India vs Australia: భారత్ – ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా మూడో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు అల్ అవుట్ అవ్వగా.. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి సెంచరీతో అదరగొట్టగా.. 10 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 105 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మరోవైపు మహ్మద్ సిరాజ్ క్రీజ్ లో ఉన్నాడు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు కంటే భారత్ ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ మధ్య 8వ వికెట్‌కు రికార్డ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. దీని సహాయంతో ఫాలో ఆన్‌ను నివారించడంలో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఇక టీమిండియా బ్యాట్సమెన్ సుందర్ 162 బంతుల్లో 50 పరుగులు చేసి నితీష్ రెడ్డికి మంచి తోడ్పాటును అందించాడు.
Also Read: Job Mela In Vijayawada: విజయవాడలో మెగా వికసిత్ జాబ్ మేళా
164/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. దూకుడుగా ఆడిన రిషభ్ పంత్ (28) స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో అనవసరమైన షాట్ ఆడుతూ క్యాచ్ ఔటవ్వడంతో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 8వ స్థానంలో క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. రవీంద్ర జడేజా ఆచితూచి ఆడే ధోరణి అనుసరించాడు. జడేజా నెమ్మదిగా ఆడుతున్నప్పటికీ, నితీష్ తనదైన శైలిలో పరుగులు సాధించాడు. క్రీజులో స్థిరపడుతున్న ఈ భాగస్వామ్యాన్ని నాథన్ లయన్ చెరిపి చేశాడు. జడేజాను వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూ చేసి వెనక్కి పంపించాడు. జడేజా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి నితీష్ రెడ్డి ఆకట్టుకునే బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 244/7 స్కోర్ అందుకుంది.
Also Read: Nitish Kumar Reddy: తగ్గేదేలే.. ఆస్ట్రేలియాలో మొదటి సెంచరీతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి
ఇక ఆ తర్వాత రెండో సెషన్ ప్రారంభంలోనే నితీష్ కుమార్ రెడ్డి 81 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం పుష్ప ట్రేడ్‌మార్క్ “తగ్గేదేలే” స్టైల్‌లో సెలెబ్రేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అర్థశతకానికి తర్వాత కూడా తన దూకుడును కొనసాగించిన నితీష్, మరింత మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే, ఈ సమయంలో వర్షం కారణంగా ఆటకు తాత్కాలిక విరామం ఏర్పడింది. వాతావరణం మెరుగుపడిన తర్వాత ఆట మళ్లీ ప్రారంభమైంది. నితీష్ అదే దూకుడును కొనసాగించగా, మరోవైపు వాషింగ్టన్ సుందర్ తన సుదీర్ఘ టెస్ట్ బ్యాటింగ్ నైపుణ్యంతో నితీష్‌కు మద్దతుగా నిలిచాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో భారత్ 326/7తో టీ బ్రేక్‌కు చేరుకుంది. ఆపై మూడో సెషన్‌లో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ జోడీ క్రీజులో చాలా నెమ్మదిగా ఆడారు. వాషింగ్టన్ సుందర్ తన సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో 146 బంతుల్లో కేవలం ఒక ఫోర్ సాయంతో అర్థశతకాన్ని పూర్తి చేశాడు. మరోవైపు, నితీష్ సెంచరీకి చేరువయ్యాడు. అయితే నితీష్ 96 పరుగుల వద్ద ఉండగా, నాథన్ లయన్ వేసిన అనూహ్య బౌన్స్ డెలివరీకి వాషింగ్టన్ సుందర్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 8వ వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత క్రీజులోకి బుమ్రా రావడంతో నితీష్ కుమార్ రెడ్డి సింగిల్స్ తీసుకుంటూ 99 పరుగుల మైలురాయిని చేరాడు. అయితే ఈ దశలో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో బుమ్రా(0) ఔటవ్వడంతో నితీష్ శతకంపై ఉత్కంఠ మరింత పెరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ మూడు బంతులను నెమ్మదిగా ఆడి, నితీష్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో నితీష్ మొదటి రెండు బంతులను డిఫెన్స్ చేసి, మూడో బంతిని మాత్రం బౌండరీకి తరలించి 171 బంతుల్లో తన తొలి టెస్ట్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇక నితీష్ శతకాన్ని చూసిన అతని తండ్రి గ్రౌండ్ లోనే ప్రేక్షకుల మధ్య ముత్యాల రెడ్డి ఆనందభరిత భావోద్వేగానికి లోనయ్యాడు.