Nitin Gadkari: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం, బాగున్నారా..? అంటూ తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టిన ఆయన అనేక అభివృద్ధి అంశాలపై స్పందించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు సరిగా సాగడంలేదని గడ్కరీ పేర్కొన్నారు. ఈ పనుల్లో తలెత్తిన సమస్యకు పరిష్కారం కనుగొన్నామని, వేగంగా పూర్తి చేయడంకోసం కొత్త కాంట్రాక్టర్‌ను నియమించామని తెలిపారు. వచ్చే పది నెలల్లో ఫ్లై ఓవర్‌ను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ భూసేకరణ వేగంగా పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Earthquake: ఉత్తర తెలంగాణలో భూకంపం.. పలు జిల్లాలో కంపించిన భూమి!
హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాల్లో అగ్రస్థానంలో ఉందని.. ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు ఇది కేంద్ర బిందువైందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. దేశంలోని అనేక నగరాల నుంచి ప్రజలు హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రధాన నగరాలతో కలిపేలా జాతీయ రహదారుల అభివృద్ధి జరిగిందని వివరించారు. ఇండోర్-హైదరాబాద్ కారిడార్ తెలంగాణలో పూర్తయ్యిందని, మహారాష్ట్రలో కూడా పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ కారిడార్‌తో 20 గంటల ప్రయాణం 10 గంటల్లో పూర్తి అవుతుందని చెప్పారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ 4 లేన్ రోడ్డు ని 6 లేన్ రోడ్డుగా మారుస్తామని చెప్పారు. నాగ్‌పూర్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన డబుల్ డెక్కర్ ఎయిర్ బస్ ను హైదరాబాద్ రింగ్ రోడ్డుపై ట్రై చేయాలని రాష్ట్ర మంత్రులను కోరారు. ఈ బస్సులో ఎయిర్ హోస్టెస్ లాగా బస్ హోస్టెస్ కూడా ఉంటారని, సాధారణ బస్సుల కంటే 3 శాతం ఛార్జి తక్కువగా ఉంటుందని తెలిపారు. CNG, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని.. డీజిల్, పెట్రోల్ వాహనాలపై ఆధారం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతులు వ్యవసాయంలో కూడా పర్యావరణహిత వాహనాలు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క స్మార్ట్ నగరాలతో దేశ అభివృద్ధి సాధ్యం కాదని, స్మార్ట్ గ్రామాలు అవసరం అని గడ్కరీ తెలిపారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.