Manchu Vishnu: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి తన గొప్పతన్నాని చాటుకున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. దింతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జనవరి 13న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబుతో కలిసి విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనాథ పిల్లలతో కలిసి భోగి మంటలు వేయడం, వారికి ఆట వస్తువులు, కొత్త బట్టలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. “120 మంది చిన్నారులకు విద్య, వైద్యంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటాను. ఈ పిల్లలు ఇక నుంచి నా కుటుంబసభ్యులే. పిల్లలతో సంక్రాంతి పండగను జరుపుకోవడం నాకు ఎంతో సంతోషం ఇస్తోంది. వారికి అవసరమైన అన్ని వసతుల్ని అందించేందుకు నేను ప్రయత్నిస్తాను” అని హామీ ఇచ్చారు. అలాగే, “కుడిచేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. కానీ, నా మంచి పని ఇతరులకు కూడా ఆదర్శంగా మారాలని నేను ఆశిస్తున్నాను. మాతృశ్య సంస్థ నిర్వాహకురాలు శ్రీదేవి గొప్ప మనసుతో ఈ చిన్నారులను ఆదరిస్తున్నారు. ఇప్పటి నుంచి నేను ఈ సంస్థకు పెద్దన్నగా ఉంటాను” అని చెప్పుకొచ్చారు.
తాను ప్రారంభించిన ఈ మంచి పనిలో అందరి సహకారం కూడా అవసరమని ఆయన పిలుపునిచ్చారు. “అవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఇలాంటి మంచి పనులు చేస్తే సమాజానికి మేలు జరుగుతుంది. మీ ప్రాంతంలో ఉన్న అనాథ పిల్లల్ని ఆదరించి, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేయండి” అని కోరారు. మంచు విష్ణు చేసిన ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు, సోషల్ మీడియాలో విష్ణుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచు విష్ణు చేసిన మంచి పని ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమాలతో మంచు విష్ణు తన శ్రేయస్సుతో పాటు సమాజం పట్ల బాధ్యతను కూడా చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు.