భారత్- కెనడా వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో భారత్ కు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరిన సంగతి తెలిసిందే. అది చినికి చినికి గాలివానలాగా మారింది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ ముఠాలు కూడా భారత్ పై బెదిరింపులకు పాల్పడ్డాయి. దీంతో భారత్ వారిని ఎక్కడికక్కడ అణగద్రొక్కాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో భారతీయులను బెదిరించిన సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూకు పంజాబ్‌లో ఉన్నటువంటి ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జప్తు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో ముందడుగు వేసిన ఎన్ఐఏ ఖలిస్థాన్ ముఠాలు, ఉగ్రవాదులపై దర్యాప్తును వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా బుధవారం 50 ప్రాంతాల్లో సోదాలకు దిగింది.
Also Read: Motorola Edge 40 Neo Price: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్!
కెనడా ప్రధాని ఆరోపణల తరువాత దర్యాప్తు, నిఘా సంస్థలు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీ ఎన్ సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా ప్రాంతాలను లక్ష్యం చేసుకుని దాడులు నిర్వహిస్తుంది ఎన్ఐఏ. విదేశాల నుంచి భారత్ వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణ, ఉగ్రవాదులకు నిధుల సాయం, ఆయుధాల సరఫరాకు సంబంధించిన సమాచారం ఎన్ఐఏకి చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్ల మధ్య అనుబంధానికి సంబంధించిన కీలక సమాచారం నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీకి అందినట్లు తెలుస్తోంది. దీంతో పంజాబ్ లోని 30 ప్రాంతాల్లో, రాజస్థాన్ లోని 13 ప్రాంతాల్లో, హర్యానాలో నాలుగు ప్రాంతాల్లో ఎన్ ఐఏ దాడులు చేపట్టింది.
ఈ ముఠాలు కెనడా, యూకే, యూఎస్, ఆస్ట్రేలియాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయా ముఠాలను ఏరిపారేయాలని నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాదులను గుర్తించి, వారి పేరిట ఉన్న ఓసీఐ కార్డులను (ఓవర్ సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా) రద్దు చేయాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దాని ద్వారా వారు తిరిగి భారత్ కు రాకుండా చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది.. విదేశాల్లో స్థిరపడిన ఖలిస్థాన్ ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించాలని దర్యాప్తు ఏజెన్సీలను కేంద్రం కోరినట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.