విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణ కార్యక్రమంకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 21 నుంచి 25 వరకు భవానీ దీక్షలు విరమణలు జరగనున్నాయి. దీక్షలు విరమణల ఏర్పాట్లపై నేడు ఇంద్రాకిలాద్రిపై సమీక్ష జరగగా.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో రామారావు పాల్గొన్నారు. ఈసారి 60 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లు, కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ… ‘ ఈనెల 21 నుంచి 25 వరకు భవానీ దీక్షలు విరమణ కార్యక్రమం జరుగుతుంది. ఈసారి 60 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. భక్తులకు 15 లక్షల వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశాం. భక్తులకు ఏమైనా ఇబ్బంది ఉంటే.. కాల్ సెంటర్లు, కమాండ్ కంట్రోల్ రూమ్స్ సంప్రదించొచ్చు. ప్రతి ఒకరోజు లక్ష పైనే భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా. భక్తులు స్థానాలు చేసే ఘాట్లను పరిశీలించాం. వెహికల్స్ మీద వచ్చే భక్తులకు గుడి సమీపంలో పార్కింగ్ లేదు, సిటీకి అవతలే పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం’ అని చెప్పారు.
‘భవానీలు ఎంత భక్తితో అమ్మవారిని దర్శించుకుంటారు, మేం కూడా అంతే భక్తితో ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. భక్తులు వచ్చే క్యూ లైన్లు మరియు దుర్గ ఘాట్ వద్ద ఉన్న షవర్‌లను నాతో పాటు అధికారులు పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం అధికారులకు కొన్ని సూచనలు చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. అమ్మవారి దయ అందరి మీద ఉంటుంది’ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు.