China New Virus: ప్రపంచం ఇప్పుడిప్పుడే కోవిడ్ మహమ్మరి జ్ఞాపకాల నుంచి బయటపడుతుంది. 2019 లో చైనా నుంచి వచ్చిన COVID-19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి మృత్యుఘోషను సృష్టించిన విషయాన్ని ప్రజలు అప్పుడే మర్చిపోలేరు. మొదట చైనాలో వెలుగు చూసిన ఈ వ్యాధి తీవ్రత మొత్తం ప్రపంచాన్ని బాధించింది. వీటి నుంచి ప్రపంచం బయట పడటానికి చాలా సమయం పట్టింది. తాజాగా చైనా నుంచి మరోకొత్త వైరస్ బయటికి వచ్చిందని ఉత్తర కొరియా వాపోతుంది. ఇంతకీ నార్త్ కొరియాను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ కొత్త రకం వైరస్ ఏంటి, దీనికి చైనాకు ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: OG : ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టు షాక్
సమస్యగా మారిన చర్మ వ్యాధి..
ప్రస్తుతం ఉత్తర కొరియాలో కొత్త రకం వైరస్ ప్రజలను భయభ్రాంతలకు గురి చేస్తుంది. ఈ వ్యాధి చైనాలోనే ఉద్భవించిందని ఉత్తర కొరియా నమ్ముతుంది. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో ఇలాంటి చర్మ వ్యాధులు సంభవించాయని నార్త్ కొరియాలో పుకార్లు వ్యాపించాయి. ఇప్పటికే ఆ దేశం తమ ప్రజలకు ముందు జాగ్రత్తగా టీకాలు వేయించింది. ఉత్తర ప్యోంగాన్ ప్రావిన్స్‌లో వ్యాపిస్తున్న ఈ వ్యాధిని అరుదైన చర్మ వ్యాధి లేదా అరుదైన సోరియాసిస్ చర్మ వ్యాధి అని వైద్య నిపుణులు పిలుస్తున్నారు.
ఇంతకీ ఏంటా వ్యాధి..
ఉత్తర కొరియాలోని ఉత్తర ప్యోంగాన్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో తెల్లటి మచ్చలు, దురద, చీము స్రావాలు వంటి చర్మ వ్యాధి పెద్ద సంఖ్యలో వ్యాపించింది. ఈ నెల ప్రారంభం నుంచి జియోంగ్జు నగరం, సక్జు, చాంగ్‌సాంగ్, యోమ్జు కౌంటీలలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా అక్కడి ప్రాంతాల్లో అత్యవసర నిర్బంధం, చికిత్స చర్యలు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వచ్చాయి. ఆ దేశ కేంద్ర కమిటీ, ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వ్యాధి ప్రభావిత నగరాలు, కౌంటీలలో తక్షణ రోగుల సర్వేలకు ఆదేశించాయి. అలాగే దేశవ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి వైద్యులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయని నివేదికలు పేర్కొన్నాయి.
వ్యాధి ప్రభావానికి గురైన రోగులను తీవ్రమైన, మధ్యస్థ కేసులుగా వర్గీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తీవ్రమైన కేసులలో ఉన్న రోగులకు, సెలవు, విశ్రాంతి ఏర్పాటు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ చివరి నాటికి రోగులకు చికిత్స పూర్తి చేసి, అక్టోబర్ 10 నాటికి వారిని పూర్తిగా కోలుకునేలా చేయాలని గడువు విధించినట్లు పలు వర్గాలు పేర్కొన్నాయి. అవసరమైతే ఈ కాలపరిమితిని అక్టోబర్ చివరి వరకు పొడిగిస్తారని సమాచారం.
వ్యాధిపై దర్యాప్తుకు ఆదేశాలు..
ప్రస్తుతం ఈ వ్యాధి ప్యోంగాన్ ప్రావిన్స్‌లోని మూడు ప్రాంతాలకు మాత్రమే వ్యాపించింది. అయితే అధికారులు ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతాలతో సహా అన్ని నగరాలు, జిల్లాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోగులకు చికిత్స, సంరక్షణ కోసం ఆసుపత్రులు, క్లినిక్‌లు పూర్తిగా సిద్ధం అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వ్యాధికి కారణాలు, అసలు మూలాన్ని గుర్తించడానికి, దాని వ్యాప్తిని నివారించడానికి ఆరోగ్య శాఖ సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా విభజించి ప్రావిన్స్ అంతటా నియమించారు. ఈ వ్యాధి ఇతర నగరాలకు వ్యాపించకుండా ప్రవేశ ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ కొత్త వ్యాధి చైనాలో ఉద్భవించిందని ఉత్తర కొరియా ప్రజలు వాదిస్తున్నారు.
READ ALSO: PhonePe IPO: మెగా ఐపీఓకు ఫోన్ పే.. రూ.12 వేల కోట్ల టార్గెట్ !