Site icon NTV Telugu

North Korea: మరోసారి కిమ్‌ కవ్వింపు చర్యలు.. రెండు బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగం..

North Korea

North Korea

North Korea: కిమ్ జోంగ్ ఉన్‌.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణి ప్రయోగాలు చేసి పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా చేపట్టింది. ఉత్తర కొరియా ఆదివారం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ మరోసారి కవ్వింపు చర్యలను మొదలుపెట్టింది. ప్యోంగ్యాంగ్ గత నెలలో అత్యంత అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంతో సహా అపూర్వమైన ఆయుధ పరీక్షలను నిర్వహించడంతో ఈ సంవత్సరం కొరియా ద్వీపకల్పంలో సైనిక ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. ఉత్తర ప్యోంగాన్ ప్రావిన్స్‌లోని టోంగ్‌చాంగ్-రి ప్రాంతం నుంచి ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను గుర్తించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఈ క్షిపణులను ఉదయం 11:13 (0213 GMT) నుంచి మధ్యాహ్నం 12:05 గంటల వరకు తూర్పు సముద్రంలోకి ప్రయోగించారని దక్షిణ కొరియాతో పాటు జపాన్‌ ధ్రువీకరించింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ తెలిపారు. మరోవైపు.. జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సైతం దీనిని ధ్రువీకరించారు. ఈ క్రమంలో జపాన్‌ ప్రధాని ఎమర్జెన్సీ అలర్ట్‌ ప్రకటించారు.

ఈ క్షిపణులు దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించి గరిష్టంగా 550 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాయని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. టాంగ్‌చాంగ్రిలో ఉత్తరకొరియాకు చెందిన సోహే శాటిలైట్‌ లాంఛింగ్‌ సెంటర్‌ ఉంది. గతంలో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అవసరమైన రాకెట్లు ఇక్కడ పరీక్షించింది. దీనిపై అప్పట్లో ఐరాస మండిపడింది. రాకెట్ల ముసుగులో ఖండాంతర క్షిపణి టెక్నాలజీని పరీక్షిస్తోందని ఆరోపించింది. గురువారం ఇక్కడ అత్యంత శక్తిమంతమైన ఘన ఇంధన మోటార్‌ను ఉత్తరకొరియా ఇదే కేంద్రంలో పరీక్షించింది. దీనిని తమ వ్యూహాత్మక ఆయుధంలో ఉపయోగిస్తామని ఉత్తర కొరియా చెబుతోంది. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిగానే తాము క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉత్తరకొరియా సమర్థించుకొంటోంది.

Terror Attack: పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి.. నలుగురు పోలీసులు మృతి

కొరియన్‌ ద్వీపకల్పం, జపాన్‌ మధ్యలోని సముద్ర జలాల్లో ఈ మిస్సైల్‌ పడినట్లు జపాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, జపాన్‌ తీరానికి ఎంత దూరంలో పడిందనే విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు.. జపాన్‌ ఎక్స్‌క్లూసివ్‌ ఎకనామిక్‌ జోన్‌కు వెలుపల పడినట్లు ఆ దేశ జాతీయ టెలివిజన్‌ పేర్కొంది. అమెరికాను చేరుకునేంత అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్‌ మిసైల్ పరీక్షలను నిర్వహించబోతున్నమని ఉత్తర కొరియా ప్రకటించిన మూడో రోజే ఈ ప్రయోగం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుశక్తిని కలిగి ఉండాలని తాను కోరుకుంటున్నట్లు కిమ్ ఈ సంవత్సరం చెప్పాడు. తన దేశాన్ని తిరుగులేని అణు రాజ్యంగా ప్రకటించాడు. కిమ్ గత సంవత్సరం వెల్లడించిన కోరికల జాబితాలో భూమి లేదా జలాంతర్గాముల నుండి ప్రయోగించగల ఘన-ఇంధన ఐసీబీఎంలు ఉన్నాయి. తాజా మోటారు పరీక్ష ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ.. ఇలాంటి క్షిపణిని అభివృద్ధి చేయడంలో ఉత్తర కొరియా ఎంతవరకు ముందుకు వచ్చిందనేది స్పష్టంగా తెలియరాలేదని విశ్లేషకులు తెలిపారు.

Exit mobile version