Site icon NTV Telugu

North Korea: బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

North Korea

North Korea

North Korea: ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తమ గగనతలాన్ని ఉల్లంఘించిన యూఎస్ గూఢచారి విమానాలను కూల్చివేస్తామని ఉత్తర కొరియా బెదిరించిన మరునాడే ఈ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియా జపాన్‌ సముద్దం అని పిలవబడే తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు. ఈ క్షిపణి జపాన్‌ సముద్ర జలాల్లో బుధవారం ఉదయం పడిందని తెలిపారు. ఇది తూర్పు దిశగా కొంత సేపు పయనించి జపాన్‌ కాలమానం ప్రకారం ఉదయం 11.15 సమయంలో సముద్ర జలాల్లో పడిందని ఆ దేశ కోస్ట్‌గార్డ్‌ వెల్లడించింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంత అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి, దౌత్యం నిలిచిపోయింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ తన దేశాన్ని తిరుగులేని అణు రాజ్యంగా ప్రకటించాడు. ఆయుధాల అభివృద్ధిని పెంచాలని పిలుపునిచ్చారు.

Also Read: Heavy Rains: విషాదాన్ని మిగులుస్తున్న వర్షాలు.. దేశవ్యాప్తంగా 100 మందికి పైగా మృతి

ఇక మంగళవారం రోజున.. ఉత్తర కొరియా నియంత్రిస్తున్న ప్రాంతం గగనతలంలోకి అమెరికా మిలిటరీ గూఢచారి విమానం ఎనిమిది సార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టాయని అన్నారు. ఆ ప్రాంతంలో అమెరికా నిఘా కార్యకలాపాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. మరోవైపు ఉత్తర కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానిస్తూ.. గతంలో అమెరికా తమ గగనతలంలోకి గూఢచారి విమానాలను ఎగురవేస్తోందని ఆరోపించింది. వాటిని కూడా కూల్చివేస్తామని హెచ్చరించింది.

Also Read: Asia Cup 2023 Schedule: ఆసియా కప్‌కు బీసీసీఐ, పీసీబీ గ్రీన్‌ సిగ్నల్‌.. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్!

ఉత్తర కొరియా భూభాగంలోకి అమెరికా గూఢచారి విమానాలను ఎగురవేయడాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఖండించారు. దక్షిణ కొరియా సైన్యంతో కలిసి అమెరికా ప్రామాణిక నిఘా కార్యకలాపాలు చేస్తోందని వారు తెలిపారు. ఆ మాటలపై స్పందించిన కిమ్ యో జోంగ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ యూఎస్ మిలిటరీకి ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అమెరికా తన నిఘా కార్యకలాపాలను ముమ్మరం చేస్తోందని, ఇది ఉత్తర కొరియా సార్వభౌమాధికారం, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు.

Exit mobile version