నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తమ్ముడు’ గురించి తెలిసిందే. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా యూనిట్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగా నితిన్, దిల్ రాజు కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో నితిన్ దిల్ రాజుకు పలు ప్రశ్నలు సంధించగా, ఆయన సమాధానాలు ఇచ్చారు. అలాగే, దిల్ రాజు నితిన్‌కు కొన్ని ప్రశ్నలు వేయగా, నితిన్ వాటికి సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంలో నితిన్, “దిల్ సినిమా నుంచి ఇప్పటి ‘తమ్ముడు’ వరకు చూస్తే మీకు నా గురించి ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం చెప్పండి” అని దిల్ రాజును అడిగాడు. దీనికి దిల్ రాజు కాస్త ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “నిజానికి నేను ‘దిల్’ సినిమా చేస్తున్నప్పుడు నితిన్ ఒక పెద్ద స్టార్ అవుతాడని అనుకున్నాను. ‘ఆర్య’ సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ స్టార్ అవుతాడని అనుకున్నట్లే, నితిన్ విషయంలోనూ అలాగే ఆలోచించాను. నేను ఎవరితో సినిమా చేసినా, వారు ఆ స్థాయికి చేరుకుంటారని భావించేవాడిని. కానీ, అల్లు అర్జున్ స్టార్ హోదా సంపాదించినట్లు నితిన్ సంపాదించలేకపోయాడు” అని చెప్పారు. “ఒకవేళ ఈ ‘తమ్ముడు’ సినిమాతో నేను ఆ హోదా సంపాదించగలనా?” అని నితిన్ అడిగితే, “కలెక్షన్స్ బాగుండొచ్చు, కానీ స్టార్ ఇమేజ్ సాధించడం కష్టమే” అని దిల్ రాజు సమాధానించారు. అయితే, “తాను చేయబోయే ‘ఎల్లమ్మ’ సినిమాతో ఆ ఇమేజ్ సాధించగలనా?” అని నితిన్ అడిగితే, “అవకాశం ఉంది” అని దిల్ రాజు అన్నారు.