మరో రెండు రోజుల్లో నవంబర్ నెల ముగియనుంది. అనంతరం ఈ ఏడాదిలోనే చివరి నెల డిసెంబర్ ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతినెల 1వ తేదీన కొన్ని మార్పులు జరుగుతుంటాయి. డిసెంబర్‌లో కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఇవి ప్రజల జీవనంపై ప్రభావం చూపనున్నాయి.
పెన్షన్ పొందేవారు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి
దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ముఖ్యమైన వార్త. పెన్షన్ పొందడానికి 30 నవంబర్ 2022లోపు మీ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఒకవేళ ఈనెలాఖరులోగా సర్టిఫికెట్ సమర్పించకపోతే డిసెంబర్ 1 నుంచి పెన్షన్ నిలిపివేయబడుతుంది. పెన్షనర్లు వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. నవంబరు 30లోగా ఈ పనులు పూర్తి చేయాలని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
రైళ్ల వేళల్లో మార్పులు
పెరుగుతున్న చలి, పొగమంచు కారణంగా పలు రైళ్ల వేళల్లో డిసెంబర్ 1 నుంచి మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా డజన్ల కొద్దీ రైళ్లు కూడా రద్దు చేయబడ్డాయి. దట్టమైన పొగమంచు కారణంగా భారతీయ రైల్వే డిసెంబర్ 2022, ఫిబ్రవరి-మార్చి 2023 మధ్య మూడు నెలల కాలానికి 50 కంటే ఎక్కువ రైళ్ల సేవలను రద్దు చేయాలని నిర్ణయించింది. రైలు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి ముందు రద్దు చేయబడిన, పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్ల జాబితాను తనిఖీ చేయాలని అధికారులు సూచించారు.
పెరగనున్న టూవీలర్ ధరలు
దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచాలని నిర్ణయించింది. టూవీలర్ వాహనాల కొత్త ధరలు డిసెంబర్ 1 నుంచి అమలు కానున్నాయి. ద్విచక్ర వాహనాల ధరలు రూ.1500 వరకు పెరగనున్నాయి. వాహనాల మార్కెట్, మోడల్‌ను బట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఈ కేవైసీ పూర్తి చేయాలి
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఇకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 12 ఇందుకు డెడ్‌లైన్. అందువల్ల ఎవరి కేవైసీ అయినా పెండింగ్‌లో ఉంటే.. వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి. లేదంటే బ్యాంక్ అకౌంట్ పని చేయకపోవచ్చు. అంతేకాకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిసెంబర్ నుంచి కొత్త రూల్ తీసుకువస్తోంది. ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఏటీఎం లావాదేవీలు మరింత సురక్షితంగా మారనున్నాయి.
బ్యాంకు సెలవులు
దేశవ్యాప్తంగా బ్యాంకులకు డిసెంబర్ నెలలో దాదాపు 14 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. రాష్ట్రం ప్రాతిపదికన ఈ బ్యాంక్ సెలవులు మారతాయి. అయితే ఏపీ, తెలంగాణలో మాత్రం ఒక్క రోజు కూడా బ్యాంకులకు హాలిడే లేదు. రెండో, నాలుగో శనివారాలు, ఆదివారం మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి.
LPG గ్యాస్ ధరలు మారనున్నాయి
దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు ప్రతి నెలా మొదటి తేదీన మారుతుంటాయి. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గించింది. అయితే 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కొత్త ధరను డిసెంబర్ 1న ప్రకటించే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో గ్యాస్ ధరలు పెరగడం చూస్తుంటే ఈ నెలలో సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also: Manufacturing Machine Scam: ఫోన్ స్విచాఫ్ వస్తోంది.. న్యాయం చేయండి మహాప్రభో