికొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కసరత్తు ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంల తరలింపు, భద్రతా దళాల మొహరింపు, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికలు కూడా ఏడు విడతల్లో జరిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఏపీలో తొలి విడతలో జరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. 2019 లో మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 18న నోటిఫికేషన్ జారీ అయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా, మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సారి మార్చి 16న షెడ్యూల్ వస్తుండటంతో ఏపీలో ఏప్రిల్ 20-25 మధ్య పోలింగ్ ఉంటుందని భావిస్తున్నారు. ఏపీలో తొలి విడతలోనే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. గతంలోనూ తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించటం ద్వారా..ఇతర రాష్ట్రాలకు అధికారులు, భద్రతా సిబ్బందిని వినియోగంచుకోవటానికి ఎన్నికల సంఘానికి వెసులుబాటు దొరికింది.
తొలి విడతలో ఏపీతో పాటుగా తెలంగాణలోనూ ఎన్నికలు జరగుతాయనే అంచనాలున్నాయి. ఇక, ఏపీలో ఇప్పటికే ఎన్నికల సమరం హీటెక్కింది. వైసీపీని ఓడించే లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పాటయ్యాయి. జగన్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ – వామపక్షాలు కూటమిగా జత కట్టాయి. షెడ్యూల్ విడుదల రోజే సీఎం జగన్ తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దుల తుది జాబితా ఇడుపుల పాయ వేదికగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రకటించనున్నారు. ఇటు టీడీపీ కూటమి సైతం అభ్యర్దుల పైన దాదాపు స్పష్టత ఇచ్చింది. షెడ్యూల్ వచ్చిన సమయం నుంచి ప్రచారం హీటెక్కనుంది. రెండు వైపులా మేనిఫెస్టోలు కీలకం కానున్నాయి. దీంతో..ఏపీలో ఈ షెడ్యూల్ ప్రకటన ద్వారా రాజకీయ పోరు మరింత ఉత్కంఠగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.
లోక్ సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తోంది. ఈలోగానే కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. అలా జరిగేలా ఈసీ షెడ్యూల్ ఇస్తుందని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కొత్తేం కాదు. కానీ కశ్మీర్ విభజన తర్వాత.. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్ముకశ్మీర్లో జరగనున్న ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేంద్రం చెబుతున్నట్టుగా అక్కడ ఏం మారిందనేది పోలింగ్ లో తేలిపోతుందనే అంచనాలున్నాయి. విపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఏమీ మారలేదనే మాట కూడా నిజమా.. కాదా అనేది అప్పుడే తేలుతుంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడంతో.. విపక్షాలు అనుమానాలు లేవనెత్తాయి. అయితే వెంటనే స్పందించిన కేంద్రం.. ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల ఖాళీలు వేగంగా భర్తీ చేసింది. అయితే ఎంపికకు అనుసరించిన విధానంపై లోక్ సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అభ్యంతరం చెప్పారు. షెడ్యూల్ ను ఈసీ ప్రకటించిన తర్వాత రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి ప్రకటనలు వస్తాయనేది చూడాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో బీజేపీకి అనుకూలంగా.. మోడీ ప్రచారానికి వీలుగా షెడ్యూల్ ఇచ్చారని.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్దేశపూర్వకంగా దశలు పెంచారని.. ఇలా చాలా ఆరోపణలు చేశాయి విపక్షాలు. మరి ఈసారి ఈసీ ఎలాంటి కసరత్తు చేసిందనేది తేలాల్సి ఉంది. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని.. వాటికి అనుగుణంగానే షెడ్యూల్ పై కసరత్తు చేశామనేది ఈసీ వర్గాల మాట. షెడ్యూల్ వస్తుంది కదా.. వెయిట్ అండ్ సీ అంటున్నాయి. అటు పార్టీలు కూడా ఎన్నికలకు వ్యూహరచన కోసం షెడ్యూల్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.