India Vs Pakistan: భారత్ vs పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అనేది క్రీడాభిమానులకు అసలైన ఉత్కంఠను కలిగించే ఓ సంఘటన. క్రికెట్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు, సంఘటనలతో ఈ రెండు జట్ల మధ్య పోటీ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ జట్ల మధ్య ఉన్న రైవల్రీపై నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక డాక్యుమెంటరీని తీసుకొస్తోంది. “ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్” పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 7న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో విడుదల చేసిన డాక్యుమెంటరీ పోస్టర్‌లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, విరేంద్ర సెహ్వాగ్ పాక్ జట్టుతో తలపడటానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించడం క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ డాక్యుమెంటరీలో సెహ్వాగ్, గంగూలీ, షోయబ్ అక్తర్, వాకర్ యూనిస్, ఇంజమామ్ ఉల్ హక్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్ల ప్రసంగాలు కూడా ఉండనున్నట్లు సమాచారం.
Also Read: Manchu Vishnu: 120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచువారబ్బాయి
ఈ డాక్యుమెంటరీలో ఇరు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లు, ఇరువురి మధ్య పోటీ ఎలా మారిందో, దానికి కారణమైన అనేక ఆసక్తికర విషయాలు చూపించనున్నారు. నెట్‌ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా పోస్ట్‌లో “రెండు దేశాల మధ్య అద్భుతమైన పోటీ, 160 కోట్ల మంది ఆశలు, భారత్ – పాక్ క్రికెట్ అనుభవాన్ని మరింత ఆస్వాదించండి” అని పేర్కొంది. ఇక మరోవైపు, క్రికెట్ అభిమానుల ఆనందానికి డబుల్ ట్రీట్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్ కూడా ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగనుండటంతో ఈ డాక్యుమెంటరీ అనేక మంది క్రీడాభిమానులకు మరింత ఉత్సహాన్ని తీసుకురానుంది. కేవలం ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులకు మాత్రమే కాకుండా అన్ని దేశాల క్రికెట్ అభిమానులకు ఇది ఖచ్చితంగా ఒక సూపర్ ట్రీట్ కానుంది.