Nigerian Army: నైజీరియా సైన్యం శుక్రవారం తన తాజా భద్రతా ఆపరేషన్‌లో 79 మంది ఉగ్రవాదులు, కిడ్నాపర్‌లను హతమార్చినట్లు వెల్లడించింది. ఈ ఆపరేషన్ ఈశాన్య నైజీరియాలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ల తిరుగుబాటుదరు అలాగే నార్త్-వెస్ట్ ప్రాంతంలో సాయుధ గ్రూపుల దాడులను లక్ష్యంగా చేసుకుని చేపట్టబడింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఈశాన్య ప్రాంతంలో దాదాపు 35,000 మంది పౌరులు మరణించారు. అలాగే 2 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో, నైజీరియా తమ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తోంది. ఈ ఆపరేషన్‌లో 252 మందిని అరెస్టు చేసినట్లు నైజీరియా ఆర్మీ అధికార ప్రతినిధి ఎడ్వర్డ్ బుబా ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న 67 మందికి విమోచనం కల్పించారు.
Also Read: IND vs ENG: భారత్ జోరును ఇంగ్లాండ్ అడ్డుకుంటుందా! నేడే రెండో టి20
నార్త్ వెస్ట్ ప్రాంతంలో కిడ్నాప్ ఒక సాధారణ వ్యవహారంగా మారింది. ఇక్కడ సాయుధ సమూహాలు గ్రామాలు, ప్రధాన రహదారులపై దాడి చేసి ప్రజలను అపహరిస్తున్నాయి. వీరిలో ఎక్కువ భాగం డబ్బులు చెల్లించిన తర్వాతే విడుదల అవుతారు. అరెస్టయిన వారిలో 28 మంది నిందితులు ముడి చమురు దొంగతనంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. నైజీరియాలో ముడి చమురు దొంగతనం అనేది పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల దేశం ప్రతీ ఏడాది కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతోంది. 2009-2020 మధ్య నైజీరియా 46 బిలియన్ల డాలర్స్ కు పైగా నష్టపోయింది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఈ వివిధ భద్రతా చర్యలు, వేర్పాటువాద ఉద్యమాలు, ఉగ్రవాద దాడులు నైజీరియాలోని ప్రజల మానవ హక్కుల పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రజల భద్రతను పెంచడానికి ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటున్నా.. విపరీతమైన ఉగ్రవాదం, సామాజిక శాంతి లేని పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి.