నోయిడాలోని సెక్టార్ 93ఏలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేడు కూల్చివేయాలని ఈ ట్విన్ టవర్స్ కూల్చివేసేందుకు సెక్టార్ 93ఏ లోని ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు అధికారులు. వాహనాలు, పెంపుడు జంతువులను ఇతర ప్రాంతాలకు తరలించారు. నోయిడా ట్విన్ టవర్స్ లో అపెక్స్ టవర్ లో 32 ఫోర్లు ఉండగా.. సెయాన్ టవర్ లో 29 ఫ్లోర్లు ఉన్నాయి. 103 మీటర్ల ఎత్తున్న ఈ జంట టవర్ల కూల్చివేత కోసం మొత్తం 3700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. పిల్లర్లకు 7000 రంధ్రాలను చేసి పేలుడు పదార్థాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటిని వైర్ల ద్వారా కనెక్ట్ చేశారు. దాదాపుగా 20,000 సర్క్యూట్ లను ఏర్పాటు చేశారు.
కేవలం 10 సెకన్లలోనే 32 అంతస్తులు పేకమేడల్లా కుప్పకూలాయి. పేలుడు వల్ల వచ్చే దుమ్ము దాదాపు 15 నిమిషాల పాటు ఉంది. అయితే.. పేలుడు పర్యవేక్షించే నిపుణులు టవర్స్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉండి ఈ భవనాన్ని కూల్చివేశారు. పేలుడు సమయంలో ఆ ప్రాంతాన్ని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించారు అధికారులు. పేలుడు వల్ల 55,000 టన్నుల శిథిలాలు ఏర్పడుతాయి. వీటిని 3000 ట్రక్కుల ద్వారా మూడు నెలల పాటు తరలించే అవకాశం ఉంది.